2 సమూయేలు 24:24-25
2 సమూయేలు 24:24-25 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
రాజు “నేను అలా తీసుకోను, ఖరీదు ఇచ్చి నీ దగ్గర కొంటాను. వెల ఇవ్వకుండా తీసుకున్న దాన్ని నా దేవుడైన యెహోవాకు దహనబలిగా అర్పించను” అని అరౌనాతో చెప్పి ఆ కళ్ళాన్నీ ఎడ్లనూ 50 తులాల వెండి ఇచ్చి కొన్నాడు. అక్కడ దావీదు యెహోవా పేరున ఒక బలిపీఠం కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించాడు. దేశం కోసం చేసిన ఆ విన్నపాలను యెహోవా అంగీకరించగా ఇశ్రాయేలీయులకు దాపురించిన ఆ తెగులు ఆగిపోయింది.
2 సమూయేలు 24:24-25 పవిత్ర బైబిల్ (TERV)
అప్పుడు అరౌనాతో రాజు ఇలా అన్నాడు: “కాదు! నేను నిజం చెబుతున్నాను. నీకు వెలయిచ్చి నీ నుండి ఈ భూమిని కొంటాను. నాకు వెల లేకుండా వచ్చిన వాటితో నా ప్రభువైన దేవునికి దహనబలులు ఇవ్వను!” కావున నూర్పిడి కళ్లాన్ని, ఎద్దులను, ఏబైతులాల వెండి వెల ఇచ్చి దావీదు కొన్నాడు. తరువాత యెహోవాకి అక్కడ ఒక బలిపీఠాన్ని దావీదు నిర్మింపజేశాడు. దహనబలులు, సమాధాన బలులు దావీదు అర్పించాడు. దేశంకొరకు దావీదు చేసిన ప్రార్థనను యెహోవా ఆలకించి, ఇశ్రాయేలులో ప్రబలిన వ్యాధులను ఇంకా వ్యాపించకుండా ఆపాడు.
2 సమూయేలు 24:24-25 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
రాజు–నేను ఆలాగు తీసికొనను, వెల యిచ్చి నీయొద్ద కొందును, వెల యియ్యక నేను తీసికొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహనబలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్లమును ఎడ్లను ఏబది తులముల వెండికి కొనెను. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠముకట్టించి దహనబలులను సమాధానబలులను అర్పించెను; యెహోవా దేశముకొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచి పోయెను.
2 సమూయేలు 24:24-25 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అయితే రాజు అరౌనాతో, “లేదు, నీకు వెల చెల్లించి కొంటాను. ఉచితంగా తీసుకున్న దానిని నేను నా దేవుడైన యెహోవాకు దహనబలి అర్పించను” అన్నాడు. కాబట్టి దావీదు ఆ నూర్పిడి కళ్ళాన్ని ఎడ్లను యాభై షెకెళ్ళ వెండికి కొన్నాడు. దావీదు అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి దహనబలులు సమాధానబలులు అర్పించాడు. అప్పుడు యెహోవా దేశం కోసం అతడు చేసిన ప్రార్థన అంగీకరించగా ఇశ్రాయేలీయులకు వచ్చిన తెగులు తొలగిపోయింది.