2 సమూయేలు 24:10-25
2 సమూయేలు 24:10-25 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
జనసంఖ్య చూసినందుకు దావీదు మనస్సు నొచ్చుకుంది. అతడు యెహోవాతో “నేను చేసిన పని వలన గొప్ప పాపం మూటగట్టుకున్నాను. ఇలా చేయడం చాలా పెద్ద పాపం. యెహోవా, నేను చాలా తెలివి తక్కువ పని చేశాను. దయచేసి నీ దాసుడి దోషం తీసివెయ్యి” అన్నాడు. తెల్లవారి, దావీదు నిద్ర లేచినప్పుడు దావీదుకు దీర్ఘ దర్శి, ప్రవక్త అయిన గాదుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై, “నీవు పోయి దావీదుతో ఇలా చెప్పు. ‘మూడు విషయాలు నీ ముందుంచుతున్నాను. వాటిలో ఒకటి కోరుకో. దాన్ని నీపైకి రప్పిస్తాను.’” కాబట్టి గాదు దావీదు దగ్గరికి వచ్చి సంగతి తెలిపాడు. “నీవు నీ దేశంలో మూడేళ్ళు కరువు కలగడం కోరుకుంటావా, నీ శత్రువు నిన్ను తరుముతుంటే మూడునెలల పాటు పారిపోడానికి ఒప్పుకుంటావా, లేక నీ దేశంలో మూడు రోజులు తెగులు చెలరేగడానికి ఒప్పుకొంటావా? ఈ విషయం ఆలోచించి నన్ను పంపిన దేవునికి ఏమి జవాబు చెప్పాలో నిర్ణయించు” అన్నాడు. అందుకు దావీదు “గొప్ప చిక్కులో పడ్డాను. యెహోవా కరుణా సంపన్నుడు గనక మనుషుల చేతిలో పడడం కంటే యెహోవా చేతిలోనే పడదాము” అని గాదుతో అన్నాడు. కాబట్టి యెహోవా ఇశ్రాయేలీయుల మీదికి ఘోర వ్యాధి రప్పించాడు. ఉదయం మొదలుకుని నియామక కాలం వరకూ అది చెలరేగింది. ఫలితంగా దాను నుండి బెయేర్షెబా వరకూ 70 వేలమంది మరణించారు. దూత యెరూషలేమును నాశనం చెయ్యడానికి తన చెయ్యి చాపగా, యెహోవా ఆ అరిష్టం విషయం పరితపించాడు. ఆయన నాశన దూతకు “ఇక చాలు, నీ చెయ్యి వెనక్కి తీసుకో” అని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ సమయంలో యెహోవా దూత యెబూసీయుడైన అరౌనాకు చెందిన కళ్ళం దగ్గర ఉన్నాడు. ప్రజలను నాశనం చేసిన ఆ దూతను చూసి దావీదు యెహోవాను ఇలా ప్రార్థించాడు. “పాపం చేసిన వాణ్ని నేను గదా. దుర్మార్గంగా ప్రవర్తించిన వాణ్ని నేను గదా. గొర్రెలవంటి ఈ ప్రజలేమి చేసారు? నన్నూ నా తండ్రి కుటుంబాన్నీ శిక్షించు.” ఆ రోజున గాదు దావీదు దగ్గరికి వచ్చి “నీవు వెళ్లి యెబూసీయుడైన అరౌనా కళ్ళంలో యెహోవా పేరున ఒక బలిపీఠం కట్టించు” అని అతనితో చెప్పాడు. దావీదు గాదు ద్వారా యెహోవా యిచ్చిన ఆజ్ఞ ప్రకారం బయలు దేరాడు. రాజు, అతని పరివారం తనవైపు రావడం అరౌనా చూసి ఎదురు వెళ్లి రాజుకు సాష్టాంగ నమస్కారం చేసి “నా యజమానీ, రాజూ అయిన నీవు నీ దాసుడైన నా దగ్గరికి వచ్చిన కారణమేమిటి?” అని అడిగాడు. దావీదు “ఈ కళ్ళం నీ దగ్గర కొని యెహోవా పేరున ఒక బలిపీఠం కట్టించాలని వచ్చాను. అ విధంగా ఈ తెగులు ప్రజలనుండి తొలిగి పోతుంది” అన్నాడు. అందుకు అరౌనా “నా యజమానీ రాజు అయిన నీవు నీకు ఏది కావాలో తీసుకో. నీకు అనుకూలమైనదేమిటో అది చెయ్యి. ఇదుగో, దహనబలి కోసం ఎడ్లు ఉన్నాయి. కట్టెలుగా ఈ నూర్చే కర్ర వస్తువులూ, ఎడ్ల కాడి పనికొస్తాయి. రాజా, యివన్నీ అరౌనా అనే నేను, రాజుకు ఇస్తున్నాను” అన్నాడు. “నీ దేవుడైన యెహోవా నీ మనవి వినుగాక” అని రాజుతో అన్నాడు. రాజు “నేను అలా తీసుకోను, ఖరీదు ఇచ్చి నీ దగ్గర కొంటాను. వెల ఇవ్వకుండా తీసుకున్న దాన్ని నా దేవుడైన యెహోవాకు దహనబలిగా అర్పించను” అని అరౌనాతో చెప్పి ఆ కళ్ళాన్నీ ఎడ్లనూ 50 తులాల వెండి ఇచ్చి కొన్నాడు. అక్కడ దావీదు యెహోవా పేరున ఒక బలిపీఠం కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించాడు. దేశం కోసం చేసిన ఆ విన్నపాలను యెహోవా అంగీకరించగా ఇశ్రాయేలీయులకు దాపురించిన ఆ తెగులు ఆగిపోయింది.
2 సమూయేలు 24:10-25 పవిత్ర బైబిల్ (TERV)
జనాభా లెక్కలు చూసినందుకు దావీదు సిగ్గుపడ్డాడు. దావీదు యెహోవాకి ఇలా విన్నవించుకున్నాడు, “నేను చేసిన ఈ పనివల్ల నేను చాలా పాపం మూటగట్టుకున్నాను. ప్రభూవా, నా పాపాన్ని క్షమించమని వేడుకుంటున్నాను. నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను.” దావీదు ఉదయం నిద్రలేచే సరికి యెహోవా వాక్యం గాదుకు చేరింది. గాదు ప్రవక్త దావీదుకు సన్నిహితుడు. గాదుకు యెహోవా ఇలా చెప్పాడు: “దావీదు వద్దకు వెళ్లి నా మాటగా ఈ విషయం చెప్పు: యెహోవా మూడు విషయాలు నీ ముందు వుంచుతున్నాడు. ఆయన నీకు చేయవలసిన దాని నొకటి నీవు ఎన్నుకో.” దావీదుతో గాదు ఇలా చెప్పాడు: “నేను చెప్పేవాటిలో ఒక దానిని కోరుకో: ఏడేండ్ల కరువు నీకూ, నీ రాజ్యానికీ రావాలా? లేక నీ శత్రువులు నిన్ను మూడు నెలల పాటు వెన్నంటి తరమాలా? లేక మూడు రోజుల పాటు నీ దేశంలో వ్యాధులు ప్రబలాలా? బాగా ఆలోచన చేసి ఈ మూడింటిలో నీవు దేనిని కోరుకుంటున్నావో చెప్పు. నేను నీ నిర్ణయాన్ని నన్ను పంపిన యెహోవాకి అందజేయాలి.” గాదుతో దావీదు, “నిజంగా నేను చాలా క్లిష్ట పరిస్థితిలో పడ్డాను! యెహోవా దయామయుడు కావున ఆయనే మమ్మల్ని శిక్షించనీ, నాకు శిక్ష ప్రజలనుండి మాత్రం రానీయకు!” అని అన్నాడు. అందువల్ల యెహోవా ఇశ్రాయేలులో వ్యాధులు ప్రబలేలా చేశాడు. ఉదయం మొదలైన వ్యాధులు నిర్ణయించిన గడువు వరకు ప్రబలినాయి. ఉత్తర దేశంలో దానునుండి దక్షిణ ఇశ్రాయేలులోని బెయేర్షెబా వరకు డెబ్బై వేల మంది చనిపోయారు. దేవదూత యెరూషలేమును నాశనం చేసేందుకు చేయి పైకి లేపాడు. కాని జరిగిన విషాద సంఘటనలకు యెహోవా విచారించాడు. ప్రజలను నాశనం చేసిన దేవదూతతో యెహోవా, “ఇది చాలు! నీ చేయిదించు!” అని అన్నాడు. యోహోవాదూత యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్లం వద్దవున్నాడు. ప్రజలను నశింపజేసిన దేవదూతను దావీదు చూశాడు. దావీదు యెహోవాకి యిలా విన్నవించుకున్నాడు, “నేను పాపం చేశాను! నేను తప్పు చేశాను! కాని నా ప్రజలంతా నన్ను గొర్రెలవలె అనుసరించారు! వారు చేసిన తప్పేమీ లేదు! కావున దయచేసి నీ కోపం నామీద, నా తండ్రి కుటుంబం మీద మాత్రమే చూపించు!” ఆరోజు మరల గాదు దావీదు వద్దకు వచ్చి, “యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్లం మీద యెహోవాకి ఒక బలిపీఠం నిర్మించమని చెప్పాడు”. గాదు చెప్పిన రీతి దావీదు అంతా చేశాడు. యెహోవా ఆజ్ఞలను దావీదు శిరసావహించాడు. దావీదు అరౌనాను చూడటానికి వెళ్లాడు. అరౌనా తలెత్తి చూడగా అక్కడ రాజు (దావీదు) వున్నాడు. ఆయన మనుష్యులు తన వైపు రావటం చూశాడు. అరౌనా ఎదురేగి తన శిరస్సు నేలను ఆనే వరకు వంగి రాజుకు నమస్కరించాడు. “నా ప్రభువైన రాజు నావద్దకు ఎందుకు వచ్చినట్లు?” అని అడిగాడు అరౌనా. అందుకు దావీదు, “నీనుండి నూర్పిడి కళ్లం కొనడానికి. అది కొని దానిపై యెహోవాకు ఒక బలిపీఠం నిర్మిస్తాను, అప్పడు ఈ వ్యాధులన్నీ అరికట్ట బడతాయి,” అని అన్నాడు. “నా ప్రభువైన రాజు బలికి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. దహనబలికి కొన్ని ఎద్దులున్నాయి. అగ్నిని ప్రజ్వలింప చేయటానికి ధాన్యం రాలగొట్టే బల్లలు, మరియు ఎద్దులపై వేసే కాడికర్రలు వున్నాయి! ఓ రాజా! ఇవన్నీ నీకు నేను ఇస్తాను.” అని అరౌనా దావీదుతో అన్నాడు. “నీ ప్రభువైన దేవుడు నీ పట్ల ప్రీతి చెందుగాక!” అని కూడ అన్నాడు. అప్పుడు అరౌనాతో రాజు ఇలా అన్నాడు: “కాదు! నేను నిజం చెబుతున్నాను. నీకు వెలయిచ్చి నీ నుండి ఈ భూమిని కొంటాను. నాకు వెల లేకుండా వచ్చిన వాటితో నా ప్రభువైన దేవునికి దహనబలులు ఇవ్వను!” కావున నూర్పిడి కళ్లాన్ని, ఎద్దులను, ఏబైతులాల వెండి వెల ఇచ్చి దావీదు కొన్నాడు. తరువాత యెహోవాకి అక్కడ ఒక బలిపీఠాన్ని దావీదు నిర్మింపజేశాడు. దహనబలులు, సమాధాన బలులు దావీదు అర్పించాడు. దేశంకొరకు దావీదు చేసిన ప్రార్థనను యెహోవా ఆలకించి, ఇశ్రాయేలులో ప్రబలిన వ్యాధులను ఇంకా వ్యాపించకుండా ఆపాడు.
2 సమూయేలు 24:10-25 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు–నేను చేసిన పనివలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాని చేసితిని; యెహోవా, కరుణయుంచి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవిచేయగా ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను నీవు పోయి దావీదుతో ఇట్లనుము– యెహోవా సెలవిచ్చునదేమనగా–మూడు విషయములను నీ యెదుట పెట్టుచున్నాను; వాటిలో ఒక దానిని నీవు కోరుకొనినయెడల నేనది నీమీదికి రప్పించెదను. కావున గాదు దావీదునొద్దకు వచ్చి యిట్లని సంగతి తెలియజెప్పెను–నీవు నీ దేశమందు ఏడు సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుము చున్న నీ శత్రువులయెదుట నిలువలేక నీవు మూడు నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా? నీ దేశమందు మూడుదినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? యోచనచేసి నన్ను పంపినవానికి నేనియ్యవలసిన యుత్తరము నిశ్చయించి తెలియజెప్పుమనెను. అందుకు దావీదు – నా కేమియు తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను, యెహోవా బహు వాత్సల్యతగలవాడు గనుక మనుష్యుని చేతిలో పడకుండ యెహోవా చేతిలోనే పడుదుము గాక అని గాదుతో అనెను. అందుకు యెహోవా ఇశ్రాయేలీయులమీదికి తెగులు రప్పించగా ఆ దినము ఉదయము మొదలుకొని సమాజకూటపు వేళవరకు అది జరుగుచుండెను; అందుచేత దానునుండి బెయేర్షెబావరకు డెబ్బది వేలమంది మృతినొందిరి. అయితే దూత యెరూషలేము పైని హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు, యెహోవా ఆ కీడునుగూర్చి సంతాపమొంది–అంతే చాలును, నీ చెయ్యి తీయుమని జనులను నాశనముచేయు దూతకు ఆజ్ఞ ఇచ్చెను. యెహోవాదూత యెబూసీయుడైన అరౌనాయొక్క కళ్లము దగ్గర ఉండగా దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఈలాగు ప్రార్థిం చెను–చిత్తగించుము; పాపము చేసినవాడను నేనే; దుర్మార్గముగా ప్రవర్తించినవాడను నేనే; గొఱ్ఱెలవంటి వీరేమి చేసిరి? నన్నును నా తండ్రి యింటివారిని శిక్షించుము. ఆ దినమున గాదు దావీదునొద్దకు వచ్చి–నీవు పోయి యెబూసీయుడైన అరౌనాయొక్క కళ్లములో యెహోవా నామమున ఒక బలిపీఠముకట్టించుమని అతనితో చెప్పగా దావీదు గాదుచేత యెహోవా యిచ్చిన ఆజ్ఞచొప్పున పోయెను. అరౌనా రాజును అతని సేవకులును తన దాపునకు వచ్చుటచూచి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారముచేసి–నా యేలినవాడవును రాజవునగు నీవు నీ దాసుడనైన నాయొద్దకు వచ్చిన నిమిత్తమేమని అడుగగా దావీదు –ఈ తెగులు మనుష్యులకు తగలకుండ నిలిచిపోవునట్లు యెహోవా నామమున ఒక బలిపీఠముకట్టించుటకై నీయొద్ద ఈ కళ్లమును కొనవలెనని వచ్చితిననెను, అందుకు అరౌనా–నా యేలినవాడవగు నీవు చూచి యేది నీకు అనుకూలమో దాని తీసికొని బలి అర్పించుము; చిత్తగించుము, దహనబలికి ఎడ్లున్నవి, నూర్చుకఱ్ఱ సామానులు కట్టెలుగా అక్కరకు వచ్చును. రాజా, యివన్నియు అరౌనా అను నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పి– నీ దేవుడైన యెహోవా నిన్ను అంగీకరించును గాక అని రాజుతో అనగా రాజు–నేను ఆలాగు తీసికొనను, వెల యిచ్చి నీయొద్ద కొందును, వెల యియ్యక నేను తీసికొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహనబలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్లమును ఎడ్లను ఏబది తులముల వెండికి కొనెను. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠముకట్టించి దహనబలులను సమాధానబలులను అర్పించెను; యెహోవా దేశముకొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచి పోయెను.
2 సమూయేలు 24:10-25 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
సైన్యాన్ని లెక్కించిన తర్వాత దావీదు తప్పు చేశానని మనస్సాక్షి గద్దింపు పొంది, అతడు యెహోవాకు, “నేను ఈ పని చేసి ఘోరపాపం చేశాను. యెహోవా, మీ సేవకుని దోషాన్ని తొలగించమని బ్రతిమాలుకుంటున్నాను. నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను” అని ప్రార్థన చేశాడు. తర్వాతి రోజు ఉదయాన్నే దావీదు నిద్ర లేవడానికి ముందే దావీదుకు దీర్ఘదర్శిగా, ప్రవక్తగా ఉన్న గాదుతో యెహోవా ఇలా చెప్పారు: “వెళ్లి దావీదుతో ఇలా చెప్పు, ‘యెహోవా చెప్పే మాట ఇదే: నేను నీకు మూడు ఎంపికలు ఇస్తున్నాను. వాటిలో ఒకదాన్ని ఎంచుకో, దానిని నీమీదికి రప్పిస్తాను.’ ” కాబట్టి గాదు దావీదు దగ్గరకు వెళ్లి అతనితో, “నీ దేశంలో మూడు సంవత్సరాల కరువు రావాలని కోరుకుంటావా? నీ శత్రువులు నిన్ను వెంటాడగా, వారిని ఎదుర్కోలేక మూడు నెలలు పారిపోతావా? నీ దేశంలో మూడు రోజులు తెగులు వ్యాపించాలని కోరుకుంటావా? ఇప్పుడు, నన్ను పంపిన వ్యక్తికి నేనేమి జవాబివ్వాలో ఆలోచించి నిర్ణయించుకో” అన్నాడు. అందుకు దావీదు గాదుతో, “నేను తీవ్ర బాధలో ఉన్నాను. యెహోవా కనికరం ఎంతో గొప్పది కాబట్టి ఆయన చేతిలోనే మేము పడాలి; కాని మనుష్యుల చేతిలో నేను పడకూడదు” అని అన్నాడు. కాబట్టి యెహోవా ఉదయం నుండి నియమించబడిన సమయం పూర్తయ్యే వరకు ఇశ్రాయేలు మీదికి తెగులు రప్పించారు. అప్పుడు దాను నుండి బెయేర్షేబ వరకు డెబ్బైవేలమంది చనిపోయారు. యెరూషలేమును నాశనం చేయడానికి దేవదూత చేయి చాపినప్పుడు జరిగిన కీడుకు యెహోవా మనస్సు కరిగి ప్రజలను నాశనం చేస్తున్న దూతతో, “ఇక చాలు! నీ చేయి వెనుకకు తీసుకో” అని చెప్పారు. అప్పుడు యెహోవా దూత యెబూసీయుడైన అరౌనాకు చెందిన నూర్పిడి కళ్ళం దగ్గర ఉన్నాడు. నాశనం చేస్తున్న దూతను చూసిన దావీదు, “గొర్రెల కాపరినైన నేను పాపం చేశాను! వీరు గొర్రెల వంటి వారు, వీరేమి చేశారు? ఈ ప్రజలు ఏమి చేశారు? మీ చేతులు నా మీద నా కుటుంబం మీద పడనివ్వండి” అని యెహోవాకు ప్రార్థన చేశాడు. అదే రోజు గాదు దావీదు దగ్గరకు వచ్చి, “యెబూసీయుడైన అరౌనా నూర్పిడి కళ్ళంలో యెహోవాకు బలిపీఠం కట్టించు” అని చెప్పాడు. గాదు ద్వారా యెహోవా ఇచ్చిన ఆజ్ఞమేరకు దావీదు బయలుదేరి వెళ్లాడు. రాజు, అతని అధికారులు తన వైపు రావడం చూసిన అరౌనా రాజుకు ఎదురు వెళ్లి తన తల నేలకు వంచి రాజుకు నమస్కారం చేశాడు. అరౌనా, “నా ప్రభువైన రాజా, తన సేవకుని దగ్గరకు రావడానికి కారణం ఏమిటి?” అని అడిగాడు. అందుకు దావీదు, “ప్రజల మీద ఉన్న తెగులు ఆగిపోవడానికి యెహోవాకు బలిపీఠం కట్టడానికి, నీ నూర్పిడి కళ్ళం కొనాలని వచ్చాను” అని అన్నాడు. అందుకు అరౌనా దావీదుతో, “నా ప్రభువైన రాజు తనకు కావల్సింది తీసుకుని బలి అర్పించవచ్చు. దహనబలి కోసం ఇక్కడ ఎద్దులు ఉన్నాయి. కట్టెలకు నూర్చే కర్రలు ఎద్దు కాడెలు ఉన్నాయి. రాజా, ఇవన్నీ అరౌనా అనే నేను రాజుకు ఇస్తున్నాను” అని చెప్పి, “నీ దేవుడైన యెహోవా నీ ప్రార్థన అంగీకరించును గాక” అని అన్నాడు. అయితే రాజు అరౌనాతో, “లేదు, నీకు వెల చెల్లించి కొంటాను. ఉచితంగా తీసుకున్న దానిని నేను నా దేవుడైన యెహోవాకు దహనబలి అర్పించను” అన్నాడు. కాబట్టి దావీదు ఆ నూర్పిడి కళ్ళాన్ని ఎడ్లను యాభై షెకెళ్ళ వెండికి కొన్నాడు. దావీదు అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి దహనబలులు సమాధానబలులు అర్పించాడు. అప్పుడు యెహోవా దేశం కోసం అతడు చేసిన ప్రార్థన అంగీకరించగా ఇశ్రాయేలీయులకు వచ్చిన తెగులు తొలగిపోయింది.