2 సమూయేలు 16:5-13
2 సమూయేలు 16:5-13 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
రాజైన దావీదు బహూరీముకు వచ్చినప్పుడు, సౌలు కుటుంబ వంశానికి చెందిన ఒక వ్యక్తి అక్కడినుండి బయటకు వచ్చాడు. అతడు గెరా కుమారుడైన షిమీ. అతడు బయటకు వస్తూ దావీదును శపిస్తున్నాడు. సైనికులు బలాఢ్యులు దావీదుకు ఇరువైపులా ఉన్నప్పటికీ అతడు రాజైన దావీదు మీదికి అతని అధికారులందరి మీదికి రాళ్లు విసిరాడు. అంతేకాక షిమీ అతన్ని శపిస్తూనే, “వెళ్లిపో, వెళ్లిపో, హంతకుడా, దుర్మార్గుడా! నీవు ఎవరి స్థానంలో పరిపాలించావో, ఆ సౌలు ఇంటివారి రక్తాన్ని నీవు చిందించినందుకు యెహోవా నీకు ప్రతిఫలమిచ్చారు. యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యాన్ని అప్పగించారు. నీవు హంతకుడివి కాబట్టే నీవు పతనానికి దగ్గరలో ఉన్నావు” అని దూషించాడు. అప్పుడు సెరూయా కుమారుడైన అబీషై రాజుతో, “ఈ చచ్చిన కుక్క రాజైన నా ప్రభువును ఎందుకు శపించాలి? నేను వెళ్లి అతని తల నరికివేయనివ్వండి” అన్నాడు. అందుకు రాజు, “సెరూయా కుమారులారా! ఈ విషయంతో మీకేమి సంబంధం? ‘దావీదును శపించు’ అని ఒకవేళ యెహోవా అతనితో చెప్పినందుకు అతడు శపిస్తున్నాడేమో, అలాంటప్పుడు, ‘నీవు ఎందుకిలా చేస్తున్నావు’ అని ఎవరు అడగగలరు?” అన్నాడు. తర్వాత దావీదు అబీషైతో, తనతో ఉన్నవారందరితో, “నా రక్తం పంచుకుని పుట్టిన నా కుమారుడే నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటప్పుడు ఈ బెన్యామీనీయుడు ఇలా చేయడంలో ఆశ్చర్యమేముంది? అతన్ని వదిలేయండి, శపించమని యెహోవా వానికి చెప్పారు, కాబట్టి శపించనివ్వండి. యెహోవా నా బాధ చూసి, ఈ రోజు ఇతడు పలికిన శాపాలకు బదులుగా నాకు మంచి చేస్తాడేమో!” అని అన్నాడు. దావీదు, అతని మనుష్యులు తమ దారిన ముందుకు వెళ్తుండగా, షిమీ అతనికి ఎదురుగా కొండ ప్రక్క నుండి వెళ్తూ, దావీదును శపిస్తూ, అతని మీదికి రాళ్లు విసురుతూ, అతని మీద దుమ్మెత్తి పోస్తూ ఉన్నాడు.
2 సమూయేలు 16:5-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
రాజైన దావీదు బహూరీము దగ్గర కు వచ్చినప్పుడు సౌలు కుటుంబానికి చెందిన గెరా కుమారుడు షిమీ అనేవాడు అక్కడికి వచ్చాడు. అతడు దావీదు పక్కనే నడుస్తూ “నరహంతకుడా, దుర్మార్గుడా ఛీ పో, ఛీ పో. రాజ్యాధికారం కోసం నువ్వు తరిమివేసిన సౌలు కుటుంబంవారి ఉసురు యెహోవా నీపైకి రప్పించాడు. నీ కుమారుడు అబ్షాలోము చేతికి యెహోవా రాజ్యాన్ని అప్పగించాడు. నువ్వు హంతకుడివి కాబట్టే ఈ మోసంలో చిక్కుకున్నావు” అని దుర్భాషలాడుతూ వచ్చాడు. రాజైన దావీదు ఇరుపక్కలా ప్రజలు, బలాఢ్యులైన వారంతా ఉన్నప్పటికీ అతడు దావీదు మీదా, అతని సేవకుల మీదా రాళ్లు రువ్వాడు. అప్పుడు సెరూయా కుమారుడు అబీషై “ఈ చచ్చిన కుక్క నా యజమానివి, రాజువు అయిన నిన్ను శపిస్తాడా? నాకు అనుమతి ఇవ్వు, నేను వాడి తల నరుకుతాను” అన్నాడు. అందుకు రాజు “సెరూయా కొడుకుల్లారా, మీకు నామీద ఎందుకింత అభిమానం? దావీదును శపించమని యెహోవా అతనికి చెప్పి ఉన్నట్టయితే అతణ్ణి శపించయ్యండి. నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావని అడిగేవాళ్ళెవరు?” అని చెప్పాడు. తరువాత అబీషైతో, తన సేవకులందరితో, ఇలా చెప్పాడు. “నా కడుపున పుట్టిన నా కొడుకే నన్ను చంపాలని చూస్తున్నప్పుడు ఈ బెన్యామీయుడు ఇలా చేయడంలో ఆశ్చర్యం ఏముంది? వాడి సంగతి వదిలిపెట్టండి. యెహోవా వాడికి సెలవిచ్చాడు, వాడిని తిట్టనివ్వండి. యెహోవా నా బాధలను పట్టించుకుంటాడేమో, వాడు పెట్టిన శాపాలకు బదులు నాకు మేలు చేస్తాడేమో.” తరువాత దావీదు, అతని మనుషులు బయలుదేరి వెళ్ళిపోయారు. వారు వెళ్తుండగా షిమీ దావీదుకు ఎదురుగా కొండ పక్కనే నడుస్తూ అతని పైకి రాళ్లు రువ్వుతూ, దుమ్మెత్తి పోస్తూ ఉన్నాడు.
2 సమూయేలు 16:5-13 పవిత్ర బైబిల్ (TERV)
దావీదు బహూరీముకు వచ్చాడు. బహూరీమునుండి సౌలు కుటుంబానికి చెందిన వాడొకడు బయటికి వచ్చాడు. వాని పేరు షిమీ. అతను గెరా అనువాని కుమారుడు. దావీదును గురించి చెడు మాటలు మాట్లాడుతూ వాడు బయటికి వచ్చాడు. అతడలా పదే పదే నిందిస్తూ వచ్చాడు. దావీదు మీదికి, అతని సేవకుల మీదికి రాళ్లు విసరటం మొదలు పెట్టాడు. కాని దావీదుతో వున్న మనుష్యులు, సైనికులు దావీదు చుట్టూ చేరారు. చూట్టూ చేరి రక్షణ కల్పించారు. షిమీ దావీదును తిట్టాడు. “బయటికి పో! బయటికి పో! నీవు మంచివాడవు కావు. హంతకుడవు!” అంటూ తిట్టాడు. “యెహోవా నిన్ను శిక్షిస్తాడు! ఎందువలననగా నీవు సౌలు కుటుంబంలోని మనుష్యులను చంపావు! రాజైన సౌలు స్థానాన్ని నీవు సంగ్రహించావు! కాని యెహోవా ఇప్పుడు రాజ్యాన్ని నీ కుమారుడైన అబ్షాలోముకు ఇచ్చాడు! నీవు చేసిన చెడు కార్యాలన్నీ ఇప్పుడు నీకే జరుగుతున్నాయి! ఎందువల్లననగా నీవొక హంతకుడవు!” సెరూయా కుమారుడైన అబీషై రాజుతో, “నా ప్రభువైన రాజును ఈ చచ్చిన కుక్క ఎందుకు తిట్టాలి? నన్ను వెళ్లి, షిమీ తల నరికివేయనీయండి!” అని అన్నాడు. అందుకు రాజు ఇలా అన్నాడు: “సెరూయా కుమారులారా, నేనేమి చేయగలను! నిజానికి షిమీ నన్ను దూషిస్తున్నాడు! కాని యెహోవా వాని చేత నన్ను శపిస్తున్నాడు!” దావీదు తన సేవకులతోను, అబీషైతోను ఇంకా ఈ విధంగా అన్నాడు, “చూడండి, నా స్వంత కుమారుడే నన్ను చంపజూస్తున్నాడు! బెన్యామీనీయుడైన ఈ మనుష్యుడు (షిమీ) నన్ను చంపటానికి ఇంకా ఎక్కువ హక్కు కలిగి వున్నాడు! అతనిని అలా వదిలి వేయండి. నన్ను గురించి చెడ్డ మాటలు వానిని చెప్పనీయండి. యెహోవాయే ఇవన్నీ వానిచేత పలికిస్తున్నాడు. బహుశః యెహోవా నాకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా గమనిస్తూ వుండవచ్చు. బహుశః యెహోవాయే నాకు మేలు చేయవచ్చు. ఈ రోజు షిమీ చెప్పే చెడ్డ మాటలన్నిటికీ భిన్నంగా ఏదో ఒక మంచి నాకు జరుగువచ్చు!” కావున దావీదు తన మనుష్యులతో కలిసి తన దారిన వెళ్లిపోయాడు. కాని షిమీ దావీదును అనుసరిస్తూనే ఉన్నాడు. కొండ ప్రక్కగా దారికి ఆవలివైపున నడుస్తూ ఉన్నాడు. దారి పొడవునా షిమీ దావీదును దూషిస్తూనే ఉన్నాడు. అంతేగాకుండా దావీదు మీదకు రాళ్లు రువ్వటం, దుమ్ము జల్లటం కూడ చేస్తూనే వున్నాడు.
2 సమూయేలు 16:5-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబికుడగు గెరా కుమారుడైన షిమీ అను నొకడు అచ్చటనుండి బయలుదేరి వచ్చెను; అతడు వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు జనులందరును బలాఢ్యులందరును దావీదు ఇరు పార్శ్వముల నుండగా రాజైన దావీదుమీదను అతని సేవకులందరిమీదను రాళ్లు రువ్వుచు వచ్చెను. ఈ షిమీ–నరహంతకుడా, దుర్మా ర్గుడా ఛీపో, ఛీపో, –నీవేలవలెనని నీవు వెళ్లగొట్టిన సౌలు ఇంటివారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి, యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించియున్నాడు; నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి యున్నావని చెప్పి రాజును శపింపగా సెరూయా కుమారుడైన అబీషై–ఈ చచ్చిన కుక్క నా యేలినవాడవును రాజవునగు నిన్ను శపింపనేల? నీ చిత్తమైతే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చెదననెను. అందుకు రాజు –సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వానిని శపింపనియ్యుడు, దావీదును శపింపుమని యెహోవా వానికి సెలవియ్యగా–నీవు ఈలాగున నెందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి అబీషైతోను తన సేవకులందరితోను పలికినదేమనగా–నా కడుపున బుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయ చూచుచుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము? వానిజోలి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చియున్నాడు గనుక వానిని శపింపనియ్యుడి. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టు నేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలుచేయునేమో. అంతట దావీదును అతని వారును మార్గమున వెళ్లిపోయిరి. వారు వెళ్లిపోవుచుండగా షిమీ అతని కెదురుగా కొండప్రక్కను పోవుచు అతని మీదికి రాళ్లు విసరుచు ధూళి యెగరగొట్టుచునుండెను.