2 సమూయేలు 15:13-31

2 సమూయేలు 15:13-31 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షం చేరిపోయారని దావీదుకు కబురు అందింది. దావీదు యెరూషలేములో ఉన్న తన సేవకులకందరికీ ఇలా ఆజ్ఞ ఇచ్చాడు “అబ్షాలోము చేతిలో నుండి మనం తప్పించుకుని బతకలేము. మనం పారిపోదాం పదండి. అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకుని, మనకు కీడు చేయక ముందే, నగరంలో హత్యాకాండ జరిపించకముందే మనం త్వరగా వెళ్లిపోదాం రండి.” అప్పుడు రాజు సేవకులు ఇలా చెప్పారు “అయ్యా, వినండి. నువ్వు మమ్మల్ని ఏలేవాడివి. మాకు రాజువు. నువ్వు చెప్పినట్టు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము.” అప్పుడు రాజు నగరాన్ని కనిపెట్టుకుని ఉండడానికి తన పదిమంది ఉపపత్నులను ఉంచి, తన కుటుంబాన్ని వెంటబెట్టుకుని కాలినడకన బయలుదేరాడు. రాజు, అతని కుటుంబం బయలుదేరి బెత్మెర్హాకుకు వచ్చి అక్కడ సేదదీర్చుకున్నారు. కెరేతీయులు, పెలేతీయులు, గాతు నుండి వచ్చిన ఆరు వందలమంది గిత్తీయులు రాజుకు ముందుగా నడిచారు. రాజు సేవకులంతా అతనికి రెండు వైపులా నడిచారు. గిత్తీయుడైన ఇత్తయితో రాజు “నువ్వు నివసించేందుకు స్థలం కోరి వచ్చిన విదేశీయుడివి. మాతో కలసి ఎందుకు వస్తున్నావు? వెనక్కు వెళ్లి రాజ భవనంలో ఉండు. నిన్ననే వచ్చిన నీకు, ఎక్కడి వెళ్తామో తెలియని మాతో కలసి ఈ తిరుగులాట ఎందుకు? నువ్వు నీ సహోదరులను తీసుకుని వెనక్కు వెళ్ళిపో. యెహోవా నీకు తన సత్యం, కనికరం నీపై చూపుతాడు గాక” అని చెప్పాడు. అప్పుడు ఇత్తయి “నేను చనిపోయినా, బ్రతికినా యెహోవా మీద ఒట్టు, నా ఏలిక, రాజు అయిన నీ జీవం మీద ఒట్టు. నా రాజువైన నువ్వు ఎక్కడ ఉంటావో ఆ స్థలం లోనే నీ దాసుడనైన నేనూ ఉంటాను” అని రాజుతో చెప్పాడు. అప్పుడు దావీదు “ఆలాగైతే నువ్వు మాతో కూడ రావచ్చు” అని చెప్పినప్పుడు గిత్తీయుడైన ఇత్తయి, అతని పరివారమంతా దావీదును వెంబడించారు. వారు కొనసాగిపోతూ ఉన్నప్పుడు ప్రజలంతా బాగా రోదించారు. ఈ విధంగా వారంతా రాజుతో కలసి కిద్రోనువాగు దాటి ఎడారి వైపు ప్రయాణమై వెళ్ళారు. సాదోకు, లేవీయులంతా దేవుని నిబంధన మందసాన్ని మోస్తూ దావీదు దగ్గర ఉన్నారు. వారు దేవుని మందసాన్ని కిందికి దించారు. పట్టణంలోనుండి బయలుదేరిన ప్రజలంతా దాటిపోయే వరకూ అబ్యాతారు అక్కడే నిలబడి ఉన్నాడు. అప్పుడు రాజు సాదోకును పిలిచి “దేవుని మందసాన్ని తిరిగి పట్టణంలోకి తీసుకువెళ్ళు. యెహోవా దృష్టికి నేను దయ పొందితే ఆయన నన్ను తిరిగి రప్పించి దానినీ, అది ఉండే స్థలాన్నీ నాకు చూపిస్తాడు. నీపట్ల నాకు దయ లేదని చెప్పినట్టయితే అది ఆయన ఇష్టం. ఆయన దృష్టికి ఏది అనుకూలమో దానినే నా విషయంలో జరిగిస్తాడు” అని చెప్పాడు. అతడు యాజకుడైన సాదోకుతో ఇంకా ఇలా చెప్పాడు. “దీర్ఘదర్శివైన సాదోకూ, నీకు మంచి జరుగుతుంది. నువ్వు నీ కొడుకు అహిమయస్సునూ, అబ్యాతారుకు కొడుకు యోనాతానునూ వెంటబెట్టుకుని పట్టణం వెళ్ళు. నేను చెప్పేది విను, నీ నుండి నాకు కచ్చితమైన కబురు వచ్చేదాకా నేను అరణ్యంలో నది తీరాల దగ్గర వేచి ఉంటాను.” అప్పుడు సాదోకు, అబ్యాతారు దేవుని మందసాన్ని యెరూషలేముకు తీసుకువెళ్ళి అక్కడ ఉండిపోయారు. దావీదు తన తల కప్పుకుని, ఏడుస్తూ, చెప్పులు లేకుండా నడుచుకొంటూ ఒలీవ చెట్ల కొండ ఎక్కుతూ వెళ్ళాడు. అతనితో ఉన్నవారంతా తలలు కప్పుకుని ఏడుస్తూ కొండ ఎక్కారు. అంతలో ఒకడు వచ్చి “అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలుకు కూడా పాత్ర ఉంది” అని దావీదుకు చెప్పాడు. అప్పుడు దావీదు “యెహోవా, అహీతోపెలు పథకాలను చెడగొట్టు” అని ప్రార్థన చేశాడు.

షేర్ చేయి
Read 2 సమూయేలు 15

2 సమూయేలు 15:13-31 పవిత్ర బైబిల్ (TERV)

ఈ వార్త దావీదుకు చెప్పటానికి ఒక వ్యక్తి వచ్చాడు. “ఇశ్రాయేలు ప్రజలు అబ్షాలోమును అనుసరించటం మొదలు పెట్టారు” అని అతడు చెప్పాడు. అది విని దావీదు యెరూషలేములో తనతో ఉన్న సేవకులను పిలిచి ఇలా చెప్పాడు: “మనం ఇప్పుడు అవశ్యంగా తప్పించుకోవాలి! మనం అలా చేయకపోతే అబ్షాలోము మనల్ని వదిలిపెట్టడు. అబ్షాలోము మనల్ని పట్టుకొనే లోపు మనం త్వరపడాలి. అతడు మనందరినీ నాశనం చేస్తాడు. అతడు ఇశ్రాయేలు ప్రజలను కత్తితో నరికి చంపుతాడు.” “మీరు ఏమి చేయాలని మాకు చెబుతారో మేమది చేస్తాము” అని రాజు యొక్క సేవకులు అన్నారు. రాజు (దావీదు) తన ఇంటి వారందరితో కలిసి బయటికి పోయాడు. రాజు తన ఉంపుడుగత్తెలలో పది మందిని ఇంటిని చూస్తూ వుండేటందుకు వదిలి పెట్టాడు. తన ప్రజలందరూ వెంటరాగా రాజు బయలుదేరి వెళ్లాడు. వారు చివరి ఇంటివద్ద ఆగారు. సేవకులంతా రాజు ముందునుంచి వెళ్లారు. కెరేతీయులు, పెలేతీయులు మరియు గిత్తీయులు (ఆరు వందల మంది గాతువారు) అందరూ రాజు ముందు నుంచి నడిచి వెళ్లారు. గిత్తీయుడైన ఇత్తయిని చూచి రాజు, “నీవెందుకు మాతో వస్తున్నావు? తిరిగిపోయి, కొత్త రాజుతో (అబ్షాలోము) వుండిపో. నీవు పరదేశీయుడవు. ఇది నీ స్వదేశం కాదు. నిన్న మాత్రమే నీవు నన్ను కలియటానికి వచ్చావు. ఇప్పుడు నీవు నాతో కలిసి వివిధ ప్రాంతాలు తిరిగే అవసరం వుందా? లేదు. తిరిగి వెళ్లిపో నీ సోదరులను కూడ నీతో తీసుకొని వెళ్లు. దయ, విశ్వాసం నీకు అండగా వుండుగాక!” అని అన్నాడు. కాని ఇత్తయి రాజుకు సమాధానమిస్తూ, “యెహోవా జీవము తోడుగా, నీ జీవము తోడుగా నేను నీతోనే వుంటాను! చావుబ్రతుకుల్లో కూడ నేను నీతోనే వుంటాను!” అని అన్నాడు. “అయితే మనం కిద్రోను వాగు దాటుదాము,” అన్నాడు రాజు ఇత్తయితో. అప్పుడు గిత్తీయుడైన ఇత్తయి తన వారితోను, వారి పిల్లలతోను కిద్రోను వాగు దాటాడు. ప్రజలంతా బిగ్గరగా ఏడ్వసాగారు. రాజు (దావీదు) కిద్రోనువాగు దాటాడు. అప్పుడు వారంతా ఎడారివైపు ప్రయాణం సాగించారు. సాదోకు, తనతో వున్న తదితర లేవీయులందరూ దేవుని ఒడంబడిక పెట్టెను మోసుకొని వస్తూవున్నారు. వారు దేవుని పెట్టెను దించారు. ప్రజలంతా యెరూషలేము నగరం నుండి వెళ్లిపోయే వరకు అబ్యాతారు ప్రార్థన చేస్తూవున్నాడు. సాదోకుతో రాజు (దావీదు) ఈ విధంగా చెప్పాడు: “దేవుని పవిత్ర పెట్టెను యెరూషలేముకు తిరిగి తీసుకొని వెళ్లు. ఒక వేళ యెహోవా నన్ననుగ్రహించితే, ఆయన నన్ను యెరూషలేముకు తిరిగి తీసుకొని వస్తాడు. యెహోవా మరల నన్ను యెరూషలేమును, ఆయన దేవాలయమును చూసేలా చేస్తాడు. కాని దేవుడు నేనంటే ఇష్టంలేదని చెప్పితే ఆయన నాకు వ్యతిరేకంగా తన ఇష్టం వచ్చినట్లు చేయగలడు.” యాజకుడు సాదోకుతో రాజు ఇంకా ఇలా అన్నాడు: “నీవు దీర్ఘదర్శివి. నగరానికి ప్రశాంతంగా వెళ్లు. నీ కుమారుడైన అహిమయస్సును, అబ్యాతారు కుమారుడైన యోనాతానును నీతో తీసుకొని వెళ్లు. ప్రజలు ఎడారిలోకి ప్రవేశించే స్థలంలో నేను మీనుండి మళ్లీ సమాచారం వచ్చేవరకు వేచి వుంటాను.” కావున సాదోకు, అబ్యాతారు దేవుని పవిత్ర పెట్టెను తీసుకొని యెరూషలేముకు తిరిగి వెళ్లి అక్కడ వుండి పోయారు. దావీదు ఒలీవల పర్వతం మీదికి వెళ్లాడు. అతడు ఏడుస్తూవున్నాడు. తలమీద ముసుగు వేసికొని, చెప్పులు కూడ లేకుండా వెళ్లాడు. దావీదుతో వున్న మనుష్యులంతా కూడ తలపై ముసుగు వేసుకున్నారు. వారు ఏడుస్తూ దావీదు వెంట వెళ్లారు. ఒక వ్యక్తి దావీదు వద్దకు వచ్చి, “అబ్షాలోముతో కలిసి పథకం వేసిన వారిలో అహీతోపెలు ఒకడు” అని చెప్పాడు. అది విని దావీదు యెహోవాకు “అహీతోపెలు సలహా నిరుపయోగమయ్యేలా చేయమని నిన్ను వేడుకుంటున్నాను” అని ప్రార్థన చేశాడు.

షేర్ చేయి
Read 2 సమూయేలు 15

2 సమూయేలు 15:13-31 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఇశ్రాయేలీయులు అబ్షాలోముపక్షము వహించిరని దావీదునకు వర్తమానము రాగా దావీదు యెరూషలేమునందున్న తన సేవకులకందరికి ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను–అబ్షాలోము చేతిలోనుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము; మనము పారిపోదము రండి, అతడు హఠా త్తుగా వచ్చి మనలను పట్టుకొనకను, మనకు కీడుచేయకను, పట్టణమును కత్తివాత హతము చేయకను ఉండునట్లు మనము త్వరగా వెళ్లిపోదము రండి. అందుకు రాజు సేవకులు ఈలాగు మనవి చేసిరి–చిత్తగించుము; నీ దాసులమైన మేము మా యేలినవాడవును రాజవునగు నీవు సెలవిచ్చినట్లు చేయుటకు సిద్ధముగా నున్నాము. అప్పుడు రాజు నగరిని కనిపెట్టుటకై ఉపపత్నులగు పదిమందిని ఉంచిన మీదట తన యింటివారినందరిని వెంటబెట్టుకొని కాలినడకను బయలుదేరెను. రాజును అతని యింటివారును బయలుదేరి బెత్మెర్హాకుకు వచ్చి బసచేసిరి. అతని సేవకులందరును అతని యిరుపార్శ్వముల నడిచిరి; కెరే తీయులందరును పెలేతీయులందరును గాతునుండి వచ్చిన ఆరువందలమంది గిత్తీయులును రాజునకు ముందుగా నడచుచుండిరి. రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని– నీవు నివాసస్థలము కోరు పరదేశివై యున్నావు; నీవెందుకు మాతోకూడ వచ్చుచున్నావు? నీవు తిరిగి పోయి రాజున్న స్థలమున ఉండుము. నిన్ననే వచ్చిన నీకు, ఎక్కడికి పోవుదుమో తెలియకయున్న మాతోకూడ ఈ తిరుగు లాట యెందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము; కృపాసత్యములు నీకు తోడుగా ఉండును గాక యని చెప్పగా ఇత్తయి–నేను చచ్చినను బ్రదికినను, యెహోవా జీవముతోడు నా యేలినవాడవును రాజవునగు నీ జీవముతోడు, ఏ స్థలమందు నా యేలినవాడవును రాజవునగు నీవుందువో ఆ స్థలమందే నీ దాసుడనైన నేనుందునని రాజుతో మనవిచేసెను. అందుకు దావీదు –ఆలాగైతే నీవు రావచ్చునని ఇత్తయితో సెలవిచ్చెను గనుక గిత్తీయుడగు ఇత్తయియును అతని వారందరును అతని కుటుంబికులందరును సాగిపోయిరి. వారు సాగిపోవుచుండగా జనులందరు బహుగా ఏడ్చుచుండిరి, ఈ ప్రకారము వారందరు రాజుతోకూడ కిద్రోనువాగు దాటి అరణ్యమార్గమున ప్రయాణమై పోయిరి. సాదోకును లేవీయులందరును దేవుని నిబంధనమందసమును మోయుచు అతనియొద్ద ఉండిరి. వారు దేవుని మందసమును దింపగా అబ్యాతారు వచ్చి పట్టణములోనుండి జనులందరును దాటిపోవువరకు నిలిచెను. అప్పుడు రాజు సాదోకును పిలిచి–దేవుని మందసమును పట్టణములోనికి తిరిగి తీసికొనిపొమ్ము; యెహోవా దృష్టికి నేను అనుగ్రహము పొందినయెడల ఆయన నన్ను తిరిగి రప్పించి దానిని తన నివాసస్థానమును నాకు చూపించును; నీయందు నాకిష్టము లేదని ఆయన సెలవిచ్చినయెడల ఆయన చిత్తము, –నీ దృష్టికి అనుకూలమైనట్టు నాయెడల జరిగించుమని నేను చెప్పుదునని పలికి యాజకుడైన సాదోకుతో ఇట్లనెను–సాదోకూ, నీవు దీర్ఘదర్శివి కావా? శుభమొంది నీవును నీ కుమారుడగు అహిమయస్సు అబ్యాతారునకు పుట్టిన యోనాతాను అను మీ యిద్దరు కుమారులును పట్టణమునకు పోవలెను. ఆలకించుము; నీయొద్దనుండి నాకు రూఢియైన వర్తమానము వచ్చువరకు నేను అరణ్య మందలి రేవులదగ్గర నిలిచి యుందును. కాబట్టి సాదోకును అబ్యాతారును దేవుని మందసమును యెరూషలేమునకు తిరిగి తీసికొనిపోయి అక్కడ నిలిచిరి. అయితే దావీదు ఒలీవచెట్ల కొండ యెక్కుచు ఏడ్చుచు, తల కప్పుకొని పాదరక్షలులేకుండ కాలినడకను వెళ్లెను; అతనియొద్దనున్న జనులందరును తలలు కప్పుకొని యేడ్చుచు కొండ యెక్కిరి. అంతలో ఒకడు వచ్చి, అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరియున్నాడని దావీదునకు తెలియజేయగా దావీదు–యెహోవా అహీతోపెలుయొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేసెను.

షేర్ చేయి
Read 2 సమూయేలు 15

2 సమూయేలు 15:13-31 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

ఒక దూత వచ్చి దావీదుతో, “ఇశ్రాయేలు ప్రజలు అబ్షాలోము పక్షంగా ఉన్నారు” అనే వార్త చెప్పాడు. దావీదు తనతో పాటు యెరూషలేములో ఉన్న తన అధికారులందరితో, “రండి, మనం పారిపోవాలి, లేకపోతే అబ్షాలోము నుండి మనలో ఎవరమూ తప్పించుకోలేము. మనం వెంటనే వెళ్లిపోవాలి లేదంటే అతడు త్వరగా వచ్చి మనలను పట్టుకుని మనలను మన పట్టణాన్ని ఖడ్గంతో నాశనం చేస్తాడు” అని చెప్పాడు. అందుకు రాజు అధికారులు, “మా ప్రభువైన రాజు ఏం చెప్పినా చేయడానికి మీ సేవకులమైన మేము సిద్ధంగా ఉన్నాం” అని జవాబిచ్చారు. అప్పుడు రాజు రాజభవనాన్ని కనిపెట్టుకుని ఉండడానికి పదిమంది ఉంపుడుగత్తెలను ఉంచి, తన పరివారమంతటితో కలిసి బయలుదేరి వెళ్లాడు. రాజు తన పరివారమంతటితో కాలినడకను బయలుదేరి వెళ్లి పట్టణం చివరి ఉన్న ఇంట్లో బసచేశాడు. రాజు సేవకులందరూ రాజుకు ఇరువైపులా నడిచారు. కెరేతీయులు, పెలేతీయులు, గాతు నుండి అతనితో వచ్చిన ఆరువందలమంది గిత్తీయులు రాజుకు ముందుగా నడిచారు. రాజు గిత్తీయుడైన ఇత్తయితో, “నీవు మాతో పాటు రావడం ఎందుకు? తిరిగివెళ్లి అబ్షాలోము రాజుతో పాటు ఉండు. నీవు బందీగా ఉన్న విదేశీయుడవు. నీవు నిన్ననే వచ్చావు. నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియనప్పుడు నీవు మాతో తిరగడం ఎందుకు? నీ ప్రజలను తీసుకుని నీవు తిరిగి వెళ్లిపో. యెహోవా నీ మీద దయను నమ్మకత్వాన్ని చూపిస్తారు” అన్నాడు. అందుకు ఇత్తయి రాజుతో, “నా ప్రభువైన రాజు ఎక్కడ ఉంటాడో నీ సేవకుడైన నేను మరణించినా బ్రతికినా అక్కడే ఉంటానని సజీవుడైన యెహోవా మీద, నా ప్రభువైన రాజు జీవం మీద ప్రమాణం చేస్తున్నాను” అన్నాడు. దావీదు ఇత్తయితో, “సరే, నీవు మాతో రావచ్చు” అన్నాడు. కాబట్టి గిత్తీయుడైన ఇత్తయి అతనితో ఉన్న మనుష్యులు, కుటుంబాలు ముందుకు నడిచారు. వారందరూ వెళ్లి పోతుంటే ప్రజలంతా గట్టిగా ఏడ్చారు. ఇలా వారందరూ రాజుతో కలిసి కిద్రోనువాగు దాటి అరణ్యమార్గంలో కదిలారు. సాదోకు అతనితో ఉన్న లేవీయులందరు దేవుని నిబంధన మందసాన్ని మోస్తూ వచ్చారు. తర్వాత వారు మందసాన్ని క్రిందికి దించినప్పుడు ప్రజలందరూ పట్టణాన్ని దాటి వచ్చేవరకు అబ్యాతారు బలులు అర్పించాడు. అప్పుడు రాజు సాదోకును పిలిచి, “దేవుని మందసాన్ని తిరిగి పట్టణంలోనికి తీసుకెళ్లు. యెహోవా నా పట్ల దయ చూపిస్తే ఆయన నన్ను మరలా తీసుకువచ్చి ఆయన మందసాన్ని, ఆయన నివాస స్థలాన్ని నేను మళ్ళీ చూసేలా చేస్తారు. ఒకవేళ ఆయన, ‘నీపై నాకు దయలేదు’ అని చెప్పినా సరే నేను అందుకు సిద్ధమే; ఆయనకు ఏది న్యాయం అనిపిస్తే నా పట్ల అదే చేస్తారు” అని చెప్పాడు. రాజు యాజకుడైన సాదోకుతో, “నీవు దీర్ఘదర్శివి గదా! నీవు నా దీవెనతో సమాధానంగా పట్టణానికి తిరిగి వెళ్లు. నీతో పాటు నీ కుమారుడైన అహిమయస్సును, అబ్యాతారు కుమారుడైన యోనాతానును తీసుకెళ్లు. నీవు అబ్యాతారు మీరిద్దరూ మీ ఇద్దరు కుమారులతో తిరిగి వెళ్లండి. నీ దగ్గర నుండి నాకు కబురు వచ్చేవరకు నేను అరణ్యంలో ఉన్న రేవుల దగ్గర ఎదురుచూస్తూ ఉంటాను” అన్నాడు. కాబట్టి సాదోకు అబ్యాతారులు దేవుని మందసాన్ని యెరూషలేముకు తిరిగి తీసుకెళ్లి అక్కడే ఉండిపోయారు. దావీదు ఒలీవల కొండ ఎక్కుతూ ఏడ్చాడు. తన తల కప్పుకుని, చెప్పులు లేకుండా నడుస్తూ వెళ్లాడు. అతనితో ఉన్నవారందరు తల కప్పుకుని ఏడుస్తూ కొండ ఎక్కారు. ఇంతలో ఒకడు వచ్చి, “అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలుకు కూడా భాగం ఉంది” అని దావీదుతో చెప్పాడు. కాబట్టి దావీదు, “యెహోవా! అహీతోపెలు ఆలోచనలను అవివేకంగా మార్చండి” అని ప్రార్థించాడు.

షేర్ చేయి
Read 2 సమూయేలు 15