2 సమూయేలు 15:13-17
2 సమూయేలు 15:13-17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఇశ్రాయేలీయులు అబ్షాలోముపక్షము వహించిరని దావీదునకు వర్తమానము రాగా దావీదు యెరూషలేమునందున్న తన సేవకులకందరికి ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను–అబ్షాలోము చేతిలోనుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము; మనము పారిపోదము రండి, అతడు హఠా త్తుగా వచ్చి మనలను పట్టుకొనకను, మనకు కీడుచేయకను, పట్టణమును కత్తివాత హతము చేయకను ఉండునట్లు మనము త్వరగా వెళ్లిపోదము రండి. అందుకు రాజు సేవకులు ఈలాగు మనవి చేసిరి–చిత్తగించుము; నీ దాసులమైన మేము మా యేలినవాడవును రాజవునగు నీవు సెలవిచ్చినట్లు చేయుటకు సిద్ధముగా నున్నాము. అప్పుడు రాజు నగరిని కనిపెట్టుటకై ఉపపత్నులగు పదిమందిని ఉంచిన మీదట తన యింటివారినందరిని వెంటబెట్టుకొని కాలినడకను బయలుదేరెను. రాజును అతని యింటివారును బయలుదేరి బెత్మెర్హాకుకు వచ్చి బసచేసిరి.
2 సమూయేలు 15:13-17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షం చేరిపోయారని దావీదుకు కబురు అందింది. దావీదు యెరూషలేములో ఉన్న తన సేవకులకందరికీ ఇలా ఆజ్ఞ ఇచ్చాడు “అబ్షాలోము చేతిలో నుండి మనం తప్పించుకుని బతకలేము. మనం పారిపోదాం పదండి. అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకుని, మనకు కీడు చేయక ముందే, నగరంలో హత్యాకాండ జరిపించకముందే మనం త్వరగా వెళ్లిపోదాం రండి.” అప్పుడు రాజు సేవకులు ఇలా చెప్పారు “అయ్యా, వినండి. నువ్వు మమ్మల్ని ఏలేవాడివి. మాకు రాజువు. నువ్వు చెప్పినట్టు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము.” అప్పుడు రాజు నగరాన్ని కనిపెట్టుకుని ఉండడానికి తన పదిమంది ఉపపత్నులను ఉంచి, తన కుటుంబాన్ని వెంటబెట్టుకుని కాలినడకన బయలుదేరాడు. రాజు, అతని కుటుంబం బయలుదేరి బెత్మెర్హాకుకు వచ్చి అక్కడ సేదదీర్చుకున్నారు.
2 సమూయేలు 15:13-17 పవిత్ర బైబిల్ (TERV)
ఈ వార్త దావీదుకు చెప్పటానికి ఒక వ్యక్తి వచ్చాడు. “ఇశ్రాయేలు ప్రజలు అబ్షాలోమును అనుసరించటం మొదలు పెట్టారు” అని అతడు చెప్పాడు. అది విని దావీదు యెరూషలేములో తనతో ఉన్న సేవకులను పిలిచి ఇలా చెప్పాడు: “మనం ఇప్పుడు అవశ్యంగా తప్పించుకోవాలి! మనం అలా చేయకపోతే అబ్షాలోము మనల్ని వదిలిపెట్టడు. అబ్షాలోము మనల్ని పట్టుకొనే లోపు మనం త్వరపడాలి. అతడు మనందరినీ నాశనం చేస్తాడు. అతడు ఇశ్రాయేలు ప్రజలను కత్తితో నరికి చంపుతాడు.” “మీరు ఏమి చేయాలని మాకు చెబుతారో మేమది చేస్తాము” అని రాజు యొక్క సేవకులు అన్నారు. రాజు (దావీదు) తన ఇంటి వారందరితో కలిసి బయటికి పోయాడు. రాజు తన ఉంపుడుగత్తెలలో పది మందిని ఇంటిని చూస్తూ వుండేటందుకు వదిలి పెట్టాడు. తన ప్రజలందరూ వెంటరాగా రాజు బయలుదేరి వెళ్లాడు. వారు చివరి ఇంటివద్ద ఆగారు.
2 సమూయేలు 15:13-17 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ఒక దూత వచ్చి దావీదుతో, “ఇశ్రాయేలు ప్రజలు అబ్షాలోము పక్షంగా ఉన్నారు” అనే వార్త చెప్పాడు. దావీదు తనతో పాటు యెరూషలేములో ఉన్న తన అధికారులందరితో, “రండి, మనం పారిపోవాలి, లేకపోతే అబ్షాలోము నుండి మనలో ఎవరమూ తప్పించుకోలేము. మనం వెంటనే వెళ్లిపోవాలి లేదంటే అతడు త్వరగా వచ్చి మనలను పట్టుకుని మనలను మన పట్టణాన్ని ఖడ్గంతో నాశనం చేస్తాడు” అని చెప్పాడు. అందుకు రాజు అధికారులు, “మా ప్రభువైన రాజు ఏం చెప్పినా చేయడానికి మీ సేవకులమైన మేము సిద్ధంగా ఉన్నాం” అని జవాబిచ్చారు. అప్పుడు రాజు రాజభవనాన్ని కనిపెట్టుకుని ఉండడానికి పదిమంది ఉంపుడుగత్తెలను ఉంచి, తన పరివారమంతటితో కలిసి బయలుదేరి వెళ్లాడు. రాజు తన పరివారమంతటితో కాలినడకను బయలుదేరి వెళ్లి పట్టణం చివరి ఉన్న ఇంట్లో బసచేశాడు.