2 సమూయేలు 12:22-23
2 సమూయేలు 12:22-23 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అందుకతడు, “బిడ్డ ప్రాణాలతో ఉన్నప్పుడు ‘ఒకవేళ యెహోవా నా మీద జాలి చూపించి బ్రతకనిస్తాడేమో’ అనుకుని ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు ఆ బిడ్డ చనిపోయాడు. నేనెందుకు ఉపవాసముండాలి? నేను అతన్ని మళ్ళీ బ్రతికించగలనా? నేనే వాని దగ్గరకు వెళ్లాలి తప్ప, వాడు నా దగ్గరకు తిరిగి రాడు కదా!” అని జవాబిచ్చాడు.
2 సమూయేలు 12:22-23 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పుడు దావీదు “బిడ్డ బతికి ఉన్నప్పుడు దేవుడు నన్ను కరుణించి బిడ్డను బతికిస్తాడన్న ఆశతో నేను ఉపవాసముండి ఏడుస్తూ వేడుకొన్నాను. ఇప్పుడు బిడ్డ చనిపోయాడు కనుక నేనెందుకు ఉపవాసముండాలి? బిడ్డను నేను తిరిగి రప్పించగలనా? నేనే వాడి దగ్గరకు వెళ్తాను గానీ వాడు నా దగ్గరికి మళ్ళీ రాడు కదా” అని వారితో చెప్పాడు.
2 సమూయేలు 12:22-23 పవిత్ర బైబిల్ (TERV)
అందుకు దావీదు ఇలా చెప్పాడు: “బిడ్డ బ్రతికివుండగా నేను తినలేదు. ఏడ్చాను. ఎందువల్లనంటే యెహోవా నన్ను కనికరించి బిడ్డను బ్రతికించవచ్చు! ఎవరికి తెలుసు! అనుకున్నాను. కాని ఇప్పుడు బిడ్డ చనిపోయాడు. కావున ఇప్పుడు నేనెందుకు తినటానికి నిరాకరించాలి? నేను బిడ్డను తిరిగి బతికించుకొనగలనా? లేదు! ఏదో ఒక రోజున నేనే వాని దగ్గరకు వెళతాను. అంతేగాని వాడు నా వద్దకు తిరిగి రాలేడు.”
2 సమూయేలు 12:22-23 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అతడు–బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నాయందు కనికరించి వాని బ్రదికించునేమో యనుకొని నేను ఉపవాసముండి యేడ్చు చుంటిని. ఇప్పుడు చనిపోయెను గనుక నేనెందుకు ఉపవాసముండవలెను? వానిని తిరిగి రప్పించగలనా? నేను వానియొద్దకు పోవుదునుగాని వాడు నాయొద్దకు మరల రాడని వారితో చెప్పెను.