2 సమూయేలు 1:1-27
2 సమూయేలు 1:1-27 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
సౌలు మరణించిన తర్వాత, దావీదు అమాలేకీయులను ఓడించి తిరిగివచ్చి సిక్లగులో రెండు రోజులు ఉన్నాడు. మూడవ రోజు సౌలు శిబిరం నుండి ఒక వ్యక్తి చిరిగిన బట్టలు వేసుకుని తలమీద దుమ్ముతో వచ్చాడు. అతడు దావీదు దగ్గరకు వచ్చి గౌరవంతో నేలమీద పడి నమస్కారం చేశాడు. “ఎక్కడి నుండి వచ్చావు?” అని దావీదు అతన్ని అడిగాడు. అందుకతడు, “ఇశ్రాయేలు శిబిరం నుండి తప్పించుకుని వచ్చాను” అన్నాడు. “ఏ జరిగిందో నాకు చెప్పు” అని దావీదు అడిగాడు. అప్పుడతడు, “యుద్ధరంగం నుండి సైనికులంతా పారిపోయారు. వారిలో ఎంతోమంది చనిపోయారు. సౌలు, అతని కుమారుడు యోనాతాను కూడా చనిపోయారు” అని సమాధానం ఇచ్చాడు. అందుకు దావీదు, “సౌలు, అతని కుమారుడు యోనాతాను కూడా చనిపోయారని నీకెలా తెలుసు?” అని వార్త తెచ్చిన యువకుని అడిగాడు. ఆ యువకుడు, “అనుకోకుండ నేను గిల్బోవ పర్వతం మీదికి వెళ్లినప్పుడు అక్కడ సౌలు తన ఈటె మీద అనుకుని ఉన్నాడు, రథాలు దాని రౌతులు అతని తరుముతూ వెనుక వస్తూ ఉన్నారు. అతడు వెనుకకు తిరిగినప్పుడు నన్ను చూసి, నన్ను పిలిచాడు. అందుకు నేను, ‘నన్ను ఏమి చేయమంటారు?’ అని అడిగాను. “అందుకతడు, ‘నీవెవరు?’ అని అడిగాడు. “అందుకు నేను, ‘నేను అమాలేకీయుడను’ అని జవాబిచ్చాను. “అప్పుడతడు నాతో, ‘నా ప్రాణం పోకుండా మరణవేదనతో నా తల తిరుగుతుంది. నా దగ్గరకు వచ్చి నిలబడి నన్ను చంపెయ్యి’ అన్నాడు. “అంతగా గాయపడిన అతడు ఇక బ్రతకడని భావించి నేను అతని ప్రక్కన నిలబడి అతన్ని చంపేశాను. అతని తలమీద ఉన్న కిరీటం, చేతికున్న కంకణం తీసి నా ప్రభువైన మీకు అప్పగిద్దామని తెచ్చాను” అని అన్నాడు. ఆ వార్త వినగానే దావీదు అతని మనుష్యులు దుఃఖంతో బట్టలు చింపుకున్నారు. సౌలు, అతని కుమారుడు యోనాతాను, యెహోవా సైన్యం ఇశ్రాయేలీయులు యుద్ధంలో ఖడ్గంతో చంపబడ్డారని విని, వారి కోసం సాయంకాలం వరకు దుఃఖిస్తూ ఏడుస్తూ ఉపవాసం ఉన్నారు. తనకు వార్త తీసుకువచ్చిన యువకునితో దావీదు, “నీవు ఎక్కడ నుండి వచ్చావు?” అని అడిగాడు. “నేను విదేశీయుని కుమారుడను, నా తండ్రి అమాలేకీయుడు” అని చెప్పాడు. అందుకు దావీదు, “యెహోవా అభిషేకించినవాన్ని చంపడానికి నీకు భయం వేయలేదా?” అని అడిగాడు. దావీదు తన మనుష్యుల్లో ఒకని పిలిచి, “వెళ్లి అతన్ని చంపు” అని చెప్పాడు. వెంటనే అతడు వాన్ని కొట్టి చంపాడు. ఎందుకంటే దావీదు ఆ యువకునితో, “ ‘నేను యెహోవా అభిషేకించినవాన్ని చంపాను’ అని నీ నోరే నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది కాబట్టి నీ చావుకు నీవే బాధ్యుడవు” అన్నాడు. సౌలు గురించి అతని కుమారుడైన యోనాతాను గురించి దావీదు ఒక శోకగీతాన్ని వ్రాసి, యూదావారందరికి ఆ విల్లు విలాపగీతాన్ని నేర్పించాలని అతడు ఆదేశించాడు. ఇది యాషారు అనగా యథార్థవంతులు అనే గ్రంథంలో వ్రాయబడి ఉంది: “ఇశ్రాయేలూ, నీ ఉన్నతస్థలాల మీద నీ వైభవం గలవారు చంపబడ్డారు. బలవంతులు ఎలా పడిపోయారు కదా! “ఫిలిష్తీయుల కుమార్తెలు సంతోషించకూడదు సున్నతిలేనివారి కుమార్తెలు ఆనందించకూడదు. కాబట్టి ఈ వార్త గాతులో చెప్పకండి, అష్కెలోను వీధుల్లో దీనిని ప్రకటించకండి. “గిల్బోవ పర్వతాల్లారా, మీమీద మంచు గాని వర్షం గాని కురవకుండును గాక, అర్పణల కోసం ధాన్యాన్ని ఇచ్చే పొలాలపై జల్లులు పడకుండును గాక. ఎందుకంటే అక్కడ బలవంతుల డాలు అవమానపరచబడింది, ఇకపై సౌలు డాలు నూనెతో పూయబడదు. “హతుల రక్తం ఒలికించకుండా, బలవంతుల శరీరంలో చొచ్చుకుపోకుండా, యోనాతాను విల్లు వెనుదిరగలేదు, సౌలు ఖడ్గం అసంతృప్తిగా వెనుదిరగలేదు. సౌలు యోనాతానులు తమ బ్రతుకంతా ప్రేమ కలిగి దయ కలిగినవారిగా ఉన్నారు. చావులోనూ ఒకరిని ఒకరు విడిచిపెట్టలేదు. వారు గ్రద్దల కన్నా వేగం గలవారు, సింహాల కన్నా బలవంతులు. “ఇశ్రాయేలు కుమార్తెలారా, సౌలు గురించి ఏడవండి, అతడు, మీకు విలాసవంతమైన ఎర్రని వస్ర్తాలు ధరింపచేశాడు, మీ వస్త్రాలను బంగారు ఆభరణాలతో అలంకరించాడు. “యుద్ధరంగంలో బలవంతులు ఎలా పడిపోయారో కదా! నీ పర్వతాలమీద యోనాతాను హతమైపోయాడు. నా సోదరుడా, యోనాతానా! నీకోసం నేనెంతో దుఃఖిస్తున్నాను; నీవు నాకెంతో ప్రియమైనవాడవు. నాపై నీకున్న ప్రేమ ఎంతో అద్భుతమైనది, అది స్త్రీలు చూపించే దానికన్నా అద్భుతమైనది. “బలవంతులు ఎలా పడిపోయారు కదా! యుద్ధ ఆయుధాలు నశించిపోయాయి.”
2 సమూయేలు 1:1-27 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దావీదు అమాలేకీయులను చంపి తిరిగి వచ్చాడు. సౌలు చనిపోయిన తరువాత అతడు సిక్లగు ప్రాంతంలో రెండు రోజులు ఉన్నాడు. మూడవ రోజు ఒకడు తన బట్టలు చింపుకుని, తల మీద బూడిద పోసుకుని సౌలు సైన్యం నుండి వచ్చాడు. అతడు దావీదును చూసి నేలపై సాష్టాంగపడి నమస్కారం చేశాడు. అప్పుడు దావీదు “నువ్వు ఎక్కడ నుండి వచ్చావు?” అని అడిగాడు. అందుకు వాడు “ఇశ్రాయేలీయుల సైన్యంలో నుండి నేను తప్పించుకు వచ్చాను” అన్నాడు. “జరిగిన సంగతులు నాతో చెప్పు” అని దావీదు అడిగాడు. అందుకు అతడు “సైనికులు యుద్ధంలో నిలవలేక పారిపోయారు. చాలా మంది గాయాలపాలై పడిపోయారు, చాలా మంది చనిపోయారు. సౌలూ అతని కొడుకు యోనాతానూ చనిపోయారు” అన్నాడు. “సౌలు, అతని కొడుకు యోనాతాను చనిపోయారని నీకెలా తెలిసిందో నాకు వివరంగా చెప్పు” అని దావీదు అతణ్ణి అడిగాడు. ఆ యువకుడు ఇలా అన్నాడు, “నేను అనుకోకుండా గిల్బోవ కొండకు వచ్చినప్పుడు సౌలు తన ఈటె మీద ఆనుకుని ఉన్నాడు. రథాలు, రౌతులు అతనిని తరుముతూ పట్టుకోవడానికి సమీపించినప్పుడు అతడు వెనక్కి తిరిగి చూసి నన్ను పిలిచాడు. అందుకు నేను, ‘చిత్తం నా రాజా’ అన్నాను. అతడు ‘నువ్వు ఎవరివి?’ అని నన్ను అడిగాడు. ‘నేను అమాలేకీయుణ్ణి’ అని చెప్పాను. అతడు ‘నాలో కొన ప్రాణం ఉన్నందువల్ల నేను తీవ్రమైన యాతనలో ఉన్నాను. నా దగ్గరికి వచ్చి నన్ను చంపెయ్యి’ అని ఆజ్ఞాపించాడు. అంత తీవ్రంగా గాయపడిన తరువాత అతడు ఇక బతకడని అనిపించి నేను అతని దగ్గర నిలబడి అతణ్ణి చంపివేశాను. అతని తల మీద ఉన్న కిరీటాన్ని, చేతి కంకణాలను తీసుకుని నా రాజువైన నీ దగ్గరికి వాటిని తెచ్చాను” అన్నాడు. దావీదు ఆ వార్త విని తన బట్టలు చింపుకున్నాడు. అతని దగ్గర ఉన్నవారంతా అలాగే చేసి, సౌలూ, యోనాతానూ యెహోవా ప్రజలూ ఇశ్రాయేలు వంశీకులూ యుద్ధంలో చనిపోయారని వారిని గూర్చి దుఃఖపడుతూ, ప్రలాపిస్తూ సాయంత్రం వరకూ ఉపవాసం ఉన్నారు. తరువాత దావీదు “నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు?” అని ఆ వార్త తెచ్చినవాణ్ణి అడిగాడు. వాడు “నేను ఇశ్రాయేలు దేశంలో నివసించే అమాలేకువాడైన ఒకడి కొడుకును” అన్నాడు. అందుకు దావీదు “భయం లేకుండా యెహోవా అభిషేకించిన వాణ్ణి చంపడానికి అతని మీద నువ్వెందుకు చెయ్యి ఎత్తావు?” అని తన మనిషి ఒకణ్ణి పిలిచి “వెళ్లి వాణ్ణి చంపు” అని చెప్పగా అతడు వాణ్ణి కొట్టి చంపాడు. “యెహోవా అభిషేకించిన వాణ్ణి నేను చంపానని నువ్వు చెప్పావే, నీ నోటి మాటే నీకు సాక్ష్యం. కాబట్టి నీ ప్రాణానికి నువ్వే జవాబుదారివి” అని దావీదు ఆ మృత అమాలేకీయుడితో అన్నాడు. దావీదు సౌలును గూర్చి, అతని కొడుకు యోనాతానును గూర్చి భూస్థాపన విలాప గీతం ఒకటి పాడాడు. యూదా వారంతా ఆ ధనుర్గీతం నేర్చుకోవాలని తన ప్రజలను ఆదేశించాడు. అది యాషారు గ్రంథంలో రాసి ఉంది. ఇశ్రాయేలూ, నీకు మహిమ అంతా నీ పర్వతాలపై మృతి చెందింది. బలవంతులు ఎలా పడిపోయారో గదా! ఫిలిష్తీయుల కుమార్తెలు సంతోషించకూడదు. సున్నతి లేనివారి కుమార్తెలు పండగ చేసుకోకూడదు. అందుకని ఈ సంగతి గాతులో తెలియనియ్యకండి. అష్కెలోను వీధుల్లో ప్రకటన చేయకండి. గిల్బోవ పర్వతాల్లారా, మీ మీద మంచైనా వర్షమైనా పడకపోవు గాక. అర్పణకు పనికి వచ్చే ధాన్యం పండే చేలు లేకపోవు గాక. పరాక్రమవంతుల డాలు అవమానం పాలయింది. సౌలు డాలు తైలం చేత అభిషేకం పొందనిదైనట్టు అయిపోయింది. హతుల రక్తం ఒలికించకుండా, బలిష్టుల దేహాలనుండి యోనాతాను విల్లు మడమ తిప్పలేదు. ఎవరినీ హతమార్చకుండా సౌలు ఖడ్గం వట్టినే వెనుదిరగ లేదు. సౌలూ యోనాతానూ తమ బతుకులో ప్రేమ గలవారుగా, దయ గలవారుగా ఉన్నారు. తమ చావులో సైతం వారు ఒకరికొకరికి వేరై ఉండలేదు. వారు పక్షిరాజుల కంటే వేగం గలవారు. సింహాలకంటే బలమైన వారు. ఇశ్రాయేలీయుల కుమార్తెలూ, సౌలును గూర్చి ఏడవండి. అతడు మీకు ఇష్టమైన ఎర్రని బట్టలు ధరింప జేశాడు. మీకు బంగారు నగలు ఇచ్చాడు. యుద్ధరంగంలో బలమైన మనుషులు పడిపోయారు. నీ ఉన్నత స్థలాల్లో యోనాతానును చంపేశారు. నా సోదరుడా, యోనాతానూ, నువ్వు నాకు చాలా ప్రియమైన వాడివి. నీ నిమిత్తం నేను తీవ్రంగా శోకిస్తున్నాను. నాపై నీ ప్రేమ ఎంతో వింతైనది. స్త్రీలు చూపించే ప్రేమ కంటే అది ఎక్కువైనది. అయ్యయ్యో బలవంతులైన సైనికులు కూలిపోయారు. యుద్ధ శూరులు నశించిపోయారు.
2 సమూయేలు 1:1-27 పవిత్ర బైబిల్ (TERV)
దావీదు అమాలేకీయులను ఓడించిన తర్వాత అతను సిక్లగుకు వచ్చి రెండు రోజులపాటు ఉన్నాడు. ఇది సౌలు మరణించిన తరువాత జరిగింది. మూడవ రోజున సిక్లగుకు ఒక యువసైనికుడు వచ్చాడు. ఇతడు సౌలు శిబిరము నుండి వచ్చాడు. వాని బట్టలు చిరిగిపోయి వున్నాయి. తలనిండా మట్టి పడివుంది. అతను దావీదు వద్దకు వచ్చి ప్రణమిల్లాడు. “నీవు ఎక్కడ నుండి వచ్చావు?” అని దావీదు వానిని అడిగాడు. “నేను ఇశ్రాయేలీయుల శిబిరము నుండి తప్పించుకొని వచ్చాను” అని దావీదుకు సమాధాన మిచ్చాడు. “దయచేసి యుద్ధంలో ఎవరు గెల్చారో చెప్పు” అని దావీదు అడిగాడు. “జనం యుద్ధభూమి నుండి పారిపోయారు. అనేక మంది హతులయ్యారు. సౌలు, ఆయన కుమారుడు యోనాతాను ఇద్దరూ చనిపోయారు” అని చెప్పాడా వ్యక్తి. దావీదు, “సౌలు, ఆయన కుమారుడు యోనాతాను ఇద్దరూ చనిపోయినట్లు నీకు ఎలా తెలుసు?” అని అడిగాడు. అందుకు యువసైనికుడు, ఇలా చెప్పాడు: “నేను ఆ సమయంలో గిల్బోవ పర్వతం మీదకు రావటం జరిగింది. సౌలు తన ఈటెపై ఆనుకొని వుండటం నేను చూశాను. ఫిలిష్తీయులు తమ రథాల మీద, గుర్రాల మీద సౌలుకు చేరువగా వస్తూవున్నారు. సౌలు వెనుదిరిగి నన్ను చూశాడు. అతను నన్ను పిలవగా, ‘నన్నేమి చేయమంటారు?’ అంటూ వెళ్లాను. ‘నీవెవడవు’ అని సౌలు నన్నడిగాడు. నేనొక అమాలేకీయుడనని చెప్పాను. సౌలు నాతో, ‘దయచేసి కొంచెం ఆగి నన్ను చంపివేయి. నేను తీవ్రంగా గాయపడ్డాను. నేను ఇంచుమించు చనిపోయినట్లే’ అని చెప్పాడు. అందువల్ల నేను ఆగి, అతన్ని చంపాను. అతను ఇక బ్రతకనంత తీవ్రంగా గాయపడ్డాడని నాకు తెలుసు. అప్పుడు నేనతని కిరీటాన్ని, కంకణాన్ని తీసుకొని, వాటిని నా యజమానివైన నీ యొద్దకు తెచ్చాను.” తన దుఃఖాన్ని వెలిబుచ్చటానికి దావీదు తన బట్టలను చించుకున్నాడు. దావీదుతో వున్న మనుష్యులందరూ అలానే చేశారు. వారు మిక్కిలి దుఃఖించారు. సాయంత్రం వరకు వారేమీ తినలేదు. సౌలు, అతని కుమారుడు యోనాతాను ఇరువురూ మరణించినందుకు వారు విలపించారు. మరణించిన ప్రజలకొరకు, ఇశ్రాయేలు కొరకు దావీదు, అతని మనుష్యులు దుఃఖించారు. సౌలు, అతని కుమారుడు యోనాతాను, తదితర ఇశ్రాయేలీయులు కత్తులతో నరకబడి చంపబడినందుకు వారు విలపించారు. సౌలు మరణవార్త తెచ్చిన ఆ యువసైనికుని, “నీవెక్కడ నుంచి వచ్చావు?” అని దావీదు అడిగాడు. “నేనొక పరదేశీయుని కుమారుడను. అమాలేకీయుడను,” అని ఆ యువసైనికుడు అన్నాడు. “యెహోవాచే ప్రతిష్ఠింపబడిన రాజును చంపటానికి నీవెందుకు భయపడలేదు?” అని దావీదు వానిని అడిగాడు. తరువాత దావీదు తన యువభటులలో ఒకనిని పిలిచి ఆ అమాలేకీయుని చంపుమని చెప్పాడు. యువకుడైన ఇశ్రాయేలు సైనికుడు అమాలేకీయుని చంపివేశాడు. “నీ చావుకు నీవే కారకుడవు. నీకు వ్యతిరేకంగా నీవే మాట్లాడావు! ‘దేవునిచే ఎంపిక చేయబడిన రాజును నేనే చంపానని’ నీవే అన్నావు,” అని దావీదు ఆ అమాలేకీయునుద్దేశించి అన్నాడు. సౌలు, అతని కుమారుడు యోనాతానులను గూర్చి దావీదు ఒక ప్రలాప గీతం పాడాడు. యూదా ప్రజలకు ఈ పాట నేర్పుమని దావీదు తన మనుష్యులకు చెప్పాడు. ఈ పాట “ధనుర్గీతిక” అని పిలవబడింది: ఈ పాట యాషారు గ్రంథంలో ఇలా వ్రాయబడింది. ఓహో! “ఇశ్రాయేలూ నీ సౌందర్యం ఉన్నత స్థలాలపై ధ్వంసం చేయబడింది! బలాఢ్యులు పడిపోయారు! ఈ విషయం గాతులో చెప్పవద్దు, అష్కెలోను వీధులలో ప్రకటించ వద్దు! ఏలయనగా ఫిలిష్తీయుల ఆడపడుచులు సంతసించ వచ్చు, సున్నతి కాని వారి కుమార్తెలు ఉల్లసించవచ్చు! “గిల్బోవ పర్వతాలపై హిమబిందువులు గాని వాన చినుకులు గాని పడకుండుగాక! ఆ పొలాలు బీడులైపోవుగాక! యోధులైన వారి డాళ్లు అక్కడ మలినమైనాయి అభిషిక్తుడైన సౌలు డాలు నూనెతో మెరుగు పెట్టబడలేదు. యోనాతాను విల్లు దానివంతు శత్రు సంహారంచేసింది. సౌలు కత్తి దానివంతు శత్రువులను తుత్తునియలు చేసింది అవి శత్రురక్తాన్ని చిందించాయి యోధుల, కొవ్వును స్పృశించాయి. “సౌలును, యోనాతానును మేము ప్రేమించాము; వారు బ్రతికి వుండగా వారి సహాయ సంపత్తును అనుభవించాము! మరణంలో సైతం సౌలు, యోనాతాను ఎడబాటు ఎరుగరు! వారు పక్షి రాజుల కంటె వేగం గలవారు, వారు సింహాల కంటె బలంగలవారు! ఇశ్రాయేలు కుమార్తెలారా, సౌలు కొరకు ఏడ్వండి! సౌలు మిమ్మల్ని ఎర్రని ఛాయగల దుస్తులతో అలంకరించియున్నాడు; మీ దుస్తులపై బంగారు నగలు పెట్టాడు. “యుద్ధంలో బలవంతులు నేలకొరిగారు! యోనాతాను గిల్భోవ కొండల్లో కన్ను మూశాడు. యోనాతానూ, సహోదరుడా! నీ కొరకై విలపిస్తున్నాను. నీ స్నేహపు మాధుర్యాన్ని చవిచూశాను; నా పట్ల నీ ప్రేమ అద్భతం, అది స్త్రీల ప్రేమకంటే మహోన్నతమైనది! శక్తిమంతులు యుద్ధ రంగంలో నేలకొరిగారు! వారి ఆయుధాలు నాశనమయ్యాయి.”
2 సమూయేలు 1:1-27 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దావీదు అమాలేకీయులను హతముచేసితిరిగి వచ్చెను. సౌలు మృతినొందిన తరువాత అతడు సిక్లగులో రెండు దినములుండెను. మూడవదినమున బట్టలు చింపుకొని తలమీద బుగ్గిపోసికొనిన యొకడు సౌలునొద్దనున్నదండులోనుండి వచ్చెను. అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారముచేయగా దావీదు–నీ వెక్కడనుండి వచ్చితివని యడిగెను. అందుకు వాడు–ఇశ్రాయేలీయుల సైన్యములోనుండి నేను తప్పించుకొని వచ్చితిననెను. –జరిగిన సంగతులేవో నాతో చెప్పుమని దావీదు సెలవియ్యగా వాడు–జనులు యుద్ధమందు నిలువలేక పారిపోయిరి. అనేకులు పడి చచ్చిరి, సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరి అనెను. –సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరని నీ కేలాగు తెలిసినది అని దావీదు వానినడుగగా వాడిట్లనెను –గిల్బోవ పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన యీటెమీద ఆనుకొనియుండెను. అతడు రథములును రౌతులును తనను వెనువెంట తగులు చుండుట చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచెను. అందుకు–చిత్తము నా యేలినవాడా అని నేనంటిని. – నీవెవడవని అతడు నన్నడుగగా–నేను అమాలేకీయుడనని చెప్పితిని. అతడు–నా ప్రాణము ఇంక నాలో ఉన్నదిగాని తల త్రిప్పుచేత నేను బహు బాధ పడుచున్నాను; నీవు నా దగ్గర నిలువబడి నన్ను చంపుమని సెలవియ్యగా, ఈలాగు పడినతరువాత అతడు బ్రదుకడని నేను నిశ్చయించుకొని అతనిదగ్గర నిలిచి అతని చంపితిని; తరువాత అతని తలమీదనున్న కిరీటమును హస్తకంకణములను తీసికొని నా యేలినవాడవైన నీయొద్దకు వాటిని తెచ్చియున్నాను అనెను. దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొనెను. అతనియొద్దనున్నవారందరును ఆలాగున చేసి సౌలును యోనాతానును యెహోవా జనులును ఇశ్రాయేలు ఇంటివారును యుద్ధములో కూలి రని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రమువరకు ఉపవాసముండిరి. తరువాత దావీదు–నీవెక్కడ నుండి వచ్చితివని ఆ వార్త తెచ్చినవానినడుగగా వాడు–నేను ఇశ్రాయేలుదేశమున నివసించు అమాలేకీయుడగు ఒకని కుమారుడననెను. అందుకు దావీదు–భయపడక యెహోవా అభిషేకించినవానిని చంపుటకు నీవేల అతని మీద చెయ్యి ఎత్తితివి? యెహోవా అభిషేకించిన వానిని నేను చంపితినని నీవు చెప్పితివే; నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాది వని వానితో చెప్పి తనవారిలో ఒకని పిలిచి–నీవు పోయి వాని చంపుమనగా అతడు వానిని కొట్టి చంపెను. యూదావారికి అభ్యాసము చేయవలెనని దావీదు సౌలునుగూర్చియు అతని కుమారుడైన యోనాతానునుగూర్చియు ధనుర్గీతమొకటి చేసి దానినిబట్టి విలాపము సలిపెను. అది యాషారు గ్రంథమందు లిఖింపబడి యున్నది. ఎట్లనగా– ఇశ్రాయేలూ, నీకు భూషణమగువారు నీ ఉన్నతస్థలములమీద హతులైరి అహహా బలాఢ్యులు పడిపోయిరి. ఫిలిష్తీయుల కుమార్తెలు సంతోషింపకుండునట్లు సున్నతిలేనివారి కుమార్తెలు జయమని చెప్పకుండునట్లు ఈ సమాచారము గాతులో తెలియజేయకుడి అష్కెలోను వీధులలో ప్రకటన చేయకుడి. గిల్బోవ పర్వతములారా మీమీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరుగల చేలైనను లేకపోవును గాక. బలాఢ్యులడాళ్లు అవమానముగ పారవేయబడెను. తైలముచేత అభిషేకింపబడని వారిదైనట్టు సౌలు డాలును పారవేయబడెను. హతుల రక్తము ఒలికింపకుండ బలాఢ్యుల క్రొవ్వును పట్టకుండ యోనాతాను విల్లు వెనుకతియ్యలేదు ఎవరిని హతముచేయకుండ సౌలు కత్తి వెనుక తీసినది కాదు. సౌలును యోనాతానును తమ బ్రతుకునందు సరసులుగాను నెనరుగల వారుగాను ఉండిరి తమ మరణమందైనను వారు ఒకరినొకరు ఎడబాసినవారు కారు వారు పక్షిరాజులకంటె వడిగలవారు సింహములకంటె బలముగలవారు. ఇశ్రాయేలు కుమార్తెలారా, సౌలునుగూర్చి యేడ్వుడి అతడు మీకు ఇంపైన రక్తవర్ణపు వస్త్రములు ధరింప జేసినవాడు బంగారు నగలు మీకు పెట్టినవాడు. యుద్ధరంగమునందు బలాఢ్యులు పడియున్నారు నీ ఉన్నతస్థలములలో యోనాతాను హతమాయెను. నా సహోదరుడా, యోనాతానా నీవు నాకు అతిమనోహరుడవై యుంటివి నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను నాయందు నీకున్న ప్రేమ బహు వింతైనది స్త్రీలు చూపు ప్రేమకంటెను అది అధికమైనది. అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయిరి యుద్ధసన్నద్ధులు నశించిపోయిరి.
2 సమూయేలు 1:1-27 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)