2 రాజులు 9:30-37
2 రాజులు 9:30-37 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహూ యెజ్రెయేలులో అడుగుపెట్టిన విషయం యెజెబెలుకు తెలిసింది. కాబట్టి ఆమె తన కళ్ళ చుట్టూ రంగులు వేసుకుని కేశాలంకరణ చేసుకుని మేడపైని కిటికీలోనుండి బయటకు తొంగి చూసింది. యెహూ గుమ్మం గుండా లోపలికి వస్తుండగా “జిమ్రీ వలే యజమానిని చంపినవాడా, శాంతి భావంతో వస్తున్నావా?” అని అడిగింది. అతడు తలెత్తి కిటికీ వైపు చూశాడు. “అక్కడ నా వైపు ఉన్నదెవరు?” అని అడిగాడు. ఇద్దరు ముగ్గురు నపుంసకులు కిటికీలోనుండి తొంగి చూసారు. యెహూ “ఆమెను కిందకు తోసెయ్యండి” అన్నాడు. వారు యెజెబెలుని కిందకు తోసేశారు. దాంతో ఆమె రక్తం గోడలమీదా, గుర్రాలమీదా చిమ్మింది. అప్పుడు యెహూ ఆమెను గుర్రాలతో తొక్కించాడు. తరువాత అతడు భవనంలో ప్రవేశించి భోజనం చేసిన తరువాత “శాపానికి గురైన ఆమె ఒక రాజ కుమార్తె. కాబట్టి వెళ్ళి ఆమెని సమాధి చేయండి” అని ఆదేశించాడు. సేవకులు ఆమెని సమాధి చేయడానికి వెళ్ళారు. కానీ వాళ్ళకి ఆమె పుర్రె, కాళ్ళు, అరచేతులూ తప్ప ఇంకేమీ కనపడలేదు. వారు వచ్చి యెహూకి ఆ సంగతి చెప్పారు. అప్పుడు అతడు “ఇది యెహోవా తన సేవకుడూ, తిష్బీ వాడూ అయిన ఏలీయా ద్వారా పలికిన మాట, ‘యెజ్రెయేలు నేలపై కుక్కలు యెజెబెలు మాంసాన్ని తిని వేస్తాయి. ఎవరూ గుర్తు పట్టలేకుండా ఆమె శరీరం యెజ్రెయేలు పొలాల్లో పేడలా ఉంటుంది’ ఆ మాట ప్రకారం ఇది జరిగింది” అన్నాడు.
2 రాజులు 9:30-37 పవిత్ర బైబిల్ (TERV)
యెహూ యెజ్రెయేలుకు వెళ్లాడు. యెజెబెలు ఆ వార్త విన్నది. కనుక ఆమె తనను సింగారించుకుంది. జుట్టు సరిదిద్దుకుంది, రంగుపూసుకుంది, శిరోభూషణములు ధరించుకున్న తర్వాత ఆమె కిటికీకి ప్రక్కగా నిలిచి వెలుపలికి చూచింది. యెహూ గుమ్మం ద్వారా నగరం ప్రవేశించాడు. ఆమె అతనిని చూసి, “జిమ్రీ వంటివాడా, అతనివలె నీవు నీ యజమానిని చంపివేశావు. సమాధానంగా వచ్చుచున్నావా” అని అడిగింది. యెహూ కిటికీ పైకి చూశాడు. “దాని ప్రక్కన ఎవరున్నారు? ఎవరు?” అన్నాడు. ఇద్దరో ముగ్గురో నపుంసకులు యెహూని కిటికీ నుండి చూశారు. వారితో యెహూ, “యెజెబెలుని క్రిందికి త్రోసి వేయండి” అన్నాడు. తర్వాత నపుంసకులు యెజెబెలుని క్రిందికి త్రోసివేశారు. యెజెబెలు రక్తం కొంచెం గోడమీద చిమ్మింది. గుర్రాలమీద కూడా చిమ్మింది. గుర్రాలు యెజెబెలు శరీరం మీదుగా నడిచాయి. యెహూ ఇంట్లోకి వెళ్లి అన్నపానాదులు చేసిన తరువాత, “ఇప్పుడు ఈ శాపగ్రస్తురాలిని చూడండి, ఈమె ఒక రాజు కుమార్తె. అందువల్ల ఆమెను సమాధి చేయండి” అన్నాడు. ఆ మనుష్యులు యెజెబెలుని సమాధి చేయడానికి వెళ్లారు. కాని ఆమె శరీరం వారికి కనబడలేదు. ఆమె కపాలము, ఆమె పాదాలు, ఆమె అరచేతులు మాత్రమే కనిపించాయి. అందువల్ల ఆ మనుష్యులు వెనుదిరిగి వచ్చి యెహూతో చెప్పారు. అప్పుడు యెహూ, “యెజ్రెయేలు ప్రదేశంలో యెజెబెలు శవాన్ని కుక్కలు తింటాయని యెహోవా తన సేవకుడు తిష్బీవాడయిన ఏలీయాతో చెప్పాడు. యెజ్రెయేలు ప్రదేశపు పొలంలో యెజెబెలు శవం పెంటవలె ఉంటుందనీ, ఇది యెజెబెలని ఎవరూ గుర్తు పట్టలేరనీ ఏలీయా చెప్పాడు.”
2 రాజులు 9:30-37 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజె బెలునకు వినబడెను గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసికొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలోనుండి కనిపెట్టి చూచుచుండగా యెహూ గుమ్మముద్వారా ప్రవేశించెను. ఆమె అతనిని చూచి–నీ యజమానుని చంపినవాడా, జిమ్రీ వంటివాడా, నీవు సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా అతడు తలయెత్తి కిటికీతట్టు చూచి–నా పక్షమందున్న వారెవరని అడుగగా ఇద్దరు ముగ్గురు పరిచారకులు పైనుండి తొంగిచూచిరి. –దీనిని క్రింద పడద్రోయుడని అతడు చెప్పగా వారు దానిని క్రిందికి పడద్రోసినందున దాని రక్తములో కొంత గోడమీదను గుఱ్ఱములమీదను చిందెను. మరియు గుఱ్ఱములచేత అతడు దానిని త్రొక్కించెను. అతడు లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తరువాత–ఆ శాపగ్రస్తు రాలు రాజకుమార్తె గనుక మీరు వెళ్లి దానిని కనుగొని పాతిపెట్టుడని ఆజ్ఞ ఇయ్యగా వారు దానిని పాతిపెట్ట బోయిరి; అయితే దాని కపాలమును పాదములును అర చేతులును తప్ప మరి ఏమియు కనబడలేదు. వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియజెప్పగా అతడిట్లనెను –ఇది యెజెబెలని యెవరును గుర్తుపట్టలేకుండ యెజ్రెయేలు భూభాగమందు కుక్కలు యెజెబెలు మాంసమును తినును. యెజెబెలుయొక్క కళేబరము యెజ్రెయేలు భూభాగ మందున్న పెంటవలెనుండును అని తన సేవకుడును తిష్బీ యుడునగు ఏలీయాద్వారా యెహోవా సెలవిచ్చిన మాటచొప్పున యిది జరిగెను.
2 రాజులు 9:30-37 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
తర్వాత యెహు యెజ్రెయేలుకు వెళ్లాడు. ఆ సంగతి యెజెబెలు విన్నప్పుడు, ఆమె తన కళ్లకు కాటుక పెట్టుకొని, తలను అలంకరించుకుని, కిటికీలో నుండి చూస్తూ ఉంది. యెహు ద్వారంలో ప్రవేశించగానే, యెజెబెలు అతనితో, “తన యజమానుని హత్యచేసిన జిమ్రీ లాంటివాడా, సమాధానంగా వస్తున్నావా?” అని అడిగింది. అతడు తన తల పైకెత్తి కిటికీవైపు చూసి, “నా పక్షంగా ఉన్నవారెవరు?” అని అరవగానే ఇద్దరు, ముగ్గురు నపుంసకులు క్రిందికి అతనివైపు చూశారు. అప్పుడు యెహు వారితో, “ఆమెను క్రిందికి త్రోసివేయండి” అని అరిచాడు. వెంటనే వారు ఆమెను త్రోసివేయగా ఆమె నేల మీద పడి, ఆమె రక్తం గోడపైన గుర్రాలపైన చిమ్మింది, యెహు తన రథాన్ని ఆమెపైకి ఎక్కించాడు. తర్వాత యెహు లోపలికి వెళ్లి భోజనం చేశాడు. అతడు వారికి, “ఈ శపితమైన స్త్రీ సంగతి చూడండి, ఈమె రాజకుమార్తె కాబట్టి ఈమె శవాన్ని పాతిపెట్టండి” అని ఆదేశించాడు. వెంటనే వారు ఆమెను పాతిపెట్టడానికి వెళ్లారు గాని ఆమె కపాలం, పాదాలు, అరచేతులు తప్ప ఏమీ కనిపించలేదు. వారు తిరిగివచ్చి యెహుకు విషయం చెప్పినప్పుడు, అతడు ఇలా జవాబిచ్చాడు, “యెహోవా తన సేవకుడైన తిష్బీయుడైన ఏలీయా ద్వారా చెప్పిన మాట ఇది: యెజ్రెయేలులో ఈ నేల మీద యెజెబెలు శరీరాన్ని కుక్కలు తింటాయి. ‘ఈమె యెజెబెలు’ అని ఎవరూ అనుకోకుండ ఈమె శవం యెజ్రెయేలు పొలంలో నేలమీది పేడలా అవుతుంది.”