2 రాజులు 8:7-15
2 రాజులు 8:7-15 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఎలీషా దమస్కుకు వెళ్లాడు, అప్పుడు అరాము రాజైన బెన్-హదదుకు జబ్బుచేసింది. అప్పుడు, “దైవజనుడు ఇక్కడకు వచ్చాడు” అని రాజుకు చెప్పినప్పుడు, రాజు హజాయేలుతో, “నీవు కానుక పట్టుకుని వెళ్లి దైవజనున్ని కలువు. అతని ద్వారా యెహోవాను సంప్రదించి ‘నేను ఈ జబ్బు నుండి కోలుకుంటానా?’ అని అడుగు” అన్నాడు. హజాయేలు బహుమానంగా దమస్కులోని శ్రేష్టమైన వస్తువులను తీసుకుని నలభై ఒంటెల మీద ఎక్కించి ఎలీషాను కలవడానికి వెళ్లాడు. అతడు వెళ్లి ఎలీషా ఎదుట నిలబడి, “మీ కుమారుడు, అరాము రాజైన బెన్-హదదు, ‘నేను ఈ జబ్బు నుండి కోలుకుంటానా?’ అని అడగమని నన్ను పంపాడు” అని చెప్పాడు. అందుకు ఎలీషా, “నీవు వెళ్లి, అతడు తప్పకుండ కోలుకుంటాడని చెప్పు. కానీ అతడు ఖచ్చితంగా చనిపోతాడని యెహోవా నాకు తెలియజేశారు” అన్నాడు హజాయేలు ఇబ్బందిపడేంతగా దైవజనుడు అతన్ని చూస్తూ ఏడ్వడం మొదలుపెట్టాడు. అప్పుడు హజాయేలు, “నా ప్రభువా ఎందుకు ఏడుస్తున్నారు?” అని అడిగాడు. అందుకతడు, “ఎందుకంటే మీరు ఇశ్రాయేలీయులకు చేసే కీడు నాకు తెలుసు. మీరు వారి కోటగోడలకు నిప్పంటిస్తారు, వారి యువకులను ఖడ్గంతో చంపుతారు, వారి చిన్న పిల్లలను నేలకు కొడతారు, వారి గర్భవతుల కడుపులు చీల్చివేస్తారు” అన్నాడు. అందుకు హజాయేలు, “మీ దాసుడు, కుక్కలాంటి వాడు, ఇంతటి సాహసం ఎలా చేస్తాడు?” అన్నాడు. ఎలీషా జవాబిస్తూ, “నీవు అరాము దేశానికి రాజవుతావని యెహోవా నాకు తెలియజేశారు” అని చెప్పాడు. అప్పుడు హజాయేలు ఎలీషాను విడిచి తన యజమాని దగ్గరకు తిరిగి వెళ్లాడు. బెన్-హదదు, “ఎలీషా నీతో ఏం చెప్పాడు” అని బెన్-హదదు అడిగినప్పుడు, హజాయేలు, “మీరు తప్పకుండా కోలుకుంటారు” అని జవాబిచ్చాడు. మరుసటిరోజు హజాయేలు మందమైన గుడ్డను తీసుకుని నీళ్లలో ముంచి రాజు ముఖం మీద పరచగా రాజు చనిపోయాడు. అప్పుడు హజాయేలు అతని స్థానంలో రాజయ్యాడు.
2 రాజులు 8:7-15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఎలీషా దమస్కుకి వచ్చాడు. అక్కడ సిరియా రాజు బెన్హదదు జబ్బు పడి ఉన్నాడు. “దేవుని మనిషి ఇక్కడికి వచ్చాడు” అని రాజుకు చెప్పారు. రాజు హజాయేలును పిలిచాడు. “నీవు ఒక కానుక తీసుకుని దేవుని మనిషి దగ్గరికి వెళ్ళు. ‘నాకు నయమౌతుందా లేదా’ అని అతని ద్వారా యెహోవా దగ్గర సంప్రదించు” అని చెప్పాడు. కాబట్టి హజాయేలు ఎలీషాకు కానుకగా దమస్కులో దొరికే మంచి వస్తువులను తీసుకుని వాటిని నలభై ఒంటెల మీద ఎక్కించి బయల్దేరాడు. హజాయేలు వచ్చి ఎలీషా ఎదుట నిలబడ్డాడు. “సిరియా రాజూ, నీ కొడుకులాంటి వాడూ అయిన బెన్హదదు తన రోగం నయమౌతుందా అని అడగడానికి నన్ను పంపాడు” అన్నాడు. అప్పుడు ఎలీషా “నీవు వెళ్ళు. అతనికి తప్పక నయమౌతుంది అని చెప్పు. కానీ అతడు కచ్చితంగా చనిపోతాడని యెహోవా నాకు చూపించాడు” అన్నాడు. ఇలా చెప్పి ఎలీషా హజాయేలు సిగ్గు పడేంతగా అతన్నే చూస్తూ కన్నీరు పెట్టుకున్నాడు. అప్పుడు హజాయేలు “నా ప్రభూ, మీరెందుకు ఏడుస్తున్నారు?” అని అడిగాడు. దానికి ఎలీషా “ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకు నీవు చేయబోయే దుర్మార్గపు పనులు నాకు తెలుసు. వాళ్ళ ప్రాకారాలను నీవు తగలబెడతావు. వాళ్ళల్లో యువకులను కత్తితో హతమారుస్తావు. పిల్లలను నేలకు కొట్టి ముక్కలు చేస్తావు. గర్భవతుల కడుపులు చీరేస్తావు” అని జవాబిచ్చాడు. అందుకు హజాయేలు “నేను కుక్కలాంటి వాణ్ణి. ఇంత పెద్ద పని నేనెలా చేస్తాను?” అన్నాడు. దానికి ఎలీషా “నీవు సిరియాకు రాజు అవుతావు. నాకు యెహోవా చూపించాడు” అన్నాడు. అతడు ఎలీషా దగ్గరనుండి తన రాజు దగ్గరికి వచ్చాడు. అప్పుడు రాజు “ఎలీషా నీతో ఏం చెప్పాడు” అని అడిగాడు. అతడు “నీకు తప్పకుండా నయమౌతుంది అన్నాడు” అని జవాబిచ్చాడు. కాని ఆ తరువాత రోజు హజాయేలు ఒక కంబళి తీసుకుని నీటితో తడిపి దాన్ని రాజు ముఖంపై పరిచాడు. దాంతో రాజు చనిపోయాడు. అతని స్థానంలో హజాయేలు రాజు అయ్యాడు.
2 రాజులు 8:7-15 పవిత్ర బైబిల్ (TERV)
ఎలీషా దమస్కుకు వెళ్లాడు. సిరియా రాజయిన బెన్హదదు జబ్బుతో వున్నాడు. “దేవుని వ్యక్తి ఇచ్చటికి వచ్చాడు.” అని ఒకడు బెన్హదదుకు చెప్పాడు. అప్పుడు బెన్హదదు హజాయేలుతో ఇట్లన్నాడు: “ఒక కానుక తీసుకొని దేవుని వ్యక్తిని కలుసుకొనుము. నేను నా జబ్బునుండి కోలుకొందునో లేదో అతడు యెహోవాని అడగమని అతనితో చెప్పుము.” అందువల్ల హజాయేలు ఎలీషాని కలుసు కొనడానికి వెళ్లాడు. తనతో పాటు హజాయేలు కానుకలు తెచ్చాడు. దమస్కు నుండి అతడు అన్ని రకాల మంచి వస్తువులు తెచ్చాడు. వాటిని మోయడానికి 40 ఒంటెలు కావలసి వచ్చింది. హజాయేలు ఎలీషా వద్దకు పోయాడు. “నీ అనుచరుడైన సిరియా రాజు నన్ను నీ వద్దకు పంపించాడు. అతను జబ్బునుండి కోలుకొనునో లేదో అడగమని, నన్ను పంపెను,” అని హజాయేలు చెప్పాడు. అప్పుడు ఎలీషా, “నీవు బాగుపడెదవని బెన్హదదుతో చెప్పు. కాని నీవు చనిపోదువని నిజముగా యెహోవా నాతో చెప్పాడు.” అన్నాడు. ఎలీషా పైకి క్రిందికి చూడసాగాడు. హజాయేలు ఇబ్బందిలో పడేంతవరకూ అతను చూసెను. దైవజనుడు ఏడవసాగెను. “అయ్యా, మీరెందుకు ఏడుస్తున్నారు?” అని హజయేలు అడిగాడు. “ఇశ్రాయేలు వారికి మీరేమి చెడుపనులు చేయగలరో తెలిసి నేను ఏడుస్తున్నాను. మీరు వారి బలమైన నగరాలను దగ్ధం చేస్తారు. ఖడ్గాలతో మీరు ఆ యువకులను చంపుతారు. వారి పసిపిల్లలను కూడా మీరు హతమారుస్తారు. మీరు వారి గర్భవతులను చీల్చి వేస్తారు” అని ఎలీషా సమాధానం చెప్పాడు. హజయేలు “నేను శక్తిమంతుడను కానని చెప్పాడు. ఈ గొప్ప విషయాలు నేను చేయలేను.” “నీవు సిరియా రాజువి కాగలవని యెహోవా చూపాడు.” అని ఎలీషా సమాధాన మిచ్చాడు. ఆ తర్వాత హజయేలు ఎలీషాని విడిచి తన రాజు వద్దకు వెళ్లాడు. “ఎలీషా నీతో ఏమి చెప్పాడు?” అని బెన్హదదు హజయేలును అడిగాడు. “నీవు జీవించెదవు అని ఎలీషా చెప్పాడు” అని హజయేలు చెప్పాడు. కాని ఆ మరునాడే హజాయేలు ఒక ముతక వస్త్రం తీసుకుని దాన్ని నీటిలో తడిపాడు. తర్వాత బెన్హదదు ముఖాన్ని కప్పివేసి, వుక్కిరి బిక్కిరి చేయడంతో అతడు మరణించాడు. హజాయేలు కొత్తగా రాజు అయ్యాడు.
2 రాజులు 8:7-15 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఎలీషా దమస్కునకు వచ్చెను. ఆ కాలమున సిరియారాజైన బెన్హదదు రోగియైయుండి, దైవజనుడైన అతడు ఇక్కడికి వచ్చియున్నాడని తెలిసికొని హజాయేలును పిలిచి–నీవు ఒక కానుకను చేతపట్టుకొని దైవజనుడైన అతనిని ఎదుర్కొన బోయి–ఈ రోగముపోయి నేను బాగుపడుదునా లేదా అని అతనిద్వారా యెహోవాయొద్ద విచారణ చేయుమని ఆజ్ఞ ఇచ్చిపంపెను. కాబట్టి హజాయేలు దమస్కులోనున్న మంచి వస్తువులన్నిటిలో నలువది ఒంటెల మోతంత కానుకగా తీసికొని అతనిని ఎదుర్కొన బోయి అతని ముందర నిలిచి–నీ కుమారుడును సిరియా రాజునైన బెన్హదదు–నాకు కలిగిన రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని నిన్నడుగుటకు నన్ను పంపె నని చెప్పెను. అప్పుడు ఎలీషా–నీవు అతని యొద్దకు పోయి–నిశ్చయముగా నీకు స్వస్థతకలుగవచ్చుననిచెప్పుము. అయినప్పటికిని అతనికి అవశ్యముగ మరణము సంభవించునని యెహోవా నాకు తెలియజేసెనని పలికి హజాయేలు ముఖము చిన్నబోవునంతవరకు ఆ దైవజనుడు అతని తేరి చూచుచు కన్నీళ్లు రాల్చెను. హజాయేలు–నా యేలిన వాడవైన నీవు కన్నీళ్లు రాల్చెదవేమని అతని నడుగగా ఎలీషా యీలాగు ప్రత్యుత్తరమిచ్చెను–ఇశ్రాయేలువారి గట్టి స్థలములను నీవు కాల్చివేయుదువు; వారి యౌవనస్థులను కత్తిచేత హతము చేయుదువు; వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు; వారి గర్భిణుల కడుపులను చింపి వేయుదువు గనుక నీవు వారికి చేయబోవు కీడును నేనెరిగియుండుటచేత కన్నీళ్లు రాల్చుచున్నాను. అందుకు హజాయేలు–కుక్కవంటివాడనగు నీ దాసుడనైన నేను ఇంత కార్యము చేయుటకు ఎంతటి వాడను అని అతనితో అనగా, ఎలీషా–నీవు సిరియామీద రాజవగుదువని యెహోవా నాకు బయలుపరచియున్నాడనెను. అతడు ఎలీషాను విడిచి వెళ్లి తన యజమానుని యొద్దకు రాగా అతడు–ఎలీషా నీతో చెప్పినదేమని అడుగగా అతడు– నిజముగా నీవు బాగుపడుదువని అతడు చెప్పెననెను. అయితే మరునాడు హజాయేలు ముదుగు బట్ట తీసికొని నీటిలో ముంచి రాజు ముఖముమీద పరచగా అతడు చచ్చెను; అప్పుడు హజాయేలు అతనికి మారుగా రాజాయెను.