2 రాజులు 2:6-15
2 రాజులు 2:6-15 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అంతట ఏలీయా–యెహోవా నన్ను యొర్దానునకు పొమ్మని సెలవిచ్చియున్నాడు గనుక నీవు దయచేసి యిక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు–యెహోవా జీవముతోడు నీ జీవముతోడు, నేను నిన్ను విడువనని చెప్పెను గనుక వారిద్దరును ప్రయాణమై సాగి వెళ్లిరి. ప్రవక్తల శిష్యులలో ఏబదిమంది దూరమున నిలిచి చూచుచుండగా వారిద్దరు యొర్దానునదిదగ్గర నిలిచిరి. అంతట ఏలీయా తన దుప్పటి తీసికొని మడత పెట్టి నీటిమీద కొట్టగా అది ఇవతలకును అవతలకును విడిపోయెను గనుక వారిద్దరు పొడినేలమీద దాటిపోయిరి. వారు దాటిపోయిన తరువాత ఏలీయా ఎలీషాను చూచి–నేను నీయొద్దనుండి తీయబడకమునుపు నీకొరకు నేనేమి చేయకోరుదువో దాని నడుగుమని చెప్పగా ఎలీషా–నీకు కలిగిన ఆత్మలో రెండుపాళ్లు నా మీదికి వచ్చునట్లు దయచేయుమనెను. అందుకతడు–నీవు అడిగినది కష్టతరముగా నున్నది; అయితే నీయొద్దనుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడినయెడల ఆప్రకారము నీకు లభించును, కనబడనియెడల అది కాకపోవునని చెప్పెను. వారు ఇంక వెళ్లుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుఱ్ఱములును కనబడి వీరిద్దరిని వేరు చేసెను; అప్పుడు ఏలీయా సుడిగాలిచేత ఆకాశమునకు ఆరోహణమాయెను ఎలీషా అది చూచి–నా తండ్రీ నా తండ్రీ, ఇశ్రాయేలువారికి రథమును రౌతులును నీవే అని కేకలువేసెను; అంతలో ఏలీయా అతనికి మరల కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని రెండు తునకలుగా చేసెను. మరియు ఏలీయా దుప్పటి క్రింద పడగా అతడు దాని తీసికొని యొర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటిమీదినుండి క్రిందపడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటిమీద కొట్టి–ఏలీయాయొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి యొడ్డునకు నడిచిపోయెను. యెరికోదగ్గరనుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతని చూచి–ఏలీయా ఆత్మ ఎలీషామీద నిలిచియున్నదని చెప్పుకొని, అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి
2 రాజులు 2:6-15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పుడు ఏలీయా “నీవు దయచేసి ఇక్కడే నిలిచిపో. నన్ను యొర్దానుకి వెళ్ళమని యెహోవా చెప్పాడు” అని ఎలీషాతో అన్నాడు. దానికి ఎలీషా “యెహోవా ప్రాణం మీదా నీ ప్రాణం మీదా ఒట్టేసి చెబుతున్నాను, నేను నిన్ను విడిచి పెట్టను” అని జవాబిచ్చాడు. కాబట్టి వాళ్ళిద్దరూ ప్రయాణం కొనసాగించారు. తరువాత వాళ్ళిద్దరూ యొర్దాను నదీ తీరాన నిల్చున్నారు. ప్రవక్తల సమాజం వారు యాభై మంది కొంచెం దూరంలో నిలబడి చూస్తూ ఉన్నారు. అప్పుడు ఏలీయా తన పైవస్త్రాన్ని తీసుకుని, దాన్ని చుట్టి దానితో నీటి మీద కొట్టాడు. దాంతో నది అటూ ఇటూగా విడిపోయింది. అప్పుడు వాళ్ళిద్దరూ పొడినేల పైన నడుస్తూ దాటిపోయారు. వాళ్ళిద్దరూ నది దాటిన తరువాత ఏలీయా ఎలీషాతో ఇలా అన్నాడు. “నన్ను నీనుండి యెహోవా తీసుకుపోక ముందు నీ కోసం నేనేం చేయాలనుకుంటున్నావో చెప్పు.” అందుకు ఎలీషా “నీ ఆత్మలో రెండు పాళ్ళు నా పైకి వచ్చేలా చెయ్యి” అన్నాడు. అందుకు ఏలీయా “నీవు కఠినమైన విషయం అడిగావు. అయితే యెహోవా నన్ను నీ నుంచి తీసుకు వెళ్ళే సమయంలో ఒకవేళ నేను నీకు కనిపిస్తే అది నీకు జరుగుతుంది. కనిపించకపోతే జరగదు” అన్నాడు. వారు మాట్లాడుతూ ఇంకా ముందుకు సాగిపోతూ ఉన్నారు. అకస్మాత్తుగా అగ్నిజ్వాల వంటి ఒక రథం, అగ్నిజ్వాలల వంటి గుర్రాలూ కనిపించాయి. అవి వారిద్దరి మధ్యకు వచ్చి ఇద్దరినీ వేరు చేశాయి. ఇంతలో ఒక సుడి గాలి లేచింది. ఆ సుడిగాలిలో ఎలీయా పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఎలీషా అది చూసి “నా తండ్రీ, నా తండ్రీ, ఇశ్రాయేలుకి రథాలూ, వాళ్ళ రౌతులు నువ్వే” అని కేక పెట్టాడు. ఆ తరువాత ఏలీయా అతనికి మళ్ళీ కనిపించలేదు. అప్పుడు ఎలీషా తాను కట్టుకున్న వస్త్రం తీసుకుని దాన్ని రెండు ముక్కలుగా చేశాడు. ఏలీయా దగ్గర నుండి జారి పడిన పైవస్త్రాన్ని అతడు తీసుకున్నాడు. దానితో యొర్దాను నదీ తీరానికి వచ్చాడు. నేల మీద పడిన ఎలీయా పైవస్త్రాన్ని పట్టుకుని దానితో నీటిని కొట్టి “ఏలీయా దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు?” అన్నాడు. అతడు ఆ పైవస్త్రంతో నీటిని కొట్టగానే నది అటూ ఇటూగా విడిపోయింది. ఎలీషా అవతలి ఒడ్డుకు నడిచి పోయాడు. యెరికోలో ఉన్న ప్రవక్తల సమాజం వారు అతని కోసం చూస్తూ ఉన్నారు. వారు అతని చూడగానే “ఏలీయా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉంది” అని చెప్పుకున్నారు. వారు అతణ్ణి కలుసుకోడానికి వెళ్ళి నేల వరకూ వంగి అతనికి నమస్కారం చేశారు.
2 రాజులు 2:6-15 పవిత్ర బైబిల్ (TERV)
ఏలీయా ఎలీషాతో, “దయచేసి ఇక్కడ వుండుము. ఎందుకంటే నన్ను యోర్దాను నది వద్దకు వెళ్లమని యెహోవా ఆదేశించాడు” అనిచెప్పాడు. ఎలీషా ఇలా అన్నాడు, “యెహోవా జీవంతోడు, నా జీవంతోడు నేను నిన్ను విడిచి వెళ్లను.” అందువల్ల ఆ ఇరువురు వెళ్లారు. ప్రవక్తల బృందం నుండి ఏభై మంది మనుష్యులు వారిని అనుసరించారు. ఏలీయా ఎలీషాలు యోర్దాను నదివద్ద నిలిచారు. ఆ ఏభై మంది మనుష్యులు ఏలీయా ఎలీషాలకు దూరంగా నిలబడ్డారు. ఏలీయా తన దుప్పటిని తీసి మడత పెట్టి నీటిమీద దానితో కొట్టాడు. నీళ్లు కుడికీ ఎడమకీ వేరు వేరయ్యాయి. అప్పుడు ఏలీయా ఎలీషాలు పొడినేల మీద నదిని దాటారు. వారు నదిని దాటిన తర్వాత, ఏలీయా ఎలీషాతో, “నీనుండి యెహోవా నన్ను తీసుకొని పోవడానికి ముందు నీ కోసం నన్నేమి చేయమంటావు?” అని ఏలీయా అడిగాడు. “నీ ఆత్మ రెండింతల భాగాముగా నామీదికి వచ్చునట్లు చేయి” అని ఎలీషా అడిగాడు. ఏలీయా, “కష్టమైన విషయం నీవు అడిగావు. నన్ను నీనుండి తీసుకొని పోయేటప్పుడు నన్ను చూస్తూ వుంటే అది జరుగుతుంది. కాని నన్ను నీనుండి తీసుకొని పోయెటప్పుడు చూడకుంటే, అప్పుడు, అది జరగదు” అని చెప్పాడు. ఏలీయా ఎలీషాలు ఒకటిగా నడుస్తూ మాటాలాడుతూ వున్నారు. ఉన్నట్టుండి కొన్ని గుర్రాలు, ఒక అగ్నిరథం వచ్చి ఏలీయా ఎలీషాలను వేరు చేసాయి. ఆ గుర్రాలు మరియు రథం ఉన్నాయి. తర్వాత ఒక సుడిగాలి ద్వారా ఏలీయా పరలోకానికి తీసుకొని పోబడ్డాడు. అది ఎలీషా చూచి, నా తండ్రి! “నా తండ్రి! ఇశ్రాయేలు రథం, దాని గుర్రపు సైనికులు నీవె” అని అరిచాడు. ఎలీషా ఏలీయాని ఆ తర్వతా ఎన్నడూ చూడలేదు. ఎలీషా తన విచారాన్ని వ్యక్తం చేయడానికి తన వస్త్రాలను రెండుగా చింపివేశాడు. ఏలీయా ధరించు కంబళి భూమిమీదికి పడింది. అందువల్ల ఎలీషా దానిని తీసుకున్నాడు. ఎలీషా నీటినికొట్టి, “ఏలీయా దేవుడైన యెహోవా ఎక్కడ?” అన్నాడు. ఎలీషా నీటిని కొట్టగా నీళ్లు కుడుకీ ఎడమకీ వేరు వేరయ్యాయి. అప్పుడు ఎలీషా నదిని దాటాడు. యెరికోలోని ప్రవక్తల బృందం ఎలీషాని చూడగానే, “ఏలీయా ఆత్మ ఇప్పుడు ఎలీషా మీద వున్నది” అన్నారు. ఎలీషాని కలుసుకునేందుకు వారు వచ్చారు. ఎలీషా ముందు వారు నేలకు తాకునట్లుగా నమస్కరించారు.
2 రాజులు 2:6-15 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
తర్వాత ఏలీయా అతనితో, “ఎలీషా, నీవు ఇక్కడే ఉండు. యెహోవా నన్ను యొర్దానుకు వెళ్లమన్నారు” అని చెప్పాడు. కాని అతడు, “సజీవుడైన యెహోవా మీద, నీ మీద ప్రమాణం చేసి చెప్తున్న, నేను నిన్ను విడువను” అన్నాడు. కాబట్టి ఆ ఇద్దరు నడుచుకుంటూ వెళ్లారు. ప్రవక్త బృందంలో నుండి యాభైమంది మనుష్యులు యొర్దాను దగ్గర ఆగిన ఏలీయా, ఎలీషాలకు ఎదురుగా నిలబడ్డారు. ఏలీయా తన పైవస్త్రాన్ని తీసి, మడతపెట్టి నీళ్లను కొట్టాడు, నీళ్లు కుడి వైపుకు, ఎడమవైపుకు చీలిపోయాయి, వారిద్దరు పొడినేల మీద నడిచివెళ్లారు. వారు దాటిన తర్వాత, ఏలీయా ఎలీషాతో, “నన్ను నీ దగ్గర నుండి తీసుకెళ్లక ముందు, నేను నీకోసం ఏం చెయ్యాలో చెప్పు” అన్నాడు. అందుకు ఎలీషా అన్నాడు, “నీ మీద ఉన్న ఆత్మ నా మీద రెండంతలుగా నేను పొందుకోనివ్వు.” అందుకు ఏలీయా, “నీవు అడిగింది కష్టమైనది, అయితే నన్ను తీసుకువెళ్లే సమయంలో నీవు నన్ను చూస్తే నీవు దానిని పొందుకుంటావు, చూడకపోతే నీవు పొందుకోవు” అని చెప్పాడు. వారు కలిసి మాట్లాడుతూ నడుస్తూ వెళ్తున్నప్పుడు, అకస్మాత్తుగా అగ్ని గుర్రాలతో ఉన్న అగ్ని రథం వచ్చి వారిద్దరిని వేరు చేసింది. ఏలీయా సుడిగాలిలో ఆకాశంలోకి పైకి వెళ్లిపోయాడు. ఎలీషా అది చూస్తూ, “నా తండ్రీ! నా తండ్రీ! ఇశ్రాయేలు రథాలు, రౌతులు నీవే!” అని కేక పెట్టాడు. ఎలీషా అతన్ని మరలా చూడలేదు. అప్పుడు అతడు తాను వేసుకున్న బట్టలు రెండుగా చింపుకున్నాడు. ఎలీషా, ఏలీయా మీద నుండి క్రిందపడ్డ అతని పైవస్త్రాన్ని తీసుకుని తిరిగి యొర్దాను ఒడ్డుకు వచ్చి నిలబడ్డాడు. ఎలీషా ఏలీయా మీద నుండి క్రిందపడ్డ పైవస్త్రాన్ని పట్టుకుని దానితో నీళ్లను కొట్టి, “ఏలీయా దేవుడైన యెహోవా, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?” అన్నాడు. అతడు ఆ నీళ్లను కొట్టినప్పుడు ఆ నీళ్లు కుడి వైపుకు ఎడమవైపుకు విడిపోగా అతడు అవతలి ఒడ్డుకు వెళ్లాడు. దీనిని చూస్తున్న యెరికోలో ఉన్న ప్రవక్తల బృందం వారు, “ఏలీయా మీద ఉన్న ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉంది” అని చెప్పి అతన్ని కలుసుకోడానికి వెళ్లి అతని ఎదుట సాష్టాంగపడ్డారు.