2 కొరింథీయులకు 9:10-15
2 కొరింథీయులకు 9:10-15 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
విత్తువానికి విత్తనాలు, తినడానికి రొట్టె సమకూర్చే దేవుడు, మీకు విత్తనం దయచేసి మీ విత్తనాల నిల్వను వృద్ధి చేస్తాడు, మీ నీతి అనే పంటను విస్తారంగా ఇస్తాడు. మీరు ప్రతి సమయంలో ఉదారంగా ఇవ్వడానికి మీరు అన్నిరకాలుగా సంపన్నులు అవుతారు, మీ దాతృత్వం బట్టి మా ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెల్లించబడతాయి. మీరు చేసే ఈ పరిచర్య కేవలం ప్రభువు ప్రజల అవసరాలకు అందించడమే కాదు కాని అనేక విధాలుగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించడంలో అత్యధికమవుతుంది. ఈ పరిచర్య వలన మిమ్మల్ని మీరు నిరూపించుకున్నారు, క్రీస్తు సువార్తను మీరు అంగీకరించడాన్ని బట్టి కలిగిన విధేయత కొరకు, వారితో మరియు అందరితో పాలుపంచుకొనే మీ దాతృత్వం బట్టి ఇతరులు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారు. దేవుడు మీకిచ్చిన అత్యధిక కృపను బట్టి, వారు మీ కొరకు ప్రార్థించినప్పడు వారి హృదయాలు మిమ్మల్ని చూడాలని ఆశపడతాయి. చెప్పశక్యం కాని ఆయన వరాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు.
2 కొరింథీయులకు 9:10-15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
విత్తనాలు చల్లేవారికి విత్తనాన్నీ తినడానికి ఆహారాన్నీ దయచేసే దేవుడు మీకు విత్తనాన్ని దయచేసి వృద్ధి చేస్తాడు. మీ నీతి ఫలాన్ని అధికం చేస్తాడు. ఎప్పుడూ ఉదారంగా ఇవ్వడానికి మీకు సర్వ సమృద్ధి కలుగుతుంది. దాన్ని బట్టి మా ద్వారా దేవునికి కృతజ్ఞత తెలియజేసే కారణం దొరుకుతుంది. మీరు చేసే ఈ సేవ పరిశుద్ధుల అక్కరలు తీర్చడమే కాకుండా దేవునికి కృతజ్ఞత చెల్లించేలా చేస్తుంది. ఈ సేవ ద్వారా మీ యోగ్యత కనబడుతుంది. క్రీస్తు సువార్తను ఒప్పుకుని విధేయులై, ఇంత ఉదారంగా వారికీ, అందరికీ పంచిపెట్టడం బట్టి, వారు కూడా దేవుణ్ణి మహిమ పరుస్తారు. మీ పట్ల దేవుడు కనపరచిన అత్యధికమైన కృపను చూసి, వారు మీ కోసం ప్రార్థన చేస్తూ, మిమ్మల్ని చూడాలని ఎంతో కోరికతో ఉన్నారు. వర్ణించ శక్యం గాని ఆయన బహుమానానికి దేవునికి ధన్యవాదాలు.
2 కొరింథీయులకు 9:10-15 పవిత్ర బైబిల్ (TERV)
రైతుకు విత్తనాలు, తినటానికి ఆహారము యిచ్చే దేవుడే మీ పంటను సమృద్ధిగా పండించటానికి కావలసిన విత్తనాలు యిస్తాడు. తద్వారా మీ నీతికి ఫలం కలిగిస్తాడు. మీరు అన్ని విషయాల్లో ధారాళంగా ఉండేటట్లు మీకు సకల ఐశ్వర్యాలు యిస్తాడు. మాద్వారా మీరిచ్చిన విరాళాలు తీసుకొని విశ్వాసులు దేవునికి కృతజ్ఞతలు చెపుతారు. మీరు చేసిన సహాయం విశ్వాసుల అవసరాలను తీరుస్తుంది. అంతేకాక, వాళ్ళు దేవుణ్ణి అన్నివేళలా స్తుతించేటట్లు చేస్తుంది. మీరు ఈ సేవ చేసి మీ విశ్వాసాన్ని నిరూపించుకున్నారు. క్రీస్తు సువార్తను అంగీకరించారు. దాన్ని విధేయతతో పాటించారు. మీకున్నదాన్ని వాళ్ళతో మాత్రమే కాక, అందరితో ధారాళంగా పంచుకొన్నారు. ఇది చూసి ప్రజలు దేవుణ్ణి స్తుతిస్తారు. దేవుడు మీపై యింత కరుణ చూపినందుకు, వాళ్ళు ప్రార్థించినప్పుడు మనసారా మిమ్మల్ని ప్రేమతో తలచుకుంటారు. దేవుడు యిచ్చిన వర్ణనాతీతమైన ఆ కానుకకు మనము ఆయనకు కృతజ్ఞతతో ఉందాము.
2 కొరింథీయులకు 9:10-15 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి, మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యముగలవారగునట్లు, మీ నీతిఫలములు వృద్ధిపొం దించును. ఇట్టి ఔదార్యమువలన మాద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఏలయనగా ఈ సేవనుగూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగజేయుట మాత్రము కాకుండ, అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. ఏలాగనగా క్రీస్తుసువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుటయందు మీరు విధేయులైనందుచేతను, వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందుచేతను, ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందునవారు దేవుని మహిమపరచుచున్నారు. మరియు మీయెడల దేవుడు కనుపరచిన అత్యధికమైన కృపను చూచి, వారు మీ నిమిత్తమై ప్రార్థనచేయుచు, మిమ్మును చూడవలెనని ఎక్కువ కోరిక గలవారై యున్నారు. చెప్ప శక్యము కాని ఆయన వరమునుగూర్చి దేవునికి స్తోత్రము.
2 కొరింథీయులకు 9:10-15 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
విత్తువానికి విత్తనాలు, తినడానికి రొట్టె సమకూర్చే దేవుడు మీకు విత్తనం ఇచ్చి ఫలింపజేస్తారు, మీ నీతి పంటను విస్తరింపజేస్తారు. మీరు ప్రతి సమయంలో ధారాళంగా ఇవ్వడానికి మీరు అన్ని రకాలుగా సంపన్నులు అవుతారు. మీ దాతృత్వం బట్టి మా ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెల్లించబడతాయి. మీరు చేసే ఈ పరిచర్య కేవలం పరిశుద్ధుల అవసరాలు తీర్చడమే కాదు, దేవునికి అనేక విధాలుగా కృతజ్ఞతలు చెల్లించినట్టవుతుంది. ఈ పరిచర్య వలన మిమ్మల్ని మీరు నిరూపించుకున్నారు. క్రీస్తు సువార్తను మీరు అంగీకరించడాన్ని బట్టి కలిగిన విధేయత కోసం, వారితో అందరితో పాలుపంచుకొనే మీ దాతృత్వం బట్టి ఇతరులు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారు. దేవుడు మీకిచ్చిన అత్యధిక కృపను బట్టి వారు మీ కోసం ప్రార్థిస్తూ, మిమ్మల్ని చూడాలని ఆశపడుతున్నారు. చెప్పశక్యం కాని ఆయన వరాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు.