2 కొరింథీయులకు 8:1-15

2 కొరింథీయులకు 8:1-15 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

సహోదరీ సహోదరులారా, మాసిదోనియా ప్రాంతంలోని సంఘాలకు అనుగ్రహించబడిన దేవుని కృప గురించి మీరు తెలుసుకోవాలని మేము కోరుతున్నాము. చాలా తీవ్రమైన పరీక్షల మధ్యలో కూడా అత్యధికమైన ఆనందాన్ని వారు పొందారు, వారు నిరుపేదలైనా విస్తారమైన దాతృత్వాన్ని కలిగి ఉన్నారు. ఎందుకంటే, తాము ఇవ్వగలిగిన దానికన్నా, తమ సామర్థ్యాన్ని మించి వారు ఇచ్చారని నేను సాక్ష్యమిస్తాను. ప్రభువు ప్రజలకు పరిచర్య చేయడంలో పాలుపంచుకునే ఆధిక్యత అత్యవసరమని వారు మమ్మల్ని బ్రతిమాలారు. వారు మా అంచనాలను అధిగమించారు: మొదటిగా తమను తాము ప్రభువుకు అర్పించుకున్నారు, ఆ తర్వాత దేవుని చిత్తాన్ని బట్టి మాకు కూడ తమను అర్పించుకున్నారు. కాబట్టి తీతు ఈ దాతృత్వ పనిని గతంలో ప్రారంభించినట్లే మీ వైపు నుండి కూడా దానిని పూర్తి చేయమని అతన్ని వేడుకున్నాము. అయితే మీరు విశ్వాసంలో, వాక్యంలో, జ్ఞానంలో, ఆసక్తిలో, మాపై మీకు గల ప్రేమలో శ్రద్ధలో ఎలా వృద్ధి చెందుతున్నారో అలాగే మీరు ధారాళంగా ఇవ్వడంలో కూడా వృద్ధిచెందేలా చూసుకోండి. ఆజ్ఞాపించి మీకు చెప్పడం లేదు, కాని సహాయం చేయడంలో ఇతరుల ఆసక్తితో పోల్చి మీ ప్రేమ ఎంత నిజమైనదో పరీక్షించాలనుకుంటున్నాను. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప ఎలాంటిదో మీకు తెలుసు. ఆయన ధనవంతుడైనా తన పేదరికం ద్వారా మిమ్మల్ని ధనవంతులను చేయడానికి మీ కోసం ఆయన పేదవానిగా అయ్యారు. ఈ విషయంలో మీకు ఏది మంచిదో నా అభిప్రాయాన్ని చెప్తున్నాను. గత ఏడాది మీరు ఇవ్వడంలోనే కాదు అలా చేయాలనే ఆసక్తిలో కూడా మొదటివారిగా ఉన్నారు. కాబట్టి ఆ పనిని ముగించండి, అప్పుడు చేయాలనే మీ ఆసక్తిని, మీ సామర్థ్యాన్ని బట్టి దాన్ని పూర్తి చేయడం ద్వారా సరిపోల్చవచ్చు. ఎందుకంటే, ఇవ్వాలనే ఆసక్తి మీకు ఉంటే, మీ సామర్థ్యాన్ని మించి కాకుండా మీకు ఉన్నదానిలో ఇచ్చే మీ కానుక అంగీకరించదగింది. మీ పైనే భారాన్ని ఉంచి ఇతరులను వదిలేయాలని మేము కోరడంలేదు కాని సమానత్వం ఉండాలని మా కోరిక. ప్రస్తుత సమయంలో మీ సమృద్ధి వారికవసరమైనది సరఫరా చేస్తుంది, అలాగే మీరు అవసరంలో ఉన్నప్పుడు వారి సమృద్ధి మీకు అవసరమైనది సరఫరా చేస్తుంది. సమానత్వమే లక్ష్యం, ఎందుకంటే, “ఎక్కువ పోగుచేసుకున్న వారికి ఎక్కువ మిగల్లేదు, తక్కువ పోగుచేసుకున్న వారికి తక్కువ కాలేదు” అని వ్రాయబడి ఉంది.

2 కొరింథీయులకు 8:1-15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

సోదరీ సోదరులారా, మాసిదోనియ ప్రాంతంలోని సంఘాలపై దేవుడు చూపిన కృపను గూర్చి మీకు తెలియజేస్తున్నాం. విపరీతమైన బాధలు వారిని పరీక్షిస్తున్నప్పుడు సైతం, వారు అత్యధికంగా సంతోషించారు. వారు నిరుపేదలైనా వారి దాతృత్వం చాలా గొప్పది. వారిని గురించి నా సాక్ష్యం ఏమిటంటే, పరిశుద్ధులకు సేవ చేయడానికి తమకు కూడా భాగం ఇవ్వాలని ఎంతో బతిమాలారు. వారు స్వయంగానే ఇవ్వగలిగినంతా ఇచ్చారు. వాస్తవానికి, దానికంటే ఎక్కువే ఇచ్చారు. అంతేకాక వారు మొదట ప్రభువుకూ, తరువాత దేవుని సంకల్పం వలన మాకూ తమను తామే అప్పగించుకున్నారు. ఇలా చేస్తారని మేమెన్నడూ తలంచలేదు. కాబట్టి మీ దగ్గర తీతు ఇప్పటికే మొదలు పెట్టిన ఈ కృపా పరిచర్యను పూర్తి చేయమని మేము అతన్ని ప్రోత్సహించాము. మీరు ప్రతి విషయంలో అంటే విశ్వాసంలో ఉపదేశంలో జ్ఞానంలో శ్రద్ధ అంతటిలో మీకు మా పట్ల ఉన్న ప్రేమలో ఎలా రాణిస్తున్నారో అలానే మీరు ఈ కృపా పరిచర్యలో కూడా తప్పక రాణించండి. ఆజ్ఞలా మీతో చెప్పడం లేదు. ఇతరుల శ్రద్ధాసక్తులు మీకు తెలియజేసి మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షిస్తున్నాను. మీకు మన ప్రభు యేసు క్రీస్తు కృప తెలుసు గదా? ఆయన ధనవంతుడై ఉండీ తన పేదరికం వలన మీరు ధనవంతులు కావాలని, మీ కోసం పేదవాడయ్యాడు. ఈ విషయంలో మీకు ఉపయోగపడే సలహా ఇస్తాను. ఏడాది క్రితం ఈ పని చేయాలని మొదలు పెట్టారు. అంతే కాదు, తలపెట్టడంలో మొదటి వారు కూడా మీరే. కాబట్టి మీరిప్పుడు ఆ పని పూర్తి చేయండి. పని చేయాలనే ఆశ, ఉత్సాహం అప్పుడు మీకెలా ఉన్నాయో ఆ విధంగానే మీరిప్పుడు దాన్ని ముగింపుకు తీసుకు రండి. అసలు ఈ పని చేయాలనే శ్రద్ధ ఉంటే అది మంచిదీ, ఆమోదయోగ్యమైనది కూడా. ఈ ఆమోదం ఒక వ్యక్తి, తనకున్న దాన్ని బట్టే గానీ లేని దాన్ని బట్టి కాదు. ఇతరుల బాధ ఉపశమనం చేసి మీకు భారంగా ఉండాలని ఇలా చెప్పడం కాదు. అందరికీ ఒకే విధంగా ఉండాలనే. “ఎక్కువ ఉన్న వాడికి ఏమీ మిగల్లేదు. తక్కువ ఉన్న వాడికి కొదువ లేదు” అని రాసి ఉంది. ప్రస్తుతం మీ సమృద్ధి వారి అవసరానికీ మరొకప్పుడు వారి సమృద్ధి మీ అవసరానికీ ఉపయోగపడాలని ఇలా చెబుతున్నాను.

2 కొరింథీయులకు 8:1-15 పవిత్ర బైబిల్ (TERV)

సోదరులారా! మాసిదోనియ దేశంలోని సంఘాల పట్ల దేవుడు చూపిన అనుగ్రహాన్ని గురించి మీకు తెలపాలని మా అభిప్రాయం. వాళ్ళ కష్టాలు వాళ్ళను తీవ్రంగా పరీక్షించాయి. వాళ్ళు చాలా పేదరికం అనుభవించారు. అయినా వాళ్ళలో చాలా ఆనందం కలిగి, వాళ్ళు యివ్వటంలో మిక్కిలి ఔదార్యం చూపారు. వాళ్ళు యివ్వగలిగింది స్వయంగా యిచ్చారు. అంతే కాదు, తాము యివ్వగలిగినదానికన్నా ఇంకా ఎక్కువే యిచ్చారని నేను ఖచ్చితంగా చెప్పగలను. విశ్వాసులైనవారికి చేసే సహాయంలో తాము కూడా చేరుతామని వాళ్ళు మమ్మల్ని ప్రాధేయపడ్డారు. మేము ఆశించినంతగా చేయలేదు. అయినా వాళ్ళు మొదట తమను తాము ప్రభువుకు అర్పించుకొన్నారు. తర్వాత దేవుని చిత్తానుసారంగా మాకును అప్పగించుకున్నారు. ఈ కార్యాన్ని ప్రారంభించిన తీతును దీన్ని కొనసాగించమని వేడుకొన్నాము. మీరు చేయాలనుకొన్న ఈ సేవాకార్యాన్ని అతడు పూర్తిచేసాడు. మీరు విశ్వాసంలో, మాటలో, జ్ఞానంలో, సంపూర్ణ ఆసక్తిలో, మా పట్ల వ్యక్తపరుస్తున్న ప్రేమలో అందరిని మించిపోయారు. మీ దాతృత్వంలో కూడా అందరిని మించిపోవాలని మిమ్మల్ని అడుగుతున్నాను. నేను మీకు ఆజ్ఞాపించటం లేదు. ఇతరులు చేస్తున్న సేవతో మీ ప్రేమను పోల్చి చూడాలని ఉంది. మీ ప్రేమ ఎంత నిజమైందో చూడాలని ఉంది. మన యేసు క్రీస్తు ప్రభువు అనుగ్రహం ఎంత గొప్పదో మీకు తెలుసు. ఆయన ఐశ్వర్యవంతుడైనా మీ కొరకు పేదవాడయ్యాడు. ఆయన పేదరికం వల్ల మీరు ఐశ్వర్యవంతులు కావాలని ఆ విధంగా చేసాడు. ఈ విషయంలో మీకు ఏది మంచిదో అది చెబుతాను. పోయిన సంవత్సరం మీరు అందరికన్నా ఎక్కువగా యివ్వటమే కాకుండా అలాంటి ఉద్దేశ్యం ఉన్నవాళ్ళలో మీరే ప్రథములు. కార్యాన్ని మొదలు పెట్టటంలో చూపిన ఆసక్తి దాన్ని పూర్తి చెయ్యటంలో కూడా చూపండి. మీ శక్త్యానుసారం చెయ్యండి. మీకు యివ్వాలనే ఆసక్తి ఉంటే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. మీ దగ్గర లేనిదాన్ని బట్టి కాకుండా ఉన్నదాన్ని బట్టి మీరిచ్చింది అంగీకరిస్తాడు. మీ మీద భారం మోపి యితరుల భారం తగ్గించాలని కాదు కాని అందరికీ సమానంగా ఉండవలెనని నా ఉద్దేశ్యం. ప్రస్తుతం మీ దగ్గర అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. కనుక అవసరమున్నవాళ్ళకు మీరు సహాయం చెయ్యటం సమంజసమే. అలా చేస్తే మీకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు సహాయం చేస్తారు. అప్పుడు సమంజసంగా ఉంటుంది. లేఖనాల్లో ఈ విధంగా వ్రాసారు

2 కొరింథీయులకు 8:1-15 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అను గ్రహింపబడియున్న దేవుని కృపనుగూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఏలాగనగా, వారు బహు శ్రమవలన పరీక్షింపబడగా, అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్త రించెను. ఈ కృపవిషయములోను, పరిశుద్ధులకొరకైన పరిచర్యలో పాలుపొందు విషయములోను, మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు, వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యముకంటె ఎక్కువగాను తమంతట తామే యిచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. ఇదియుగాక మొదట ప్రభువునకును, దేవుని చిత్తమువలన మాకును, తమ్మును తామే అప్పగించుకొనిరి; యింతగా చేయుదురని మేమనుకొనలేదు. కావున తీతు ఈ కృపను ఏలాగు పూర్వము మొదలుపెట్టెనో ఆలాగున దానిని మీలో సంపూర్ణము చేయుమని మేమతని వేడు కొంటిమి. మీరు ప్రతివిషయములో, అనగా విశ్వాస మందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్తయందును మీకు మాయెడలనున్న ప్రేమయందును ఏలాగు అభివృద్ధిపొందుచున్నారో ఆలాగే మీరు ఈ కృపయందు కూడ అభివృద్ధిపొందునట్లు చూచుకొనుడి. ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పుటలేదు; ఇతరుల జాగ్రత్తను మీకు చూపుటచేత మీ ప్రేమ యెంత యథార్థమైనదో పరీక్షింపవలెనని చెప్పుచున్నాను. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురుగదా? ఆయన ధనవంతుడై యుండియు మీరు తన దారిద్యమువలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను. ఇందునుగూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను; సంవత్సరము క్రిందటనే యీ కార్యము చేయుటయందే గాక చేయ తలపెట్టుటయందు కూడ మొదటివారై యుండిన మీకు మేలు కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఏలాగు కలిగెనో, ఆలాగే మీ కలిమికొలది సంపూర్తియగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి. మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి యుంటే శక్తికి మించి కాదు గాని కలిమికొలదియే యిచ్చినది ప్రీతికరమవును. ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవలెనని ఇది చెప్పుటలేదు గాని –హెచ్చుగా కూర్చుకొనినవానికి ఎక్కువ మిగుల లేదనియు తక్కువగా కూర్చుకొనినవానికి తక్కువ కాలేదనియు వ్రాయబడిన ప్రకారము అందరికి సమానముగాఉండు నిమిత్తము, ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును మరియొకప్పుడు వారి సమృద్ధి మీ యక్కరకును సహా యమై యుండవలెనని ఈలాగు చెప్పుచున్నాను.