2 కొరింథీయులకు 7:5-13
2 కొరింథీయులకు 7:5-13 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
మాసిదోనియాకు చేరిన తరువాత కూడా మాకు విశ్రాంతి లేదు, అయితే అన్నిచోట్ల తీవ్రమైన ఆందోళనలు, బయట కలహాలు లోపల భయాలు. కానీ, బలహీన హృదయులను ధైర్యపరచే దేవుడే తీతు రాక ద్వారా మమ్మల్ని ఓదార్చాడు. అతని రాక వల్లనే కాదు కాని, మీరు అతనికిచ్చిన ఆదరణ వల్ల కూడా. నన్ను చూడాలనే మీ కోరిక గురించి, మీ లోతైన దుఃఖం గురించి, నా పట్ల మీకున్న అభిమానం గురించి అతడు మాకు చెప్పాడు. అందుకు నేను ఎంతో ఎక్కువగా ఆనందించాను. నేను వ్రాసిన పత్రిక మీకు బాధ కలిగించినా, దానికి నేను చింతించను. ఆ పత్రిక మీకు బాధ కలిగించిందని తెలిసి నేను చింతించినా, అది కొంత వరకే. మీకు విచారాన్ని కలిగించినందుకు కాదు, మీ విచారం మీ పశ్చాత్తాపానికి దారితీసినందుకు ఇప్పుడు నేను ఆనందిస్తున్నాను. ఎందుకంటే, మా వలన మీరు ఏ రీతిగా నష్టపోకూడదని ఉండడానికి దేవుని చిత్తప్రకారం మీరు విచారించారు. దైవికమైన విచారం, రక్షణ కలిగించే పశ్చాత్తాపానికి దారి తీస్తుంది ఏ చింత ఉండదు, కాని లోకసంబంధమైన విచారం మరణాన్ని తెస్తుంది. దైవికమైన విచారం మీలో మీ నిర్దోషత్వాన్ని నిరూపించుకోవాలనే ఎలాంటి ఆతురతను, ఆసక్తిని, ఆగ్రహాన్ని, భయాన్ని, అభిలాషను, శ్రద్ధను, న్యాయం జరిగించడానికి ఎలాంటి సంసిద్ధతను పుట్టిస్తుందో చూడండి. ప్రతిసారి ఈ విషయంలో మీరు నిర్దోషులని మీకు మీరే నిరూపించుకున్నారు. కనుక నేను మీకు పత్రిక వ్రాసినప్పటికి, తప్పు చేసినవారి గురించి గాని బాధించబడినవారి గురించి గాని వ్రాయలేదు. అయితే మీరు మా పట్ల ఎలా శ్రద్ధ చూపించారో దాన్ని దేవుని ముందు మీరు చూడాలని వ్రాసాను. వీటన్నిటిని బట్టి మేము ధైర్యపరచబడ్డాము. మాకు ఈ ఆదరణ కలిగినపుడు, తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన నెమ్మది పొందినందుకు అతడు ఎంత సంతోషంగా ఉన్నాడో చూసి మరి ఎక్కువగా సంతోషించాము.
2 కొరింథీయులకు 7:5-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మేము మాసిదోనియ వచ్చినప్పుడు మా శరీరాలకు ఎంత మాత్రం విశ్రాంతి దొరకలేదు. అన్నివైపులా మాకు కష్టాలే. బయట పోరాటాలు, లోపల భయాలు ఉన్నాయి. కానీ కృంగిన వారిని ఆదరించే దేవుడు, తీతు రాక ద్వారా మమ్మల్ని ఆదరించాడు. తీతు రాక వలన మాత్రమే కాక, అతడు మీ దగ్గర పొందిన ఆదరణ వలన కూడా దేవుడు మమ్మల్ని ఆదరించాడు. నాపై ఉన్న మీ అభిమానం, నా పట్ల మీ దుఃఖం, నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తి మాకు తెలియజేశాడు. కాబట్టి నేను మరెక్కువగా ఆనందించాను. నా లేఖ మీకు దుఃఖం కలిగించినా, అది రాసినందుకు నేను బాధ పడటం లేదు. అది మీకు కొంత దుఃఖం కలిగించిందని నాకు తెలుసు. అది నాకు కూడా దుఃఖం కలిగించింది. అయినా అది కొంచెం సేపు మాత్రమే. కాని ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది. మీరు విచారించారని ఆనందించడం లేదు గానీ మీ విచారం పశ్చాత్తాపపడేలా చేసింది. మీరు దైవిక విచారాన్ని అనుభవించారు. అందువల్ల మా వలన ఎలాంటి నష్టమూ మీరు పొందలేదు. దైవిక విచారం పశ్చాత్తాపాన్ని తెస్తుంది. దాని వలన విచారం కాదు, రక్షణ లభిస్తుంది. అయితే లోకానుసారమైన విచారం చావును తెస్తుంది. దైవిక విచారం మీలో ఎలాంటి పట్టుదల తెచ్చిందో చూడండి. మీరు నిర్దోషులని రుజువు చేసే ఎలాంటి గొప్ప పట్టుదల, ఎలాంటి రోషం, ఎలాంటి భయభక్తులు, ఎలాంటి తపన, ఎలాంటి ఆసక్తి, ప్రతి దానిలో న్యాయం తప్పక జరగాలనే ఎలాంటి ఆశ, మీలో కలిగాయో చూడండి! ఆ విషయంలో అన్ని విధాలుగా మీరు నిర్దోషులని నిరూపించుకున్నారు. నేను మీకు రాసినా ఆ చెడ్డ పని చేసినవాడి కోసం రాయలేదు. వాడి వలన అన్యాయం పొందిన వాడి కోసం కూడా రాయలేదు. అయితే మా పట్ల మీకున్న ఆసక్తి దేవుని దృష్టిలో మీకు తెలియడానికే రాశాను. వీటన్నిటితో మాకెంతో ప్రోత్సాహం లభించింది. అంతే కాదు, తీతు పొందిన ఆనందం ద్వారా మాకు మరెక్కువ ఆనందం కలిగింది. మీ అందరి వలన అతని ఆత్మకు ఊరట కలిగింది.
2 కొరింథీయులకు 7:5-13 పవిత్ర బైబిల్ (TERV)
మేము మాసిదోనియ దేశానికి వచ్చినప్పటినుండి మా ఈ దేహాలకు విశ్రాంతి లేదు. ప్రతిచోటా మమ్మల్ని కష్టపెట్టారు. బయట ఆందోళనలు, లోపల భయాలు. కాని క్రుంగిన మనస్సులకు శాంతిని కలిగించే దేవుడు తీతును పంపి మాకు సహాయం చేసాడు. అతడు రావటం వల్ల మాత్రమే కాకుండా మీరతనికి చేసిన సహాయాన్ని గురించి, ఆదరణను గురించి, అతడు చెప్పటం వల్ల మాకు ఆనందం కలిగింది. అతడు మీ కోరికను గురించి, మీ దుఃఖాన్ని గురించి, మీరు నా పట్ల చూపిన అభిమానాన్ని గురించి చెప్పాడు. దానివల్ల ఇంకా ఎక్కువ ఆనందపడ్డాను. నా లేఖ మీకు దుఃఖం కలిగించినా, అది వ్రాసినందుకు నేను బాధ చెందటం లేదు. అది మీకు కొంత దుఃఖం కలిగించిందని నాకు తెలుసు. అది నాకు కూడా కొంత దుఃఖం కలిగించింది. అయినా అది కొంచెం సేపు మాత్రమే. కాని యిప్పుడు నాకు ఆనందంగా ఉంది. మీకు దుఃఖం కలిగించానని కాదు, మీ దుఃఖం మారుమనస్సుకు నడిపింది. దేవుని చిత్తానుసారంగా మీరు దుఃఖపడ్డారు. గాని మేము మీకు ఏ హానీ కలిగించలేదు. దేవుడు కలిగించిన దుఃఖం, మారుమనస్సు పొందేటట్లు చేసి రక్షణకు దారితీస్తుంది. దాని వల్ల నష్టం కలుగదు. కాని ఈ ప్రపంచం కలిగించే దుఃఖం మరణానికి దారితీస్తుంది. దేవుడు కలిగించిన దుఃఖం వల్ల మీలో కలిగిన మార్పుల్ని గమనించండి. మీలో ఎంత నిజాయితీ కలిగిందో చూడండి. నిర్దోషులని నిరూపించుకోవటానికి మీరు ఎంత ఉత్సాహంతో ఉన్నారో గమనించండి. ఎంత ఆందోళన కలిగిందో గమనించండి. మీ అభిమానం ఎంతగా అభివృద్ధి చెందిందో గమనించండి. మీ విశ్వాసం ఎంతగా పెరిగిందో, న్యాయం చేకూర్చాలనే ఆత్రుత ఎంతగా కలిగిందో గమనించండి. మీరు ఈ సమస్యవల్ల కలిగిన ప్రతీ నిందనుండి తప్పించుకొన్నారు. కనుక నేనా ఉత్తరం మీలో అన్యాయం చేసినవానికొరకు గాని, ఆ అన్యాయానికి గురి అయినవానికొరకు గాని, వ్రాయలేదు. దేవుని సాక్షిగా చెపుతున్నాను, మీరు కనబరుస్తున్న అభిమానాన్ని, మీరు చూడగలగాలని వ్రాసాను. అది మాకు ప్రోత్సాహం కలిగించింది. మా ప్రోత్సాహంతో పాటు, తీతు యొక్క ఆనందాన్ని చూసి మాకు ఇంకా ఎక్కువ ఆనందం కలిగింది. మీరు అతని మనస్సుకు శాంతి చేకూర్చారు.
2 కొరింథీయులకు 7:5-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మేము మాసిదోనియకు వచ్చినప్పుడును మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటుబోయినను మాకు శ్రమయే కలిగెను; వెలుపట పోరాటములు లోపట భయములు ఉండెను. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాకవలన మమ్మును ఆదరించెను. తీతు రాకవలనమాత్రమే కాకుండ, అతడు మీ అత్యభిలాషను మీ అంగలార్పును నా విషయమై మీకు కలిగిన అత్యా సక్తిని మాకు తెలుపుచు, తాను మీ విషయమై పొందిన ఆదరణవలన కూడ మమ్మును ఆదరించెను గనుక నేను మరి ఎక్కువగ సంతోషించితిని. నేను వ్రాసిన పత్రికవలన మిమ్మును దుఃఖపెట్టినందున విచారపడను; నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మును స్వల్పకాలముమట్టుకే దుఃఖపెట్టెనని తెలిసికొనియున్నాను. మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదుగాని మీరు దుఃఖపడి మారుమనస్సు పొందితిరని యిప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయములోనైనను మావలన మీరు నష్టము పొందకుండుటకై, దైవచిత్తానుసారముగా దుఃఖపడితిరి. దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనస్సును కలుగజేయును; ఈ మారుమనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోకసంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన యీ దుఃఖము ఎట్టి జాగ్రత్తను ఎట్టి దోషనివార ణకైన ప్రతివాదమును ఎట్టి ఆగ్రహమును ఎట్టి భయమును ఎట్టి అభిలాషను ఎట్టి ఆసక్తిని ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించెనో చూడుడి. ఆ కార్యమునుగూర్చి సమస్త విషయములలోను మీరు నిర్దోషులై యున్నారని ఋజువు పరచుకొంటిరి. నేను మీకు వ్రాసినను ఆ దుష్కార్యము చేసినవాని నిమిత్తము వ్రాయలేదు; వానివలన అన్యాయము పొందినవాని నిమిత్తమైనను వ్రాయలేదు; మాయెడల మీ కున్న ఆసక్తి దేవునియెదుట మీ మధ్య బాహాటమగుటకే వ్రాసితిని. ఇందుచేత మేము ఆదరింపబడితిమి. అంతే కాదు, మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతుయొక్క ఆత్మ మీ అందరివలన విశ్రాంతిపొందినందున అతని సంతోషమును చూచి మరి యెక్కువగా మేము సంతోషించి తిమి.
2 కొరింథీయులకు 7:5-13 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
మాసిదోనియాకు చేరిన తర్వాత కూడా మాకు విశ్రాంతి లేదు, అయితే ఎక్కడకు వెళ్లినా తీవ్రమైన ఆందోళనలు, బయట కలహాలు లోపల భయాలు. కానీ, బలహీన హృదయులను ధైర్యపరచే దేవుడే తీతు రాక ద్వారా మమ్మల్ని ఓదార్చాడు. అతని రాక వల్లనే కాదు కాని, మీరు అతనికిచ్చిన ఆదరణ వల్ల కూడా. నన్ను చూడాలనే మీ కోరిక గురించి, మీ లోతైన దుఃఖం గురించి, నా పట్ల మీకున్న అభిమానం గురించి అతడు మాకు చెప్పాడు. అందుకు నేను ఎంతో ఎక్కువగా ఆనందించాను. నేను వ్రాసిన పత్రిక మీకు బాధ కలిగించినా, దానికి నేను బాధపడను. ఆ పత్రిక మీకు బాధ కలిగించిందని తెలిసి నేను చింతించినా, అది కొంతకాలం వరకే. మీకు దుఃఖం కలిగించినందుకు కాదు, మీ విచారం మీ పశ్చాత్తాపానికి దారితీసినందుకు ఇప్పుడు నేను ఆనందిస్తున్నాను. ఎందుకంటే, మా వలన మీరు ఏ విధంగా కూడా నష్టపోకూడదని ఉండడానికి దేవుని చిత్తప్రకారం మీరు విచారించారు. దైవికమైన విచారం, రక్షణ కలిగించే పశ్చాత్తాపానికి దారి తీస్తుంది ఏ చింత ఉండదు, కాని లోకసంబంధమైన విచారం మరణాన్ని తెస్తుంది. దైవికమైన విచారం మీలో మీ నిర్దోషత్వాన్ని నిరూపించుకోవాలనే ఎలాంటి ఆతురతను, ఆసక్తిని, ఆగ్రహాన్ని, భయాన్ని, అభిలాషను, శ్రద్ధను, న్యాయం జరిగించడానికి ఎలాంటి సంసిద్ధతను పుట్టిస్తుందో చూడండి. ప్రతిసారి ఈ విషయంలో మీరు నిర్దోషులని మీకు మీరే నిరూపించుకున్నారు. కాబట్టి నేను మీకు పత్రిక వ్రాసినప్పటికి, తప్పు చేసిన వారి గురించి గాని బాధించబడినవారి గురించి గాని వ్రాయలేదు. అయితే మీరు మా పట్ల ఎలా శ్రద్ధ చూపించారో దాన్ని దేవుని ముందు మీరు చూడాలని వ్రాశాను. వీటన్నిటిని బట్టి మేము ధైర్యపరచబడ్డాము. మాకు ఈ ఆదరణ కలిగినపుడు, తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన నెమ్మది పొందినందుకు అతడు ఎంత సంతోషంగా ఉన్నాడో చూసి మరి ఎక్కువగా సంతోషించాము.