2 కొరింథీయులకు 3:14-18
2 కొరింథీయులకు 3:14-18 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
నిజానికి వారి మనస్సులు మొద్దుబారాయి, పాత నిబంధన చదువుతున్నపుడు ఈనాటికి వారి మనస్సులకు ఆ ముసుగు వేయబడేవుంది. అది తీసివేయబడలేదు ఎందుకంటే కేవలం క్రీస్తులో మాత్రమే అది తీసివేయబడుతుంది. నేటికీ వారు మోషే ధర్మశాస్త్రాన్ని చదివేటప్పుడు, వారి మనస్సులకు ముసుగు వేయబడి ఉంటుంది. కాని ఎవరైన ప్రభువు వైపుకు తిరిగితే ఆ ముసుగు తీసివేయబడుతుంది. ఇప్పుడు ప్రభువే ఆత్మ, ఆ ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉన్నాడో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. కాబట్టి ముసుగు తొలగిన ముఖాలతో ఆత్మ అయిన ప్రభువు నుండి వచ్చే ఆయన మహిమను ప్రతిబింబిస్తూ, అంతకంతకు అధికమయ్యే ఆయన మహిమ రూపంలోనికి మనమందరం మార్చబడుతున్నాము.
2 కొరింథీయులకు 3:14-18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అయితే వారి మనసులు మూసుకు పోయాయి. ఇప్పటి వరకూ వారు పాత ఒడంబడిక చదివేటప్పుడు ఆ ముసుకు అలానే ఉంది. ఎందుకంటే కేవలం క్రీస్తులో దేవుడు దాన్ని తీసివేశాడు. అయితే ఇప్పటికీ వారు మోషే గ్రంథాన్ని చదివే ప్రతిసారీ వారి హృదయాల మీద ముసుకు ఇంకా ఉంది గాని వారు ఎప్పుడు ప్రభువు వైపుకు తిరుగుతారో అప్పుడు దేవుడు ఆ ముసుకు తీసివేస్తాడు. ప్రభువే ఆత్మ. ప్రభువు ఆత్మ ఎక్కడ ఉంటాడో అక్కడ స్వేచ్ఛ ఉంటుంది. మనమంతా ముసుకు లేని ముఖాలతో ప్రభువు వైభవాన్ని చూస్తూ, అదే వైభవపు పోలిక లోకి క్రమక్రమంగా మారుతూ ఉన్నాము. ఇది ఆత్మ అయిన ప్రభువు ద్వారా జరుగుతున్నది.
2 కొరింథీయులకు 3:14-18 పవిత్ర బైబిల్ (TERV)
వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఈ నాటికీ వాళ్ళు పాత నిబంధన గ్రంథం చదివినప్పుడు వాళ్ళకు ముసుగు కనిపిస్తూవుంటుంది. దాన్ని ఎవ్వరూ తీయలేరు. క్రీస్తు మాత్రమే ఆ ముసుగు తీసివేయగలడు. ఈ నాటికీ మోషే గ్రంథాలు చదివినప్పుడు ఆ ముసుగు వాళ్ళ బుద్ధిని కప్పివేస్తుంది. కాని ప్రభువు వైపుకు మళ్ళినవాళ్ళ “ముసుగు తీసివేయబడింది.” ప్రభువే “ఆత్మ”. ప్రభువు ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వేఛ్చ ఉంటుంది. ముసుగు తీసివేయబడ్డ మా ముఖాల్లో ప్రభువు మహిమ ప్రకాశిస్తోంది. అది ఆత్మ అయినటువంటి ప్రభువు నుండి వచ్చింది. అనంతమైన ఆ మహిమ మమ్మల్ని ప్రభువులా మారుస్తోంది.
2 కొరింథీయులకు 3:14-18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మరియు వారి మనస్సులు కఠినములాయెను గనుక నేటివరకును పాతనిబంధన చదువబడునప్పుడు, అది క్రీస్తునందు కొట్టివేయబడెనని వారికి తేటపరచబడక, ఆ ముసుకే నిలిచియున్నది. నేటివరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్ల ముసుకు వారి హృదయములమీదనున్నది గాని వారి హృదయము ప్రభువువైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుకు తీసివేయబడును. ప్రభువే ఆత్మ . ప్రభువుయొక్క ఆత్మ యెక్కడ నుండునో అక్కడ స్వాతంత్యమునుండును. మన మందరమును ముసుకులేని ముఖముతో ప్రభువుయొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమనుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మ చేత ఆ పోలిక గానే మార్చబడుచున్నాము.
2 కొరింథీయులకు 3:14-18 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
నిజానికి వారి మనస్సులు మొద్దుబారాయి, పాత నిబంధన చదువుతున్నపుడు ఈనాటికీ వారి మనస్సులకు ఆ ముసుగు అలాగే ఉంది. అది తీసివేయబడలేదు ఎందుకంటే కేవలం క్రీస్తులో మాత్రమే అది తీసివేయబడుతుంది. నేటికీ వారు మోషే ధర్మశాస్త్రాన్ని చదివేటప్పుడు, వారి హృదయాల మీద ముసుగు ఉంది. కాని ఎవరైనా ప్రభువు వైపుకు తిరిగితే ఆ ముసుగు తీసివేయబడుతుంది. ఇప్పుడు ప్రభువే ఆత్మ. ప్రభువు ఆత్మ ఎక్కడ ఉన్నాడో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. కాబట్టి ముసుగు తొలగిన ముఖాలతో ఆత్మయైన ప్రభువు నుండి వచ్చే ఆయన మహిమను ప్రతిబింబిస్తూ, అంతకంతకు అధికమయ్యే ఆయన మహిమ రూపంలోనికి మనమందరం మార్చబడుతున్నాము.