2 కొరింథీయులకు 12:2-10
2 కొరింథీయులకు 12:2-10 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
క్రీస్తులో ఉన్న ఒక వ్యక్తి నాకు తెలుసు, అతడు పద్నాలుగు సంవత్సరాల క్రితం మూడవ ఆకాశానికి కొనిపోబడ్డాడు. అతడు శరీరంతో కొనిపోబడ్డాడా లేక శరీరం లేకుండా కొనిపోబడ్డాడా అనేది నాకు తెలియదు; అది దేవునికే తెలుసు. అలాంటి వ్యక్తి నాకు తెలుసు. అతడు అది శరీరంతోనా లేదా శరీరం లేకుండా కొనిపోబడ్డాడో నాకు తెలియదు. అది దేవునికే తెలుసు. అతడు పరదైసుకు కొనిపోబడ్డాడు, ఎవరూ చెప్పలేని మాటలు విన్నాడు, ఆ మాటలు పలకడానికి ఎవ్వరికి అనుమతి లేదు. కాబట్టి అలాంటి వాని గురించి గర్విస్తాను, కాని నా గురించి అయితే నా బలహీనత గురించి తప్ప వేరు విధంగా గర్వించను. ఒకవేళ నేను గర్వించాలనుకున్నా సత్యమే చెప్తాను కాబట్టి అవివేకిని కాను. కాని నేను చేసిన దానికి లేదా చెప్పిన దానికి మించి ఎవరూ నా గురించి ఎక్కువగా ఆలోచించకుండా నేను వాటికి దూరంగా ఉన్నాను. నాకు కలిగిన విశేషమైన గొప్ప ప్రత్యక్షతలు వల్ల గర్వంతో ఉబ్బిపోకుండ నా శరీరంలో ఒక ముల్లు పెట్టబడింది. అది సాతాను దూతగా పని చేసి నన్ను నలుగగొట్టి గర్వించకుండా చేస్తుంది. దీన్ని నా నుండి తీసివేయమని నేను మూడుసార్లు ప్రభువుకు మనవి చేశాను. అందుకు, “నా కృప నీకు చాలు, బలహీనతలో నా శక్తి పరిపూర్ణమవుతుంది” అని ఆయన నాతో చెప్పారు. అందువల్ల క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండేలా నా బలహీనతల్లోనే నేను గర్విస్తాను. అందుకే క్రీస్తు కోసం నాకు కలిగిన బలహీనతలు, అవమానాలు, కష్టాలు, హింసలు, బాధలు నాకు ఆనందాన్నే కలిగిస్తాయి. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను.
2 కొరింథీయులకు 12:2-10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
క్రీస్తులో ఉన్న ఒక వ్యక్తి నాకు తెలుసు. పద్నాలుగు సంవత్సరాల క్రితం దేవుడు అతణ్ణి మూడవ ఆకాశానికి కొనిపోయాడు. అతడు శరీరంతో వెళ్ళాడో లేకపోతే శరీరం లేకుండా వెళ్ళాడో నాకు తెలియదు. దేవునికే తెలుసు. అలాంటి వ్యక్తి నాకు తెలుసు. అతడు శరీరంతో వెళ్ళాడో లేకపోతే శరీరం లేకుండా వెళ్ళాడో నాకు తెలియదు. దేవునికే తెలుసు. దేవుడు అతణ్ణి ఆనంద నివాసంలోకి కొనిపోయాడు. అతడక్కడ ఎవరూ పలకడానికి వీలు కాని అతి పవిత్రమైన విషయాలు విన్నాడు. అలాంటి వ్యక్తి తరపున నేను అతిశయిస్తాను. అయితే నా బలహీనతల విషయంలో తప్ప నా తరపున నేను అతిశయించను. ఒకవేళ అతిశయించాలనుకొన్నా అది తెలివి తక్కువతనమేమీ కాదు. ఎందుకంటే నేను సత్యమే చెబుతున్నాను. కానీ ఎవరైనా నాలో చూసినదాని కంటే, నేను చెప్పింది విన్నదాని కంటే నన్ను ఎక్కువ ఘనంగా ఎంచకుండా ఉండేలా అతిశయించడం మానుకుంటాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు అసాధారణమైనవి కాబట్టి నేను గర్వంతో రెచ్చిపోకుండా దేవుడు నా దేహంలో ఒక ముల్లు పెట్టాడు. అది నన్ను బాధించడానికి, అతిశయించకుండా ఉండటానికి ఉన్న సాతాను దూత. అది నా దగ్గర నుండి తొలగిపోవాలని దాని గురించి మూడు సార్లు ప్రభువును బతిమాలాను. అప్పుడాయన నాతో ఇలా అన్నాడు, “నా కృప నీకు చాలు. బలహీనతలోనే బలం పరిపూర్ణమవుతుంది.” కాగా క్రీస్తు బలం నా మీద నిలిచి ఉండేలా, నేను నా బలహీనతల్లోనే అతిశయిస్తాను. బలహీనంగా నేనెప్పుడున్నానో అప్పుడే బలవంతుడిని. అందుచేత క్రీస్తు కోసం నా బలహీనతల్లో అవమానాల్లో ఇబ్బందుల్లో హింసల్లో ఉపద్రవాల్లో నేను సంతృప్తిగా ఉన్నాను.
2 కొరింథీయులకు 12:2-10 పవిత్ర బైబిల్ (TERV)
క్రీస్తును విశ్వసించే ఒక వ్యక్తి నాకు తెలుసు. పద్నాలుగు సంవత్సరాల క్రితం దేవుడు అతణ్ణి మూడవ ఆకాశమునకు తీసుకు వెళ్ళాడు. అతణ్ణి శరీరంతో తీసుకొని వెళ్ళాడో లేక అతని ఆత్మను తీసుకొని వెళ్ళాడో, నాకు తెలియదు. అది దేవునికే తెలుసు. నాకు తెలిసిన ఈ వ్యక్తి శరీరంతో వెళ్ళాడో లేక అతని ఆత్మ మాత్రమే వెళ్ళిందో నాకు తెలియదు. దేవునికే తెలుసు. దేవుడు యితణ్ణి పరదైసునకు తీసుకు వెళ్ళాడు. అక్కడ అతడు పవిత్రమయిన విషయాలు విన్నాడు. ఇవి చెప్పటానికి అనుమతి లేదు. నేను అతణ్ణి గురించి గర్వంగా చెపుతున్నాను. కాని నా గురించి నేను గర్వంగా చెప్పుకోను. నా బలహీనతను గురించి మాత్రమే గర్వంగా చెప్పుకొంటాను. ఒకవేళ నేను గర్వంగా మాట్లాడినా, నేను ఎప్పుడూ నిజం చెబుతాను కనుక తెలివిలేనివాణ్ణని అనిపించుకోను. నేను చెప్పినవాటి కన్నా, చేసినవాటి కన్నా నన్ను గురించి మీరు గొప్పగా అనుకోరాదని నా అభిలాష. కనుక నేను నన్ను గురించి గర్వంగా చెప్పుకోకుండా నిగ్రహించుకొంటాను. దేవుడు కనుపరచిన ఈ గొప్పవిషయాల వల్ల నాకు గర్వం కలుగరాదని నా శరీరంలో ఒక ముల్లు ఉంచబడింది. అది సాతాను దూత. అది నన్ను బాధపెడుతూ ఉంటుంది. ఆ ముల్లు తీసివేయమని ప్రభువుతో మూడు సార్లు మొరపెట్టుకొన్నాను. కాని ప్రభువు నాతో, “నీకు నా అనుగ్రహం చాలు. నా శక్తి నీ బలహీనత ద్వారా పరిపూర్ణత పొందుతుంది” అని అన్నాడు. అందువల్ల క్రీస్తు శక్తి నాలో ఉండాలని నా బలహీనతను గురించి ఇంకా ఎక్కువ ఆనందంతో, గర్వంగా చెప్పుకొంటాను. అందువల్లే క్రీస్తు కోసం నేను బలహీనతల్లో, అవమానాల్లో, ఇబ్బందుల్లో, హింసల్లో, కష్టాల్లో ఆనందం పొందుతూ ఉంటాను. నేను బలహీనంగా ఉన్నప్పుడు బలంగా ఉంటాను.
2 కొరింథీయులకు 12:2-10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
క్రీస్తునందున్న యొక మనుష్యుని నేనెరుగుదును. అతడు పదునాలుగు సంవత్సరములక్రిందట మూడవ ఆకాశమునకు కొనిపో బడెను; అతడు శరీరముతో కొనిపోబడెనో నేనెరుగను, శరీరములేక కొనిపోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియును. అట్టి మనుష్యుని నేనెరుగుదును. అతడు పరదైసులోనికి కొనిపోబడి, వచింప శక్యము కాని మాటలు వినెను; ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడెనో శరీరములేక కొని పోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియును. అట్టివాని గూర్చి అతిశయింతును; నా విషయమైతేనో నా బలహీనతయందే గాక వేరువిధముగా అతిశయింపను. అతిశయపడుటకు ఇచ్ఛయించినను నేను సత్యమే పలుకుదును గనుక అవివేకిని కాకపోదును గాని నాయందు ఎవడైనను చూచినదానికన్నను నావలన వినినదానికన్నను నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అతిశయించుట మానుకొనుచున్నాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒకముల్లు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము, నన్ను నలగగొట్టుటకు సాతానుయొక్క దూతగా ఉంచబడెను. అది నాయొద్దనుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు–నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను.