2 కొరింథీయులకు 11:23-29

2 కొరింథీయులకు 11:23-29 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

వారు క్రీస్తు సేవకులా? నేను మతిలేనివానిలా మాట్లాడుతున్నాను, నేను వారి కంటే ఎక్కువ. నేను ఎంతో కష్టపడి పని చేశాను, ఎక్కువ సార్లు నేను చెరసాలలో ఉన్నాను, చాలా తీవ్రంగా కొరడా దెబ్బలు తిన్నాను, మరల మరల ప్రాణాపాయాలను ఎదుర్కొన్నాను. యూదుల చేత ఐదు సార్లు ఒకటి తక్కువ నలభై దెబ్బలు తిన్నాను. మూడుసార్లు బెత్తాలతో కొట్టబడ్డాను, ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాను, మూడుసార్లు ఓడ పగిలి శ్రమపడ్డాను, ఒక రాత్రింబగళ్లు సముద్రంలో గడిపాను, తరచుగా ప్రయాణాలు చేస్తున్నాను. నదుల వల్ల ఆపదలు, దొంగల వల్ల ఆపదలు, తోటి యూదుల వల్ల ఆపదలు, యూదేతరుల వల్ల ఆపదలు నేను ఎదుర్కొన్నాను; పట్టణాల్లో, అడవుల్లో, సముద్రాల మీద ఆపదల్లో పడ్డాను; ఇంకా కపట సహోదరుల వల్ల ఆపదల్లో ఉన్నాను. నేను ప్రయాసపడ్డాను కష్టపడ్డాను, తరచూ నిద్ర లేకుండా ఉండేవాడిని; ఆకలి దాహం నాకు తెలుసు, అనేకసార్లు ఆహారం లేకుండా ఉన్నాను; చలితో, వస్త్రాలు లేకుండా ఉన్నాను. అన్నిటికంటే మించి సంఘాలన్నిటి గురించిన చింత అనుదినం నాకు కలుగుతుంది. ఎవరైనా బలహీనంగా ఉంటే, నేను బలహీనంగా ఉండనా? ఎవరైనా పాపంలో నడిస్తే, నా హృదయం మండదా?

2 కొరింథీయులకు 11:23-29 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

వారు క్రీస్తు సేవకులా? (వెర్రివాడిలాగా మాట్లాడుతున్నాను) నేను కూడా ఇంకా ఎక్కువగా క్రీస్తు సేవకుణ్ణి. వారికంటే చాలా ఎక్కువగా కష్టపడ్డాను. అనేక సార్లు చెరసాల పాలయ్యాను. లెక్కలేనన్ని సార్లు దెబ్బలు తిన్నాను. అనేకమార్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను. యూదుల చేత ఐదు సార్లు “ఒకటి తక్కువ నలభై” కొరడా దెబ్బలు తిన్నాను. మూడు సార్లు నన్ను బెత్తాలతో కొట్టారు. ఒకసారి రాళ్లతో కొట్టారు. మూడుసార్లు నేనెక్కిన ఓడలు పగిలిపోయాయి. ఒక పగలు, ఒక రాత్రి సముద్రంలో గడిపాను. తరచుగా ప్రయాణాల్లో అపాయాలకు గురయ్యాను. నదుల్లో అపాయాలూ దోపిడీ దొంగల వలన అపాయాలూ నా సొంత ప్రజల వలన అపాయాలూ యూదేతరుల వలన అపాయాలూ పట్టణాల్లో అపాయాలూ అరణ్యాల్లో అపాయాలూ సముద్రంలో అపాయాలూ కపట సోదరుల వల్ల అపాయాలూ నాకు ఎదురయ్యాయి. కష్ట పడ్డాను. వేదన అనుభవించాను. నిద్ర కరువైన అనేక రాత్రులు గడిపాను. చలితో, ఆకలి దప్పులతో, తినడానికి ఏమీ లేక, బట్టల్లేక ఉన్నాను. ఈ విషయాలు మాత్రమే కాకుండా క్రీస్తు సంఘాలన్నిటిని గురించిన దిగులు రోజూ నా మీద భారంగా ఉంది. మీలో ఒకడు బలహీనుడైతే, నేనూ బలహీనుణ్ణి కాకుండా ఉండగలనా? ఒకడు ఇతరుల వల్ల పాపంలో పడితే, నేను నా అంతరంగంలో మండిపోకుండా ఉండగలనా?

2 కొరింథీయులకు 11:23-29 పవిత్ర బైబిల్ (TERV)

వాళ్ళు క్రీస్తు సేవకులా? ఈ విధంగా మాట్లాడాలంటే నాకు మతిపోతుంది. నేను వాళ్ళకన్నా ఎక్కువ సేవ చేస్తున్నాను. నేను వాళ్ళకన్నా ఎక్కువ కష్టించి పని చేసాను. వాళ్ళకన్నా ఎక్కువ సార్లు కారాగారానికి వెళ్ళాను. వాళ్ళకన్నా తీవ్రమైన కొరడాదెబ్బలు తిన్నాను. ఎన్నోసార్లు చావుకు గురి అయ్యాను. యూదులు నన్ను ఐదు సార్లు ముప్పైతొమ్మిది కొరడాదెబ్బలు కొట్టారు. మూడు సార్లు ఇనుప కడ్డీలతో కొట్టారు; ఒకసారి రాళ్ళతో కొట్టారు. మూడు సార్లు పడవ పగిలి ఒక రాత్రి, ఒక పగలు సముద్రం మీద గడిపాను. విరామం లేకుండా ప్రయాణం చేసాను. ఆ ప్రయాణాల్లో నదులవల్ల ప్రమాదం కలిగింది. బందిపోటు దొంగలవల్ల ప్రమాదం కలిగింది. నా జాతీయులవల్ల ప్రమాదం కలిగింది. యూదులుకానివాళ్ళవల్ల ప్రమాదం కలిగింది. పట్టణాల్లో ప్రమాదం కలిగింది. నిర్మానుష్య ప్రాంతాల్లో ప్రమాదం కలిగింది. సముద్రం మీద ప్రమాదం కలిగింది. దొంగ సోదరులవల్ల ప్రమాదం కలిగింది. నేను కష్టాలు ఎదుర్కొని, కష్టించి పని చేసాను. నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాను. ఆకలి దప్పులు అంటే ఏమిటో తెలుసుకొన్నాను. ఎన్నోసార్లు ఆహారం లేక గడిపాను. చలిలో వస్త్రాలు లేకుండా గడిపాను. ఇవే కాక, సంఘాల కొరకు నేను ప్రతిరోజూ దిగులు పడుతుంటాను. మీలో ఒకడు బలహీనుడైనప్పుడు, నేనూ బలహీనుడు కాకుండా ఉండగలనా? ఒకడు పాపంలో పడితే, నేను నా అంతరంగంలో మండిపోకుండా ఉండగలనా? పాపం చెయ్యటానికి మీలో ఎవరైనా కారకుడు అయితే అతని పట్ల నాకు కోపం కలగదా?

2 కొరింథీయులకు 11:23-29 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

వారు క్రీస్తు పరిచారకులా? వెఱ్ఱివానివలె మాటలాడుచున్నాను, నేనును మరి యెక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యా యములు చెరసాలలో ఉంటిని; అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేకమారులు ప్రాణాపాయములలో ఉంటిని. యూదులచేత అయిదుమారులు ఒకటి తక్కువ నలువది దెబ్బలు తింటిని; ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని; ఒకసారి రాళ్లతో కొట్టబడితిని; ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని; ఒక రాత్రింబగళ్లు సముద్రములో గడిపితిని. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదులవలననైన ఆపదలలోను, దొంగలవలననైన ఆపదలలోను, నా స్వజనులవలననైన ఆపదలలోను, అన్యజనుల వలననైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరులవలని ఆపదలలోను ఉంటిని. ప్రయాసతోను, కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలిదప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకను చెప్ప వలసినవి అనేకములున్నవి. ఇవియును గాక సంఘములన్నిటినిగూర్చిన చింతయు కలదు. ఈ భారము దిన దినమును నాకు కలుగుచున్నది. ఎవడైనను బలహీను డాయెనా? నేనును బలహీనుడను కానా? ఎవడైనను తొట్రుపడెనా? నాకును మంట కలుగదా?

2 కొరింథీయులకు 11:23-29 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

వారు క్రీస్తు సేవకులా? నేను మతిలేనివానిలా మాట్లాడుతున్నాను, నేను వారికంటే ఎక్కువ. నేను ఎంతో కష్టపడి పని చేశాను. ఎక్కువసార్లు నేను చెరసాలలో ఉన్నాను, చాలా తీవ్రంగా కొరడా దెబ్బలు తిన్నాను, అనేకసార్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను. యూదులచేత అయిదు సార్లు ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలు తిన్నాను. మూడుసార్లు బెత్తాలతో కొట్టబడ్డాను, ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాను, మూడుసార్లు ఓడ పగిలి శ్రమపడ్డాను. ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపాను. తరచుగా ప్రయాణాలు చేస్తున్నాను. నదుల వల్ల ఆపదలు, దొంగల వల్ల ఆపదలు, తోటి యూదుల వల్ల ఆపదలు, యూదేతరుల వల్ల ఆపదలు, పట్టణాల్లో, అడవుల్లో, సముద్రాల మీద ఆపదల్లో పడ్డాను; ఇంకా కపట సహోదరుల వల్ల ఆపదల్లో ఉన్నాను. నేను ప్రయాసపడ్డాను కష్టపడ్డాను, తరచూ నిద్ర లేకుండా ఉండేవాన్ని; ఆకలి దాహం నాకు తెలుసు, అనేకసార్లు ఆహారం లేకుండా ఉన్నాను; చలితో, వస్త్రాలు లేకుండా ఉన్నాను. అన్నిటికంటే మించి సంఘాలన్నిటి గురించిన చింత అనుదినం నాకు కలుగుతుంది. ఎవరైనా బలహీనంగా ఉంటే, నేను బలహీనంగా ఉండనా? ఎవరైనా పాపంలో నడిస్తే, నా హృదయం మండదా?