2 కొరింథీయులకు 1:3-8
2 కొరింథీయులకు 1:3-8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు, ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. క్రీస్తుయొక్క శ్రమలు మాయందేలాగు విస్తరించుచున్నవో, ఆలాగే క్రీస్తుద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణకొరకును రక్షణకొరకును పొందుదుము; మేమాదరణ పొందినను మీ ఆదరణకొరకై పొందుదుము. ఈ ఆదరణ, మేము కూడ పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై యున్నది. మీరు శ్రమలలో ఏలాగు పాలివారైయున్నారో, ఆలాగే ఆదరణలోను పాలివారైయున్నారని యెరుగుదుము గనుక మిమ్మునుగూర్చిన మా నిరీక్షణ స్థిరమైయున్నది. సహోదరులారా, ఆసియలో మాకు తటస్థించినశ్రమనుగూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు; అదేదనగా మేము బ్రదుకుదుమను నమ్మకములేక యుండునట్లుగా, మా శక్తికి మించిన అత్యధిక భారమువలన క్రుంగిపోతిమి.
2 కొరింథీయులకు 1:3-8 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
మన యేసు క్రీస్తు ప్రభువుకు తండ్రియైన దేవునికి కృతజ్ఞతలు చెల్లింద్దాము. మన తండ్రి కనికరం గలవాడు. సమస్త ఆదరణ అనుగ్రహించే దేవుడు. దేవుడు మనల్ని ఏ ఆదరణతో ఆదరిస్తున్నాడో, అలాగే, దేవుని నుండి మనకు లభించిన ఆదరణతో, పలురకాలైన కష్టాల్లో ఉన్న వారిని మనం ఆదుకోగలం. క్రీస్తు కష్టాల్లో మనం ఎక్కువగా పాలుపంచుకొన్నట్టుగా క్రీస్తు ద్వారా మనం ఆయన ఇచ్చే గొప్ప ఆదరణలో పాలుపంచుకోగలం. మేము శ్రమపడడం మీకు ఆదరణ రక్షణ కలుగడానికే. ఆదరణ లభిస్తే, అది మీ కొరకే కనుక మేము ఓర్పుతో సహించే కష్టాలనే మీరు ఓపికతో భరించడానికి శక్తి లభిస్తుంది. మీరు మా కష్టాల్లో పాల్గొనట్లే, మాకు లభించే ఆదరణలో కూడ మీరు పాల్గొంటారని మాకు తెలుసు. కనుక మీలోని మా నిరీక్షణ ఎన్నటికి చలించదు. సోదరులారా, ఆసియా ప్రాంతంలో మాకు ఎదురైన కష్టాన్ని గురించి మీకు చెప్పకుండా ఉండాలని అనుకోవడం లేదు. మేము మా శక్తికి మించిన కష్టాలకు గురైయ్యాము. కనుక మేము జీవితంపై ఆశ వదులుకొన్నాం.
2 కొరింథీయులకు 1:3-8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతి కలుగు గాక. ఆయన దయగల తండ్రి, అన్ని విధాలా ఆదరించే దేవుడు. ఆయన మా కష్టాలన్నిటిలో మమ్మల్ని ఆదరిస్తున్నాడు. దేవుడు మాకు చూపిన ఆ ఆదరణ మేమూ చూపి ఎలాంటి కష్టాల్లో ఉన్నవారినైనా ఆదరించగలిగేలా ఆయన మమ్మల్ని ఆదరిస్తున్నాడు. క్రీస్తు పడిన బాధలు మాలో అధికమయ్యే కొద్దీ, క్రీస్తు ఆదరణ కూడా మాలో అంతకంతకూ అధికం అవుతూ ఉంది. మాకు కష్టాలు వస్తే అవి మీ విమోచన కోసం, మీ ఆదరణ కోసం. మాకు ఆదరణ కలిగితే అది కూడా మీ ఆదరణ కోసమే. మాలాగే మీరూ పడుతున్న కష్టాలను సహించడానికి కావలసిన ఓర్పును ఈ ఆదరణ కలిగిస్తున్నది. మీరు మా కష్టాలను ఎలా పంచుకుంటున్నారో అలాగే మా ఆదరణ కూడా పంచుకుంటున్నారని మాకు తెలుసు. అందుచేత మీ గురించి మాకు దృఢమైన ఆశాభావం ఉంది. సోదరులారా, ఆసియ ప్రాంతంలో మేము పడిన బాధలు మీకు తెలియకుండా ఉండడం మాకిష్టం లేదు. మేము బతుకుతామనే నమ్మకం లేక, మా శక్తికి మించిన భారంతో పూర్తిగా కుంగిపోయాము.
2 కొరింథీయులకు 1:3-8 పవిత్ర బైబిల్ (TERV)
మన యేసు క్రీస్తు ప్రభువును, తండ్రియైన దేవుణ్ణి స్తుతిద్దాము. దేవుడు దయామయుడు. మనకు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. ఆయన మన కష్టాలు తొలగిపోవటానికి సహాయం చేస్తాడు. ఆయనలాగే మనము కూడా యితరుల కష్టాలు తొలగించటానికి సహాయం చెయ్యాలని ఆయన ఉద్దేశం. క్రీస్తు కష్టాల్ని మనము పంచుకొన్న విధంగా ఆయన ద్వారా కలిగే సహాయాన్ని కూడా పంచుకొందాము. మీకు సహాయం చెయ్యాలని, రక్షణ కలగాలని మేము కష్టాలు అనుభవిస్తున్నాము. మీకు సహాయం చెయ్యటానికి దేవుడు మాకు సహాయం చేస్తున్నాడు. ఈ సహాయం వల్ల మేము అనుభవించిన కష్టాలు మీరు కూడా అనుభవించేటట్లు మీలో సహనం కలుగుతుంది. నాకు మీ పట్ల గట్టి నమ్మకం ఉంది. మీరు మా కష్టాలు పంచుకొన్నట్లుగానే, మాకు కలిగే సహాయాన్ని కూడా పంచుకొంటారని మాకు తెలుసు. మేము ఆసియ ప్రాంతంలో అనుభవించిన కష్టాలు మీకు చెప్పకుండా ఉండలేము. మాకు అక్కడ తీవ్రమైన కష్టాలు కలిగాయి. అవి మేము మోయలేనంతగా ఉండినవి. జీవిస్తామనే ఆశ కూడా పోయింది.
2 కొరింథీయులకు 1:3-8 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
మన యేసు క్రీస్తు ప్రభువుకు తండ్రియైన దేవునికి కృతజ్ఞతలు చెల్లింద్దాము. మన తండ్రి కనికరం గలవాడు. సమస్త అన్ని విధాలా ఆదరణనిచ్చే దేవుడు. దేవుడు మనల్ని ఏ ఆదరణతో ఆదరిస్తున్నారో, అదే ఆదరణతో అలాంటి కష్టాల్లో ఉన్నవారిని ఆదరించగలిగేలా ఆయన మమ్మల్ని ఆదరిస్తున్నారు. క్రీస్తు శ్రమలలో మనం ఎంత ఎక్కువ భాగం పంచుకున్నామో క్రీస్తు ఆదరణ కూడా అంతే ఎక్కువగా మనకు కలుగుతుంది. మేము శ్రమపడడం మీకు ఆదరణ కోసం రక్షణ కోసమే. ఆదరణ లభిస్తే అది మీ కొరకే కాబట్టి మేము పడిన కష్టాలను మీరు కూడా ఓపికతో భరించడానికి శక్తి లభిస్తుంది. మీరు మా కష్టాల్లో పాలివారైనట్లే ఆదరణలో కూడా పాలుపంచుకుంటారని మాకు తెలుసు. కాబట్టి మీలో మా నిరీక్షణ స్థిరంగా ఉంది. సహోదరి సహోదరులారా, ఆసియా ప్రాంతంలో మాకు ఎదురైన కష్టాల గురించి మీకు చెప్పకుండా ఉండాలని అనుకోవడం లేదు. మేము మా శక్తికి మించిన కష్టాలను అనుభవించాము. కాబట్టి మేము జీవితంపై ఆశ వదులుకున్నాము.