2 దినవృత్తాంతములు 20:6-12

2 దినవృత్తాంతములు 20:6-12 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

“మా పూర్వీకుల దేవా, యెహోవా, పరలోకంలో దేవుడివి నీవే గదా! అన్ని రాజ్యాలనూ పాలించే బలం గలవాడవు, పరాక్రమం గలవాడవు, నిన్నెదిరించడం ఎవరి తరమూ కాదు. నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల ఎదుటి నుంచి ఈ దేశవాసులను తోలివేసి, నీ స్నేహితుడైన అబ్రాహాము సంతతికి దీన్ని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడవు నువ్వే.” “వారు అందులో నివాసం చేసి, మాకేదైనా విపత్తు జరిగితే, అంటే యుద్ధపు తీర్పు గానీ రోగం గానీ కరువుగానీ, మా మీదికి వస్తే మేము ఈ మందిరం ముందు నిలబడి మా బాధలో నీకు మొర్రపెడితే నీవు ఆలకించి మమ్మల్ని కాపాడతావని, ఇక్కడ నీ పేరు కోసం ఈ పరిశుద్ధ స్థలాన్ని కట్టించారు. నీ పేరు ఈ మందిరానికి ఉంది గదా. ఇశ్రాయేలీయులు ఐగుప్తునుంచి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ మోయాబీయులతోనూ శేయీరు కొండ ప్రాంతం వారితోనూ యుద్ధం చేయనివ్వలేదు కాబట్టి ఇశ్రాయేలీయులు వారిని నాశనం చేయకుండా వారి దగ్గర నుంచి వెళ్ళిపోయారు. మేము స్వతంత్రించుకోవాలని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యంలో నుంచి మమ్మల్ని తోలివేయడానికి వారు బయలుదేరి వచ్చి మాకు ఎలాంటి ప్రత్యుపకారం చేస్తున్నారో చూడండి. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చే ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు. ఏమి చేయాలో మాకు తెలియదు. నువ్వే మా దిక్కు” అని ప్రార్థన చేశారు.

2 దినవృత్తాంతములు 20:6-12 పవిత్ర బైబిల్ (TERV)

అతడు ఈ విధంగా ప్రార్థించాడు: “మా పూర్వీకుల దేవుడవైన ఓ ప్రభూ, నీవే పరలోక అధిపతివి. ప్రపంచ రాజ్యాలన్నిటినీ ఏలేవాడవు నీవే! నీకు అధికారం, బలం వున్నాయి! నిన్నెదిరించి ఎవ్వడూ నిలువలేడు! నీవు మా దేవుడివి! ఈ దేశంలో నివసించే ప్రజలను బయటకు పొమ్మని ఒత్తిడి చేశావు. ఈ పని నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల ముంగిట చేశావు. ఈ రాజ్యాన్ని అబ్రాహాము సంతతివారికి శాశ్వతంగా యిచ్చావు. అబ్రహాము నీ స్నేహితుడు. అబ్రహాము సంతతివారు ఈ రాజ్యంలో నివసించి, నీ పేరు మీద ఒక ఆలయాన్ని కట్టించారు. వారు, ‘యుద్ధాలు, శిక్ష, వ్యాధులు, కరువు కాటకాలు మొదలైన ఈతి బాధలు మాకు సంభవించినప్పుడు, ఈ మందిరం ముందు, నీ సన్నిధిని నిలబడతాము. ఈ మందిరం నీ పేరు మీద వుంది. మాకు ఆపద వచ్చినప్పుడు నీకు మొర పెట్టుకొంటాము. అప్పుడు నీవు మా మొరాలకించి మమ్ము రక్షిస్తావు’ అని అన్నారు. “కాని ఇప్పుడు అమ్మోను, మోయాబు, మరియు శేయీరు పర్వత ప్రాంత మనుష్యులు ఇక్కడ వున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు నుండి బయటికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులను వారి రాజ్యంలోనికి నీవు వెళ్లనీయలేదు అందువల్ల ఇశ్రాయేలు ప్రజలు వారి జోలికి పోకుండా తిరిగి వచ్చి, వారిని నాశనం చేయలేదు. కాని మేము వారిని నాశనం చేయకుండా వదిలిపెట్టినందుకు వారు మాకు ఏ రకమైన ప్రతిఫలం ఇస్తున్నారో చూడు. నీ దేశం నుండి మమ్మల్ని తరిమి వేయటానికి వారు వచ్చారు. ఈ దేశాన్ని నీవు మాకు యిచ్చి యున్నావు. మా దేవా, ఆ మనుష్యులను శిక్షించుము! మామీదికి దండెత్తి వస్తున్న ఈ మహా సైన్యాన్ని ఎదిరించే శక్తి మాకు లేదు! మేము ఏమి చేయాలో మాకు తోచటంలేదు! అందువల్ల నీ సహాయం కొరకు ఎదురు చూస్తూన్నాం.”

2 దినవృత్తాంతములు 20:6-12 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

–మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై యున్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే; నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుట కెవరికిని బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలీయుల యెదుటనుండి ఈ దేశపు కాపురస్థులను తోలివేసి, నీ స్నేహితుడైన అబ్రాహాముయొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. వారు అందులో నివాసముచేసి, కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరవైనను, మామీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ యెదుటను నిలువబడి మా శ్రమలో నీకు మొఱ్ఱపెట్టినయెడల నీవు ఆలకించి మమ్మును రక్షిం చుదువని అనుకొని, యిచ్చట నీ నామఘనతకొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడెను గదా. ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోను మోయాబీయులతోను శేయీరు మన్యవాసులతోను యుద్ధము చేయనియ్యలేదు గనుక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలము చేయక వారియొద్దనుండి తొలగి పోయిరి. మేము స్వతంత్రించుకొనవలెనని నీవు మా కిచ్చిన నీ స్వాస్థ్యములోనుండి మమ్మును తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము. మా దేవా, నీవు వారికి తీర్పుతీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు; ఏమి చేయుటకును మాకు తోచదు; నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను.

2 దినవృత్తాంతములు 20:6-12 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

ఇలా ప్రార్థించాడు: “యెహోవా మా పూర్వికుల దేవా, పరలోకంలో ఉన్న దేవుడు మీరు కాదా? మీరు ప్రజల రాజ్యాలన్నిటినీ పరిపాలిస్తున్నారు. బలప్రభావాలు మీ చేతిలో ఉన్నాయి, మీకు వ్యతిరేకంగా ఎవరు నిలబడలేరు. మా దేవా! మీ ప్రజలైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశంలో కాపురమున్న వారిని మీరు వెళ్లగొట్టి, మీ స్నేహితుడైన అబ్రాహాము వారసులకు శాశ్వతంగా ఈ దేశాన్ని ఇవ్వలేదా? వారు ఇక్కడ నివాసముండి మీ పేరట ఇక్కడ పరిశుద్ధాలయం కట్టారు. వారు, ‘ఒకవేళ మా మీదికి విపత్తుగానీ, తీర్పు అనే ఖడ్గమే గాని తెగులే గాని కరువే గాని వస్తే మీ నామం కలిగిన ఈ మందిరం ముందు మేము మీ సన్నిధిలో నిలబడి మా ఆపదలో మీకు మొరపెడితే మీరు మా మొర విని మమ్మల్ని రక్షిస్తారు’ అన్నారు. “అయితే ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి వచ్చినప్పుడు వారిని అమ్మోను, మోయాబు, శేయీరు పర్వతం నుండి వచ్చిన వారితో యుద్ధం చేయడానికి మీరు అనుమతించలేదు; కాబట్టి ఇశ్రాయేలీయులు వారిని నాశనం చేయకుండా వారి నుండి వెళ్లిపోయారు. మీరు మాకు వారసత్వంగా ఇచ్చిన స్వాస్థ్యం నుండి వారు మమ్మల్ని తోలివేయడానికి వచ్చి వారు మాకు ఎలాంటి ప్రత్యుపకారం చేస్తున్నారో చూడండి. మా దేవా, మీరు వారికి తీర్పు తీర్చరా? ఎందుకంటే మాపై దాడి చేస్తున్న ఈ మహా సైన్యాన్ని ఎదుర్కొనే శక్తి మాకు లేదు. ఏం చేయాలో మాకు తెలియదు, కానీ మీ సహాయం కోసమే చూస్తున్నాము.”