2 దినవృత్తాంతములు 15:1-7

2 దినవృత్తాంతములు 15:1-7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఆ కాలంలో దేవుని ఆత్మ ఓదేదు కొడుకైన అజర్యా మీదికి వచ్చినపుడు అతడు ఆసా ముందుకు వెళ్లి ఈ విధంగా ప్రకటించాడు. “ఆసా, యూదా ప్రజలారా, బెన్యామీను ప్రజలారా, మీరంతా నా మాట వినండి. మీరు యెహోవా పక్షపు వారైతే ఆయన మీ పక్షాన ఉంటాడు. మీరు ఆయన దగ్గర విచారణ చేస్తే ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు. మీరు ఆయన్ని విడిచిపెడితే, ఆయన మిమ్మల్ని విడిచిపెడతాడు. చాలా రోజులుగా నిజమైన దేవుడు గానీ ఉపదేశించే యాజకులు గానీ ధర్మశాస్త్రం గానీ ఇశ్రాయేలీయులకు లేకుండా పోయాయి. అయితే తమ బాధల్లో వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన్ని వెదకారు. ఆయన వారికి ప్రత్యక్షమయ్యాడు. ఆ రోజుల్లో అన్ని దేశాల్లో నివాసముండే వారందరూ గొప్ప కలవరంలో ఉండేవారు. కాబట్టి తమ కార్యాలు చక్కబెట్టుకోడానికి అటూ ఇటూ తిరిగే వారికి శాంతి, సమాధానం లేకుండా ఉంది. దేవుడు మనుషులను అన్ని రకాల బాధలతో కష్టపెట్టాడు కాబట్టి రాజ్యం రాజ్యానికీ పట్టణం పట్టణానికీ వ్యతిరేకంగా లేచి ముక్కలు చెక్కలై పోయాయి. అయితే మీరు బలహీనులు కాక ధైర్యం తెచ్చుకోండి, మీ కార్యం సఫలమవుతుంది.”

2 దినవృత్తాంతములు 15:1-7 పవిత్ర బైబిల్ (TERV)

దేవుని ఆత్మ అజర్యా మీదికి వచ్చింది. అజర్యా ఓబేదు కుమారుడు. ఆసాను కలుసుకోవటానికి అజర్యా వెళ్లాడు. అజర్యా యిలా అన్నాడు: “ఆసా, యూదా ప్రజలారా, బెన్యామీను ప్రజలారా నేను చేప్పేది వినండి! మీరు యెహోవాను నమ్మకొని ఉన్నన్ని రోజులూ, యెహోవా మీతో వుంటాడు. మీరు యెహోవాను వెదికితే, మీరాయనను కనుగొంటారు. కాని మీరు ఆయనను వదిలివేస్తే, ఆయన మిమ్మల్ని వదిలివేస్తాడు. చాలాకాలం ఇశ్రాయేలుకు ఒక నిజమైన దేవుడు లేకుండా వుండిపోయింది. వారు బోధించే యాజకుడుగాని, ధర్మశాస్త్రంగాని లేకుండా వుండి పోయారు. కాని ఇశ్రాయేలు ప్రజలకు కష్టంవచ్చినప్పుడు వారు మళ్లీ దేవుడైన యెహోవాను ఆశ్రయించారు. ఆయన ఇశ్రాయేలు దేవుడు. వారాయనను వెదకగా, యెహోవా వారికి కన్పించాడు. ఆ కష్టకాలంలో ఏ ఒక్కడూ క్షేమంగా ప్రయామాణం చేయగలిగేవాడు కాదు. రాజ్యాలన్నిటిలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఒక రాజ్యం మరో రాజ్యాన్ని, ఒక నగరం మరో నగరాన్ని నాశనం చేసికోసాగాయి. దేవుడు వాటిని సర్వవిధాలుగా కల్లోల పెట్టిన కారణంగా ఆ పరిణామాలు వచ్చాయి. కావున ఆసా, నీవు మరియు యూదా, బెన్యామీను ప్రజలు బలవంతులై యుండండి. బలహీనులు కావద్దు. అధైర్యపడవద్దు. ఎందుకంటే, మీ మంచి పనులకు తగిన ఫలితం దొరుకుతుంది!”

2 దినవృత్తాంతములు 15:1-7 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యామీదికి రాగా అతడు ఆసాను ఎదుర్కొనబోయి యీలాగు ప్రకటించెను –ఆసా, యూదావారలారా, బెన్యామీనీయులారా, మీరందరు నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపువారైనయెడల ఆయన మీ పక్షమున నుండును; మీరు ఆయనయొద్ద విచారణచేసినయెడల ఆయన మీకు ప్రత్యక్షమగును; మీరు ఆయనను విసర్జించినయెడల ఆయన మిమ్మును విసర్జించును, నిజమైన దేవుడైనను ఉపదేశముచేయు యాజకులైనను, ధర్మశాస్త్రమైనను చాలాదినములు ఇశ్రాయేలీయులకులేకుండ పోవును. తమ శ్రమయందువారు ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా యొద్దకు మళ్లుకొని ఆయనను వెదకి నపుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. ఆ కాలములలో దేశముల కాపురస్థులందరిలోను గొప్ప కల్లోలములు కలిగెను గనుక తమ పనిపాటలను చక్క పెట్టుకొనుటకై తిరుగువారికి సమాధానములేకుండెను. దేవుడు జనములను సకలవిధములైన బాధలతో శ్రమపరచెను గనుక జనము జనమును, పట్టణము పట్టణమును, పాడు చేసెను. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును.

2 దినవృత్తాంతములు 15:1-7 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదికి దిగిరాగా, అతడు ఆసాను కలుసుకోడానికి వెళ్లి అతనితో ఇలా చెప్పాడు, “ఆసా, సర్వ యూదా ప్రజలారా, బెన్యామీనీయులారా, నేను చెప్పేది వినండి. మీరు యెహోవాతో ఉంటే ఆయన మీతో ఉంటారు. మీరు ఆయనను వెదికితే, ఆయన మీకు కనిపిస్తారు. ఒకవేళ మీరు ఆయనను విడిచిపెడితే, ఆయన మిమ్మల్ని విడిచిపెడతారు. ఎందుకంటే చాలా కాలం వరకు ఇశ్రాయేలు ప్రజలు నిజమైన దేవుడు గాని, బోధించడానికి యాజకులు గాని, ధర్మశాస్త్రం గాని లేకుండానే గడిపారు. అయితే తమ బాధలో వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయనను వెదికారు. ఆయన వారికి దొరికారు. ఆ రోజుల్లో ప్రయాణం చేయడం క్షేమం కాదు, ఎందుకంటే దేశాల వాసులంతా గొప్ప కలవరంలో ఉన్నారు. ఒక దేశం మరొక దేశాన్ని, ఒక పట్టణం మరొక నగరాన్ని నాశనం చేసుకుంటున్నాయి, ఎందుకంటే దేవుడు వారిని అన్ని రకాల బాధలతో ఇబ్బంది పెడుతున్నారు. అయితే మీరు మాత్రం ధైర్యంగా ఉండండి, ఆశ వదులుకోవద్దు, ఎందుకంటే మీ పనికి ప్రతిఫలం లభిస్తుంది.”