1 థెస్సలొనీకయులకు 1:1-10

1 థెస్సలొనీకయులకు 1:1-10 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

తండ్రియైన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తుకు చెందిన థెస్సలొనీకయుల సంఘానికి, పౌలు, సిల్వాను, తిమోతి అనే మేము వ్రాయునది: మీకు కృపా సమాధానములు కలుగును గాక. మేము ప్రార్థించిన ప్రతిసారి మీ అందరి గురించి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. దేవునిపై మీకున్న విశ్వాసంతో చేసిన కార్యాలు, ప్రేమ చేత ప్రేరేపించబడిన మీ ప్రయాసం, మన ప్రభువైన యేసుక్రీస్తులో మీకున్న నిరీక్షణ వలన మీరు చూపుతున్న ఓర్పును మేము మన తండ్రియైన దేవుని యెదుట మానక జ్ఞాపకం చేసుకుంటున్నాము. దేవుని ప్రేమను పొందిన సహోదరీ సహోదరులారా, దేవుడు మిమ్మల్ని ఆయన ప్రజలుగా ఎన్నుకున్నాడనే సంగతి మాకు తెలుసు. ఎందుకంటే, మేము మీకు సువార్తను కేవలం సాధారణ మాటలతో కాక పరిశుద్ధాత్మ శక్తితో బలమైన విశ్వాసంతో ప్రకటించాము. మీ గురించి మేము మీ మధ్యలో ఎలా జీవించామో మీకు తెలుసు. మీరు తీవ్రమైన శ్రమల మధ్యలో పరిశుద్ధాత్మలోని సంతోషంతో వాక్యాన్ని స్వీకరించి, మమ్మల్ని మరియు ప్రభువును పోలి నడుచుకుంటున్నారు. కనుక మాసిదోనియ అకయ ప్రాంతాల్లో వున్న విశ్వాసులందరికి మీరు మాదిరిగా ఉన్నారు. అందుకని మీ వలన ప్రభువును గురించిన వాక్యం కేవలం మాసిదోనియ అకయ ప్రాంతాల్లో మారుమ్రోగడమే కాకుండా మీలో దేవునిపై ఉన్న విశ్వాసాన్ని గురించి ప్రతిచోట తెలిసింది. కనుక దాని గురించి మేము చెప్పవలసిన అవసరం లేదు, ఎందుకంటే మీరు మాకు ఇచ్చిన ఆతిథ్యం ఎలాంటిదో వారే సాక్ష్యమిస్తున్నారు. సజీవుడైన నిజమైన దేవుణ్ని సేవించడానికి మీరు విగ్రహాలను విడిచిపెట్టి ఎలా దేవుని వైపుకు తిరిగారో, మరణం నుండి ఆయన లేపిన, రాబోయే ఉగ్రత నుండి మనల్ని కాపాడబోవుచున్న, పరలోకం నుండి రాబోతున్న ఆయన కుమారుడైన యేసు కొరకు మీరు ఎంతగా ఎదురుచూస్తున్నారో వారే చెప్తున్నారు.

1 థెస్సలొనీకయులకు 1:1-10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

తండ్రి అయిన దేవునిలోనూ ప్రభు యేసు క్రీస్తులోనూ ఉన్న తెస్సలోనిక సంఘానికి పౌలు, సిల్వాను, తిమోతి రాస్తున్న సంగతులు. కృపా శాంతీ మీకు కలుగు గాక! మీ అందరి కోసం దేవునికి ఎప్పుడూ మా ప్రార్థనల్లో కృతజ్ఞతలు చెబుతూ మీ కోసం ప్రార్ధిస్తూ ఉన్నాం. విశ్వాసంతో కూడిన మీ పనినీ, ప్రేమతో కూడిన మీ ప్రయాసనూ, మన ప్రభు యేసు క్రీస్తులో ఆశాభావం వల్ల కలిగిన మీ సహనాన్నీ మన తండ్రి అయిన దేవుని సమక్షంలో మేము ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు ప్రేమించిన సోదరులారా, దేవుడు మిమ్మల్ని తన ప్రజలుగా ఎంపిక చేసుకున్నాడని మాకు తెలుసు గనక ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఎందుకంటే మీకు మేము సువార్త ప్రకటించినప్పుడు అది కేవలం మాటతో మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ మీ మధ్య శక్తివంతంగా పని చేశాడు కాబట్టి ఆయన మిమ్మల్ని ఎంపిక చేసుకున్నాడని మాకు తెలిసింది. తాను అలా చేస్తున్నానని మాకు పూర్తి నిశ్చయత కలిగించాడు. అదే విధంగా మీకు సహాయంగా ఉండాలని మేము మీ మధ్య ఎలా మాట్లాడామో, ఎలా ప్రవర్తించామో మీకు తెలుసు. మీరు మమ్మల్నీ, ప్రభువునీ అనుకరించారు. అనేక తీవ్ర హింసలు కలిగినా పరిశుద్ధాత్మ వలన కలిగే ఆనందంతో వాక్యాన్ని అంగీకరించారు. కాబట్టి మాసిదోనియలో, అకయలో ఉన్న విశ్వాసులందరికీ మీరు ఆదర్శప్రాయులయ్యారు. మీ దగ్గర నుండే ప్రభువు వాక్కు మాసిదోనియలో అకయలో వినిపించింది. అంతమాత్రమే కాకుండా ప్రతి స్థలంలో దేవుని పట్ల మీకున్న విశ్వాసం వెల్లడి అయింది కాబట్టి మేము ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడి వారు మా విషయమై మీరు మమ్మల్ని ఎలా స్వీకరించారో విగ్రహాలను వదిలి నిజ దేవునికి సేవ చేయడానికి మీరు ఎలా తిరిగారో, పరలోకం నుండి వస్తున్న ఆయన కుమారుని కోసం ఎలా వేచి ఉన్నారో చెబుతున్నారు. ఈ యేసును దేవుడు చనిపోయిన వారిలో నుండి సజీవంగా లేపాడు. ఈయన రానున్న ఉగ్రత నుండి మనలను తప్పిస్తున్నాడు.

1 థెస్సలొనీకయులకు 1:1-10 పవిత్ర బైబిల్ (TERV)

మన తండ్రియైన దేవునికి, యేసు క్రీస్తు ప్రభువుకు చెందిన థెస్సలొనీక పట్టణంలో ఉన్న సంఘానికి పౌలు, సిల్వాను మరియు తిమోతి వ్రాయటమేమనగా, మీకు దైవానుగ్రహము, శాంతి లభించుగాక! మేము మీకోసం ప్రార్థిస్తూ మీరు మా సోదరులైనందుకు మేము దేవునికి అన్నివేళలా కృతజ్ఞతతో ఉన్నాము. విశ్వాసంవల్ల మీరు సాధించిన కార్యాన్ని గురించి, ప్రేమ కోసం మీరు చేసిన కార్యాల్ని గురించి యేసు క్రీస్తు ప్రభువులో మీకున్న దృఢవిశ్వాసం వల్ల మీరు చూపిన సహనాన్ని గురించి విన్నాము. దానికి తండ్రియైన దేవునికి మేము అన్ని వేళలా కృతజ్ఞులము. సోదరులారా! దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని ఎన్నుకొన్నాడని మాకు తెలుసు. ఎందుకంటే, మేము సువార్తను మీకు వట్టి మాటలతో బోధించలేదు. శక్తితో, పరిశుద్ధాత్మతో, గట్టి నమ్మకంతో బోధించాము. మేము మీకోసం మీతో కలిసి ఏ విధంగా జీవించామో మీకు తెలుసు. మీరు మమ్మల్ని, ప్రభువును అనుసరించారు. మీకు కష్టం కలిగినా పరిశుద్ధాత్మ ఇచ్చిన ఆనందంతో సందేశాన్ని అంగీకరించారు. కనుక మాసిదోనియ, అకయ పట్టణాలలో ఉన్న విశ్వాసులందరికీ మీరు ఆదర్శులయ్యారు. ఆ పట్టణాలలో మీ ద్వారా ప్రభువు సందేశం ప్రచారమైంది. దేవుని పట్ల మీకున్న విశ్వాసం, ఆ పట్టణాలలోనే కాక, ప్రతి చోటా తెలిసింది. దాన్ని గురించి మేమేమీ చెప్పనవసరం లేదు. మీరు మాకెలాంటి స్వాగతమిచ్చారో వాళ్ళు అందరికీ చెపుతున్నారు. అంతేకాక, సజీవమైన నిజమైన దేవున్ని పూజించటానికి మీరు విగ్రహారాధనను వదిలి నిజమైన దేవుని వైపుకు ఏ విధంగా మళ్ళారో వాళ్ళు అందరికీ చెపుతున్నారు. పరలోకము నుండి రానున్న దేవుని కుమారుడైన యేసు కొరకు మీరు ఏ విధంగా కాచుకొని ఉన్నారో వాళ్ళు అందరికీ చెపుతున్నారు. దేవునిచే సజీవంగా లేపబడిన ఈ యేసు రానున్న ఆగ్రహం నుండి మనల్ని రక్షిస్తాడు.

1 థెస్సలొనీకయులకు 1:1-10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

తండ్రియైన దేవునియందును ప్రభువైన యేసుక్రీస్తు నందును ఉన్న థెస్సలొనీకయుల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. కృపయు సమాధానమును మీకు కలుగును గాక. విశ్వాసముతోకూడిన మీ పనిని, ప్రేమతోకూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతోకూడిన మీ ఓర్పును, మేము మన తండ్రియైన దేవుని యెదుట మానక జ్ఞాపకము చేసికొనుచు, మా ప్రార్థనలయందు మీ విషయమై విజ్ఞాపనముచేయుచు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఏలయనగా దేవునివలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి, అనగా మా సువార్త, మాటతో మాత్రముగాక శక్తితోను, పరిశుద్ధాత్మతోను, సంపూర్ణ నిశ్చయతతోను మీయొద్దకు వచ్చియున్న సంగతి మాకు తెలియును. మీ నిమిత్తము మేము మీయెడల ఎట్టివారమై యుంటిమో మీరెరుగుదురు. పరిశుద్ధాత్మవలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము నంగీకరించి, మమ్మును ప్రభువును పోలి నడుచుకొనినవారైతిరి. కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికిని మాదిరియైతిరి; ఎందుకనగా మీయొద్దనుండి ప్రభువు వాక్యము మాసిదోనియలోను అకయలోను మ్రోగెను; అక్కడమాత్రమే గాక ప్రతి స్థలమందును దేవునియెడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయెను గనుక, మేమేమియు చెప్పవలసిన అవశ్యములేదు. మీయొద్ద మాకెట్టి ప్రవే శము కలిగెనో, అక్కడి జనులు మమ్మునుగూర్చి తెలియ జెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచి పెట్టి, జీవముగలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును, దేవుడు మృతులలోనుండి లేపిన యేసు, అనగా రాబోవు ఉగ్రతనుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు, పరలోకమునుండి వచ్చునని యెదురు చూచుటకును, మీరేలాగు దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు.

1 థెస్సలొనీకయులకు 1:1-10 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

తండ్రియైన దేవునికి ప్రభువైన యేసు క్రీస్తుకు చెందిన థెస్సలొనీకయుల సంఘానికి, పౌలు, సీల, తిమోతి అనే మేము వ్రాయునది: మీకు కృపా సమాధానాలు కలుగును గాక. మేము ప్రార్థించిన ప్రతిసారి మీ అందరి గురించి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. దేవునిపై మీకున్న విశ్వాసంతో చేసిన కార్యాలు, ప్రేమ చేత ప్రేరేపించబడిన మీ ప్రయాసం, మన ప్రభువైన యేసు క్రీస్తులో మీకున్న నిరీక్షణ వలన మీరు చూపుతున్న ఓర్పును మేము మన తండ్రియైన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకుంటున్నాము. దేవుని ప్రేమను పొందిన సహోదరీ సహోదరులారా, దేవుడు మిమ్మల్ని ఆయన ప్రజలుగా ఎన్నుకున్నాడనే సంగతి మాకు తెలుసు. ఎందుకంటే, మేము మీకు సువార్తను కేవలం సాధారణ మాటలతో కాక పరిశుద్ధాత్మ శక్తితో బలమైన విశ్వాసంతో ప్రకటించాము. మీ గురించి మేము మీ మధ్యలో ఎలా జీవించామో మీకు తెలుసు. మీరు తీవ్రమైన శ్రమల మధ్యలో పరిశుద్ధాత్మలోని సంతోషంతో వాక్యాన్ని స్వీకరించి, మమ్మల్ని ప్రభువును పోలి నడుచుకుంటున్నారు. కాబట్టి మాసిదోనియ అకాయ ప్రాంతాల్లో ఉన్న విశ్వాసులందరికి మీరు మాదిరిగా ఉన్నారు. అందుకని మీ వలన ప్రభువును గురించిన వాక్యం కేవలం మాసిదోనియ అకాయ ప్రాంతాల్లో మారుమ్రోగడమే కాకుండా మీలో దేవునిపై ఉన్న విశ్వాసాన్ని గురించి ప్రతిచోట తెలిసింది. కాబట్టి దాని గురించి మేము చెప్పవలసిన అవసరం లేదు, ఎందుకంటే మీరు మాకు ఇచ్చిన ఆతిథ్యం ఎలాంటిదో వారే సాక్ష్యమిస్తున్నారు. సజీవుడైన నిజమైన దేవున్ని సేవించడానికి మీరు విగ్రహాలను విడిచిపెట్టి ఎలా దేవుని వైపుకు తిరిగారో, మరణం నుండి ఆయన లేపిన, రాబోయే ఉగ్రత నుండి మనల్ని కాపాడబోవుచున్న, పరలోకం నుండి రాబోతున్న ఆయన కుమారుడైన యేసు కోసం మీరు ఎంతగా ఎదురుచూస్తున్నారో వారే చెప్తున్నారు.