1 సమూయేలు 30:6-8
1 సమూయేలు 30:6-8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దావీదు చాలా దుఃఖపడ్డాడు. తమ తమ కొడుకులూ కూతుర్లను బట్టి వారందరికీ ప్రాణం విసికి పోయి దావీదును రాళ్లు రువ్వి చంపాలని చెప్పుకున్నారు. దావీదు తన దేవుడు, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అప్పుడు దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడైన అహీమెలెకు కుమారుడు అబ్యాతారుతో చెప్పాడు. అబ్యాతారు ఏఫోదును దావీదు దగ్గరికి తీసుకు వచ్చాడు. “నేను ఈ సేనను తరిమితే దాని కలుసుకోగలుగుతానా?” అని యెహోవా దగ్గర దావీదు విచారణ చేశాడు. అందుకు యెహోవా “తరుము, తప్పకుండా నీవు వాళ్ళని కలుసుకుని నీవారినందరినీ విడిపించుకుంటావు” అని చెప్పాడు.
1 సమూయేలు 30:6-8 పవిత్ర బైబిల్ (TERV)
సైన్యంలోని మగవాళ్లంతా వారి కుమారులు, కుమార్తెలు బందీలుగా తీసుకుని పోబడినందుకు విచారంగా, కోపంగా ఉన్నారు. దావీదును రాళ్లతో కొట్టి చంపాలని వారు మాట్లాడుకుంటున్నారు. ఇది దావీదును చాలా తల్లడిల్ల చేసింది. కానీ దావీదు తనదేవుడైన యెహోవా నుంచి బలంపొందాడు. యాజకుడైన అబ్యాతారుతో, “ఏఫోదును తెమ్మని” చెప్పాడు దావీదు. అప్పుడు దావీదు యెహోవాకు ప్రార్థన చేసాడు “మా కుటుంబాలను బందీలుగా తీసుకునిపోయిన వారిని నేను వెంటాడనా? వారిని పట్టుకుంటానా?” అని అడిగాడు, “వారిని వెంటాడు, నీవు వారిని పట్టుకుంటావు. మీ కుటుంబాలను రక్షించుకొంటావు” అని యెహోవా ప్రత్యుత్తర మిచ్చాడు.
1 సమూయేలు 30:6-8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమతమ కుమారులనుబట్టియు కుమార్తెలనుబట్టియు జనులకందరికి ప్రాణము విసికినందున రాళ్లు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పు కొనగా దావీదు తన దేవుడైన యెహోవానుబట్టి ధైర్యము తెచ్చుకొనెను. పిమ్మట దావీదు–ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు నొద్దకు తీసికొనివచ్చెను. –నేను ఈ దండును తరిమినయెడల దాని కలిసికొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణచేయగా యెహోవా–తరుము, నిశ్చయముగా నీవు వారిని కలిసి కొని తప్పక నీవారినందరిని దక్కించుకొందువని సెలవిచ్చెను.
1 సమూయేలు 30:6-8 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అక్కడున్న మనుష్యులు తమ కుమారులు కుమార్తెల గురించి తీవ్రంగా దుఃఖపడి ఆ బాధతో దావీదును రాళ్లతో కొట్టి చంపాలని వారు మాట్లాడుకోవడంతో దావీదు ఎంతో దుఃఖపడ్డాడు. కాని దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. తర్వాత దావీదు అహీమెలెకు కుమారుడును యాజకుడునైన అబ్యాతారుతో, “నాకు ఏఫోదు తీసుకురా” అని చెప్పినప్పుడు అబ్యాతారు దాన్ని తెచ్చాడు. అప్పుడు దావీదు, “నేను ఈ గుంపును వెంటాడితే వారిని పట్టుకోగలనా?” అని యెహోవా దగ్గర విచారణ చేశాడు. అందుకు యెహోవా, “నీవు వెంటాడు, ఖచ్చితంగా నీవు వారిని పట్టుకుని నీ వారినందరిని విడిపించడంలో విజయం పొందుతావు” అని జవాబిచ్చారు.