1 సమూయేలు 24:4-8
1 సమూయేలు 24:4-8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దావీదు జనులు–అదిగో–నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చెనని అతనితో అనగా; దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండ అతని పైవస్త్రపు చెంగును కోసెను. సౌలు పైవస్త్రమును తాను కోసెనని దావీదు మనస్సు నొచ్చి –ఇతడు యెహోవాచేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవాచేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవానుబట్టి అతని నేను చంపను అని తన జనులతో చెప్పెను. ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదికి పోనియ్యక వారిని ఆపెను. తరువాత సౌలు లేచి గుహలోనుండి బయలువెళ్లి మార్గమున పోయెను. అప్పుడు దావీదు లేచి గుహలోనుండి బయలువెళ్లి–నా యేలినవాడా రాజా, అని సౌలు వెనుకనుండి కేక వేయగా సౌలు వెనుక చూచెను. దావీదు నేల సాష్టాంగపడి నమస్కారము చేసి
1 సమూయేలు 24:4-8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దావీదు అనుచరులు “నీ దృష్టికి ఏది మంచిదో అది చేసేందుకు నీ శత్రువుని నీ చేతికి అప్పగిస్తానని యెహోవా నీతో చెప్పిన రోజు వచ్చింది” అని అతనితో చెప్పారు. దావీదు లేచి వెళ్ళి సౌలుకు తెలియకుండా అతని పైవస్త్రపు చెంగును కోశాడు. సౌలు పై వస్రాన్ని కోసినందుకు దావీదు మనస్సులో నొచ్చుకుని, “ఇతడు యెహోవా చేత అభిషేకం పొందినవాడు కాబట్టి యెహోవా చేత అభిషిక్తుడైన నా రాజు పట్ల నేను ఈ పని చేయను, యెహోవాను బట్టి నేను అతణ్ణి చంపను” అని తన వారితో చెప్పాడు. ఈ మాటలు చెప్పి దావీదు సౌలు మీదికి వెళ్ళకుండా తన వారిని అడ్డగించాడు. తరువాత సౌలు లేచి గుహలో నుండి బయలుదేరి తన దారిన వెళ్ళిపోయాడు. అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయటికి వచ్చి “నా యజమానీ, రాజా” అని వెనుక నుండి కేకవేస్తే, సౌలు వెనక్కి చూశాడు. దావీదు నేలపై పడి సాష్టాంగ నమస్కారం చేసి
1 సమూయేలు 24:4-8 పవిత్ర బైబిల్ (TERV)
సౌలును చూసి దావీదు అనుచరులు అతనితో “యెహోవా చెప్పిన రోజు ఇదే. ‘నీ శత్రువును నీకు అప్పగిస్తాను కనుక ఇప్పుడు నీ శత్రువును నీ ఇష్టం వచ్చినట్లు చేయవచ్చు అని యెహోవా నీతో చెప్పాడు గదా!’” అన్నారు. అప్పుడు దావీదు మెల్లగా సౌలు వద్దకు పాకుతూ వెళ్లి, సౌలు అంగీని ఒక కొన కోసివేశాడు. సౌలు దావీదును గమనించలేదు. కానీ తర్వాత సౌలు అంగీని కోసివేసినందుకు దావీదు బాధపడ్డాడు. “నా యజమానికి నేను ఇలాంటి పని చేయకుండా యెహోవా నన్ను నివారించునుగాక! సౌలు యెహోవా నియమించిన రాజు. సౌలు యెహోవాచే అభిషేకింపబడిన రాజు గనుక సౌలుకు వ్యతిరేకంగా నేను ఏమీ చేయకూడదు” అని దావీదు తన మనుష్యులతో అన్నాడు. కోపోద్రేకులైన తన మనుష్యులను అదుపు చేయటానికి దావీదు ఈ మాటలు చెప్పాడు. దావీదు వారిని సౌలు మీదికి పోనియ్యలేదు. సౌలు గుహ వదిలి తన దారిన వెళ్లిపోయాడు. అతని వెనుకనే దావీదు బయటికి వచ్చి, “రాజా నా ప్రభూ” అని కేక వేసాడు. సౌలు వెనుదిరిగి చూశాడు. దావీదు వంగి నమస్కరించాడు.
1 సమూయేలు 24:4-8 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ఆ మనుష్యులు, “ ‘నీ ఇష్టం వచ్చినట్లు చేయడానికి నీ శత్రువును నీ చేతికి అప్పగిస్తాను’ అని యెహోవా నీతో చెప్పిన రోజు ఇదే” అన్నారు. అప్పుడు దావీదు ప్రాకుతూ ముందుకు వెళ్లి సౌలు వస్త్రపు అంచును కత్తిరించాడు. కాని తర్వాత, సౌలు పైవస్త్రపు అంచును కోసినందుకు దావీదుకు మనస్సులో ఎంతో బాధ కలిగి, “ఇతడు యెహోవాచేత అభిషేకించబడినవాడు కాబట్టి యెహోవాచేత అభిషిక్తుడైన నా ప్రభువుకు నేను ఈ పని చేయను. యెహోవాను బట్టి అతన్ని నేను చంపను” అని తన ప్రజలతో చెప్పాడు. ఈ మాటలు చెప్పి దావీదు తన ప్రజలను గద్దించి సౌలు మీద దాడి చేయకుండ వారిని ఆపాడు. సౌలు ఆ గుహ నుండి బయటకు వచ్చి తన దారిలో వెళ్లిపోయాడు. అప్పుడు దావీదు గుహ నుండి బయటకు వచ్చి, “నా ప్రభువా రాజా!” అని పిలిచాడు. సౌలు అతని వెనుక చూసినప్పుడు దావీదు నేలకు సాష్టాంగపడి ఉన్నాడు.