1 సమూయేలు 2:1-36

1 సమూయేలు 2:1-36 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మరియు హన్నా విజ్ఞాపనచేసి యీలాగనెను– నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది. యెహోవాయందు నాకు మహా బలముకలిగెను నీవలని రక్షణనుబట్టి సంతోషించుచున్నాను నావిరోధులమీద నేను అతిశయపడుదును. యెహోవావంటి పరిశుద్ధ దేవుడు ఒకడునులేడు నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు మన దేవునివంటి ఆశ్రయదుర్గమేదియులేదు. యెహోవా అనంతజ్ఞానియగు దేవుడు ఆయనే క్రియలను పరీక్షించువాడు ఇకను అంత గర్వముగా మాటలాడకుడి గర్వపుమాటలు మీ నోట రానియ్యకుడి. ప్రఖ్యాతినొందిన విలుకాండ్రు ఓడిపోవుదురు తొట్రిల్లినవారు బలము ధరించుకొందురు. తృప్తిగా భుజించినవారు అన్నము కావలెనని కూలికి పోవుదురు ఆకలిగొనినవారు ఆకలితీర తిందురు గొడ్రాలు ఏడుగురు పిల్లలను కనును అనేకమైన పిల్లలను కనినది కృశించి పోవును. జనులను సజీవులనుగాను మృతులనుగాను చేయువాడు యెహోవాయే పాతాళమునకు పంపుచు అందులోనుండి రప్పించుచుండువాడు ఆయనే. యెహోవా దారిద్యమును ఐశ్వర్యమును కలుగజేయు వాడు క్రుంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలోనుండి యెత్తువాడు ఆయనే లేమిగలవారిని పెంటకుప్పమీదినుండి లేవనెత్తువాడు ఆయనే. భూమియొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటిమీద ఆయన నిలిపియున్నాడు. తన భక్తుల పాదములు తొట్రిల్లకుండ ఆయన వారిని కాపాడును దుర్మార్గులు అంధకారమందు మాటుమణుగుదురు బలముచేత ఎవడును జయము నొందడు. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు పరమండలములోనుండి ఆయన వారిపైన ఉరుమువలె గర్జించును లోకపు సరిహద్దులలో నుండువారికి ఆయన తీర్పు తీర్చును తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును తాను అభిషేకించినవానికి అధిక బలము కలుగజేయును. తరువాత ఎల్కానా రామాలోని తన యింటికి వెళ్లి పోయెను; అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ యెదుట యెహోవాకు పరిచర్యచేయుచుండెను. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగనివారై మిక్కిలి దుర్మార్గులైయుండిరి. జనులవిషయమై యాజకులు చేయుచు వచ్చిన పని యేమనగా, ఎవడైన బలిపశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకునిపనివాడు మూడు ముండ్లుగల కొంకిని తీసికొనివచ్చి బొరుసులోగాని తపేలలోగాని గూనలోగానికుండలోగాని అది గుచ్చినపుడు ఆ కొంకిచేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తనకొరకు తీసికొనును. షిలోహుకు వచ్చు ఇశ్రాయేలీయులందరికిని వీరు ఈలాగున చేయుచువచ్చిరి. ఇదియుగాక వారు క్రొవ్వును దహింపకమునుపు యాజకుని పనివాడు వచ్చి బలిపశువును వధించువానితో– యాజకునికి వండించుటకై మాంసమిమ్ము, ఉడకబెట్టిన మాంసము అతడు నీయొద్ద తీసికొనడు, పచ్చి మాంసమే కావలెను అని చెప్పుచువచ్చెను. –ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు, తరువాత నీ మనస్సు వచ్చినంతమట్టుకు తీసికొనవచ్చునని వానితో ఆ మనిషి చెప్పినయెడల వాడు–ఆలాగువద్దు ఇప్పుడే యియ్యవలెను, లేనియెడల బలవంతముచేత తీసికొందుననును. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్య పడుటకు ఆ యౌవనులు కారణమైరి, గనుక వారిపాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయెను. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వాని తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి యేటేట బలి అర్పించుటకు తన పెనిమిటితోకూడ వచ్చినప్పుడు దాని తెచ్చి వానికిచ్చుచు వచ్చెను. –యెహోవా సన్నిధిని మనవిచేసికొనగా నీకు దొరకిన యీ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానము నిచ్చునుగాక అని ఏలీ ఎల్కానాను అతని భార్యను దీవించిన తరువాత వారు ఇంటికి వెళ్లిరి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతియై ముగ్గురు కుమాళ్లను ఇద్దరు కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి యెదుగుచుండెను. ఏలీ బహు వృద్ధుడాయెను. ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నియు, వారు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము దగ్గరకు సేవచేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయను మాట చెవిని పడగా వారిని పిలిచి యిట్లనెను ఈ జనులముందర మీరు చేసిన చెడ్డకార్యములు నాకు వినబడినవి. ఈలాటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? నా కుమారులారా, యీలాగు చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు, యెహోవా జనులను మీరు అతిక్రమింపచేయుచున్నారు. నరునికి నరుడు తప్పుచేసినయెడల దేవుడు విమర్శచేయునుగాని యెవరైన యెహోవా విషయములో పాపము చేసినయెడల వానికొరకు ఎవడు విజ్ఞాపనము చేయును? అనెను. అయితే యెహోవావారిని చంప దలచి యుండెను గనుక వారు తమ తండ్రియొక్క మొఱ్ఱను వినకపోయిరి. బాలుడగు సమూయేలు ఇంకను ఎదు గుచు యెహోవా దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. అంతట దైవజనుడొకడు ఏలీయొద్దకు వచ్చి యిట్లనెను –యెహోవా నిన్నుగూర్చి సెలవిచ్చినదేమనగా, నీ పితరుని యింటివారు ఐగుప్తు దేశమందు ఫరో యింటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని. అతడు నా ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠముమీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడగునట్లు ఇశ్రాయేలు గోత్రములలోనుండి నేనతని ఏర్పరచుకొంటిని. ఇశ్రాయేలీయులు అర్పించిన హోమవస్తువు లన్నిటిని నీ పితరుని యింటివారికిచ్చితిని. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీ రేల తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులగు ఇశ్రాయేలీయులుచేయు నైవేద్యములలో శ్రేష్ఠభాగములను పట్టుకొనుచు, నాకంటె నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. నీ యింటివారును నీ పితరుని యింటివారును నా సన్నిధిని యాజ కత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ యిచ్చియున్నను ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయెనని ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా– నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును. నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు. ఆలకించుము; రాగల దినములలో నీ బలమును నీ పితరుని యింటి బలమును నేను తక్కువచేతును. నీ యింట ముసలివాడు ఒకడును లేకపోవును. యెహోవా ఇశ్రాయేలీయులకు చేయదలచిన మేలువిషయములో నా నివాసస్థలమునకు అపాయము కలుగగా నీవు చూతువు. ఎప్పటికిని నీ యింట ముసలివాడు ఉండడు. నా బలిపీఠమునొద్ద నెవడు ఉండకుండ నేనందరిని నశింపజేయక విడుచు వాడను గనుక అది నీ కన్నులు క్షీణించుటకును నీవు దుఃఖముచేత క్షయమగుటకును సాధనమగును; నీ సంతానపు వారందరు వయఃకాలమందు మరణమవుదురు. నీ యిద్దరు కుమారులైన హొఫ్నీకిని ఫీనెహాసునకును సంభవించునని నేను చెప్పినదానికి నీకు సూచనగా నుండును. ఒక్క నాటియందే వారిద్దరు మరణమవుదురు. తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును; అతడు నా యోచననుబట్టి నా కనుకూలముగా యాజకత్వము జరిగించును, అతనికి నేను నమ్మకమైన సంతానము పుట్టిం తును, అతడు నా అభిషిక్తుని సన్నిధిని ఎప్పటికిని యాజ కత్వము జరిగించును. అయితే నీ యింటివారిలో శేషించినవారు ఒక వెండిరూకనైనను రొట్టెముక్కనైనను సంపా దించుకొనవలెనని అతనియొద్దకు వచ్చి దండముపెట్టి–నేను రొట్టెముక్క తినునట్లుగా దయచేసి యాజకుల ఉద్యోగములలో ఒకదానియందు నన్ను ఉంచుమని అతని వేడుకొందురు.

షేర్ చేయి
Read 1 సమూయేలు 2

1 సమూయేలు 2:1-36 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

హన్నా ప్రార్థన చేస్తూ ఇలా అంది, “నా హృదయం యెహోవాలో సంతోషిస్తూ ఉంది. యెహోవాలో నాకు ఎంతో బలం కలిగింది. నీ ద్వారా కలిగిన రక్షణను బట్టి సంతోషిస్తున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడతాను. యెహోవా లాంటి పరిశుద్ధ దేవుడు ఎవరూ లేరు. నువ్వు కాకుండా ఇంక ఏ దేవుడూ లేడు మన దేవుడిలాంటి ఆశ్రయం ఎక్కడా లేదు. యెహోవా దేవుని జ్ఞానం అనంతమైంది. మన కార్యాలను పరిశీలించేవాడు ఆయనే. కాబట్టి ఇకపై ఎవరూ గర్వంగా మాట్లాడవద్దు. అహంకారమైన మాటలు మీ నోట నుంచి రానియ్యవద్దు. పేరుగాంచిన విలుకాళ్ళు ఓడిపోతారు. తొట్రిల్లి పడిపోయినవారు బలం పొందుతారు. తృప్తిగా భోజనం చేసినవారు అన్నం కోసం కూలి పనికి వెళ్తారు. ఆకలి వేసినవారు కడుపునిండా తింటారు. గొడ్రాలు ఏడుగురు పిల్లలను కంటుంది. ఎక్కువమంది పిల్లలను కనిన స్త్రీ కృశించిపోతుంది. మనుషులను సజీవులుగానూ, మృతులుగానూ చేసేవాడు యెహోవాయే. పాతాళానికి పంపిస్తూ అక్కడినుండి రప్పించే వాడూ ఆయనే. యెహోవా దరిద్రతను, ఐశ్వర్యాన్ని కలుగ జేసేవాడు. కుంగిపోయేలా చేసేవాడూ, లేవనెత్తేవాడూ ఆయనే. దరిద్రులను అధికారులతో కలసి కూర్చోబెట్టేవాడూ, మహిమగల సింహాసనంపై కూర్చునేలా చేసేవాడూ వారిని మట్టిలోనుండి పైకి ఎత్తే వాడు ఆయనే. పేదవారిని పెంటకుప్పపై నుండి పైకి లేపేవాడు ఆయనే. భూమి ఆధార స్తంభాలు యెహోవా ఆధీనంలో ఉన్నాయి. ఆయన లోకాన్ని వాటిపై నిలిపి ఉంచాడు. తన భక్తుల పాదాలు తొట్రుపడకుండా ఆయన వారిని కాపాడతాడు. దుర్మార్గులు చీకటిలో దాక్కొంటారు. బలం వలన ఎవరూ విజయం సాధించలేరు. యెహోవాతో వాదులాడేవారు నాశనమైపోతారు. పరలోకం నుండి ఆయన వారి మీద ఉరుములాగా గర్జిస్తాడు. భూదిగంతాల ప్రజలకు ఆయన తీర్పు తీరుస్తాడు. తాను నిలబెట్టిన రాజుకు ఆయన బలమిస్తాడు. తాను అభిషేకించిన రాజుకు అధికమైన బలం కలిగిస్తాడు.” తరువాత ఎల్కానా రమాలోని తన ఇంటికి వెళ్లిపోయాడు. అయితే ఆ పిల్లవాడు యాజకుడైన ఏలీ సమక్షంలో యెహోవాకు సేవ చేస్తున్నాడు. ఏలీ కుమారులు యెహోవా మార్గాలు తెలియని దుర్మార్గులు. ప్రజల విషయంలో యాజకులు చేస్తున్న పని ఏమిటంటే, ఎవరైనా బలిగా అర్పించిన తరువాత మాంసం ఉడుకుతూ ఉన్నపుడు యాజకుని మనుషులు మూడుముళ్ళు ఉన్న కొంకిని తీసుకు వచ్చి డేక్సాలో గాని తపేలాలో గాని గుండిగలో గాని కుండలో గాని గుచ్చినపుడు ఆ కొంకికి గుచ్చుకుని బయటకు వచ్చేదంతా యాజకుడు తన కోసం తీసుకొంటాడు. షిలోహుకు వచ్చే ఇశ్రాయేలీయులు అందరికీ వీరు ఇలాగే చేస్తూ వచ్చారు. అంతేకాక, వారు కొవ్వును దహించక ముందు యాజకుని పనివాడు వచ్చి బలిపశువును వధించేవాడితో “యాజకుని కోసం వండడానికి మాంసం ఇవ్వు. ఉడకబెట్టిన మాంసం అతడు తీసుకోడు, పచ్చిమాంసమే కావాలి” అనేవాడు. “అలా కాదు, ముందు కొవ్వును దహించాలి, తరువాత నీకు కావలసినంత తీసికోవచ్చు” అని అతనితో చెబితే, వాడు “అలా వద్దు, ఇప్పుడే ఇవ్వాలి, లేకపోతే బలవంతంగా తీసుకుంటాం” అనేవాడు. అందువల్ల ప్రజలు యెహోవాకు నైవేద్యం అర్పించడం మానివేసి దాని విషయం అసహ్యపడడానికి ఆ యువకులు కారణమయ్యారు. కాబట్టి వారు చేస్తున్న పాపం యెహోవా దృష్టికి మితి మీరింది. బాల సమూయేలు నారతో నేసిన ఏఫోదు ధరించుకుని యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. అతని తల్లి అతనికి చిన్న అంగీ ఒకటి కుట్టి ప్రతి సంవత్సరం బలి అర్పించడానికి తన భర్తతో కలసి వచ్చినప్పుడు దాన్ని తెచ్చి అతనికి ఇస్తూ వచ్చింది. “యెహోవా సన్నిధిలో వేడుకొన్నప్పుడు నీకు కలిగిన ఈ సంతానానికి బదులుగా యెహోవా నీకు మరెక్కువ సంతానం ఇస్తాడు” అని ఏలీ ఎల్కానాను, అతని భార్యను దీవించిన తరువాత వారు ఇంటికి వెళ్ళారు. యెహోవా హన్నాకు మళ్లీ సహాయం చేయగా ఆమె మళ్లీ గర్భం దాల్చి ముగ్గురు కొడుకులను, ఇద్దరు కూతుళ్ళను కన్నది. అయితే బాల సమూయేలు యెహోవా సన్నిధిలో ఉండి పెరుగుతూ ఉన్నాడు. ఏలీ చాలా ముసలివాడయ్యాడు. ఇశ్రాయేలీయుల పట్ల తన కొడుకులు చేసిన పనులన్నిటి విషయం, వారు ప్రత్యక్షపు గుడారం ద్వారం దగ్గర సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో వ్యభిచరిస్తున్నారు అనే విషయం విన్నప్పుడు వారిని పిలిచి ఇలా అన్నాడు, “ఈ ప్రజల ముందు మీరు చేస్తున్న చెడ్డ పనులు నాకు తెలిశాయి. ఇలాటి పనులు మీరెందుకు చేస్తున్నారు? నా కుమారులారా, ఇలా చేయవద్దు. నేను విన్నది మంచిది కాదు. మీరు యెహోవా ప్రజల చేత పాపం చేయిస్తున్నారు. మనిషి పట్ల మనిషి తప్పు చేస్తే న్యాయాధిపతి శిక్షిస్తాడు. అయితే ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేస్తే అతని కోసం ఎవడు వేడుకుంటాడు?” అయితే యెహోవా వారిని చంపాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి వారు తమ తండ్రి చెప్పిన మాటలు వినలేదు. బాల సమూయేలు యెహోవాకూ, మనుష్యులకూ ఇష్టమైనవాడుగా పెరుగుతూ ఉన్నాడు. ఆ సమయంలో దేవుని మనిషి ఒకడు ఏలీ దగ్గరకి వచ్చి ఇలా చెప్పాడు. “యెహోవా నిన్ను గూర్చి చెబుతున్నది ఏమిటంటే, ‘నీ పూర్వికులు ఐగుప్తు దేశంలో ఫరో కింద బానిసత్వంలో ఉన్నప్పుడు నేను వారికి ప్రత్యక్షమయ్యాను. అతడు నా సన్నిధానంలో ఏఫోదును ధరించి నా బలిపీఠం మీద అర్పణ, ధూపం అర్పించడానికి నాకు యాజకుడుగా ఉండేందుకు ఇశ్రాయేలు గోత్రాల్లో నుండి నేను అతణ్ణి ఏర్పరచుకొన్నాను. ఇశ్రాయేలీయులు అర్పించిన హోమ వస్తువులన్నిటినీ నీ పూర్వికుని ఇంటివారికి ఇచ్చాను. నా సన్నిధి ఉండే స్థలానికి నేను నిర్ణయించిన బలి నైవేద్యాలను మీరు ఎందుకు తిరస్కరిస్తున్నారు? మిమ్మల్ని మీరు కొవ్వబెట్టుకోడానికి నా ప్రజలైన ఇశ్రాయేలీయులు చేసే నైవేద్యాల్లో శ్రేష్ఠమైన భాగాలను మీరే ఉంచుకొంటూ నాకంటే నీ కొడుకులను నీవు గొప్ప చేస్తున్నావు. నీ ఇంటివారు, నీ పూర్వికుని ఇంటివారు నా సన్నిధిలో యాజకత్వం జరిగిస్తారని నేను వాగ్దానం చేశాను. కానీ ఇప్పుడు అలా కొనసాగించడం నాకు దూరం అగు గాక.’ అని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి యెహోవా మాట ఏమిటంటే, ‘నన్ను గొప్ప చేసేవారిని నేను గొప్పచేస్తాను. నన్ను తిరస్కరించేవారిని తోసిపుచ్చుతాను.’ జాగ్రత్తగా వినండి, రాబోయే రోజుల్లో నీ బలాన్ని, నీ ఇంటి వంశం బలాన్ని నేను తగ్గిస్తాను. నీ ఇంటి మొత్తంలో ముసలివాడు ఒకడు కూడా ఉండడు. నా సన్నిధి స్థలానికి అపాయం సంభవించడం నువ్వు చూస్తావు. యెహోవా ఇశ్రాయేలీయుల కోసం చేయాలనుకొన్న మేలు జరిగిస్తాడు గానీ నీ ఇంట్లో మాత్రం వృద్ధుడు ఎవడూ ఉండడు, నా బలిపీఠం దగ్గర ఎవరూ లేకుండా నేను అందరినీ నాశనం చేయకుండా విడిచిపెట్టేవాడిని కాదు. కాబట్టి అది నీ కళ్ళు మసకబారడానికి, నువ్వు దుఃఖంతో క్షీణించిపోడానికి కారణమౌతుంది. నీ సంతానమంతా ముసలివాళ్ళు కాకముందే చనిపోతారు. నీ ఇద్దరు కొడుకులైన హొఫ్నీకీ, ఫీనెహాసుకూ ఇలా జరుగుతుందని నేను చెప్పిన దానికి నీకు ఒక సూచన, ఒక్కరోజే వారిద్దరూ చనిపోతారు. తరువాత నమ్మకమైన ఒక యాజకుణ్ణి నేను నియమిస్తాను. అతడు నా ఆలోచనను బట్టి నాకు అనుకూలంగా యాజకత్వం జరిగిస్తాడు. అతనికి నేను నమ్మకమైన సంతానం అనుగ్రహిస్తాను. అతడు నా అభిషిక్తుని సన్నిధిలో సదాకాలం యాజకత్వం జరిగిస్తాడు. అయితే నీ ఇంటివారిలో మిగిలిన ప్రతి ఒక్కరూ డబ్బుకోసం రొట్టెల కోసం అతని దగ్గరికి వచ్చి వంగి నమస్కరించి, ‘నేను కడుపుకు రొట్టెముక్క తినగలిగేలా దయచేసి యాజకుల సేవల్లో ఒకదానిలో నన్ను పెట్టుకో’ అని అతడిని బతిమాలుకుంటారు.”

షేర్ చేయి
Read 1 సమూయేలు 2

1 సమూయేలు 2:1-36 పవిత్ర బైబిల్ (TERV)

హన్నా దేవుని ఇలా కీర్తించెను: “నా హృదయం దేవునిలో పరవశించి పోతూవుంది. నా దేవుని ద్వారా నాకు బలము కలిగెను. నా శత్రువులను నేను పరిహసించగలను. నా విజయానికి మురిసిపోతున్నాను. యెహోవా వంటి మరో పరిశుద్ధ దేవుడు లేడు. నీవు తప్ప మరో దేవుడు లేడు! మన దేవుని వంటి బండ మరొకడు లేడు. ఇక డంబాలు పలుకవద్దు! గర్వపు మాటలు కట్టి పెట్టండి! ఎందువల్లనంటే యెహోవా దేవునికి అంతా తెలుసు దేవుడు మనుష్యులను నడిపిస్తాడు, వారికి తీర్పు తీరుస్తాడు. మహా బలశాలుల విల్లులు విరిగిపోతాయి! బలహీనులు బలవంతులవుతారు! ఇది వరకు సమృద్ధిగా భోజనం ఉన్నావారు భోజనం కోసం పని చేయాలి ఇప్పుడు కాని ఇదివరకు ఆకలితో కుమిలేవారికి ఇప్పుడు సమృద్ధిగా భోజనం! గొడ్రాలుకు ఏడుగురు పిల్లలు! సంతానవతికి పుత్రనాశనంతో దుఃఖపాటు. యెహోవా జనన మరణ కారకుడు! దేవుడు నరులను చావుగోతికి తోసివేయ గలడు. ఆయన వారిని మరల బ్రతికించగలడు. యెహోవా కొందరిని పేద వారిగా చేస్తాడు, మరికొందరిని ధనవంతులుగా చేస్తాడు. పతనానికీ, ఉన్నతికీ కారకుడు యెహోవాయే. మట్టిలో ఉండే వారిని యెహోవా ఉన్నతికి తీసుకొని వస్తాడు ఆయన వారి దుఃఖాన్ని నిర్ములిస్తాడు. యెహోవా పేదవారిని ప్రముఖులుగా చేస్తాడు. యువ రాజుల సరసన కూర్చుండబెడ్తాడు. యెహోవా వారిని ఘనులతో బాటు ఉన్నతాసీనులను చేస్తాడు. పునాదుల వరకూ ఈ సర్వజగత్తూ యెహోవాదే! యెహోవా ఈ జగత్తును ఆ పునాదులపై నిలిపాడు. యెహోవా తన పరిశుద్ధ ప్రజలను కాపాడుతాడు. వారు పడిపోకుండా ఆయన వారిని కాపాడుతాడు. కాని దుష్టులు నాశనం చేయబడతారు. వారు అంధకారంలో పడిపోతారు. వారి శక్తి, వారు జయించేందుకు తోడ్పడదు. యెహోవా తన శత్రువులను నాశనం చేస్తాడు. సర్వోన్నతుడైన దేవుడు ప్రజల గుండెలదిరేలా పరలోకంలో గర్జిస్తాడు. సర్వలోకానికీ యెహోవా తీర్పు ఇస్తాడు! యెహోవా తన రాజుకు శక్తి ఇస్తాడు. ఆయన నియమించిన రాజును బలవంతునిగా చేస్తాడు.” తరువాత ఎల్కానా తన కుటుంబంతో కలిసి రామాలో తన ఇంటికి వెళ్లిపోయాడు. బాలుడు మాత్రం యాజకుడైన ఏలీ పర్యవేక్షణలో షిలోహులో యెహోవా సేవలో వుండిపోయాడు. ఏలీ కుమారులు చెడ్డవారు. వారు యెహోవాను లక్ష్యపెట్టలేదు. యాజకులు ప్రజల పట్ల ఎలా ప్రవర్తించాలో వారు చింత చేయలేదు. ప్రజలు వచ్చినప్పుడు యాజకులు ఇలా చేయాలి. ఒక వ్యక్తి బలి ఇచ్చిన ప్రతిసారీ ఆ మాంసాన్ని యాజకుడు ఒక కుండలో ఉడకబెట్టాలి. అప్పుడు యాజకుని సేవకుడు మూడు మొనలు గల ఒక కొంకి గరిటెతో రావాలి. యాజకుని సేవకుడు గరిటెను ఉడుకుతోన్న బాణలిలో గుచ్చి తీయాలి. అప్పుడా గరిటె కొనలకు పట్టుకొని ఎంత మాంసం వస్తుందో అది మాత్రం యాజకునికి చెందుతుంది. బలులు ఇవ్వటానికి షిలోహుకు వచ్చిన ఇశ్రాయేలు ప్రజలకు యాజకులు చేయవలసిన విధి ఇదే. కాని ఏలీ కుమారులు ఆ పద్ధతిని పాటించలేదు. కొవ్వును బలిపీఠం మీద దహించక మునుపే వారి సేవకులు బలులు ఇచ్చేవారి వద్దకు వెళ్లి “యాజకుని వంటకానికై కొంత మాంసం ఇవ్వమనీ, ఉడుకబెట్టిన మాంసం మీనుండి ఆయన తీసుకోడని అనేవారు.” అయితే బలి ఇచ్చే వ్యక్తి గనుక కొవ్వును యధావిధిగా, “ముందు దహించిన తరువాత మీ ఇష్టం వచ్చినంత తీసుకోమని” అంటే యాజకుని సేవకుడు ఒప్పుకొనేవాడు కాదు. “అలా కాదు, ముందుగా మాంసం ఇవ్వండి. మీరు నాకు ఇవ్వక పోతే, బలవంతాన తీసుకోవలసి వస్తుంది!” అని బదులు చెప్పేవాడు. ఈ విధంగా, యెహోవాకు అర్పించబడిన అర్పణలను వారు లక్ష్యపెట్టలేదని హొఫ్నీ, ఫీనెహాసులు వ్యక్తం చేసారు. ఇది చాలా చెడ్డపాపం. కానీ సమూయేలు యెహోవాను సేవించాడు. సమూయేలు ఏఫోదు ధరించిన ఒక బాల సహాయకుడు. ప్రతి సంవత్సరం సమూయేలు తల్లి అతనికై ఒక చిన్న అంగీ తయారుచేసి, తన భర్తతో షిలోహుకు బలి అర్పించేందుకు వెళ్లినపుడు ఆ అంగీని సమూయేలు కొరకు తీసుకొని వెళ్లేది. ఎల్కానాను, అతని భార్యను ఏలీ ఆశీర్వదించేవాడు: “హన్నా ప్రార్థన ఫలితంగా పుట్టిన వానిని మరల యెహోవా సేవకై ఇచ్చారు గనుక అతని స్థానాన్ని భర్తీ చేసే విధంగా హన్నాద్వారా యెహోవా మీకు పిల్లలను కలుగజేయుగాక.” తర్వాత ఎల్కానా, హన్నా ఇంటికి వెళ్లిపోయారు. దేవుని అనుగ్రహం వల్ల హన్నాకు క్రమేపీ ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కలిగారు. బాలకుడైన సమూయేలు యెహోవా ఆలయములో దినదినము మంచి స్థితికి ఎదుగు చుండెను. ఏలీ చాలా వృద్ధుడై పోయాడు. షిలోహుకు వచ్చే ఇశ్రాయేలీయులందరి యెడల తన కుమారులు చేస్తున్న పనులను గూర్చి అతడు నిరంతరం వింటూనే వున్నాడు. పైగా సన్నిధి గుడారపు ద్వారం వద్ద పరిచర్యలు చేసే స్త్రీలతో తన కుమారులు శయనిస్తున్నారని కూడా ఏలీ విన్నాడు. ఏలీ తన కుమారులతో, “మీరు చేసిన చెడ్డ కార్యాలను గూర్చి ఇక్కడ ప్రజలు నాతో చెప్పారు. మీరెందుకు ఈ చెడ్డపనులు చేస్తున్నారు? నా కుమారులారా, ఈ చెడ్డపనులు చేయకండి. యెహోవా ప్రజలు మీ గురించి చెడుగా చెప్పుకుంటున్నారు. ఒక వ్యక్తి మరో వ్యక్తి పట్ల అపచారం చేస్తే, దేవుడు ఒక వేళ అతనికి సహాయం చేయవచ్చు. అయితే ఒక వ్యక్తి యెహోవా పట్ల అపచారం చేస్తే ఇక వానికి దిక్కెవరు?” అని అడిగాడు. అయినా ఏలీ కుమారులు తండ్రి సలహాను లెక్కచేయలేదు; కాబట్టి యెహోవా ఏలీ కుమారులను చంపటానికి నిర్ణయించాడు. బాలుడైన సమూయేలు మాత్రం దేవుని దయయందును, మనుష్యుల దయయందును పెరుగుతూ వచ్చాడు. దేవుని మనిషి– ఒకడు ఏలీ వద్దకు వచ్చాడు. ఆ దేవుని మనిషి ఇలా చెప్పాడు “ఈజిప్టు దేశంలో నీ పూర్వీకులు ఫరో ఇంటిలో బానిసలుగా ఉన్నప్పుడు వారికి నేను ప్రత్యక్షమయ్యాను. ఇశ్రాయేలులో వున్న నీ పూర్వీకుని కుటుంబాన్ని నేను ఎన్నుకున్నాను. వారిని యాజకులుగా నియమించాను. నా బలిపీఠం వద్దకు వెళ్లి ధూపం వేయటానికి వారు ప్రత్యేక ఏఫోదు ధరించేలా కోరుకున్నాను. నీ తండ్రి కుటుంబీకులు ఇశ్రాయేలు ప్రజలు అర్పించిన బలి మాంసాన్ని తీసుకునేలాగున చేశాను. అయితే నీవు బలులను, కానుకలను ఎందువలన గౌరవించుట లేదు? నీవు నాకంటే నీ కుమారులనే ఎక్కువ గౌరవిస్తున్నావు. నా కొరకు ఇశ్రాయేలు ప్రజలు తెచ్చిన మాంసాన్ని అర్పణలలో మంచి వాటిని సంగ్రహించి క్రొవ్వెక్కి వున్నావు.” ఆ దేవుని మనిషి ఇంకా ఇలా అన్నాడు: “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నీ కుటుంబీకులు, నీ తండ్రి కుటుంబీకులు ఆయనను శాశ్వతంగా సేవించే విధంగా అనుగ్రహించాడు. కాని యెహోవా ఇప్పుడిలా సెలవిస్తున్నాడు: ‘అది ఇంక ఎన్నటికీ జరుగదు! నన్ను సేవించే వారినే నేను గౌరవిస్తాను. నన్ను సేవించుటకు నిరాకరించే వారికి అనేక కష్ట నష్టాలు సంభవిస్తాయి. మీ సంతానమంతటినీ నేను నాశనం చేసే సమయమాసన్నమవుతూ ఉంది. అప్పుడు నీ కుటుంబంలో పెరిగి పెద్దవారై ముసలితనాన్ని చూచువాడు ఒక్కడూ ఉండడు. ఇశ్రాయేలు ప్రజలకు మంచి జరుగుతూ ఉండగా, నీ ఇంటి వద్ద మాత్రం కీడు జరుగుతూ ఉంటుంది. నీ కుటుంబంలో మాత్రం ముసలి వాడొకడును ఉండడు. ఒక్కడిని మాత్రం నా బలి పీఠం వద్ద యాజకునిగా సేవచేయటానికి రక్షిస్తాను. కాని, అతడు మాత్రం యాజకునిగా తన కళ్లు మందగించి, బలం ఉడిగి పోయేంత వరకు జీవిస్తాడు. నీ సంతానం వారంతా కత్తివేటుకు బలైపోతారు. నేను చెప్పినవన్నీ నిజమవబోతున్నట్లుగా నీకు ఒక నిదర్శనం ఇస్తున్నాను. నీ ఇరువురు కుమారులైన హొఫ్నీ మరియు ఫీనెహాసు ఒకే రోజు మరణిస్తారు. నాకై నేనే ఒక నమ్మకమైన యాజకుని ఎంచుకుంటాను. ఈ యాజకుడు నేను చెప్పినట్లు విని, నా మాట ప్రకారం చేస్తాడు. ఈ యాజకుని వంశాన్ని నేను స్థిరపరుస్తాను. నేను అభిషిక్తునిగా చేసిన రాజు ఎదుట ఇతడు నా సేవ చేస్తాడు. నీ వంశంలో మిగిలిన వాళ్లంతా ఈ యాజకుని ఎదుట వంగి కొంచెం రొట్టె కోసం లేక కొద్దిగా డబ్బుకోసం దీనంగా ఆశిస్తారు. “మాకు భోజనానికి ఆహారం ఉండేలా మాకు యాజకులుగా ఉద్యోగం ఇప్పించమని అడుగుతారు.”’”

షేర్ చేయి
Read 1 సమూయేలు 2

1 సమూయేలు 2:1-36 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

హన్నా ప్రార్థనచేసి ఇలా అన్నది: “నా హృదయం యెహోవాలో సంతోషిస్తుంది; యెహోవాను బట్టి నా కొమ్ము పైకెత్తబడింది. నా శత్రువులపై నా నోరు గొప్పలు పలుకుతుంది, మీ విడుదలలో నాకు ఆనందము. “యెహోవా లాంటి పరిశుద్ధుడు ఒక్కడూ లేడు; మీరు తప్ప మరి ఎవరు లేరు; మన దేవునిలాంటి ఆశ్రయదుర్గం లేదు. “అంత గర్వంగా మాట్లాడకండి మీ నోటిని గర్వంగా మాట్లాడనివ్వకండి, ఎందుకంటే యెహోవా అన్నీ తెలిసిన దేవుడు ఆయన మీ క్రియలను పరిశీలిస్తారు. “శూరుల విల్లులు విరిగిపోయాయి, కాని తడబడినవారు బలాన్ని పొందుకున్నారు. తృప్తిగా భోజనం చేసినవారు ఆహారం కోసం కూలికి వెళ్తారు, కాని ఆకలితో ఉన్నవారు ఇక ఆకలితో ఉండరు. గొడ్రాలిగా ఉన్న స్త్రీ ఏడుగురు పిల్లలను కన్నది, కాని అనేకమంది పిల్లలను కన్న స్త్రీ కృశించిపోతుంది. “మరణాన్ని జీవాన్ని ఇచ్చేది యెహోవాయే; పాతాళం క్రిందకు దింపేది పైకి లేవనెత్తేది ఆయనే. పేదరికాన్ని ఐశ్వర్యాన్ని కలుగజేసేది యెహోవాయే; తగ్గించేది హెచ్చించేది ఆయనే. దరిద్రులను మట్టిలో నుండి పైకెత్తేది పేదవారిని బూడిద కుప్ప నుండి లేవనెత్తేది ఆయనే; వారిని అధికారులతో కూర్చునేలా చేసేది ఘనత కలిగిన సింహాసనాన్ని స్వతంత్రింపజేసేది ఆయనే. “భూమి పునాదులు యెహోవాకు చెందినవి; ఆయన వాటి మీద లోకాన్ని నిలిపారు. ఆయన తన నమ్మకమైన సేవకుల పాదాలను కాపాడతారు, అయితే దుర్మార్గులు చీకటిలో మౌనులుగా చేయబడతారు. “బలం వలన ఎవరూ గెలవలేరు; యెహోవాను వ్యతిరేకించేవారు నాశనమవుతారు. పరలోకం నుండి మహోన్నతుడు ఉరుములా గర్జిస్తారు; భూదిగంతాలకు యెహోవా తీర్పు తీరుస్తారు. “ఆయన తన రాజుకు బలాన్నిస్తారు తాను అభిషేకించిన వాని కొమ్మును హెచ్చిస్తారు.” తర్వాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్లిపోయాడు, కాని ఆ బాలుడు యాజకుడైన ఏలీ సమక్షంలో యెహోవాకు పరిచర్య చేస్తూ ఉండిపోయాడు. ఏలీ కుమారులు చాలా దుర్మార్గులు; వారికి యెహోవా అంటే గౌరవం లేదు. ప్రజల విషయంలో యాజకులు చేస్తూ వచ్చిన పని ఏంటంటే, ఎవరైనా బలి అర్పిస్తే, దాని మాంసం ఉడుకుతుండగా యాజకుని సేవకులు మూడు ముళ్ళ కొంకి గరిటెను తీసుకువచ్చి, పెనంలో గాని కడాయిలోగాని పాత్రలోగాని కుండలోగాని దానిని గుచ్చినప్పుడు ఆ కొంకితో పాటు బయటకు వచ్చిన మాంసమంతా యాజకుడు తన కోసం తీసుకుంటాడు. షిలోహుకు వచ్చే ఇశ్రాయేలీయులందరికి వీరు ఇలాగే చేస్తూ వచ్చారు. అయితే క్రొవ్వును దహించకముందే యాజకుని సేవకుడు వచ్చి బలి అర్పించిన వారితో, “యాజకునికి కాల్చడానికి కొంత మాంసం ఇవ్వు; ఉడకబెట్టిన మాంసం అతడు తీసుకోడు పచ్చి మాంసమే కావాలి” అని చెప్పేవాడు. అయితే వారు అతనితో, “మొదట క్రొవ్వును దహించనివ్వండి, తర్వాత మీ ఇష్టం వచ్చినంత తీసుకోవచ్చు” అని చెప్తే ఆ సేవకుడు, “అలా కుదరదు, ఇప్పుడే ఇవ్వాలి; నీవు ఇవ్వకపోతే నేనే బలవంతంగా తీసుకుంటాను” అని అనేవాడు. ఆ యువకుల ఈ పాపం యెహోవా దృష్టిలో చాలా ఘోరమైనది, ఎందుకంటే వారిని బట్టి ప్రజలు యెహోవాకు అర్పణ అర్పించడానికి అసహ్యించుకున్నారు. అయితే బాలుడైన సమూయేలు నారతో చేసిన ఏఫోదు ధరించుకొని యెహోవా ఎదుట పరిచర్య చేస్తున్నాడు. ప్రతి సంవత్సరం అతని తల్లి తన భర్తతో కలిసి వార్షిక బలి అర్పించడానికి వెళ్లినప్పుడు అతనికి ఒక చిన్న వస్త్రాన్ని తయారుచేసి తీసుకెళ్లేది. అప్పుడు ఏలీ, ఎల్కానాను, అతని భార్యను, “ఈ స్త్రీ యెహోవాకు ప్రతిష్ఠించిన బిడ్డ స్థానంలో యెహోవా ఈమె ద్వారా మీకు పిల్లలను ప్రసాదించుగాక” అని అంటూ దీవించాడు. యెహోవా హన్నా మీద దయ చూపించాడు; ఆమె ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలను కన్నది. అదే సమయంలో, బాలుడైన సమూయేలు యెహోవా సన్నిధిలో ఉండి ఎదిగాడు. ఇక చాలా ముసలివాడై ఏలీ, ఇశ్రాయేలీయులందరి పట్ల తన కుమారులు చేస్తున్న వాటి గురించి, వారు సమావేశ గుడారపు ద్వారం దగ్గరకు సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో వ్యభిచరిస్తున్నారనే విషయాన్ని గురించి విన్నాడు. కాబట్టి అతడు వారితో, “మీరు ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు? మీరు చేసిన ఈ దుష్టమైన పనుల గురించి ప్రజలందరి నోటి నుండి నేను విన్నాను. నా కుమారులారా, ఇలా చేయవద్దు. నేను విన్న ఈ విషయం యెహోవా ప్రజల మధ్యలో వ్యాపించడం మంచిది కాదు. ఒక వ్యక్తి మరో వ్యక్తికి వ్యతిరేకంగా పాపం చేస్తే, దేవుడు ఆ అపరాధికి మధ్యవర్తిత్వం చేయవచ్చు; గాని ఎవరైనా యెహోవాకే వ్యతిరేకంగా పాపం చేస్తే వారి కోసం ఎవరు విజ్ఞాపన చేస్తారు?” అన్నాడు. అయితే వారిని చంపడం యెహోవా చిత్తం, కాబట్టి వారు తమ తండ్రి గద్దింపు వినలేదు. మరోవైపు బాలుడైన సమూయేలు యెహోవా దయలో మనుష్యుల దయలో ఎదుగుతూ ఉన్నాడు. తర్వాత ఒక దైవజనుడు ఏలీ దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, “యెహోవా చెప్పే మాట ఇదే: ‘నీ పూర్వికుల కుటుంబం ఈజిప్టులో ఫరో క్రింద ఉన్నప్పుడు నన్ను నేను వారికి బయలుపరచుకోలేదా? అతడు నా సన్నిధిలో నాకు యాజకునిగా ఉండి ఏఫోదు ధరించి, నా బలిపీఠం దగ్గరకు వెళ్లి ధూపం వేయడానికి ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటిలో నుండి నేను నీ పూర్వికున్ని ఏర్పరచుకున్నాను. ఇశ్రాయేలీయులు అర్పించిన హోమబలులన్నిటిని నీ పూర్వికుని కుటుంబానికి ఇచ్చాను. నా నివాసం కోసం నేను నిర్దేశించిన నా బలిని, అర్పణను ఎందుకు తృణీకరిస్తున్నారు? నా ప్రజలైన ఇశ్రాయేలీయులు అర్పించే ప్రతి అర్పణలో శ్రేష్ఠమైన భాగాలతో క్రొవ్వెక్కేలా చేసుకుని ఎందుకు నీవు నా కంటే నీ కుమారులను ఎక్కువగా గౌరవిస్తున్నావు?’ “కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా, ‘నీ కుటుంబం, నీ పితరుల కుటుంబం నా సన్నిధిలో నిత్యం సేవ చేస్తారని నేను వాగ్దానం చేశాను’ అని చెప్పారు కాని ఇప్పుడు యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు: ‘అది నా నుండి దూరమవును గాక! నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించేవారు తృణీకరించబడతారు. వృద్ధాప్యం వచ్చేవరకు ఎవరూ దానిలో ఉండకుండ నేను నీ బలాన్ని నీ యాజక కుటుంబ బలాన్ని తగ్గించే సమయం రాబోతుంది, నా నివాసంలో అపాయం రావడం నీవు చూస్తావు. ఇశ్రాయేలుకు మేలు జరిగినప్పటికీ, మీ కుటుంబంలో ఎవరూ వృద్ధాప్యానికి చేరుకోరు. నా బలిపీఠం దగ్గర ఎవరూ సేవ చేయకుండా నేను నాశనం చేసే నీ వారి వలన నీ కళ్ళు మసకబారతాయి, నీ బలం క్షీణించిపోతుంది. నీ సంతానమంతా యవ్వన వయస్సులో ఉండగానే చస్తారు. “ ‘మీ ఇద్దరు కుమారులు హొఫ్నీ ఫీనెహాసులకు ఏమి జరుగుతుందో తెలియడానికి ఒక సూచనగా వారిద్దరు ఒకేరోజున చనిపోతారు. తర్వాత నా హృదయంలో, మనస్సులో ఉన్నదాని ప్రకారం చేసే నమ్మకమైన యాజకుడిని నా కోసం నేను లేవనెత్తుతాను. నేను అతని యాజక కుటుంబాన్ని స్థిరపరుస్తాను, వారు ఎల్లప్పుడూ నా అభిషిక్తుని ఎదుట సేవ చేస్తారు. అప్పుడు మీ కుటుంబంలో మిగిలిన ప్రతి ఒక్కరూ వచ్చి ఒక వెండి ముక్క కోసం రొట్టె కోసం అతని ముందు నమస్కరించి, “నాకు తినడానికి ఆహారం లేక కష్టంగా ఉంది, నన్ను ఏదైనా యాజక సేవలో నియమించండి” ’ అని వేడుకుంటారు.”

షేర్ చేయి
Read 1 సమూయేలు 2

1 సమూయేలు 2:1-36

1 సమూయేలు 2:1-36 TELUBSI1 సమూయేలు 2:1-36 TELUBSI1 సమూయేలు 2:1-36 TELUBSI1 సమూయేలు 2:1-36 TELUBSI1 సమూయేలు 2:1-36 TELUBSI