1 సమూయేలు 16:6-12
1 సమూయేలు 16:6-12 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూసి “నిజంగా యెహోవా అభిషేకించేవాడు ఆయన ఎదురుగా నిలబడి ఉన్నాడు” అని అనుకున్నాడు. అయితే యెహోవా సమూయేలుతో ఇలా అన్నాడు. “అతడి అందాన్నీ ఎత్తునూ చూడవద్దు. మనుషులు లక్ష్యపెట్టే వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతణ్ణి నిరాకరించాను. మనుషులు పైరూపాన్ని చూస్తారు గానీ యెహోవా అయితే హృదయాన్ని చూస్తాడు.” యెష్షయి అబీనాదాబును పిలిచి అతణ్ణి సమూయేలు ముందు నిలబెట్టగా, అతడు “యెహోవా ఇతణ్ణి ఎన్నుకోలేదు” అన్నాడు. అప్పుడు యెష్షయి షమ్మాను పిలిచి నిలబెట్టినప్పుడు సమూయేలు “యెహోవా ఇతణ్ణి ఎన్నుకోలేదు” అన్నాడు. యెష్షయి తన ఏడుగురు కొడుకులనూ సమూయేలు ముందుకి రప్పించాడు. సమూయేలు “యెహోవా వీరిలో ఎవరినీ ఎన్నుకోలేదు” అని చెప్పి, “నీ కొడుకులందరూ ఇక్కడే ఉన్నారా?” అని యెష్షయిని అడిగాడు. అతడు “ఇంకా చివరివాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను మేపడానికి వెళ్ళాడు” అని చెప్పాడు. అందుకు సమూయేలు “నువ్వు అతనికి కబురు పంపి ఇక్కడికి రప్పించు. అతడు వచ్చేదాకా మనం కూర్చోలేం కదా” అని యెష్షయితో చెప్పాడు. యెష్షయి అతణ్ణి పిలిపించి లోపలికి తీసుకువచ్చాడు. అతడు రూపంలో ఎర్రని వాడు, చక్కని కళ్ళు కలిగి చూపులకు అందమైనవాడు. అతడు రాగానే “నేను కోరుకొన్నది ఇతడే, నీవు లేచి అతణ్ణి అభిషేకించు” అని యెహోవా చెప్పగానే
1 సమూయేలు 16:6-12 పవిత్ర బైబిల్ (TERV)
యెష్షయి, అతని కుమారులు వచ్చినపుడు సమూయేలు ఏలీయాబును చూసాడు. “నిజంగా యెహోవా ఎంపిక చేసిన మనిషి ఇతడే” అని సమూయేలు తలంచాడు. అయితే యెహోవా, “ఏలీయాబు ఎంతో అందంగా ఎత్తుగా ఉన్నాడు. కానీ ఆ విషయాలు లక్ష్యపెట్టకు. మనుష్యులు చూసే విషయాలను కాదు దేవుడు చూసేదు. ప్రజలు బాహ్య సౌందర్యం చూస్తారు కానీ యెహోవా హృదయం చూస్తాడు. ఏలీయాబు తగిన వాడు కాడు” అని తెలియజేసాడు. అప్పుడు యెష్షయి తన కుమారుడైన అబీనాదాబును పిలిచాడు. అబీనాదాబు సమూయేలు ఎదుటనడిచాడు. కానీ సమూయేలు, “లేదు యెహోవా ఎంపిక చేసినవాడు ఇతడు కాదు” అన్నాడు. తరువాత షమ్మాను సమూయేలు ఎదుట నడువుమని యెష్షయి చెప్పాడు. కానీ సమూయేలు, “లేదు, ఇతనినికూడ యెహోవా ఎంపిక చేయలేదు” అన్నాడు. తన కుమారులు ఏడుగురిని యెష్షయి సమూయేలుకు చూపించాడు. కానీ, “వీరిలో ఎవ్వరినీ యెహోవా ఎంపిక చేయలేదని” సమూయేలు యెష్షయితో చెప్పాడు. అప్పుడు, “నీ కుమారులంతా వీరేనా?” అని సమూయేలు యెష్షయిని అడిగాడు. “అందరికంటె చిన్నవాడు ఇంకొకడు ఉన్నాడు. కానీ వాడు గొర్రెలను మేపుతున్నాడు” అని యెష్షయి జవాబిచ్చాడు. సమూయేలు, “అతనికి కబురు చేయి. అతన్ని ఇక్కడకు తీసుకునిరా. అతడొచ్చేవరకూ మనం భోజనానికి కూర్చోము” అని చెప్పాడు. యెష్షయి తన చిన్న కుమారుని తీసుకుని వచ్చేందుకు ఒకరిని పంపించాడు. ఈ కుమారుడు ఎర్రని తల వెంట్రుకలతో చక్కగా కనబడేవాడు. అతడు ఎర్రటివాడు మరియు చాలా అందగాడు. “లేచి అతనిని అభిషేకించు. అతడే సుమా!” అని యెహోవా సమూయేలుతో చెప్పాడు.
1 సమూయేలు 16:6-12 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి–నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన యెదుట నిలిచియున్నాడని అనుకొనెను అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను–అతని రూపమును అతని యెత్తును లక్ష్యపెట్టకుము, మనుష్యులు లక్ష్యపెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు; నేను అతని త్రోసివేసి యున్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురుగాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. యెష్షయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతని రప్పింపగా అతడు–యెహోవా ఇతని కోరుకొన లేదనెను. అప్పుడు యెష్షయి షమ్మాను పిలువగా అతడు –యెహోవా ఇతనిని కోరుకొనలేదనెను. యెష్షయి తన యేడుగురు కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు–యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి నీ కుమారులందరు ఇక్కడనున్నారా అని యెష్షయిని అడుగగా అతడు–ఇంకను కడసారివాడున్నాడు. అయితే వాడు గొఱ్ఱెలను కాయుచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు–నీవు వాని పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చువరకు మనము కూర్చుందమని యెష్షయితో చెప్పగా అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొనివచ్చెను. అతడు ఎఱ్ఱనివాడును చక్కని నేత్రములుగలవాడును చూచుటకు సుందరమైనవాడునై యుండెను. అతడు రాగానే–నేను కోరుకొన్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవియ్యగా
1 సమూయేలు 16:6-12 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
వారు వచ్చినప్పుడు సమూయేలు ఏలీయాబును చూసి, “ఖచ్చితంగా యెహోవా అభిషేకించినవాడు యెహోవా ఎదుట నిలబడ్డాడు” అనుకున్నాడు. అయితే యెహోవా సమూయేలుతో, “అతని రూపాన్ని ఎత్తును చూసి అలా అనుకోవద్దు, నేను అతన్ని తిరస్కరించాను. మనుష్యులు చూసే వాటిని యెహోవా చూడరు. మనుష్యులు పైరూపాన్ని చూస్తారు కాని యెహోవా హదృయాన్ని చూస్తారు” అన్నారు. యెష్షయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుట నిలబెట్టాడు కాని సమూయేలు, “యెహోవా ఇతన్ని ఎంచుకోలేదు” అన్నాడు. అప్పుడు యెష్షయి షమ్మాను పిలిచాడు కాని సమూయేలు, “ఇతన్ని కూడా యెహోవా ఎంచుకోలేదు” అన్నాడు. అలా యెష్షయి తన ఏడుగురు కుమారులను సమూయేలు ఎదుట నిలబెట్టాడు కాని సమూయేలు, “యెహోవా వీరెవరిని ఎంచుకోలేదు” అని చెప్పి, నీ కుమారులంతా వీరేనా? అని యెష్షయిని అడిగాడు. అందుకు యెష్షయి, ఇంకా చివరివాడున్నాడు. అయితే వాడు గొర్రెలు కాస్తున్నాడని చెప్పాడు. అందుకు సమూయేలు, “అతన్ని పిలిపించు; అతడు వచ్చేవరకు మనం భోజనం చేయము” అన్నాడు. కాబట్టి యెష్షయి అతన్ని పిలిపించి లోపలికి తీసుకువచ్చాడు. అతడు ఎర్రగా అందమైన కళ్లతో మంచి రూపంతో ఉన్నాడు. అప్పుడు యెహోవా, “నేను ఎన్నుకున్నది ఇతన్నే, నీవు లేచి అతన్ని అభిషేకించు” అన్నారు.