1 సమూయేలు 16:18-21
1 సమూయేలు 16:18-21 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వారిలో ఒకడు “బేత్లెహేము వాడైన యెష్షయి కొడుకుల్లో ఒకణ్ణి చూశాను, అతడు చక్కగా వాయించగలడు, అతడు ధైర్యవంతుడు, యుద్ధవీరుడు, మాటకారి, అందగాడు. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు కూడా” అని చెప్పాడు. సౌలు యెష్షయి దగ్గరకి తన సేవకులను పంపి “గొర్రెలు కాస్తున్న నీ కొడుకు దావీదును నా దగ్గరకి పంపించు” అని కబురు చేశాడు. అప్పుడు యెష్షయి ఒక గాడిదపై రొట్టెలు, ద్రాక్షారసపు తిత్తి, ఒక మేకపిల్లను ఉంచి దావీదు ద్వారా సౌలుకు పంపించాడు. దావీదు సౌలు దగ్గరకి వచ్చి అతని ముందు నిలబడినపుడు అతడు సౌలుకు బాగా నచ్చాడు. అతణ్ణి సౌలు ఆయుధాలు మోసే పనిలో పెట్టారు.
1 సమూయేలు 16:18-21 పవిత్ర బైబిల్ (TERV)
అప్పుడు నౌకర్లలో ఒకడు, “బేత్లెహేములో యెష్షయి అని ఒక మనిషి ఉన్నాడు. యెష్షయి కొడుకును నేను చూసాను. సితార వాయించటం అతనికివచ్చు. అతడు ధైర్యవంతుడు. బాగా పోరాడగలవాడు. కూడా. అతడు చాతుర్యంగలవాడు. అతడు అందగాడు యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు” అని చెప్పాడు. కనుక సౌలు కొందరు మనుష్యులను యెష్షయి దగ్గరకు పంపించాడు. “నీకు దావీదు అనే కొడుకు ఉన్నాడు. అతడు గొర్రెలను కాస్తున్నాడు. అతనిని నా దగ్గరకు పంపించు” అని సౌలు చెప్పినదానిని వారు యెష్షయికి చెప్పారు. కనుక యెష్షయి సౌలుకు కానుకలుగా కొన్ని వస్తువులు సిద్ధం చేసాడు. ఒక గాడిదను, కొంత రొట్టె, ఒక ద్రాక్షారసపు తిత్తి, ఒక మెక పిల్లను యెష్షయి సిద్ధం చేసాడు. యెష్షయి వాటిని దావీదుకు ఇచ్చి అతనిని సౌలు వద్దకు పంపించాడు. కనుక దావీదు సౌలు దగ్గరకు వెళ్లి అతని ఎదుట నిలిచాడు. సౌలు దావీదును చాలా ప్రేమించాడు. దావీదు సౌలుకు ఆయుధాలు మోసే సహాయకుడయ్యాడు.
1 సమూయేలు 16:18-21 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
–చిత్తగించుము, బేత్లెహేమీయుడైన యెష్షయియొక్క కుమారులలో ఒకని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహు శూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసియునై యున్నాడు, మరియు యెహోవా వానికి తోడుగా నున్నాడనగా సౌలు–యెష్షయియొద్దకు దూతలను పంపి, గొఱ్ఱెలయొద్దనున్న నీ కుమారుడైన దావీదును నాయొద్దకు పంపుమనెను. అప్పుడు యెష్షయి ఒక గార్దభముమీద రొట్టెలను ద్రాక్షారసపు తిత్తిని ఒక మేకపిల్లను వేయించి తన కుమారుడైన దావీదుచేత సౌలునొద్దకు పంపెను. దావీదు సౌలు దగ్గరకువచ్చి అతనియెదుట నిలువబడగా అతనియందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను, అతడు సౌలు ఆయుధములను మోయువాడాయెను.
1 సమూయేలు 16:18-21 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అప్పుడు సౌలు సేవకులలో ఒకడు, “బేత్లెహేమీయుడైన యెష్షయి కుమారులలో ఒకనిని చూశాను. అతడు వీణ వాయిస్తాడు. అతడు ధైర్యవంతుడు యుద్ధవీరుడు వివేకం గలవాడు, అందగాడు. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు” అని చెప్పాడు. సౌలు యెష్షయి దగ్గరకు దూతలను పంపి, “గొర్రెల దగ్గర ఉన్న నీ కుమారుడైన దావీదును నా దగ్గరకు పంపు” అని కబురు పంపాడు. అప్పుడు యెష్షయి ఒక గాడిద మీద రొట్టెలు ద్రాక్షరసపు తిత్తిని ఒక మేకపిల్లను ఉంచి వాటిని తన కుమారుడైన దావీదుతో పాటు సౌలు దగ్గరకు పంపించాడు. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలబడగా సౌలు అతన్ని చాలా ఇష్టపడ్డాడు. దావీదు సౌలు ఆయుధాలను మోసేవారిలో ఒకనిగా నియమించబడ్డాడు.