1 సమూయేలు 15:22-35

1 సమూయేలు 15:22-35 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

అందుకు సమూయేలు–తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుటవలన యెహోవా సంతోషించునట్లు, ఒకడు దహనబలులను బలులను అర్పించుటవలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుటకంటె మాట వినుటయు శ్రేష్ఠము. తిరుగుబాటు చేయుట సోదెచెప్పుటయను పాపముతో సమానము; మూర్ఖతను అగపరచుట మాయావిగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జింతివి గనుక నీవు రాజుగా ఉండకుండ ఆయన నిన్ను విసర్జించెననగా సౌలు–జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మ్రొక్కునట్లు నాతోకూడ తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. అందుకు సమూయేలు–నీతోకూడ నేను తిరిగి రాను; నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రాయేలీయులమీద రాజుగా ఉండకుండ యెహోవా నిన్ను విసర్జించెనని చెప్పి వెళ్లిపోవలెనని తిరుగగా, సౌలు అతని దుప్పటిచెంగు పట్టుకొనినందున అది చినిగెను. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను–నేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతిలోనుండి లాగివేసి నీకంటె ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించియున్నాడు. మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైనవాడు నరుడుకాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాప పడడు. అందుకు సౌలు–నేను పాపము చేసితిని, అయినను నా జనుల పెద్దలయెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నన్ను ఘనపరచిన యెహోవాకు మ్రొక్కుటకై నేను పోగా నాతోకూడ తిరిగి రమ్మని అతనిని వేడుకొనినందున సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్లెను. సౌలు యెహోవాకు మ్రొక్కిన తరువాత సమూయేలు–అమాలేకీయులరాజైన అగగును నా దగ్గరకు తీసికొనిరండనిచెప్పెను. అగగు సంతోషముగా అతని దగ్గరకు వచ్చి–మరణశ్రమ నాకు గడచిపోయెనే అని చెప్పగా సమూయేలు–నీ కత్తి స్త్రీలకు సంతులేకుండ చేసినట్లు నీ తల్లికిని స్త్రీలలో సంతులేకపోవునని అతనితో చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిని అగగును తుత్తునియలుగా నరికెను. అప్పుడు సమూయేలు రామాకు వెళ్లిపోయెను, సౌలును సౌలు గిబియాలోని తన యింటికి వెళ్లెను. సౌలు బ్రదికిన దినములన్నిటను సమూయేలు అతని దర్శింప వెళ్లలేదుగాని సౌలునుగూర్చి దుఃఖాక్రాంతు డాయెను. మరియు తాను సౌలును ఇశ్రాయేలీయులమీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాప పడెను.

షేర్ చేయి
Read 1 సమూయేలు 15

1 సమూయేలు 15:22-35 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అందుకు సమూయేలు “ఒకడు తాను చెప్పిన మాటకు లోబడితే యెహోవా సంతోషించేటంతగా, దహనబలులు, హోమాలు అర్పిస్తే సంతోషిస్తాడా? ఆలోచించు, బలులు అర్పించడం కంటే లోబడడం, పొట్టేళ్ల కొవ్వు అర్పించడం కంటే మాట వినడం శ్రేష్ఠం. తిరుగుబాటు చేయడం అనేది శకునం చెప్పడం అనే పాపంతో సమానం. మూర్ఖంగా ప్రవర్తించడం విగ్రహ పూజ అనే పాపంతో సమానం. యెహోవా ఆజ్ఞను నువ్వు తిరస్కరించావు కాబట్టి నువ్వు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను తిరస్కరించాడు” అన్నాడు. అప్పుడు సౌలు “ప్రజలకు భయపడి వారి మాట వినడంవల్ల నేను యెహోవా ఆజ్ఞను, నీ మాటలను మీరి పాపం కొనితెచ్చుకొన్నాను. నువ్వు నా పాపాన్ని తీసివేసి నేను యెహోవాకు మొక్కుకొనేలా నాతో కలసి రా” అని సమూయేలును వేడుకున్నాడు. అయితే సమూయేలు “నీతోబాటు నేను వెనక్కి రాను. నీవు యెహోవాను తిరస్కరించావు కాబట్టి ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండాా యెహోవా నిన్ను తిరస్కరించాడు” అని చెప్పి వెళ్లిపోవాలని వెనక్కి తిరిగాడు. అప్పుడు సౌలు అతని దుప్పటి చెంగును పట్టుకొనగా అది చిరిగింది. అప్పుడు సమూయేలు అతనితో ఇలా చెప్పాడు “ఈ రోజే యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యాన్ని నీ చేతిలో నుండి తీసివేసి నీ సాటి వారిలో ఉత్తముడైన వేరొకరికి దాన్ని అప్పగించాడు. ఇశ్రాయేలీయులకు మహిమగా ఉన్న దేవుడు అబద్ధమాడడు, మనస్సు మార్చుకోడు.” సౌలు “నేను పాపం చేశాను. అయినప్పటికీ నా ప్రజల పెద్దల ముందు, ఇశ్రాయేలీయుల ముందు నన్ను గౌరవించు. యెహోవాకు మొక్కడానికి నేను వెళ్తుండగా నాతో కూడ కలసి రమ్మని” అతని బతిమాలినప్పుడు సమూయేలు సౌలు వెంట వెళ్ళాడు. సౌలు యెహోవాకు మొక్కిన తరువాత సమూయేలు “అమాలేకీయుల రాజు అగగును నా దగ్గరికి తీసుకు రండి” అన్నాడు. అగగు ఆనందంగా అతని దగ్గరకి వచ్చి “నాకు మరణ శిక్ష తప్పిపోయిందా” అన్నాడు. సమూయేలు “నీ కత్తి స్త్రీలకు సంతానం లేకుండా చేసినట్టు నీ తల్లికి కూడా స్త్రీలలో సంతానం లేకుండా పోతుంది” అని చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధానంలో అగగును ముక్కలుగా నరికివేశాడు. తరువాత సమూయేలు రమాకు, సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయారు. సౌలు బతికినంత కాలం సమూయేలు అతణ్ణి చూసేందుకు వెళ్లలేదు గానీ సౌలును గూర్చి దుఃఖిస్తూ వచ్చాడు. తాను సౌలును ఇశ్రాయేలీయులపై రాజుగా నియమించినందుకు యెహోవా పశ్చాత్తాపం చెందాడు.

షేర్ చేయి
Read 1 సమూయేలు 15

1 సమూయేలు 15:22-35 పవిత్ర బైబిల్ (TERV)

కానీ సమూయేలు, “యెహోవాకు ఎక్కువ ప్రీతి పాత్రమైనది ఏమిటి? దహనబలులు, బలులా? లేక యెహోవా ఆజ్ఞాపాలనయా? దేవునికి బలులు అర్పించటంకంటే, ఆయనకు విధేయుడై ఉండటం శ్రేష్ఠము. పొట్టేళ్ల కొవ్వును అర్పించేకంటే, దేవుని వాక్కు వినటం శ్రేష్ఠము. అవిధేయుడవై ఉండట మంటే మంత్రం వేసే పాపం లాంటిదే. మొండి వైఖరితో నీకు తోచినదే చేయటం విగ్రహారాధనవంటి పాపమే. నీవు యెహోవా ఆజ్ఞను ధిక్కరించావు. ఈ కారణంగా ఇప్పుడు యెహోవా నిన్ను రాజుగా తిరస్కరిస్తున్నాడు.” అప్పుడు సౌలు, “నేను పాపం చేశాను. నేను యెహోవా ఆజ్ఞలకు లోబడలేదు. నీవు చెప్పినట్లుగా నేను చేయలేదు. నేను ప్రజలకు భయపడ్డాను. వారు ఎలా చెప్పితే అలా చేశాను. నా పాపం క్షమించుమని ఇప్పుడు నేను నిన్ను వేడుకుంటున్నాను. నేను యెహోవాని ఆరాధిస్తాను, నాతో కూడ రా” అని సమూయేలుతో చెప్పాడు. కానీ సమూయేలు, “నేను నీతో మళ్లీ వెనుకకురాను. నీవు యెహోవా ఆజ్ఞ తిరస్కరించావు. ఇప్పుడు యెహోవా నిన్ను ఇశ్రాయేలు రాజుగా తిరస్కరిస్తున్నాడు” అని చెప్పాడు. సమూయేలు వెళ్లిపోవటానికి తిరగగానే, సౌలు అతని అంగీ పట్టుకున్నాడు. అంగీ చిరిగిపోయింది. సమూయేలు, “నీవు నా అంగీ చింపేసావు. అదే విధంగా ఈవేళ యెహోవా ఇశ్రాయేలు రాజ్యాన్ని నీనుంచి తీసేస్తాడు. నీ స్నేహితుల్లో ఒకరికి ఈ రాజ్యాన్ని యెహోవా ఇచ్చాడు. ఇతడు నీకంటే మంచివాడు. యెహోవా ఇశ్రాయేలీయుల దేవుడు. యెహోవా శాశ్వతంగా జీవిస్తాడు. యెహోవా అబద్ధం చెప్పడు. తన మనస్సు మార్చుకోడు. అనుక్షణం మనస్సుమార్చుకునే మనిషిలాంటివాడు కాదు యెహోవా” అని సౌలుతో చెప్పాడు. సౌలు సమాధానమిస్తూ, “సరే నేను పాపం చేశాను. కాని దయచేసి నాతోకూడ రా. కనీసం నాయకుల ఎదుట, ఇశ్రాయేలు ప్రజల ఎదుట నాకు కొంచెం మర్యాద చూపించు. దేవుడైన యెహోవాను నేను ఆరాధించటానికి నాతోకూడ తిరిగి రా” అన్నాడు. కనుక సమూయేలు సౌలుతో కలిసి వెనుకకు వెళ్లాడు. సౌలు యెహోవాను ఆరాధించాడు. “అమాలేకీయుల రాజైన అగగును తన వద్దకు తీసుకుని రమ్మని” సమూయేలు చెప్పాడు. అగగుసంకెళ్లతో బంధించబడి సమూయేలు ముందుకు వచ్చాడు. “నిశ్చయంగా ఇతడు నన్ను చంపడు” అని అగగు అనుకున్నాడు. కాని సమూయేలు అగగుతో, “నీ కత్తివేటుకు గురిచేసి అనేకమంది పిల్లలను తమ తల్లులకు లేకుండా చేసావు. కనుక ఇప్పుడు నీ తల్లికి పిల్లలు ఉండరు,” అంటూ గిల్గాలులో యెహోవా ఎదుట సమూయేలు అగగును ముక్కలుగా నరికి వేశాడు. అప్పుడు సమూయేలు రామాకు వెళ్లిపోయాడు. సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తరువాత సమూయేలు తన జీవితాంతం సౌలును మళ్లీ ఎన్నడూ చూడలేదు. కాని సౌలు విషయంలో సమూయేలు చాలా దుఃఖించాడు. సౌలును ఇశ్రాయేలుకు రాజుగా చేసినందుకు యెహోవా చాలా చింతించాడు.

షేర్ చేయి
Read 1 సమూయేలు 15

1 సమూయేలు 15:22-35 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

అందుకు సమూయేలు ఇలా అన్నాడు: “ఒకడు తన మాటకు లోబడితే యెహోవా సంతోషించినంతగా, దహనబలులు బలులు అర్పిస్తే ఆయన సంతోషిస్తారా? ఆలోచించు, బలులు అర్పించడం కంటే లోబడడం పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే మాట వినడం ఎంతో మంచిది తిరుగుబాటు చేయడం భవిష్యవాణి చెప్పడమనే పాపంతో సమానం అహంకారం విగ్రహారాధనలోని చెడుతనంతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు తిరస్కరించావు కాబట్టి ఆయన నిన్ను రాజుగా తిరస్కరించారు.” అప్పుడు సౌలు సమూయేలుతో, “నేను పాపం చేశాను. నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను పాటించలేదు. ప్రజలకు భయపడి వారి మాట విన్నాను. కాబట్టి నీవు నా పాపాన్ని క్షమించి నేను యెహోవాకు పూజించేలా నాతో కూడా తిరిగి రమ్మని వేడుకుంటున్నాను” అన్నాడు. అందుకు సమూయేలు అతనితో, “నీతో కూడ నేను తిరిగి రాను. నీవు యెహోవా మాటను తిరస్కరించావు కాబట్టి ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండ యెహోవా నిన్ను తిరస్కరించారు” అని చెప్పాడు. సమూయేలు వెళ్లిపోవాలని వెనుకకు తిరిగినప్పుడు సౌలు అతని వస్త్రపు అంచు పట్టుకోవడంతో అది చినిగింది. అప్పుడు సమూయేలు అతనితో, “ఈ రోజు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యాన్ని చింపి నీ చేతిలో నుండి తీసివేసి నీ కంటే మంచివాడైన నీ పొరుగువానికి దానిని అప్పగించారు. ఇశ్రాయేలీయులకు మహిమగా ఉన్నవాడు అబద్ధమాడడు మనస్సు మార్చుకోడు; మనస్సు మార్చుకోడానికి ఆయన నరుడు కాడు.” అందుకు సౌలు, “నేను పాపం చేశాను. అయినప్పటికీ దయచేసి నా ప్రజల పెద్దల ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట నన్ను గౌరవించు; మీ దేవుడైన యెహోవాను నేను ఆరాధించడానికి నాతో తిరిగి రా” అని అడిగాడు. కాబట్టి సమూయేలు సౌలుతో వెళ్లాడు, సౌలు యెహోవాను ఆరాధించాడు. అప్పుడు సమూయేలు, “అమాలేకీయుల రాజైన అగగును నా దగ్గరకు తీసుకురండి” అని చెప్పాడు. సంకెళ్ళతో ఉన్న అగగు అతని దగ్గరకు వచ్చి, “ఖచ్చితంగా మరణభయం నా నుండి తొలగిపోయింది” అనుకున్నాడు. అయితే సమూయేలు, “నీ కత్తి స్త్రీలకు సంతానం లేకుండా చేసినట్లు, స్త్రీల మధ్యలో నీ తల్లికి సంతానం లేకుండా పోతుంది” అని చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిలో అగగును ముక్కలుగా నరికాడు. అప్పుడు సమూయేలు రామాకు వెళ్లిపోయాడు కాని సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్లాడు. అప్పటినుండి సౌలు చనిపోయే వరకు సమూయేలు అతన్ని చూడటానికి వెళ్లలేదు గాని సౌలును గురించి దుఃఖపడేవాడు. సౌలును ఇశ్రాయేలీయుల మీద రాజుగా చేసినందుకు యెహోవా విచారించారు.

షేర్ చేయి
Read 1 సమూయేలు 15