1 సమూయేలు 13:1-5

1 సమూయేలు 13:1-5 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

సౌలు రాజైనప్పుడు అతని వయస్సు ముప్పై సంవత్సరాలు. అతడు నలభై రెండు సంవత్సరాలు ఇశ్రాయేలీయులను పరిపాలించాడు. సౌలు ఇశ్రాయేలీయులలో మూడువేలమందిని ఏర్పరచుకున్నాడు. వీరిలో రెండువేలమంది మిక్మషులో బేతేలు కొండ ప్రాంతంలో సౌలు దగ్గర ఉన్నారు; మిగిలిన వేయిమంది బెన్యామీనీయుల ఊరైన గిబియాలో యోనాతాను దగ్గర ఉన్నారు. మిగిలినవారిని వారి గుడారాలకు పంపివేశాడు. యోనాతాను గెబాలో ఉన్న ఫిలిష్తీయుల సైనిక స్థావరాల మీద దాడి చేశాడు, ఆ విషయం ఫిలిష్తీయులకు తెలిసింది; అప్పుడు సౌలు దేశమంతట బూర ఊదించి, “హెబ్రీయులారా వినండి” అని చెప్పాడు. సౌలు ఫిలిష్తీయుల సైనిక స్థావరాల మీద దాడిచేశాడని, దాని వలన ఇశ్రాయేలీయులంటే ఫిలిష్తీయులకు అసహ్యం కలిగిందని ఇశ్రాయేలీయులకు తెలిసినప్పుడు ప్రజలందరు గిల్గాలులో సౌలు దగ్గర సమావేశమయ్యారు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి మూడువేల రథాలు, ఆరువేల గుర్రపురౌతులు, సముద్రపు ఒడ్డున ఉండే ఇసుక రేణువులంత విస్తారమైన సైనికులను సమకూర్చుకున్నారు. వీరు బయలుదేరి బేత్-ఆవెనుకు తూర్పున ఉన్న మిక్మషులో శిబిరం ఏర్పరచుకున్నారు.

1 సమూయేలు 13:1-5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

సౌలు రాజుగా పాలించడం ఆరంభించినపుడు అతని వయస్సు ముప్ఫై ఏళ్ళు. అతడు రెండేళ్ళు ఇశ్రాయేలీయులను పాలించిన తరువాత ఇశ్రాయేలీయుల్లో మూడు వేలమందిని ఏర్పరచుకున్నాడు. వీరిలో రెండు వేలమంది మిక్మషు ప్రాంతంలోని బేతేలు కొండలో సౌలు దగ్గర ఉండగా, వెయ్యిమంది బెన్యామీనీయుల ఊరు గిబియాలో యోనాతాను దగ్గర ఉన్నారు. మిగిలిన వారిని అతడు తమ తమ గుడారాలకు పంపివేశాడు. యోనాతాను గెబాలో ఉన్న ఫిలిష్తీయుల గుంపును సంహరించినపుడు ఆ విషయం ఫిలిష్తీయులకు తెలిసింది. దేశంలోని హెబ్రీయులంతా ఈ వార్త వినాలని సౌలు ప్రచారం చేయించాడు. సౌలు ఫిలిష్తీయుల గుంపును సంహరించడం వల్ల తమపై ఫిలిష్తీయులు విరోధం పెంచుకొన్నారని ఇశ్రాయేలీయులకు తెలిసినప్పుడు వారంతా గిల్గాలులో సౌలు దగ్గరకి చేరుకున్నారు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్దం చేయడానికి ముప్ఫై వేల రథాలు, ఆరు వేలమంది గుర్రపు రౌతులు, సముద్రం ఒడ్డున ఉండే ఇసుక రేణువులంత విస్తారమైన జనసమూహాన్ని సమకూర్చుకుని బయలుదేరారు. వీరంతా బేతావెను తూర్పుదిక్కున మిక్మషులో దిగారు.

1 సమూయేలు 13:1-5 పవిత్ర బైబిల్ (TERV)

అప్పటికి సౌలు పరిపాలించటం మొదలు పెట్టి ఒక సంవత్సరం అయింది. అతడు రెండు సంవత్సరాలు పాలించేసరికి ఇశ్రాయేలునుండి మూడు వేల మందిని సైన్యానికి ఎంపిక చేశాడు. కొండల ప్రాంతమైన బేతేలు పట్టణం దగ్గర మిక్మషులో అతనితోకూడ రెండు వేలమంది ఉన్నారు. బెన్యామీనులోని గిబియాలో యోనాతానుతో ఒక వెయ్యిమంది ఉన్నారు. సైన్యంలో మిగిలిన వారిని సౌలు ఇంటికి పంపేశాడు. యోనాతాను ఫిలిష్తీయులను గెబాలో ఉన్న వారి శిబిరం వద్దనే ఓడించాడు. ఇది విన్న ఫిలిష్తీయులు “హెబ్రీ జనం తిరుగుబాటు చేశారని” అరిచారు. “హెబ్రీ ప్రజలు జరిగినదంతా వినాలని” సౌలు అన్నాడు. ఇదంతా ఇశ్రాయేలు దేశమంతా చాటింపు వేసి చెప్పమని మనుష్యులను పురమాయించాడు సౌలు. ఇశ్రాయేలీయులంతా ఈ వార్త విని, “సౌలు ఫిలిష్తీయులను ఓడించాడు గనుక వాళ్లు మనల్ని ఇప్పుడు మరింత అసహ్యించుకుంటారని” అన్నారు. సౌలును గిల్గాలు వద్ద కలుసుకోవాలని ఇశ్రాయేలు ప్రజలకు పిలుపు వచ్చింది. ఫిలిష్తీయులు ఇశ్రాయేలుపై దెబ్బ తీయటానికి సమాయత్తమయ్యారు. వారికి మూడు వేల రథాలు ఉన్నాయి. ఆరువేల మంది అశ్వదళ సైనికులు ఉన్నారు. సముద్ర తీరాన ఇసుక ఉన్నట్లుగా ఫిలిష్తీయుల సైన్యంకూడ లెక్కకు మించి ఉంది. వారంతా పోయి మిక్మషు వద్ద గుడారాలు వేసుకున్నారు. బేతావెనుకు తూర్పుగా మిక్మషు ఉంది.

1 సమూయేలు 13:1-5 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

సౌలు ముప్పది ఏండ్లవాడై యేలనారంభించెను. అతడు రెండు సంవత్సరములు ఇశ్రాయేలీయులను ఏలెను ఇశ్రాయేలీయులలో మూడు వేలమందిని ఏర్పరచు కొనెను. వీరిలో రెండు వేలమంది మిక్మషులోను బేతేలు కొండలోను సౌలునొద్దనుండిరి; వెయ్యిమంది బెన్యామీనీయుల గిబియాలో యోనాతాను నొద్దనుండిరి; మిగిలినవారిని అతడు వారి వారి డేరాలకు పంపివేసెను. యోనాతాను గెబాలోనున్న ఫిలిష్తీయుల దండును హతముచేయగా ఆ సంగతి ఫిలిష్తీయులకు వినబడెను; మరియు దేశమంతట హెబ్రీయులు వినవలెనని సౌలు బాకా ఊదించెను. సౌలు ఫిలిష్తీయుల దండును హతముచేసినందున ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులకు హేయులైరని ఇశ్రాయేలీయులకు వినబడగా జనులు గిల్గాలులో సౌలు నొద్దకు కూడివచ్చిరి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధముచేయుటకై ముప్పదివేల రథములను ఆరువేల గుఱ్ఱపు రౌతులను సముద్రపుదరినుండు ఇసుకరేణువులంత విస్తారమైన జన సమూహమును సమకూర్చుకొని వచ్చిరి. వీరు బయలుదేరి బేతావెను తూర్పుదిక్కున మిక్మషులో దిగిరి.

1 సమూయేలు 13:1-5 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)