1 సమూయేలు 10:9-13
1 సమూయేలు 10:9-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
సమూయేలు దగ్గర నుండి వెళ్లిపోడానికి బయలుదేరినపుడు దేవుడు సౌలుకు నూతన మనస్సు అనుగ్రహించాడు. ఆ రోజే ఆ ఆనవాళ్ళు కనబడ్డాయి. వారు ఆ కొండ దగ్గరకి వస్తుండగా ప్రవక్తల సమూహం అతనికి ఎదురు వచ్చినప్పుడు దేవుని ఆత్మ బలంగా అతని మీదికి వచ్చాడు. అతడు వారి మధ్య నిలిచి ప్రకటన చేస్తూ ఉన్నాడు. గతంలో అతనిని ఎరిగిన వారంతా అతడు ప్రవక్తలతో కలసి ప్రకటించడం చూసి “కీషు కుమారుడికి ఏమయ్యింది? సౌలు కూడా ప్రవక్త అయ్యాడా?” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. అక్కడ ఉన్న ఒక వ్యక్తి “అతని తండ్రి ఎవరు?” అని అడిగాడు. అందువల్ల సౌలు కూడా ప్రవక్త అయ్యాడా? అనే సామెత పుట్టింది. తరువాత అతడు ప్రకటించడం ఆపివేసి ఉన్నత స్థలానికి వచ్చాడు.
1 సమూయేలు 10:9-13 పవిత్ర బైబిల్ (TERV)
సమూయేలును వదిలి సౌలు వెళ్లిపోవటానికి మరలగానే దేవుడు సౌలుకు హృదయ పరివర్తన కలుగచేసాడు. అతనికి చెప్పబడిన గుర్తులన్నీ ఆ రోజు నిజమయ్యాయి. సౌలు, అతని సేవకుడు గిబియ-ఎలోహిముకు చేరగానే సౌలు కొంతమంది ప్రవక్తలను కలిసాడు. దేవుని ఆత్మ సౌలు మీదికి అతి శక్తివంతంగా దిగాడు. మిగిలిన ప్రవక్తలతో కలసి సౌలుకూడ దేవుని విషయాలు చెప్పసాగాడు. ఇదివరకు సౌలును ఎరిగిన ప్రజలు అతడు ఇతర ప్రవక్తలతో కలసి ప్రవక్తలా మాట్లాడటం చూసారు. వారంతా “కీషు కొడుకు సౌలుకు ఏమయ్యిందో ఏమో! సౌలుకూడా ప్రవక్తలలో ఒకడయ్యాడా?” అంటూ ఆశ్చర్యపోయారు. గిబియ-ఎలోహిములో నివసిస్తున్న ఒకడు, “అవును, అతడు వారి నాయకుడిలా కనబడుతున్నాడు” అన్నాడు. అందుకే, “సౌలుకూడా ప్రవక్తల్లో ఒకడా?” అనే నానుడి ప్రసిద్ధికెక్కింది. దేవుని విషయాలు ప్రవచించటం అయిన తర్వాత సౌలు తన ఇంటివద్ద ఉన్న ఆరాధనా స్థలం దగ్గరకు వచ్చాడు.
1 సమూయేలు 10:9-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అతడు సమూయేలునొద్దనుండి వెళ్లిపోవుటకై తిరుగగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించెను. ఆ దినముననే ఆ సూచనలు కనబడెను. వారు ఆ కొండదగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చెను. అతడు వారిమధ్యను ఉండి ప్రకటన చేయుచుండెను. పూర్వము అతని నెరిగినవారందరు అతడు ప్రవక్తలతోకూడనుండి ప్రకటించుట చూచి– కీషు కుమారునికి సంభవించిన దేమిటి? సౌలును ప్రవక్తలలో నున్నాడా? అని ఒకనితో ఒకడు చెప్పుకొనగా ఆ స్థల మందుండు ఒకడు–వారి తండ్రి యెవడని యడిగెను. అందుకు సౌలును ప్రవక్తలలో నున్నాడా? అను సామెత పుట్టెను. అంతట అతడు ప్రకటించుట చాలించి ఉన్నతస్థలమునకు వచ్చెను.
1 సమూయేలు 10:9-13 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
సౌలు సమూయేలు దగ్గరి నుండి వెళ్లడానికి వెనుకకు తిరగ్గానే దేవుడు సౌలు హృదయాన్ని మార్చారు, ఆ రోజే ఈ సూచనలన్నీ నెరవేరాయి. అతడు, అతని సేవకుడు గిబియా దగ్గరకు చేరుకున్నప్పుడు, ప్రవక్తల ఊరేగింపు అతనికి ఎదురైంది; దేవుని ఆత్మ బలంగా అతని మీదికి వచ్చి, అతడు వారితో కలిసి ప్రవచించాడు. గతంలో అతన్ని తెలిసిన వారందరు అతడు ప్రవక్తలతో కలిసి ప్రవచించడం చూసి, “కీషు కుమారునికి ఏమైంది? సౌలు కూడా ప్రవక్తల్లో ఒకడా?” అని ఒకరితో ఒకరు అనుకున్నారు. అక్కడ నివసించే ఒక వ్యక్తి, “వారి నాయకుడు ఎవరు?” అన్నాడు. అందువల్ల, “సౌలు కూడా ప్రవక్తల్లో ఒకడా?” అనే సామెత పుట్టింది. సౌలు ప్రవచించడం ఆపిన తర్వాత అతడు ఉన్నత స్థలానికి వెళ్లాడు.