1 సమూయేలు 1:10-18

1 సమూయేలు 1:10-18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

తీవ్రమైన దుఃఖంలో ఉన్న హన్నా యెహోవా సన్నిధిలో ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంది. ఆమె ఒక ప్రమాణం చేస్తూ “సైన్యాలకు అధిపతి అయిన యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగిన బాధను చూసి నన్ను మరచిపోకుండా జ్ఞాపకం చేసుకుని, నీ సేవకురాలనైన నాకు ఒక కుమారుణ్ణి దయచేస్తే వాడు బతికే కాలమంతా వాణ్ణి యెహోవాకు సమర్పిస్తాను. వాడి తలకు ఎన్నటికీ మంగలి కత్తి తగలనియ్యను” అని చెప్పింది. ఆమె యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా ఏలీ ఆమె నోటి కదలికలు కనిపెడుతున్నాడు. ఎందుకంటే హన్నా తన మనస్సులోనే మాట్లాడుకుంటూ ఉంది. ఆమె పెదవులు మాత్రం కదులుతున్నాయి. ఆమె స్వరం వినబడడం లేదు. అందువల్ల ఏలీ ఆమె మద్యం సేవించి ఉంది అనుకున్నాడు. అతడామెతో “ఎంతసేపు నువ్వు మత్తులో ఉంటావు? ద్రాక్ష మద్యం ఇక చాలించు” అన్నాడు. అందుకు హన్నా “ప్రభూ, అది కాదు, నేను మనసులో దుఃఖంతో నిండి ఉన్నాను. నేను ద్రాక్షరసం గానీ, మరి ఏ మద్యం గానీ తీసుకోలేదు. నా ఆత్మను యెహోవా సన్నిధిలో ఒలకబోస్తూ ఉన్నాను. నీ సేవకురాలనైన నన్ను చెడ్డదానిగా అనుకోవద్దు. మితిమీరిన దిగులు, అందోళనల వల్ల నాలో నేను చెప్పుకుంటున్నాను” అని జవాబిచ్చింది. అప్పుడు ఏలీ “నువ్వు క్షేమంగా వెళ్లు. ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసికొన్న మనవి ఆయన దయచేస్తాడు గాక” అని ఆమెతో చెప్పాడు. ఆమె అతనితో “నీ సేవకురాలనైన నేను ఈ విషయంలో కృప పొందుతాను” అన్నది. తరువాత ఆ స్త్రీ తన ఇంటికి వెళ్లిపోయి భోజనం చేస్తూ అప్పటినుండి విచారంగా ఉండడం మానుకుంది.

షేర్ చేయి
Read 1 సమూయేలు 1

1 సమూయేలు 1:10-18 పవిత్ర బైబిల్ (TERV)

హన్నా మిక్కిలి విచారంతో ఉంది. చాలా దుఃఖించి దేవుణ్ణి ప్రార్థించింది. ఒక పెద్ద మొక్కుబడి మొక్కింది. “సర్వశక్తిమంతుడవైన యెహోవా దేవా, నేను ఎంత దుఃఖంలో వున్నానో చూడు. నన్ను జ్ఞాపకముంచుకో! నన్ను మర్చిపోవద్దు. నాకొక కుమారుని కలుగజేస్తే వానిని నేను తిరిగి నీ సేవకై జీవితాంతం విడిచి పెడ్తాను. పైగా అతడు మద్యపానాది వ్యసనాలకు లోనుగాడు. అతడు నాజీరవుతాడు. మరియు అతని తలవెంట్రుకలు ఎవ్వరూ కత్తిపట్టి తీయరు” అని కోరుకున్నది. ఆ విధంగా హన్నా ప్రార్థనలో ఉన్నంతసేపూ ఏలీ ఆమె నోటిని గమనిస్తూ ఉన్నాడు. హన్నా అంతరంగంలోనే ప్రార్థిస్తూవుంది. ఆమె పెదవులు కదిలాయి గాని ఆమె గొంతు విప్పలేదు. అందుచేత హన్నా మద్యం సేవించి వుంటుందని ఏలీ భావించాడు. “మద్యం తాగటం మానివేయి. నీ ద్రాక్షా రసాన్ని పారబోయి” అని హన్నాతో ఏలీ చెప్పాడు. “లేదయ్యా, నేను ద్రాక్షారసం గాని, మరేదిగాని సేవించలేదు. నేను నా సమస్యలన్నీ యెహోవాతో చెప్పుకుంటున్నాను. నేనొక చెడ్డ స్త్రీ నని తలంచవద్దు. ఇంత ఎక్కువ సేపు నేను ప్రార్థన చేస్తూ ఉన్నానంటే నాకు ఎన్నో బాధలు, అంతులేని దుఃఖం ఉన్నాయి” అని హన్నా సమాధాన మిచ్చింది. అంతట ఏలీ, “నీవు సమాధానంతో వెళ్లు. ఇశ్రాయేలు దేవుడు నీ కోర్కెలను నెరవేర్చునుగాక” అని హన్నాను పంపివేశాడు. “నామీద దయ ఉంచండి” అని చెప్పి హన్నా వెళ్లి, కొంచెం ఆహారం తీసుకున్నది. ఆ తరువాత ఆమె మరెప్పుడూ అంత మనోవేదన చెందలేదు.

షేర్ చేయి
Read 1 సమూయేలు 1

1 సమూయేలు 1:10-18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

బహుదుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థనచేయుచు బహుగా ఏడ్చుచు –సైన్యములకధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగియున్నశ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసికొని, నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసినయెడల, వాని తలమీదికి క్షౌరపుకత్తి యెన్నటికి రానియ్యక, వాడు బ్రదుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసి కొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను, ఏలయనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను. ఆమె పెదవులుమాత్రము కదలుచుండి ఆమె స్వరము వినబడక యుండెను గనుక ఏలీ ఆమె మత్తురాలై యున్నదనుకొని –ఎంతవరకు నీవు మత్తురాలవై యుందువు? నీవు ద్రాక్షారసమును నీయొద్దనుండి తీసివేయుమని చెప్పగా హన్నా–అది కాదు, నా యేలినవాడా, నేను మనోదుఃఖము గలదాననై యున్నాను; నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయ లేదుగాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలనైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు; అత్యంతమైన కోపకారణమునుబట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీని చెప్పు కొనుచుంటిననెను. అంతట ఏలీ–నీవు క్షేమముగా వెళ్లుము; ఇశ్రాయేలు దేవునితో నీవు చేసికొనిన మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో–నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృప నొందుదునుగాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్లిపోయి భోజనముచేయుచు నాటనుండి దుఃఖముఖిగా నుండుట మానెను.

షేర్ చేయి
Read 1 సమూయేలు 1

1 సమూయేలు 1:10-18 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

హన్నా తీవ్ర వేదనలో ఏడుస్తూ యెహోవాకు ప్రార్థించింది. ఆమె, “సైన్యాల యెహోవా, మీరు మీ సేవకురాలినైన కష్టాలను చూసి నన్ను గుర్తుంచుకుని, మీ సేవకురాలినైన నన్ను మరచిపోకుండా నాకు ఒక కుమారున్ని ఇస్తే, అతడు బ్రతికే దినాలన్ని యెహోవాకే ఇస్తాను, అతని తలపై క్షౌరపుకత్తి ఎప్పుడూ ఉపయోగించబడదు” అని అంటూ ఒక మ్రొక్కుబడి చేసింది. ఆమె యెహోవాకు ప్రార్థిస్తూ ఉండగా, ఏలీ ఆమె నోటిని గమనించాడు. హన్నా తన హృదయంలో ప్రార్థన చేస్తోంది, ఆమె పెదవులు కదులుతున్నాయి కానీ ఆమె స్వరం వినబడలేదు. ఏలీ ఆమె త్రాగి ఉందని భావించి, ఏలీ ఆమెతో, “ఎంతకాలం నీవు మత్తులో ఉంటావు? నీ ద్రాక్షరసాన్ని దూరం పెట్టు” అన్నాడు. అందుకు హన్నా, “అలా కాదు, నా ప్రభువా, నేను చాలా బాధలో ఉన్నాను. నేను ద్రాక్షరసం గాని మద్యం గాని త్రాగలేదు; నేను నా ఆత్మను యెహోవా దగ్గర క్రుమ్మరిస్తున్నాను. నీ సేవకురాలిని చెడ్డదానిగా భావించవద్దు; నేను చాలా వేదనతో దుఃఖంతో ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను” అన్నది. అందుకు ఏలీ, “నీవు సమాధానంగా వెళ్లు, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసికొన్న మనవిని ఆయన నీకు దయచేయును గాక” అని ఆమెతో చెప్పాడు. ఆమె అతనితో, “నీ దాసురాలు నీ దయ పొందును గాక” అన్నది. తర్వాత ఆమె తన దారిన వెళ్లి భోజనం చేసింది; ఆ రోజు నుండి ఆమె ఎన్నడు దుఃఖపడుతూ కనబడలేదు.

షేర్ చేయి
Read 1 సమూయేలు 1