1 పేతురు 3:18-22
1 పేతురు 3:18-22 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఏలయనగా మనలను దేవునియొద్దకు తెచ్చుటకు, అనీతిమంతులకొరకు నీతిమంతు డైన క్రీస్తు శరీరవిషయములో చంపబడియు, ఆత్మవిషయములో బ్రదికింపబడి, పాపముల విషయములో ఒక్క సారే శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతము ఇంక కని పెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, అవిధేయులైనవారియొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మలయొద్దకు, ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా ఎనిమిది మంది నీటిద్వారా రక్షణపొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించు చున్నది; అదేదనగా శరీరమాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విష యము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్లి దూతలమీదను అధికారులమీదను శక్తులమీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు.
1 పేతురు 3:18-22 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఎందుకంటే, దేవుని దగ్గరకు తీసుకొనిరావడానికి, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికించబడి, పాపాల విషయంలో ఒక్కసారే శ్రమపడ్డారు. ఆయన సజీవుడైన తరువాత, అనగా చెరలో ఉన్న ఆత్మల దగ్గరకు, ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించారు; నోవహు ఓడను నిర్మిస్తున్న రోజుల్లో, దేవునికి అవిధేయంగా ఉన్న వారి ఆత్మలే ఇవి. అప్పుడు దేవుడు వారి కొరకు సహనంతో వేచివున్నాడు, ఓడలోని కొద్దిమంది, ఎనిమిది మంది మాత్రమే నీటి నుండి రక్షించబడ్డారు. ఈ నీరే బాప్తిస్మానికి సాదృశ్యంగా ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తుంది, శరీర మాలిన్యాన్ని తీసివేయడం కాదు గాని, యేసు క్రీస్తు పునరుత్థాన మూలంగా దేవుని ముందు నిర్మలమైన మనస్సాక్షిని అనుగ్రహిస్తుంది. ఆయన పరలోకానికి వెళ్ళి దూతలమీద, అధికారుల మీద, శక్తులమీద అధికారం పొందినవాడై, దేవుని కుడి వైపున ఉన్నారు.
1 పేతురు 3:18-22 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
క్రీస్తు కూడా పాపాల కోసం ఒక్కసారే చనిపోయాడు. మనలను దేవుని దగ్గరికి తీసుకు రావడానికి, దోషులమైన మన కోసం నీతిమంతుడైన క్రీస్తు చనిపోయాడు. ఆయనను శారీరకంగా చంపారు గానీ దేవుని ఆత్మ ఆయనను బతికించాడు. ఇప్పుడు చెరసాల్లో ఉన్న ఆత్మల దగ్గరికి, ఆయన ఆత్మరూపిగా వెళ్ళి ప్రకటించాడు. ఆ ఆత్మలు దేవునికి విధేయత చూపలేదు. పూర్వం నోవహు రోజుల్లో ఓడ తయారవుతూ ఉంటే దేవుడు దీర్ఘశాంతంతో కనిపెట్టిన ఆ రోజుల్లో, ఆ ఓడలో కొద్ది మందినే, అంటే ఎనిమిది మందినే, దేవుడు నీళ్ళ ద్వారా రక్షించాడు. దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంది. అది ఒంటి మీద మురికి వదిలించుకున్నట్టు కాదు, అది యేసు క్రీస్తు పునరుత్థానం ద్వారా దేవునికి మనస్సాక్షితో చేసే అభ్యర్ధనే. ఆయన పరలోకానికి వెళ్ళాడు. దేవుని కుడి వైపున ఉన్నాడు. దూతలూ, అధికారులూ, శక్తులు, అన్నీ ఆయనకు లోబరచబడినాయి.
1 పేతురు 3:18-22 పవిత్ర బైబిల్ (TERV)
క్రీస్తు మీ పాపాల నిమిత్తం తన ప్రాణాన్ని ఒకేసారి యిచ్చాడు. దేవుని సన్నిధికి మిమ్మల్ని తీసుకు రావాలని నీతిమంతుడైన క్రీస్తు మీ పాపాల నిమిత్తం మరణించాడు. వాళ్ళాయనకు భౌతిక మరణం కలిగించినా, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పునర్జీవం పొందాడు. పరిశుద్ధాత్మ ద్వారా, చెరలోబడిన ఆత్మల దగ్గరకు వెళ్ళి బోధించాడు. గతంలో ఈ ఆత్మలు దేవుని పట్ల అవిధేయతతో ప్రవర్తించాయి. నోవహు కాలంలో, నోవహు ఓడ నిర్మాణాన్ని సాగించినంతకాలం దేవుడు శాంతంగా కాచుకొని ఉన్నాడు. ఆ తర్వాత కొందరిని మాత్రమే, అంటే ఓడలో ఉన్న ఎనిమిది మందిని మాత్రమే నీళ్ళనుండి రక్షించాడు. అదేవిధంగా మీరు బాప్తిస్మము పొందటంవల్ల దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. బాప్తిస్మము పొదంటం అంటే శరీరం మీదినుండి మలినాన్ని కడిగివేయటం కాదు. దేవుణ్ణి స్వచ్ఛమైన మనస్సునిమ్మని వేడుకోవడం. ఇది యేసు క్రీస్తు చావు నుండి బ్రతికి రావటం వల్ల సంభవిస్తోంది. ఆయన పరలోకానికి వెళ్ళి దేవుని కుడి చేతి వైపు కూర్చొని, దేవదూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద రాజ్యం చేస్తున్నాడు.
1 పేతురు 3:18-22 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ఎందుకంటే, దేవుని దగ్గరకు తీసుకురావడానికి, అనీతిమంతుల కోసం నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికించబడి, పాపాల విషయంలో ఒక్కసారే శ్రమపడ్డారు. ఆయన సజీవుడైన తర్వాత, అనగా చెరలో ఉన్న ఆత్మల దగ్గరకు, ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించారు; నోవహు ఓడను నిర్మిస్తున్న రోజుల్లో, దేవునికి అవిధేయంగా ఉన్న వారి ఆత్మలే ఇవి. అప్పుడు దేవుడు వారి కోసం సహనంతో వేచి ఉన్నారు. ఓడలోని కొద్దిమంది, అనగా ఎనిమిది మంది మాత్రమే నీటి నుండి రక్షించబడ్డారు. ఈ నీరే బాప్తిస్మానికి సాదృశ్యంగా ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తుంది. శరీర మాలిన్యాన్ని తీసివేయడం కాదు గాని, యేసు క్రీస్తు పునరుత్థాన మూలంగా దేవుని ముందు నిర్మలమైన మనస్సాక్షిని అనుగ్రహిస్తుంది. ఆయన పరలోకానికి వెళ్లి దూతలమీద, అధికారుల మీద, శక్తులమీద అధికారం పొందినవాడై, దేవుని కుడి వైపున ఉన్నారు.