1 పేతురు 2:11-22
1 పేతురు 2:11-22 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ప్రియ మిత్రులారా, ఈ లోకంలో పరదేశులుగా, యాత్రికులుగా ఉన్న మీకు నేను మనవి చేసుకుంటున్నాను. శారీరక కోరికలు ఎప్పుడు ఆత్మతో పోరాడుతుంటాయి. కనుక వాటికి విడిచిపెట్టండి. యూదులు కాని మిమ్మల్ని ఏ విషయాల్లో దూషిస్తున్నారో ఆ విషయాల్లో మీరు మంచి ప్రవర్తన కలవారై ఉండాలి. మీ సత్కార్యాలను వారు గుర్తించి, దేవుడు మనల్ని దర్శించే రోజున వారు దేవుని మహిమపరచగలరు. ప్రభువు కొరకు మానవ అధికారులందరికి లోబడి ఉండండి: సార్వభౌమాధికారంలో ఉన్న చక్రవర్తులకు లోబడి ఉండండి. దుష్టులను శిక్షించడానికి, మంచివారిని మెచ్చుకోవడానికి పంపబడిన పాలకులకు విధేయులై ఉండండి. మీరు మీ సత్కార్యాల వలన మూర్ఖులైన జ్ఞానంలేని ప్రజల నోరు మూయించాలి, ఇది దేవుని చిత్తం. స్వతంత్రులై బ్రతకండి, దుష్టత్వాన్ని కప్పిపెట్టడానికి మీ స్వాతంత్ర్యాన్ని వినియోగించకండి; దేవునికి దాసులుగా జీవించండి. అందరిని గౌరవించండి, తోటి విశ్వాసులను ప్రేమించండి, దేవునిలో భయభక్తులు కలిగి ఉండండి, రాజులను గౌరవించండి. దాసులారా, మీ యజమానులకు మీరు విధేయులై ఉండండి, వారికి సమస్త మర్యాదలను చూపండి, దయ గలవారు, సౌమ్యులైనవారికి మాత్రమే గాక, కఠినులకు కూడా లోబడి ఉండండి. ఎవడైన అన్యాయంగా శ్రమ పొందుతూ, దేవుని పట్ల నిష్కపటమైన మనస్సాక్షి కలిగి దాన్ని ఓర్పుతో సహిస్తే దేవుని అంగీకారం పొందుతారు. ఎలాగంటే, పాపం చేసినందుకు ప్రతిఫలంగా వచ్చే శిక్షను ఓర్పుతో భరిస్తే దానిలో ఏం గొప్పతనం ఉన్నది? కాని మంచినే చేసి దాని కొరకు బాధను అనుభవించాల్సి వచ్చినపుడు ఓర్పుతో భరిస్తే, దేవుడు దానికై మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. దీని కొరకే దేవుడు మిమ్మల్ని పిలిచాడు, ఎలాగంటే క్రీస్తే మీ కొరకు బాధపడి, ఆయన అడుగుజాడల్లో మీరు నడవడానికి ఒక మాదిరిని ఏర్పరిచారు. “ఆయన ఎలాంటి పాపం చేయలేదు, ఆయన నోటి వెంట ఎన్నడు అసత్యం రాలేదు.”
1 పేతురు 2:11-22 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ప్రియులారా, మీరీ లోకంలో పరదేశులుగా, బాటసారులుగా ఉన్నారు. కాబట్టి మీ ఆత్మకు విరోధంగా పోరాటం చేసే శరీర దురాశలు విసర్జించాలని వేడుకుంటున్నాను. యూదేతరులు మిమ్మల్ని దుర్మార్గులని దూషిస్తూ ఉంటే, వారు మీ మంచి పనులు చూసి, దేవుడు దర్శించే రోజున ఆయనను మహిమ పరచేలా, వారి మధ్య మీ మంచి ప్రవర్తన చూపించండి. ప్రతి మానవ అధికారానికీ ప్రభువును బట్టి లోబడి ఉండండి. రాజు అందరికీ అధిపతి అనీ, అధికారులు దుర్మార్గులను శిక్షించడానికీ, మంచి వారిని మెచ్చుకోడానికీ ఆయన పంపిన వారనీ వారికి లోబడి ఉండండి. ఎందుకంటే మీరు ఈ విధంగా మంచి చేస్తూ తెలివి తక్కువగా మాట్లాడే బుద్ధిహీనుల నోరు మూయించడం దేవుని చిత్తం. స్వేచ్ఛ పొందిన వారుగా దుర్మార్గాన్ని కప్పి పెట్టడానికి మీ స్వేచ్ఛను వినియోగించక, దేవుని సేవకులుగా ఉండండి. అందరినీ గౌరవించండి. తోటి సోదరులను ప్రేమించండి, దేవునికి భయపడండి, రాజును గౌరవించండి. సేవకులారా, మంచివాళ్ళూ సాత్వికులయిన యజమానులకు మాత్రమే కాక వక్ర బుద్ధి గల వారికి కూడా పూర్తి మర్యాదతో లోబడి ఉండండి. ఎవరయినా దేవుని గురించిన మనస్సాక్షిని బట్టి అన్యాయాన్ని అనుభవిస్తూ బాధ సహిస్తుంటే అది గొప్ప విషయం. మీరు పాపం చేసి శిక్ష అనుభవిస్తూ సహిస్తుంటే అదేమి గొప్ప? మేలు చేసి బాధలకు గురి అయి సహిస్తుంటే అది దేవుని దృష్టిలో మెచ్చుకోదగినది. దీనికోసమే దేవుడు మిమ్మల్ని పిలిచాడు. క్రీస్తు కూడా మీకోసం బాధపడి, మీరు తన అడుగు జాడల్లో నడవాలని మీకు ఆదర్శాన్ని ఉంచి వెళ్ళి పోయాడు. ఆయన ఎలాంటి పాపం చేయలేదు. ఆయన నోటిలో ఎలాంటి కపటమూ కనబడలేదు.
1 పేతురు 2:11-22 పవిత్ర బైబిల్ (TERV)
ప్రియమైన సోదరులారా! ఈ ప్రపంచంలో మీరు పరదేశీయుల్లా, యాత్రికుల్లా జీవిస్తున్నారు. మీ ఆత్మలతో పోరాడుతున్న శారీరక వాంఛల్ని వదిలి వేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. యూదులుకాని వాళ్ళ మధ్య నివసిస్తున్న మీరు మంచి నడవడిక గలిగి జీవించాలి. ఎందుకంటే, “దుర్మార్గులని” మిమ్మల్ని నిందిస్తున్న వాళ్ళు మీ మంచి నడవడికను చూసి దేవుడు తీర్పు చెప్పనున్న రోజు ఆయన మహిమను బట్టి ఆయన్ని స్తుతిస్తారు. మీరు ప్రభువు కోసం అధికారుల పట్ల విధేయతతో ఉండండి. అది సర్వాధికారమున్న చక్రవర్తి కానివ్వండి, లేక, ఆ చక్రవర్తి నియమించిన రాజ్యాధికారులు కానివ్వండి. చక్రవర్తి ఈ రాజ్యాధికారుల్ని తప్పుచేసిన వాళ్ళను శిక్షించటానికి, ఒప్పు చేసిన వాళ్ళను మెచ్చుకోవటానికి పంపించాడు. మీరు మంచి పనులు చేసి, అవివేకంగా మాట్లాడే మూర్ఖుల నోళ్ళను కట్టి వేయాలని దేవుని కోరిక. స్వేచ్ఛగా జీవించండి. కాని ఈ స్వేచ్ఛను మీ దుష్ట స్వభావాన్ని కప్పిపుచ్చటానికి ఉపయోగించకండి. దేవుని సేవకులవలె జీవించండి. అందర్నీ గౌరవించండి. తోటి విశ్వాసులైన సోదరులను ప్రేమించండి. దేవునికి భయపడండి. రాజును గౌరవించండి. బానిసలారా! మీ యజమానులను, వాళ్ళు దయాదాక్షిణ్యాలతో మంచిగా ప్రవర్తించే యజమానులు కానివ్వండి, లేక దౌర్జన్యంతో ప్రవర్తించే యజమానులు కానివ్వండి, పూర్తిగా గౌరవిస్తూ విధేయతతో ఉండండి. ఎందుకంటే, తనకు అన్యాయంగా సంభవిస్తున్న బాధల్ని దేవుణ్ణి దృష్టిలో ఉంచుకొని అనుభవించే వ్యక్తి శ్లాఘనీయుడు. నీవు చేసిన తప్పులకు దెబ్బలు తిని ఓర్చుకుంటే అందులో గొప్పేమిటి? కాని మంచి చేసి కూడ బాధల్ని అనుభవించి ఓర్చుకుంటే అది దేవుని సాన్నిధ్యంలో శ్లాఘనీయమౌతుంది. దేవుడు మిమ్మల్ని పిలిచింది అందు కోసమే! మీకు ఆదర్శంగా ఉండాలనీ, మీరు తన అడుగు జాడల్లో నడచుకోవాలనీ క్రీస్తు మీకోసం కష్టాలనుభవించాడు. “ఆయన ఏ పాపం చేయలేదు! ఆయన మాటల్లో ఏ మోసం కనబడలేదు!”
1 పేతురు 2:11-22 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునై యున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశ లను విసర్జించి, అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్‌క్రియలను చూచి, వాటినిబట్టి దర్శనదినమున దేవుని మహిమపరచునట్లు, వారిమధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువునిమిత్తమై లోబడియుండుడి. రాజు అందరికిని అధిపతి యనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతి దండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజువలన పంపబడినవారనియు వారికి లోబడియుండుడి. ఏలయనగా మీరిట్లు యుక్తప్రవర్తన గలవారై, అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. స్వతంత్రులై యుండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్యమును వినియోగపరచక, దేవునికి దాసులమని లోబడి యుండుడి. అందరిని సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. పనివారలారా, మంచివారును సాత్వికులునైనవారికి మాత్రముకాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణభయముతో లోబడియుండుడి. ఎవడైనను అన్యాయముగా శ్రమపొందుచు, దేవునిగూర్చిన మనస్సాక్షికలిగి, దుఃఖము సహించినయెడల అది హితమగును. తప్పిద మునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించినయెడల మీకేమి ఘనము? మేలుచేసి బాధపడునప్పుడు మీరు సహించినయెడల అది దేవునికి హితమగును; ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచి పోయెను. ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు.
1 పేతురు 2:11-22 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ప్రియ మిత్రులారా, ఈ లోకంలో విదేశీయులుగా, ప్రవాసులుగా ఉన్న మీకు నేను మనవి చేసుకుంటున్నాను. శారీరక కోరికలు ఎప్పుడు ఆత్మతో పోరాడుతుంటాయి. కాబట్టి వాటికి విడిచిపెట్టండి. దేవుని ఎరుగనివారు మిమ్మల్ని ఏ విషయాల్లో దూషిస్తున్నారో ఆ విషయాల్లో మీరు మంచి ప్రవర్తన కలవారై ఉండాలి. మీ సత్కార్యాలను వారు గుర్తించి, దేవుడు మనల్ని దర్శించే రోజున వారు దేవుని మహిమపరచగలరు. ప్రభువు కోసం మానవ అధికారులందరికి లోబడి ఉండండి: సార్వభౌమాధికారంలో ఉన్న చక్రవర్తులకు లోబడి ఉండండి. దుష్టులను శిక్షించడానికి, మంచివారిని మెచ్చుకోవడానికి పంపబడిన పాలకులకు విధేయులై ఉండండి. మీరు మీ సత్కార్యాల వలన మూర్ఖులైన జ్ఞానంలేని ప్రజల నోరు మూయించాలి, ఇది దేవుని చిత్తం. స్వతంత్రులై బ్రతకండి, దుష్టత్వాన్ని కప్పిపెట్టడానికి మీ స్వాతంత్ర్యాన్ని వినియోగించకండి; దేవునికి దాసులుగా జీవించండి. అందరిని గౌరవించండి, తోటి విశ్వాసులను ప్రేమించండి, దేవునిలో భయభక్తులు కలిగి ఉండండి, రాజులను గౌరవించండి. దాసులారా, మీ యజమానులకు మీరు విధేయులై ఉండి వారి పట్ల మర్యాదగా ప్రవర్తించండి. దయగల, సౌమ్యులైన యజమానులకే గాక కఠినులైన వారికి కూడా లోబడి ఉండండి. ఎవరైనా అన్యాయంగా శ్రమ పొందుతూ దేవుని పట్ల నిష్కపటమైన మనస్సాక్షి కలిగి దాన్ని ఓర్పుతో సహిస్తే దేవుని అంగీకారం పొందుతారు. పాపం చేసినందుకు ప్రతిఫలంగా వచ్చే శిక్షను ఓర్పుతో భరిస్తే దానిలో గొప్పతనమేంటి? అయితే మంచి చేసి బాధపడాల్సి వచ్చినపుడే మీరు ఓర్పుతో భరిస్తే అది దేవుని మెచ్చుకోదగిన విషయం. దీని కోసమే మీరు పిలువబడ్డారు. ఎందుకంటే క్రీస్తు కూడా మీ కోసం బాధపడి మీరు ఆయన అడుగుజాడల్లో నడవడానికి ఒక ఉదాహరణను ఉంచారు. “ఆయన ఎలాంటి పాపం చేయలేదు, ఆయన నోటిలో ఏ మోసం లేదు.”