1 రాజులు 8:27-30
1 రాజులు 8:27-30 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వాస్తవానికి దేవుడు ఈ లోకంలో నివాసం చేస్తాడా? ఆకాశ మహాకాశాలు సైతం నిన్ను పట్టలేవే! నేను కట్టించిన ఈ మందిరం ఏ విధంగా సరిపోతుంది? అయినప్పటికీ, యెహోవా, నా దేవా, నీ దాసుడినైన నా ప్రార్థననూ మనవినీ అంగీకరించి, ఈ రోజు నీ దాసుడినైన నేను చేసే ప్రార్థననూ నా మొర్రనూ ఆలకించు. నీ దాసుడినైన నేను చేసే ప్రార్థనను దయతో అంగీకరించేలా ‘నా నామం అక్కడ ఉంటుంది’ అని ఏ స్థలం గురించి నీవు చెప్పావో ఆ ఈ మందిరం వైపు నీ కళ్ళు రాత్రీ, పగలూ తెరచుకుని ఉంటాయి గాక. నీ దాసుడినైన నేనూ నీ ప్రజలైన ఇశ్రాయేలీయులూ ఈ స్థలం వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడెల్లా, నీ నివాసమైన ఆకాశం నుండి విని మా విన్నపాన్ని ఆలకించు. ఆలకించినప్పుడెల్లా మమ్మల్ని క్షమించు.
1 రాజులు 8:27-30 పవిత్ర బైబిల్ (TERV)
“కాని దేవుడు నిజంగా ఈ భూమి మీద నివసించగలడా? ఈ ఆకాశము, ఉన్నత ఆకాశాలు నిన్ను భరించ జాలవు. నేను నిర్మించిన ఈ నివాసం కూడ ఖచ్చితంగా నిన్ను ఇముడ్చుకోలేదు. దయచేసి నా ప్రార్థనను, నా మనవిని ఆలకించు. నేను నీ సేవకుడను. నీవు నా ప్రభువైన దేవుడవు. నేను చేసే ఈ ప్రార్థన ఆలకించు. గతంలో నీవు, ‘నేనక్కడ గౌరవింపబడుదు’నని చెప్పావు. దయచేసి ఈ ఆలయాన్ని రాత్రింబవళ్లు కనిపెట్టుకుని ఉండు. ఈ దేవాలయంలో నేను చేసే ఈ ప్రార్థన ఆలకించు. దయచేసి నీ సేవకుడనైన నేను, ఇశ్రాయేలు ప్రజలు ఈ స్థలంలో చేసే ప్రార్థనలన్నీ ఆలకించు. మాకు తెలుసు నీవు పరలోకంలో నివసిస్తావని, అక్కడ నుండి మా ప్రార్థన ఆలకించి, మమ్మల్ని మన్నించుమని మేము నిన్ను వేడుకుంటున్నాము.
1 రాజులు 8:27-30 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు; ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు; నేను కట్టించిన యీ మందిరము ఏలాగు పట్టును? అయినను యెహోవా నా దేవా, నీ దాసుడనైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి, యీ దినమున నీ దాసుడనైన నేనుచేయు ప్రార్థనను పెట్టు మొఱ్ఱను ఆలకించుము. నీ దాసుడనైన నేనుచేయు ప్రార్థనను దయతో అంగీ కరించునట్లు–నా నామము అక్కడ ఉండునని యే స్థలమునుగూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన యీ మందిరముతట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి యుండునుగాక. మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులును ఈ స్థలముతట్టు తిరిగి ప్రార్థన చేయునప్పుడెల్ల, నీ నివాసస్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము; వినునప్పుడెల్ల మమ్మును క్షమించుము.
1 రాజులు 8:27-30 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
“దేవుడు భూమి మీద నిజంగా నివాసం చేస్తారా? ఆకాశ మహాకాశం మీకు సరిపోవు, నేను కట్టించిన ఈ మందిరం ఏం సరిపోతుంది! అయినా యెహోవా నా దేవా, మీ దాసుడైన నేను చేసే ప్రార్థన, కనికరం కోసం చేసే విన్నపం ఆలకించండి. ఈ రోజు మీ దాసుడు మీ సన్నిధిలో చేసే మొరను, ప్రార్థనను వినండి. నా పేరు అక్కడ ఉంటుందని మీరు ఈ మందిరాన్ని గురించి అన్నారు. కాబట్టి మీ దాసుడు ఈ స్థలం వైపు తిరిగి చేసే ప్రార్థన మీరు వినేలా రాత్రింబగళ్ళు మీ కనుదృష్టి ఈ మందిరంపై ఉంచండి. మీ దాసుడు, మీ ఇశ్రాయేలు ప్రజలు ఈ స్థలం వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడు వారి విన్నపం ఆలకించండి. మీ నివాసస్థలమైన పరలోకం నుండి వినండి, మీరు విన్నప్పుడు క్షమించండి.