1 రాజులు 8:22-61

1 రాజులు 8:22-61 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఇశ్రాయేలీయుల సమాజమంతా చూస్తుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలబడి ఆకాశం వైపు చేతులెత్తి ఇలా అన్నాడు, “యెహోవా, ఇశ్రాయేలీయుల దేవా, పైన ఉన్న ఆకాశంలో, కింద ఉన్న భూమిపై నీలాంటి దేవుడు ఒక్కడూ లేడు. పూర్ణమనస్సుతో నీ దృష్టికి అనుకూలంగా నడిచే నీ దాసుల విషయంలో నీవు నీ నిబంధనను నెరవేరుస్తూ కనికరం చూపుతూ ఉంటావు. నీ దాసుడు, నా తండ్రి అయిన దావీదుకు నీవు చేసిన వాగ్దానాన్ని స్థిరపరచి, నీవిచ్చిన మాటను ఈ రోజు నెరవేర్చావు. యెహోవా, ఇశ్రాయేలీయుల దేవా, ‘నీవు ఏవిధంగా నా ఎదుట నడుచుకున్నావో అదే విధంగా నీ సంతానం మంచి నడవడి కలిగి, నా ఎదుట నడుచుకుంటే నా దృష్టికి అనుకూలుడై ఇశ్రాయేలీయుల సింహాసనం మీద ఆసీనుడయ్యేవాడు నీ కుటుంబంలో ఉండక మానడు’ అని వాగ్దానం చేశావు. ఇప్పుడు నీవు నీ వాగ్దానాన్ని స్థిరపరచు. ఇశ్రాయేలీయుల దేవా, దయచేసి నీ దాసుడు, నా తండ్రి అయిన దావీదుతో నీవు చెప్పిన మాటను నిశ్చయం చెయ్యి. వాస్తవానికి దేవుడు ఈ లోకంలో నివాసం చేస్తాడా? ఆకాశ మహాకాశాలు సైతం నిన్ను పట్టలేవే! నేను కట్టించిన ఈ మందిరం ఏ విధంగా సరిపోతుంది? అయినప్పటికీ, యెహోవా, నా దేవా, నీ దాసుడినైన నా ప్రార్థననూ మనవినీ అంగీకరించి, ఈ రోజు నీ దాసుడినైన నేను చేసే ప్రార్థననూ నా మొర్రనూ ఆలకించు. నీ దాసుడినైన నేను చేసే ప్రార్థనను దయతో అంగీకరించేలా ‘నా నామం అక్కడ ఉంటుంది’ అని ఏ స్థలం గురించి నీవు చెప్పావో ఆ ఈ మందిరం వైపు నీ కళ్ళు రాత్రీ, పగలూ తెరచుకుని ఉంటాయి గాక. నీ దాసుడినైన నేనూ నీ ప్రజలైన ఇశ్రాయేలీయులూ ఈ స్థలం వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడెల్లా, నీ నివాసమైన ఆకాశం నుండి విని మా విన్నపాన్ని ఆలకించు. ఆలకించినప్పుడెల్లా మమ్మల్ని క్షమించు. ఎవరైనా తన పొరుగువాడికి అన్యాయం చేసినప్పుడు అతని చేత ప్రమాణం చేయించాల్సి వస్తే అతడు ఈ మందిరంలోని నీ బలిపీఠం ఎదుట ఆ ప్రమాణం చేసినప్పుడు, నీవు ఆకాశం నుండి విని, నీ దాసులకు న్యాయం తీర్చి, హాని చేసినవాడి తల మీదికి శిక్ష రప్పించి, నీతిపరుని నీతిచొప్పున అతనికిచ్చి అతని నీతిని నిర్ధారించు. నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు నీకు వ్యతిరేకంగా పాపం చేయడం వలన తమ శత్రువుల చేతిలో ఓడిపోయినప్పుడు, వారు నీ వైపు తిరిగి నీ పేరును ఒప్పుకుని ఈ మందిరంలో నీకు ప్రార్థనా విజ్ఞాపనలు చేసినప్పుడు నీవు ఆకాశం నుండి విని, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు చేసిన పాపాన్ని క్షమించి, వారి పూర్వీకులకు నీవిచ్చిన దేశంలోకి వారిని తిరిగి రప్పించు. వారు నీకు వ్యతిరేకంగా పాపం చేయడం వలన ఆకాశం మూసుకుపోయి వర్షం కురవకపోతే, వారి ఇబ్బంది వలన వారు నీ నామాన్ని ఒప్పుకుని తమ పాపాలను విడిచి ఈ స్థలం వైపు తిరిగి ప్రార్థన చేస్తే, నీవు ఆకాశం నుండి విని, నీ దాసులు, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు చేసిన పాపాన్ని క్షమించి, వారు నడుచుకోవలసిన మార్గాన్ని వారికి చూపించి, వారికి నీవు స్వాస్థ్యంగా ఇచ్చిన భూమి మీద వర్షం కురిపించు. దేశంలో కరువు గాని, తెగులు గాని, వడ గాడ్పు దెబ్బ గాని, బూజు పట్టడం గాని, పంటలకు మిడతలు గాని, చీడపురుగు గాని సోకినా, వారి శత్రువు వారి పట్టణాలను ముట్టడి వేసినా, ఏ తెగులు గాని వ్యాధి గాని సోకినా, నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల్లో ప్రతి ఒక్కరూ తన హృదయంలో ఉన్న తెగులును గ్రహిస్తాడు గనక ఒక్కడు గానీ ప్రజలందరూ గానీ ఈ మందిరం వైపు తమ చేతులు చాపి ప్రార్థనా విన్నపాలు చేస్తే ప్రతి మనిషి హృదయమూ నీకు తెలుసు కాబట్టి నీవు నీ నివాస స్థలమైన ఆకాశం నుండి విని, క్షమించి, దయచేసి ఎవరు చేసిన దాన్ని బట్టి వారికి ప్రతిఫలమిచ్చి మా పూర్వీకులకు నీవు దయ చేసిన దేశంలో ప్రజలు జీవించినంత కాలం, వారు ఈ విధంగా నీవంటే భయభక్తులు కలిగి ఉండేలా చెయ్యి. మానవులందరి హృదయాలూ నీకు మాత్రమే తెలుసు. నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల సంబంధులు కాని పరదేశులు నీ పేరును బట్టి దూర దేశం నుండి వచ్చి నీ గొప్ప పేరును గురించి, నీ బాహుబలం గురించి, నీవు ఎత్తిన నీ చేతి శక్తిని గురించి వింటారు. వారు వచ్చి ఈ మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తే నీ నివాసమైన ఆకాశం నుండి నీవు విని, పరదేశులు నిన్ను వేడుకొన్న విధంగా సమస్తం అనుగ్రహించు. అప్పుడు లోకంలోని ప్రజలంతా నీ పేరును తెలుసుకుని, నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల్లాగానే నీలో భయభక్తులు కలిగి, నేను కట్టించిన ఈ మందిరానికి నీ పేరు పెట్టామని తెలుసుకుంటారు. నీ ప్రజలు తమ శత్రువులతో యుద్ధం చేయడానికి నీవు పంపించే ఏ స్థలానికైనా బయలు దేరినప్పుడు, నీవు కోరుకొన్న పట్టణం వైపుకూ నీ నామ ఘనత కోసం నేను కట్టించిన ఈ మందిరం వైపుకూ తిరిగి యెహోవావైన నీకు ప్రార్థన చేస్తే, ఆకాశం నుండి నీవు వారి ప్రార్థన విన్నపాలను విని, వారికి సహాయం చెయ్యి. పాపం చేయనివాడు ఒక్కడూ లేడు, వారు నీకు విరోధంగా పాపం చేసినపుడు, నీవు వారి మీద కోపగించుకుని వారిని శత్రువుల చేతికి అప్పగించినప్పుడు, వారు వీరిని దూరమైనా, దగ్గరైనా ఆ శత్రువుల దేశానికి చెరగా తీసుకుపోయినప్పుడు, వారు చెరగా వెళ్ళిన దేశంలో తాము చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకుని, ‘మేము దుర్మార్గంగా ప్రవర్తించి పాపం చేశాము’ అని చింతించి, పశ్చాత్తాపపడి నీకు విన్నపం చేస్తే, వారు చెరలో ఉన్న దేశం నుండి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో నీ వైపు తిరిగి, నీవు వారి పూర్వీకులకు దయచేసిన దేశం వైపూ, నీవు కోరుకున్న పట్టణం వైపూ నీ నామఘనత కోసం నేను కట్టించిన ఈ మందిరం వైపూ తిరిగి నీకు ప్రార్థన చేస్తే, నీ నివాసమైన ఆకాశం నుండి నీవు వారి ప్రార్థన విన్నపాలు విని వారి పని జరిగించు. నీకు వ్యతిరేకంగా పాపం చేసిన నీ ప్రజలు ఏ తప్పుల విషయంలో దోషులయ్యారో ఆ తప్పులు క్షమించి, నీ ప్రజలను చెరగొనిపోయిన వారికి వారి పట్ల కనికరం పుట్టించు. వారు నీవెన్నుకున్న నీ ప్రజలు. ఇనుప కొలిమి నుండి తప్పించినట్టుగా నీవు ఐగుప్తు దేశంలోనుండి తప్పించిన నీ ప్రజలు. కాబట్టి నీ దాసుడినైన నేనూ, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులూ చేసే విన్నపం మీద దృష్టి ఉంచి, వారు ఏ విషయాల్లో నిన్ను వేడుకుంటారో వాటిని ఆలకించు. ప్రభూ, యెహోవా, నీవు మా పూర్వీకులను ఐగుప్తులో నుండి రప్పించినప్పుడు నీవు నీ దాసుడైన మోషే ద్వారా ప్రమాణం చేసినట్టు లోకంలోని ప్రజలందరిలో నుండి వారిని నీ స్వాస్థ్యంగా ప్రత్యేకించుకున్నావు కదా.” సొలొమోను ఈ విధంగా ప్రార్థించడం, విన్నపాలు చేయడం ముగించి ఆకాశం వైపు తన చేతులు చాపి, యెహోవా బలిపీఠం ఎదుట మోకాళ్ళపై నుండి లేచి నిలబడ్డాడు. అప్పుడు అతడు పెద్ద స్వరంతో ఇశ్రాయేలీయుల సమాజాన్ని ఈ విధంగా దీవించాడు, “తాను చేసిన వాగ్దానాలన్నిటినీ నెరవేర్చి తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తుతి కలుగు గాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానాల్లో ఒక్క మాటైనా విఫలం కాలేదు. కాబట్టి మన దేవుడు యెహోవా మనలను విడిచి పెట్టకుండా మన పూర్వీకులకు తోడుగా ఉన్నట్టు మనకు కూడా తోడుగా ఉండి తన మార్గాలన్నిటినీ అనుసరించి నడుచుకొనేలా, తాను మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను, కట్టడలను, విధులను పాటించేలా, మన హృదయాలను తన వైపు తిప్పుకుంటాడు గాక. ఆయన తన దాసుడినైన నా కార్యాన్ని, తన ప్రజలైన ఇశ్రాయేలీయుల కార్యాన్ని అనుదిన అవసరత ప్రకారం, జరిగించేలా నేను యెహోవా ఎదుట వేడుకొన్న ఈ మాటలు రాత్రీ పగలూ మన దేవుడు యెహోవా సన్నిధిలో ఉంటాయి గాక. అప్పుడు లోకం లోని ప్రజలంతా యెహోవాయే దేవుడనీ, ఆయన తప్ప వేరే దేవుడు లేడనీ తెలుసుకుంటారు. కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకోడానికి, ఈ రోజున ఉన్నట్టు ఆయన చేసిన నిర్ణయాలను పాటించడానికి, మీ హృదయం మీ దేవుడు యెహోవా విషయంలో యథార్థంగా ఉండుగాక.”

షేర్ చేయి
Read 1 రాజులు 8

1 రాజులు 8:22-61 పవిత్ర బైబిల్ (TERV)

పిమ్మట సొలొమోను యెహోవా బలిపీఠం ముందు నిలబడ్డాడు. ప్రజలంతా అతనికి ఎదురుగా నిలబడ్డారు. రాజైన సొలొమోను చేతులు చాపి, ఆకాశంవైపు చూశాడు. అతనిలా అన్నాడు: “ఓ ప్రభూ, ఇశ్రాయేలీయుల దేవా! నీవంటి యెహోవా ఆకాశంలో గాని, భూమి మీద గాని మరొక్కడు లేడు. నీ ప్రజలను నీవు మిక్కిలిగా ప్రేమిస్తున్నావు. కావున నీవు వారితో ఒక ఒడంబడిక చేసుకున్నావు. నిన్ననుసరించే ప్రజల పట్ల నీ ఒడంబడిక తప్పక అమలు పర్చుతావు. నీ సేవకుడు, నా తండ్రి అయిన దావీదుకు నీవు ఆ వాగ్దానం చేశావు. నీవు ఆ వాగ్దానం నెరవేర్చావు. నీ నోటితో నీవే ఆ వాగ్దానం చేశావు. నీ అమోఘమైన శక్తి సంపదతో ఆ వాగ్దానం ఈ రోజు నిజమయ్యేలా చేశావు. ఇశ్రాయేలీయుల దేవుడవైన నా ప్రభువా, నా తండ్రియు నీ సేవకుడు అయిన దావీదుకు నీవు చేసిన ఇతర వాగ్దానాలను కూడ ఇప్పుడు నెరవేర్చు. నీవిలా అన్నావు: ‘నీవు నా ఆజ్ఞలను పాటించినట్లు నీ కుమారులు కూడా నన్ననుసరించే విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలి. వారు అలా చేస్తే నీవు నీ కుటుంబంలో ఎల్లప్పుడూ ఇశ్రాయేలును పాలించటానికి ఒకనిని కలిగి వుంటావు.’ ఇశ్రాయేలు దైవమగు ఓ నా ప్రభువా, నీవు నా తండ్రికిచ్చిన ఆ వాగ్దానం కొనసాగించుమని కూడా నేను వేడు కుంటున్నాను. “కాని దేవుడు నిజంగా ఈ భూమి మీద నివసించగలడా? ఈ ఆకాశము, ఉన్నత ఆకాశాలు నిన్ను భరించ జాలవు. నేను నిర్మించిన ఈ నివాసం కూడ ఖచ్చితంగా నిన్ను ఇముడ్చుకోలేదు. దయచేసి నా ప్రార్థనను, నా మనవిని ఆలకించు. నేను నీ సేవకుడను. నీవు నా ప్రభువైన దేవుడవు. నేను చేసే ఈ ప్రార్థన ఆలకించు. గతంలో నీవు, ‘నేనక్కడ గౌరవింపబడుదు’నని చెప్పావు. దయచేసి ఈ ఆలయాన్ని రాత్రింబవళ్లు కనిపెట్టుకుని ఉండు. ఈ దేవాలయంలో నేను చేసే ఈ ప్రార్థన ఆలకించు. దయచేసి నీ సేవకుడనైన నేను, ఇశ్రాయేలు ప్రజలు ఈ స్థలంలో చేసే ప్రార్థనలన్నీ ఆలకించు. మాకు తెలుసు నీవు పరలోకంలో నివసిస్తావని, అక్కడ నుండి మా ప్రార్థన ఆలకించి, మమ్మల్ని మన్నించుమని మేము నిన్ను వేడుకుంటున్నాము. “ఎవరైనా ఒక వ్యక్తి మరో వ్యక్తి పట్ల అపచారం చేస్తే, వాడు ఈ బలిపీఠం వద్దకు తేబడతాడు. ఆ వ్యక్తి గనుక నేరం చేయకపోతే, తన నిర్దోషత్వాన్ని నిరూపించుకుంటూ ఒక ప్రమాణం చేస్తాడు. పరలోకంలోనుండి నీవు అది విని, ఆ వ్యక్తి పట్ల న్యాయనిర్ణయం చెయ్యి. దోషిని శిక్షించి, అమాయకుడైన వానిని క్షమించు. “కొన్నిసార్లు నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు నీ పట్ల పాపం చేయవచ్చు; మరియు వారి శత్రువులు వారిని ఓడించవచ్చు. వారు మరల నీ వద్దకు తిరిగివచ్చి నీకు స్తోత్రం చేస్తారు. ఈ దేవాలయంలో వారు నిన్ను వేడుకొంటూ ప్రార్థనలు చేస్తారు. పరలోకంలో నీవు వారి ప్రార్థన దయచేసి విను. నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల పాపాలను క్షమించు. మళ్లీ వారి రాజ్యం వారికి వచ్చేలా చేయి. ఈ రాజ్యం వారి పూర్వీకులకు నీవు ఇచ్చినదే! “మరి కొన్ని సార్లు వారు నీకు వ్యతిరేకంగా పాపం చేస్తే, వారి భూముల్లో వర్షం కురియకుండా నీవు చేస్తావు. వారు మరల ఈ ప్రదేశానికి వచ్చి నిన్ను ప్రార్థించి, స్తుతిస్తారు. నీవు వారిని బాధించినప్పుడు, వారు చేసిన పాపాలకు వారు పశ్చాత్తాపం పొందుతారు. ఇది జరిగినప్పుడు, పరలోకంలో నీవు వారి ప్రార్థన ఆలకించుము. నీ సేవకుడనగు నా తప్పులు, ఇశ్రాయేలు ప్రజల తప్పులను మన్నించు. పరలోకాన్నిగురించి వారికి బోధించు. యెహోవా, అప్పుడు దయచేసి రాజ్యంలో వర్షం కురిపించు. ఈ రాజ్యం వారికి నీవిచ్చినదే! “ఈ నేల బాగా ఎండిపోయి, పంటలు పండక పోవచ్చు. లేక భయంకర వ్యాధి ప్రజలలో వ్యాపించవచ్చు. బహుశా పండిన పంటనంతా క్రిమికీటకాదులు నాశనం చేయవచ్చు. లేక నీ ప్రజలు వారి నగరాలలో శత్రువాత పడవచ్చు లేక నీ ప్రజలలో చాలామంది వ్యాధిగ్రస్థులు కావచ్చు. వీటిలో ఏదైనా జరిగినప్పుడు, ఏ ఒక్కడైనా జరిగిన దానికి పశ్చాత్తాపపడి, చేతులు చాచి ఈ దేవాలయంలో నిలబడి నీకు ప్రార్థన చేస్తే, దయచేసి అతని ప్రార్థన ఆలకించు. పరలోకంలో నీవు నీ నివాసంలో వుండగా దానిని ఆలకించు. ఆలకించి ఈ ప్రజలను మన్నించి, వారికి సహాయం చేయి. ప్రజలు నిజంగా ఏమి ఆలోచిస్తున్నారో తెలుసుకోగల శక్తి నీకు తప్ప మరి ఎవ్వరికీ లేదు. కావున ప్రతి వ్యక్తికీ తీర్పు తీర్చి ఏది ఉచితమో వానికి అది చేయి. నీవు అలాగున చేయి. దానివల్ల వారు నీ పట్ల భయభ్రాంతులతో, భక్తి భావంతో మా పూర్వీకులకు నీవిచ్చిన ఈ రాజ్యంలో సదా జీవిస్తారు. “ఇతర ప్రాంతాల ప్రజలు కూడా నీ ప్రతిభా విశేషాలను గురించి వింటారు. వారు దూర ప్రాంతాలనుండి దేవాలయానికి ప్రార్థనలు చేయటానికి వస్తారు. నీ పరలోక నివాసంనుండి దయచేసి వారి మనవి ఆలకించు. ఇతర ప్రాంతాలవారు నిన్నడిగినదంతా దయచేసి నెరవేర్చు. ఇశ్రాయేలులో నీ ప్రజలు నీపట్ల ఎలాంటి భయభక్తులతో మెలుగుతారో, వారు కూడ అలా నీపట్ల విధేయులైయుంటారు. అప్పుడు సర్వప్రాంతాల ప్రజలంతా నీ గౌరవార్థం నేను కట్టించిన ఈ దేవాలయం గురించి తెలుసుకుంటారు. “కొన్ని సార్లు వారి శత్రువులతో పోరాడటానికి నీవు నీ ప్రజలకు ఆజ్ఞ ఇవ్వవచ్చు. అలాంటప్పుడు వారు నీవు ఎన్నుకున్న ఈ నగరానికి వచ్చిగాని, నీ గౌరవార్థం నేను కట్టించిన ఈ దేవాలయానికి వచ్చిగాని ప్రార్థన చేస్తారు. ఆ సమయంలో పరలోకంలో వున్న నీవు విని వారికి సహాయం చేయి. “నీ ప్రజలు నీ పట్ల పాపం చేస్తారు. ఇది నాకు తెలుసు. ఎందువల్లననగా పాపం చేయని వ్యక్తి లేడు. నీ ప్రజల పట్ల నీకు కోపం వస్తుంది. వారి శత్రువులు వారిని ఓడించేలా చేస్తావు. వారి శత్రువులు వారిని బందీలు చేసి దూర ప్రాంతాలకు తీసుకొని పోతారు. ఆ దూర పరాయి రాజ్యంలో నీ ప్రజలు జరిగిన దానిని జ్ఞాపకం చేసుకుంటారు. వారు చేసిన పాపానికి వారు పశ్చాత్తాప పడతారు. ఆ పరాయి రాజ్యంలో బందీలుగా వుండి వారు నిన్ను ప్రార్థిస్తారు. వారు ‘మేము పాపం చేశాం; మేము తప్పుచేశాం’ అని అంటారు. వారు నిజంగా ఆ పరాయి రాజ్యాలలో నిన్ను ఆశ్రయిస్తే, నీవు వారి పూర్వీకులకు ఇచ్చిన ఈ రాజ్యంవైపుగాని, నీవు ఎన్నుకున్న ఈ నగరంవైపు గాని, నేను నీ గౌరవార్థం కట్టించిన ఈ దేవాలయమువైపు గాని తిరిగి ప్రార్థిస్తే, దయచేసి పరలోకంలో వున్న నీవు వారి ప్రార్థన ఆలకించు. నీ ప్రజల పాపాలన్నిటినీ క్షమించు. నీకు వ్యతిరేకంగా తిరిగినందుకు కూడా వారిని క్షమించు. వారి శత్రువులు వారిపట్ల ఉదారంగా వుండేలా చేయి. వారు నీ ప్రజలే అని ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకో. నీవు వారిని ఈజిప్టు నుండి బయటకు తెచ్చినట్లు జ్ఞాపక ముంచుకో. మండుతున్న కొలిమిలోనుండి బయటికి తీసినట్లు వారిని రక్షించావు! “ప్రభువైన దేవా, నా ప్రార్థనలను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల ప్రార్థనలను దయచేసి ఆలకించు. వారు ఏ సమయములో నిన్ను నీ సహాయము కోరి ప్రార్థించినా వారి ప్రార్థన విను. ఈ భూలోకంలోవున్న ప్రజానీకమంతటిలో వారిని నీవు నీ ప్రజలుగా ఎంపిక చేశావు. యెహోవా మా పూర్వీకులను ఈజిప్టునుండి తీసుకొని వచ్చినప్పుడు, నీ సేవకుడైన మోషే ద్వారా ఈ వాగ్దానం నీవు చేశావు.” ఈ విధంగా సొలొమోను దేవునికి ప్రార్థన చేశాడు. దేవుని బలిపీఠం ముందు అతను మోకాళ్ల మీద ఉన్నాడు. తన చేతులను ఆకాశం వైవు చాచి అతడు ప్రార్థించాడు. సొలొమోను ప్రార్థన ముగించిన పిమ్మట లేచి నిలబడ్డాడు. పిమ్మట, పెద్ద గొంతుతో ఇశ్రాయేలు ప్రజలందరినీ దీవించమని దేవుని అర్థించాడు. సొలొమోను ఇలా అన్నాడు: “యెహోవాకు స్తోత్రము కలుగునుగాక! తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు విశ్రాంతి ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. అలాగే ఆయన మనకు విశ్రాంతి ఇచ్చాడు! తన సేవకుడైన మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు అనేక శుభప్రదమైన వాగ్దానాలను చేశాడు. యెహోవా ఈ వాగ్ధానాలన్నిటినీ నెరవేర్చాడు. మనదేవుడైన యెహోవాను మనతో ఉండమని అడుగుతున్నాను. ఆయన మన పూర్వీకులతో ఎలావున్నాడో అలాగే మనతో కూడ ఉండమని అడుగుతున్నాను. మనలను ఎన్నడూ వదిలి వుండవద్దని వేడు కుంటున్నాను. ఈ రకంగా మనం ఆయనను ఆశ్రయించి, ఆయనను అనుసరించుదాం. ఆయన మనపూర్వీకులకు ఇచ్చిన న్యాయసూత్రాలను, ఆజ్ఞలను మనము ఆచరిద్దాము. నా ఈ ప్రార్థన, నేనడిగిన అన్ని విషయాలు సదా గుర్తుచుకోమని మన దేవుడైన యెహోవాను అడుగుతున్నాను. తన సేవకుడైన రాజు కొరకు, ఇశ్రాయేలు ప్రజలకొరకు ఇవన్నీ జరిపించమని వేడుకుంటున్నాను. ఇలా ప్రతి రోజూ జరిపించమని కూడా వేడుకుంటున్నాను. యెహోవా ఇవన్నీ జరిగేలా చేస్తే ప్రపంచ ప్రజలంతా మన దేవుడైన యెహోవాయే నిజమైన దేవుడని తెలుసుకుంటారు. మన దేవుడైన యెహోవాకు మీరంతా చెందియున్నారు. కావున మన దేవుడైన యెహోవాకు విధేయులై యుండాలి. ఆయన న్యాయ సూత్రాలను, ఆజ్ఞలను మీరంతా తప్పక అనుసరించాలి. మీరిప్పుడు చేస్తున్నట్లు భవిష్యత్తులో కూడ ఆయన మార్గాన్ని మీరనుసరించాలి.”

షేర్ చేయి
Read 1 రాజులు 8

1 రాజులు 8:22-61 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఇశ్రాయేలీయుల సమాజకులందరు చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠము ఎదుట నిలువబడి ఆకాశముతట్టు చేతులెత్తి యిట్లనెను –యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమియందైనను నీవంటి దేవుడొకడును లేడు; పూర్ణమనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కని కరము చూపుచు ఉండువాడవై యున్నావు, నీ దాసుడైన నా తండ్రియగు దావీదునకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరచి, నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చియున్నావు. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా–నీ కుమారులు సత్ ప్రవర్తనగలవారై, నీవు నా యెదుట నడచినట్లు నా యెదుట నడచినయెడల, నా దృష్టికి అనుకూ లుడై ఇశ్రాయేలీయులమీద సింహాసనాసీనుడగువాడు నీకుండక మానడని సెలవిచ్చితివి. నీవు నీ దాసుడును నా తండ్రియునగు దావీదునకు ఇచ్చిన వాగ్దానమును స్థిర పరచుము. ఇశ్రాయేలీయుల దేవా, దయచేసి నీ దాసుడును నా తండ్రియునైన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు; ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు; నేను కట్టించిన యీ మందిరము ఏలాగు పట్టును? అయినను యెహోవా నా దేవా, నీ దాసుడనైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి, యీ దినమున నీ దాసుడనైన నేనుచేయు ప్రార్థనను పెట్టు మొఱ్ఱను ఆలకించుము. నీ దాసుడనైన నేనుచేయు ప్రార్థనను దయతో అంగీ కరించునట్లు–నా నామము అక్కడ ఉండునని యే స్థలమునుగూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన యీ మందిరముతట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి యుండునుగాక. మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులును ఈ స్థలముతట్టు తిరిగి ప్రార్థన చేయునప్పుడెల్ల, నీ నివాసస్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము; వినునప్పుడెల్ల మమ్మును క్షమించుము. ఎవడైనను తన పొరుగువానికి అన్యాయముచేయగా అతనిచేత ప్రమాణము చేయించుటకు అతనిమీద ఒట్టు పెట్టబడినయెడల, అతడు ఈ మందిరమందున్న నీ బలిపీఠము ఎదుట ఆ ఒట్టు పెట్టు నప్పుడు నీవు ఆకాశమందు విని, నీ దాసులకు న్యాయము తీర్చి, హాని చేసినవాని తలమీదికి శిక్ష రప్పించి నీతిపరుని నీతిచొప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చేయుము. మరియు ఇశ్రాయేలీయులగు నీ జనులు నీకు విరోధముగా పాపముచేయుటచేత తమ శత్రువులయెదుట మొత్తబడినప్పుడు, వారు నీతట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని యీ మందిరమందు నిన్నుగూర్చి ప్రార్థన విన్నపములు చేయునప్పుడెల్ల నీవు ఆకాశమందు విని, ఇశ్రాయేలీయులగు నీ జనులు చేసిన పాపమును క్షమించి, వారి పితరులకు నీవిచ్చిన దేశములోనికి వారిని తిరిగి రప్పించుము. మరియు వారు నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేక పోగా, నీవు వారిని ఈలాగునశ్రమపెట్టుటవలనవారు నీ నామమును ఒప్పు కొని తమ పాపములను విడిచి యీ స్థలముతట్టు తిరిగి ప్రార్థనచేసినయెడల నీవు ఆకాశమందు విని, నీ దాసులైన ఇశ్రాయేలీయులగు నీ జనులు చేసిన పాపమును క్షమించి, వారు నడువవలసిన సన్మార్గమును వారికి చూపించి, నీ జనులకు నీవు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపింపుము. దేశమందు క్షామముగాని తెగులుగాని గాడ్పుదెబ్బగాని చిత్తపట్టుటగాని మిడ తలుగాని చీడపురుగుగాని కలిగినను, వారి శత్రువు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినను, ఏ తెగులుగాని వ్యాధిగాని కలిగినను, ఇశ్రాయేలీయులగు నీ జనులలో ప్రతి మనిషి తన తన మనోవ్యాధిని తెలిసికొనును గదా; ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరముతట్టు తమ చేతులు చాపి ప్రార్థన విన్నపములు చేసినయెడల ప్రతి మనిషియొక్క హృదయము నీ వెరుగుదువు గనుక నీవు ఆకాశమను నీ నివాసస్థలమందు విని, క్షమించి దయచేసి యెవరి ప్రవర్తననుబట్టి వారికి ప్రతిఫలమిచ్చి మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రదుకు దినములన్నిటను వారు నీయందు భయభక్తులు కలిగియుండునట్లు చేయుము; నరపుత్రులందరి హృదయములను నీవు మాత్రమే తెలిసికొని యున్నావు. మరియు ఇశ్రాయేలీయులగు నీ జనుల సంబంధులు కాని పరదేశులు నీ నామమునుబట్టి దూరదేశమునుండి వచ్చి నీ ఘనమైన నామమునుగూర్చియు, నీ బాహుబలమునుగూర్చియు, నీవు చాపిన బాహువు ప్రసి ద్ధిని గూర్చియు విందురు. వారు వచ్చి యీ మందిరముతట్టు తిరిగి ప్రార్థన చేసినయెడల ఆకాశమను నీ నివాసస్థలమందు నీవు విని, పరదేశులు నిన్ను వేడుకొను దాని ప్రకారము సమస్తము ననుగ్రహించుము, అప్పుడు లోకములోని జనులందరును నీ నామమును ఎరిగి, ఇశ్రాయేలీయులగు నీ జనులవలెనే నీయందు భయభక్తులు కలిగి, నేను కట్టించిన యీ మందిరమునకు నీ పేరు పెట్టబడిన దని తెలిసికొందురు. మరియు నీ జనులు తమ శత్రువులతో యుద్ధము చేయుటకై నీవు వారిని పంపించు ఏ స్థలమునకైనను బయలుదేరునప్పుడు, నీవు కోరుకొనిన పట్టణముతట్టును నీ నామఘనతకు నేను కట్టించిన మందిరముతట్టును యెహోవావగు నీకు వారు ప్రార్థన చేసినయెడల ఆకాశమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని, వారికార్యమును నిర్వహించుము. పాపము చేయనివాడు ఒకడును లేడు, వారు నీకు విరోధముగా పాపము చేసినయెడల నేమి, నీవు వారిమీద కోపగించుకొని వారిని శత్రువులచేతికి అప్పగించినయెడలనేమి, వారు వీరిని దూరమైనట్టిగాని దగ్గరయైనట్టిగాని ఆ శత్రువుల దేశములోనికి చెరగా కొనిపోయినప్పుడు వారు చెరగా కొనిపోబడిన దేశమందు తాము చేసిన దానిని మనస్సునకు తెచ్చుకొని–మేము దుర్మార్గులమై ప్రవర్తించి పాపము చేసితిమని చెప్పి, తమ్మును చెరగా కొనిపోయిన వారిదేశమందు చింతించి పశ్చాత్తాపపడి నీకు విన్నపము చేసినయెడల తమ్మును చెరగా కొనిపోయిన వారియొక్క దేశమందు పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను వారు నీతట్టు తిరిగి, నీవు వారి పితరులకు దయచేసిన దేశముతట్టును నీవు కోరుకొనిన పట్టణముతట్టును నీ నామఘనతకు నేను కట్టించిన మందిరముతట్టును నిన్నుగూర్చి ప్రార్థనచేసినయెడల ఆకాశమను నీ నివాసస్థలమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారికార్యమును నిర్వహించి నీకు విరోధముగా పాపము చేసిన నీ జనులు ఏ తప్పులచేత నీ విషయమై అపరాధు లైరో ఆ తప్పులను వారికి క్షమించి, వారిని చెరలోనికి కొనిపోయినవారు వారిని కనికరించునట్లు వారియెడల కని కరము పుట్టించుము. వారు ఐగుప్తుదేశములోనుండి ఆ ఇనుపకొలిమిలోనుండి నీవు రప్పించిన నీ జనులును నీ స్వాస్థ్యమునై యున్నారు. కాబట్టి నీ దాసుడనైన నేనుచేయు విన్నపముమీదను, ఇశ్రాయేలీయులగు నీ జనులుచేయు విన్నపముమీదను, దృష్టియుంచి, వారు ఏ విషయములయందు నిన్ను వేడుకొందురో ఆ విషయములయందు వారి విన్నపముల నాలకించుము. ప్రభువా యెహోవా, నీవు మా పితరులను ఐగుప్తులోనుండి రప్పించి నప్పుడు నీవు నీ దాసుడైన మోషేద్వారా ప్రమాణమిచ్చినట్లు నీ స్వాస్థ్యమగునట్లుగా లోకమందున్న జనులంద రిలోనుండి వారిని ప్రత్యేకించితివి గదా. సొలొమోను ఈలాగు ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశముతట్టు తన చేతులను చాపి, యెహోవా బలిపీఠము ఎదుట మోకాళ్లూనుట మాని, లేచి నిలిచిన తరువాత అతడు మహాశబ్దముతో ఇశ్రాయేలీయుల సమాజమంతటిని దీవించెను. ఎట్లనగా –తాను చేసిన వాగ్దానమంతటినిబట్టి ఇశ్రాయేలీయులగు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగియుండును గాక. తన దాసుడైన మోషేద్వారా ఆయన చేసిన శుభవాగ్దానములో ఒక మాటైన తప్పిపోయినదికాదు కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలకను విడువకను, మన పితరులకు తోడుగానున్నట్లు మనకును తోడుగా ఉండి తన మార్గములన్నిటిని అనుసరించి నడుచుకొనునట్లుగాను, తాను మన పితరులకిచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను చేకొనునట్లుగాను, మన హృదయములను తనతట్టు త్రిప్పుకొనును గాక. ఆయన తన దాసుడనైన నా కార్యమును ఇశ్రాయేలీయులగు తన జనుల కార్యమును అవసరముచొప్పున, ఎల్లప్పుడును నిర్వహించునట్లుగా నేను యెహోవా యెదుట విన్నపము చేసిన యీ మాటలు రేయింబగలు మన దేవుడైన యెహోవా సన్నిధిని ఉండును గాక. అప్పుడు లోకమందున్న జనులందరును యెహోవాయే దేవుడనియు, ఆయన తప్ప మరి ఏ దేవుడును లేడనియు తెలిసికొందురు. కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచు కొనుటకును, ఈ దినమందున్నట్లు ఆయన చేసిన నిర్ణయములను చేకొనుటకును, మీ హృదయము మీ దేవుడైన యెహోవా విషయమై సర్వసిద్ధముగా నుండునుగాక.

షేర్ చేయి
Read 1 రాజులు 8

1 రాజులు 8:22-61 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

అప్పుడు సొలొమోను యెహోవా బలిపీఠం ముందు, ఇశ్రాయేలు సమాజమంతటి సమక్షంలో నిలబడి ఆకాశం వైపు చేతులు చాపి, ఇలా ప్రార్థించాడు: “యెహోవా, ఇశ్రాయేలు దేవా, పైన ఆకాశంలో గాని, క్రింద భూమిమీద గాని, మీలాంటి దేవుడు మరొకడు లేడు. మీ మార్గంలో హృదయమంతటితో కొనసాగే మీ సేవకుల పట్ల మీ ప్రేమ నిబంధనను నెరవేరుస్తారు. మీరు మీ సేవకుడూ, నా తండ్రియైన దావీదుతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చారు; మీ నోటితో చేసిన వాగ్దానాన్ని ఈ రోజున కనబడుతున్నట్టుగా మీ చేతులతో నెరవేర్చారు. “ఇప్పుడు యెహోవా! ఇశ్రాయేలు దేవా! మీరు మీ సేవకుడూ, నా తండ్రియైన దావీదుతో, ‘నీ వారసులు తమ ప్రవర్తన విషయంలో జ్రాగత్తగా ఉంటూ, నీలా నా ఎదుట నమ్మకంగా జీవిస్తే, ఇశ్రాయేలు సింహాసనం మీద ఆసీనుడయ్యేవాడు నీ సంతానంలో ఉండక పోడు’ అని చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చండి. ఇప్పుడు ఇశ్రాయేలు దేవా! మీ సేవకుడైన నా తండ్రి దావీదుతో మీరు చేసిన వాగ్దానాన్ని స్థిరపరచండి. “దేవుడు భూమి మీద నిజంగా నివాసం చేస్తారా? ఆకాశ మహాకాశం మీకు సరిపోవు, నేను కట్టించిన ఈ మందిరం ఏం సరిపోతుంది! అయినా యెహోవా నా దేవా, మీ దాసుడైన నేను చేసే ప్రార్థన, కనికరం కోసం చేసే విన్నపం ఆలకించండి. ఈ రోజు మీ దాసుడు మీ సన్నిధిలో చేసే మొరను, ప్రార్థనను వినండి. నా పేరు అక్కడ ఉంటుందని మీరు ఈ మందిరాన్ని గురించి అన్నారు. కాబట్టి మీ దాసుడు ఈ స్థలం వైపు తిరిగి చేసే ప్రార్థన మీరు వినేలా రాత్రింబగళ్ళు మీ కనుదృష్టి ఈ మందిరంపై ఉంచండి. మీ దాసుడు, మీ ఇశ్రాయేలు ప్రజలు ఈ స్థలం వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడు వారి విన్నపం ఆలకించండి. మీ నివాసస్థలమైన పరలోకం నుండి వినండి, మీరు విన్నప్పుడు క్షమించండి. “ఎవరైనా తన పొరుగువారి పట్ల తప్పు చేశారని ఆరోపించబడి వారు ప్రమాణం చేయాల్సివస్తే ఈ మందిరంలో మీ బలిపీఠం ముందు ఆ ప్రమాణం చేసినప్పుడు, మీరు ఆకాశం నుండి విని మీ దాసులకు న్యాయం తీర్చండి. దోషులను వారి దోషం బట్టి శిక్షిస్తూ, నిర్దోషుల నిర్దోషత్వాన్ని బట్టి వారి నిర్దోషత్వాన్ని నిర్ధారించండి. “మీ ఇశ్రాయేలు ప్రజలు మీకు వ్యతిరేకంగా పాపం చేసినందుకు వారి శత్రువుల చేతిలో ఓడిపోయినప్పుడు, వారు మీ వైపు తిరిగి మీ నామానికి స్తుతి చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఈ మందిరంలో మిమ్మల్ని వేడుకున్నప్పుడు, మీరు పరలోకం నుండి విని, మీ ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపాన్ని క్షమించి, వారి పూర్వికులకు మీరు ఇచ్చిన దేశానికి వారిని మళ్ళీ తీసుకురండి. “మీ ప్రజలు మీకు వ్యతిరేకంగా పాపం చేసినందుకు, ఆకాశం మూయబడి వర్షం లేనప్పుడు, వారు తమకు కలిగిన శ్రమ వలన తమ పాపం విడిచిపెట్టి ఈ స్థలం వైపు తిరిగి మీ నామానికి స్తుతి చెల్లిస్తూ, ప్రార్థిస్తే, మీరు పరలోకం నుండి విని, మీ దాసులు, మీ ఇశ్రాయేలు ప్రజల పాపాన్ని క్షమించండి. సరైన మార్గాన్ని అనుసరిస్తూ జీవించాలని వారికి బోధించండి, మీ ప్రజలకు స్వాస్థ్యంగా ఇచ్చిన దేశంలో వర్షం కురిపించండి. “దేశంలో కరువు గాని తెగులు గాని వడగాలి గాని నాచు గాని మిడతలు గాని పురుగులు గాని వచ్చినా, వారి శత్రువు వారి పట్టణాల్లో వారిని ముట్టడి చేసినా, ఏదైనా విపత్తు గాని రోగం గాని వచ్చినా, మీ ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరైనా తమ హృదయాల వేదనలు తెలుసుకొని, ఈ మందిరం వైపు తమ చేతులను చాచి ప్రార్థన విన్నపం చేస్తే, ప్రతి మనిషి హృదయం మీకు తెలుసు కాబట్టి మీ నివాసస్థలమైన పరలోకం నుండి విని క్షమించి, ఎవరు చేసిన దాన్ని బట్టి వారికి ప్రతిఫలమివ్వండి (ఎందుకంటే ప్రతి మానవ హృదయం మీకు తెలుసు), అప్పుడు మీరు మా పూర్వికులకిచ్చిన ఈ దేశంలో వారు బ్రతికి ఉన్నంత కాలం మీకు భయపడతారు. “మీ ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించని విదేశీయులు, మీ పేరును బట్టి దూరదేశం నుండి వచ్చినవారు, మీ గొప్ప నామం గురించి మీ బలమైన బాహువును గురించి వారు విని, వారు వచ్చి ఈ మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తే, మీ నివాసస్థలమైన పరలోకం నుండి వినండి. విదేశీయులు మిమ్మల్ని ఏమి అడిగినా అది వారికి చేయండి. అప్పుడు భూలోక ప్రజలు మీ ప్రజలైన ఇశ్రాయేలీయుల్లా మీ పేరు తెలుసుకొని మీకు భయపడతారు. నేను కట్టిన ఈ మందిరం మీ పేరు కలిగి ఉందని తెలుసుకుంటారు. “మీ ప్రజలు తమ శత్రువులతో యుద్ధం చేయడానికి వెళ్లినప్పుడు, మీరు వారిని ఎక్కడికి పంపినా, మీరు ఎన్నుకున్న పట్టణం వైపు, నేను మీ నామం కోసం కట్టిన మందిరం వైపు తిరిగి, వారు యెహోవాకు ప్రార్థన చేస్తే, అప్పుడు పరలోకం నుండి వారి ప్రార్థన విన్నపం విని వారి పక్షాన ఉండండి. “పాపం చేయని మనుష్యులు లేరు కాబట్టి వారు మీకు విరుద్ధంగా పాపం చేసినప్పుడు, మీరు వారిపై కోప్పడి శత్రువులకు అప్పగిస్తే, వారు వీరిని దూరంగా లేదా దగ్గరగా ఉన్న తమ దేశానికి బందీలుగా తీసుకెళ్తారు; అప్పుడు వారు బందీలుగా ఉన్న దేశంలో ఉన్నప్పుడు వారి హృదయాలు మారి పశ్చాత్తాపపడి, ‘మేము తప్పు చేసి దుర్మార్గంగా ప్రవర్తించి పాపం చేశాం’ అని వారు వేడుకుంటే, తాము బందీగా ఉన్న దేశంలో వారు తమ పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో మరలా మీ వైపు తిరిగి, వారి పూర్వికులకు మీరు ఇచ్చిన దేశం వైపు, మీరు ఎన్నుకున్న పట్టణం వైపు, నేను మీ నామం కోసం కట్టిన మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తే, అప్పుడు మీ నివాసస్థలమైన పరలోకం నుండి వారి ప్రార్థన, వారి విన్నపం విని, వారి పక్షాన ఉండండి. మీకు విరుద్ధంగా పాపం చేసిన మీ ప్రజలను క్షమించండి; మీకు విరుద్ధంగా వారు చేసిన తప్పులన్నిటిని క్షమించి, వారిని బందీగా తీసుకెళ్లిన వారు వీరిని కరుణించేలా చేయండి; ఎందుకంటే వారు మీ ప్రజలు, మీ స్వాస్థ్యం, మీరు వారిని ఈజిప్టు నుండి ఆ ఇనుప కొలిమి మధ్యలో నుండి బయట తీసుకువచ్చారు. “కాబట్టి మీ కనుదృష్టి మీ దాసుని మీద, ఇశ్రాయేలు ప్రజల విన్నపం మీద ఉండును గాక, వారు మీకు మొరపెట్టినప్పుడు మీరు విందురు గాక. ఎందుకంటే ప్రభువైన యెహోవా, మీరు మా పూర్వికులను ఈజిప్టు నుండి బయటకు తీసుకువచ్చినప్పుడు మీ సేవకుడైన మోషే ద్వారా ప్రకటించినట్లుగానే, లోకంలోని జనాంగాలన్నిటి నుండి వారిని మీ సొంత వారసత్వంగా చేసుకున్నారు కదా.” సొలొమోను యెహోవాకు ఈ ప్రార్థనలు, విన్నపాలు అన్ని చేసిన తర్వాత, యెహోవా బలిపీఠం ముందు మోకరించి ఆకాశం వైపు చేతులు చాచిన ఆ స్థలం నుండి లేచాడు. అతడు నిలబడి ఇశ్రాయేలు సమాజమంతటిని దీవిస్తూ, స్వరమెత్తి ఇలా అన్నాడు: “యెహోవాకు స్తుతి కలుగును గాక! తన వాగ్దానం ప్రకారం ఆయన తన ఇశ్రాయేలు ప్రజలకు నెమ్మది కలుగజేశారు. ఆయన తన సేవకుడైన మోషేకు ఇచ్చిన మంచి వాగ్దానాలన్నిటిలో ఒక్కటి కూడా తప్పలేదు. మన పూర్వికులతో ఉన్నట్లు మన దేవుడైన యెహోవా మనతో ఉండును గాక; ఆయన మనలను విడువక త్రోసివేయక ఉండును గాక. ఆయన మార్గాన్ని అనుసరిస్తూ, ఆయన మన పూర్వికులకు ఇచ్చిన ఆజ్ఞలను, శాసనాలను, నియమాలను పాటించడానికి, ఆయన వైపు మన హృదయాలను త్రిప్పాలి. ఆయన తన దాసుని పక్షాన, తన ఇశ్రాయేలు ప్రజల పక్షాన అనుదిన అవసరత ప్రకారం కార్యాన్ని జరిగించేలా నేను యెహోవా ఎదుట ప్రార్థన చేస్తూ మాట్లాడిన ఈ మాటలు, మన దేవుడైన యెహోవా ఎదుట రాత్రింబగళ్ళు నిలిచి ఉండాలి! అప్పుడు ప్రపంచంలోని అన్ని జనాంగాలు యెహోవాయే దేవుడని, వేరెవరు లేరని తెలుసుకుంటారు. మీ హృదయాలు ఇప్పుడున్నట్లుగా దేవుడైన యెహోవాకు పూర్తిగా సమర్పించుకొని, ఆయన శాసనాలు ప్రకారం జీవిస్తూ, ఆయన ఆజ్ఞలకు లోబడుతూ ఉండును గాక.”

షేర్ చేయి
Read 1 రాజులు 8