1 రాజులు 4:1-7

1 రాజులు 4:1-7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

సొలొమోను రాజు ఇశ్రాయేలీయులందరి మీదా రాజయ్యాడు. అతని దగ్గర ఉన్న అధికారులు ఎవరంటే, సాదోకు కొడుకు అజర్యా యాజకుడు, షీషా కొడుకులు ఎలీహోరెపు, అహీయా ప్రధాన మంత్రులు, అహీలూదు కొడుకు యెహోషాపాతు లేఖికుడు. యెహోయాదా కొడుకు బెనాయా సైన్యాధిపతి, సాదోకు, అబ్యాతారు యాజకులు. నాతాను కొడుకు అజర్యా అధికారుల పైఅధికారిగా ఉన్నాడు. నాతాను మరో కొడుకు జాబూదు యాజకుడు, రాజు చెలికాడు. అహీషారు గృహ నిర్వాహకుడు, అబ్దా కొడుకు అదోనీరాము వెట్టి చాకిరీ పనివాళ్ళపై అధికారి. ఇశ్రాయేలీయులందరి మీదా సొలొమోను 12 మంది అధికారులను నియమించాడు. వీరు రాజుకు, అతని ఇంటివారికి ఆహారం ఏర్పాటు చేసేవారు. సంవత్సరంలో ఒక్కొక్క నెలకు వారిలో ఒక్కొక్కడు ఆహారం సరఫరా చేసే బాధ్యత వహించాడు.

షేర్ చేయి
Read 1 రాజులు 4

1 రాజులు 4:1-7 పవిత్ర బైబిల్ (TERV)

ఇశ్రాయేలు ప్రజలందరి పైన సొలొమోను రాజు పరిపాలన సాగించాడు. తన పరిపాలనలో అతనికి సహాయ పడిన ప్రముఖమైన అధికారుల పేర్లు ఇవి: సాదోకు కుమారుడైన అజర్యా ప్రధాన యాజకుడు. షీషా కుమారులైన ఎలీహోరెపు మరియు అహీయా న్యాయస్థానాలలో జరిగే వాగ్వాదములు, తీర్పులు మొదలగు వాటిని గ్రంధస్థం చేసే లేఖకులు. అహీలూదు కుమారుడైన యెహోషాపాతు చరిత్రకారుడు. యెహోయాదా కుమారుడైన బెనాయా సైన్యాధ్యక్షుడు. సాదోకు, అబ్యాతారు యాజకులు. నాతాను కుమారుడు అజర్యా మండలాధిపతుల మీద అధికారి. నాతాను కుమారుడైన జాబూదు అంతఃపుర యాజకుడే గాక రాజైన సొలొమోనుకు సలహాదారుడు. అహీషారు రాజు యొక్క ఇంటి నిర్వహణలో అన్ని జాగ్రత్తలు తీసుకొనేవాడు. అబ్దా కుమారుడైన అదోనిరాము బానిసలకు అధిపతి. ఇశ్రాయేలురాజ్య పరిపాలనా సౌలభ్యం కొరకు మండలాల పేరుతో పన్నెండు ప్రాంతాలుగా విభజించారు. ప్రతి మండల పాలనకు రాజైన సొలొమోను ఒక పాలకుని ఎంపిక చేశాడు. ఈ పన్నెండుగురు మండలాధిపతులు రాజుకు, రాజ కుటుంబానికి ఆహారధాన్యాలు, తదితర తిను బండారాలు సేకరించి పంపేలా ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఈ పన్నెండుగురు పాలకులలో ఒక్కొక్కడు సంవత్సరంలో ఒక్కొక్క నెల చొప్పున ఆహర పదార్థాలు సేకరించి రాజుకు పంపే బాధ్యత వహిస్తాడు.

షేర్ చేయి
Read 1 రాజులు 4

1 రాజులు 4:1-7 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

రాజైన సొలొమోను ఇశ్రాయేలీయులందరిమీద రాజాయెను. అతనియొద్దనున్న అధిపతులు ఎవరెవరనగా సాదోకు కుమారుడైన అజర్యా యాజకుడు; షీషా కుమారులైన ఎలీహోరెపును అహీయాయును ప్రధాన మంత్రులు; అహీలూదు కుమారుడైన యెహోషాపాతు లేఖకుడై యుండెను; యెహోయాదా కుమారుడైన బెనాయా సైన్యాధిపతి; సాదోకును అబ్యాతారును యాజకులు. నాతాను కుమారుడైన అజర్యా అధికారులమీద ఉండెను; నాతాను కుమారుడైన జాబూదు రాజు సముఖములోని మిత్రుడును మంత్రియునైయుండెను; అహీషారు గృహ నిర్వాహకుడు; అబ్దా కుమారుడైన అదోనీరాము వెట్టి పని విషయములో అధికారి. ఇశ్రాయేలీయులందరిమీద సొలొమోను పన్నిద్దరు అధికారులను నియమించెను. వీరు రాజునకును అతని ఇంటివారికిని ఆహారము సంగ్రహము చేయువారు. సంవత్సరమందు ఒక్కొక్క నెలకు వారిలో ఒక్కొక్కడు ఆహారమును సంగ్రహము చేయుచుండెను.

షేర్ చేయి
Read 1 రాజులు 4

1 రాజులు 4:1-7 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

రాజైన సొలొమోను ఇశ్రాయేలు అంతటిని పరిపాలించాడు. అతని ప్రముఖ అధికారులు వీరు: సాదోకు కుమారుడు యాజకుడైన అజర్యా; షీషా కుమారులైన ఎలీహోరేపు, అహీయా న్యాయస్థాన కార్యదర్శులు; అహీలూదు కుమారుడైన యెహోషాపాతు దస్తావేజుల అధికారి; యెహోయాదా కుమారుడైన బెనాయా సేనాధిపతి; సాదోకు, అబ్యాతారు యాజకులు; నాతాను కుమారుడైన అజర్యా జిల్లా అధికారులకు అధికారి; నాతాను కుమారుడైన జాబూదు యాజకుడు రాజుకు సలహాదారుడు; అహీషారు రాజభవన నిర్వాహకుడు; అబ్దా కుమారుడైన అదోనిరాము వెట్టిచాకిరి చేసేవారిపై అధికారి. సొలొమోనుకు ఇశ్రాయేలు రాజ్యం అంతటి మీద పన్నెండుమంది జిల్లా అధికారులు ఉన్నారు, వారు రాజుకు అతని ఇంటివారికి ఆహారం సరఫరా చేసేవారు. ఒక్కొక్కరు సంవత్సరంలో ఒక్కొక్క నెల చొప్పున ఆహారం సమకూర్చేవారు.

షేర్ చేయి
Read 1 రాజులు 4