1 రాజులు 21:20-29
1 రాజులు 21:20-29 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అహాబు ఏలీయాతో, “నా శత్రువా, నీవు నన్ను పట్టుకున్నావు కదా!” అన్నాడు. అందుకతడు, “నేను నిన్ను పట్టుకున్నాను, ఎందుకంటే యెహోవా దృష్టికి చెడు చేయడానికి నిన్ను నీవే అమ్ముకున్నావు అన్నాడు. ఆయన, ‘నేను నీ మీదికి విపత్తును తీసుకురాబోతున్నాను. నీ సంతానాన్ని తుడిచివేస్తాను. ఇశ్రాయేలులో బానిసలు స్వతంత్రులు అని లేకుండా అహాబు వంశంలోని మగవారినందరిని నిర్మూలం చేస్తాను. నీ వంశాన్ని నెబాతు కుమారుడైన యరొబాము వంశంలా, అహీయా కుమారుడైన బయెషా వంశంలా చేస్తాను, ఎందుకంటే నీవు నాకు కోపం రేపావు, ఇశ్రాయేలు పాపం చేయడానికి కారణమయ్యావు’ అని అన్నారు. “అంతేకాక యెజెబెలు గురించి యెహోవా ఇలా చెప్తున్నారు: ‘యెజ్రెయేలు ప్రాకారం దగ్గరే యెజెబెలును కుక్కలు తింటాయి.’ “అహాబుకు చెందిన వారిలో పట్టణంలో చనిపోయేవారిని కుక్కలు తింటాయి, దేశంలో చనిపోయేవారిని పక్షులు తింటాయి.” (తన భార్య యెజెబెలు ప్రేరేపణకు లొంగిపోయి యెహోవా దృష్టిలో చెడు చేయడానికి తనను తానే అమ్ముకున్న అహాబులాంటి వారు ముందెన్నడూ ఎవ్వడూ లేరు. అహాబు విగ్రహాలను పెట్టుకుని చాలా నీచంగా ప్రవర్తించేవాడు, ఇశ్రాయేలు ముందు నుండి యెహోవా వెళ్లగొట్టిన అమోరీయుల్లా అతడు చేశాడు.) అహాబు ఆ మాటలు విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకుని ఉపవాసం ఉన్నాడు. గోనెపట్ట మీదే పడుకుంటూ దీనంగా తిరిగాడు. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలీయాకు వచ్చింది: “అహాబు నా ఎదుట ఎలా తగ్గించుకున్నాడో గమనించావా? అతడు తనను తాను తగ్గించుకున్నందుకు అతని జీవితకాలంలో ఈ విపత్తును తీసుకురాను, కాని అతని వంశం మీద తన కుమారుని కాలంలో దానిని తెస్తాను.”
1 రాజులు 21:20-29 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అది విని అహాబు ఏలీయాతో “నా పగవాడా, నేను నీకు దొరికానా?” అన్నాడు. అందుకు ఏలీయా ఇలా అన్నాడు. “యెహోవా దృష్టికి కీడు చేయడానికి నిన్ను నువ్వే అమ్ముకున్నావు. కాబట్టి నీవు నాకు దొరికావు. యెహోవా నీతో ఇలా చెబుతున్నాడు, నేను నీ మీదికి కీడు రప్పిస్తాను. నీ వంశం వారిని నాశనం చేస్తాను. ఇశ్రాయేలు వారిలో బానిస గానీ స్వతంత్రుడు గానీ అహాబు వైపు ఎవరూ లేకుండా పురుషులందరినీ నిర్మూలం చేస్తాను. ఇశ్రాయేలువారు పాపం చేయడానికి నీవు కారకుడివై నాకు కోపం పుట్టించావు. కాబట్టి నెబాతు కొడుకు యరొబాము కుటుంబానికీ అహీయా కొడుకు బయెషా కుటుంబానికీ నేను చేసినట్లు నీ కుటుంబానికీ చేస్తాను. యెజెబెలు గురించి యెహోవా చెప్పేదేమిటంటే యెజ్రెయేలు ప్రాకారం దగ్గర కుక్కలు యెజెబెలును పీక్కుతింటాయి. పట్టణంలో చనిపోయే అహాబు సంబంధులను కుక్కలు తింటాయి. పొలంలో చనిపోయేవారిని రాబందులు తింటాయి” అన్నాడు. తన భార్య యెజెబెలు ప్రేరేపణతో యెహోవా దృష్టిలో కీడు చేయడానికి తన్ను తాను అమ్ముకున్న అహాబులాంటి వాడు ఎవ్వడూ లేడు. ఇశ్రాయేలీయుల దగ్గరనుంచి యెహోవా వెళ్లగొట్టిన అమోరీయులు చేసినట్టు, అతడు విగ్రహాలను పెట్టుకుని చాలా నీచంగా ప్రవర్తించాడు. అహాబు ఆ మాటలు విని తన బట్టలు చించుకుని గోనెపట్ట కట్టుకుని ఉపవాసముండి, గోనెపట్ట మీద పడుకుని చాలా విచారించాడు. యెహోవా తిష్బీ వాడైన ఏలీయాతో ఇలా చెప్పాడు. “అహాబు నా ఎదుట తనను తాను ఎంత తగ్గించుకుంటున్నాడో చూశావా? తనను నా ఎదుట తగ్గించుకుంటున్నాడు కాబట్టి, రాబోయే ఆ కీడును అతని కాలంలో పంపించను. నేనతని కొడుకు రోజుల్లో అతని వంశం మీదికి కీడు రానిస్తాను.”
1 రాజులు 21:20-29 పవిత్ర బైబిల్ (TERV)
తరువాత ఏలీయా అహాబు వద్దకు వెళ్లాడు. ఏలీయాను అహాబు చూసి, “నీవు మళ్లీ నావద్దకు వచ్చావు. నీ వెప్పుడూ నాకు వ్యతిరేకివై శత్రువులా ప్రవర్తిస్తున్నావు” అని అన్నాడు. ఏలీయా ఇలా సమాధానమిచ్చాడు: “అవును, నేను మళ్లీ నిన్ను కలుసుకున్నాను. జీవితమంతా యెహోవాకు విరుద్ధంగా పాపం చేస్తూనే వచ్చావు. అందువల్ల యెహోవా నీతో ఇలా అంటున్నాడు, నేను నిన్ను నాశనం చేస్తాను. నేను నిన్ను, నీ ఇంటిలోని ప్రతిబాలుణ్ణి, మరియు మగవారినందరినీ చంపేస్తాను. నెబాతు కుమారుడైన యరొబాము కుటుంబానికి పట్టిన గతే నీ కుటుంబానికి కూడ పడుతుంది. రాజైన బయెషా కుటుంబంవలె నీ కుటుంబం కూడ అయిపోతుంది. ఆ రెండు కుటుంబాలూ సర్వనాశనం చేయబడ్డాయి. అదే విధంగా నీ కుటుంబానికి కూడ చేస్తాను. కారణమేమంటే నీవు నాకు కోపం కల్గించావు. ఇశ్రాయేలు ప్రజలు చెడుకార్యాలు చేసేటందుకు కూడా నీవు కారుకుడవయ్యావు. ఇంకా యెహోవా చెప్పిన దేమనగా నీ భార్యయగు యెజెబెలు శవాన్ని యెజ్రెయేలు నగరంలో కుక్కలు పీక్కు తింటాయి. నీ కుటుంబంలోని వాడెవడు నగరంలో చనిపోయినా వాని శవాన్ని కుక్కలు తింటాయి. వారిలో ఎవడు పొలాల్లో చనిపోయినా వానిని పక్షులు తింటాయి.” అహాబువలె అన్ని తప్పుడు పనులు చేసినవాడు, అంత పాపం మూటగట్టు కున్నవాడు మరొక వ్యక్తి లేడు. అతని భార్య యెజెబెలు అతడా తప్పులు చేయటానికి కారకురాలయింది. కొయ్య బొమ్మలను పూజిస్తూ, అహాబు ఘోరమైన పాపానికి ఒడిగట్టాడు. ఈ రకమైన పనినే అమోరీయులు కూడా చేశారు. అందువల్లనే యెహోవా ఆ రాజ్యాన్ని వారి నుండి తీసుకుని ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. ఏలీయా మాట్లాడటం పూర్తి చేసిన తరువాత అహాబు చాలా ఖిన్నుడయాడు. తన విచారానికి సూచనగా తన బట్టలు చింపుకున్నాడు. తరువాత విచారసూచకంగా ప్రత్యేకమైన బట్టలు ధరించాడు. అహాబు భోజనం మానేశాడు. ఆ ప్రత్యేకమైన బట్టలతోనే నిద్రపోయాడు. అహాబు బహు దుఃఖంతో మిక్కిలి కలతచెందాడు. ప్రవక్తయగు ఏలీయాతో యెహోవా ఇలా అన్నాడు: “అహాబు నాముందు తనను తాను తక్కువ చేసుకుని వినమ్రుడైనట్లు నేను చూస్తున్నాను. అందువల్ల అతను బ్రతికియున్నంత కాలం నేనతనికి ఆపదలు కలుగజేయను. అతని కుమారుడు రాజు అయ్యేవరకు ఆగుతాను. అప్పుడు అహాబు కుటుంబానికి కష్టనష్టాలు కలుగజేస్తాను.”
1 రాజులు 21:20-29 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అంతట అహాబు ఏలీయాను చూచి–నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కుబడితినా? అని పలుకగా ఏలీయా ఇట్లనెను– యెహోవా దృష్టికి కీడుచేయుటకు నిన్ను నీవే అమ్ముకొని యున్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి. అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చెను–నేను నీ మీదికి అపాయము రప్పించెదను; నీ సంతతివారిని నాశముచేతును; అల్పులేమి ఘనులేమి ఇశ్రాయేలువారిలో అహాబు పక్షమున ఎవరునులేకుండ పురుషులనందరిని నిర్మూలముచేతును. ఇశ్రాయేలువారు పాపము చేయుటకు నీవు కారకుడవై నాకు కోపము పుట్టించితివి గనుక నెబాతు కుమారుడైన యరొబాము కుటుంబమునకును అహీయా కుమారుడైన బయెషా కుటుంబమునకును నేను చేసినట్లు నీ కుటుంబమునకు చేయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యెజెబెలునుగూర్చి యెహోవా సెలవిచ్చున దేమనగా – యెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజెబెలును తినివేయును. పట్టణమందు చచ్చు అహాబు సంబంధికులను కుక్కలు తినివేయును; బయటిభూములలో చచ్చువారిని ఆకాశపక్షులు తినివేయును అని చెప్పెను తన భార్యయైన యెజెబెలు ప్రేరేపణచేత యెహోవా దృష్టికి కీడుచేయ తన్నుతాను అమ్ముకొనిన అహాబువంటివాడు ఎవ్వడును లేడు. ఇశ్రాయేలీయుల యెదుట నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన అమోరీయుల ఆచార రీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు బహు హేయముగా ప్రవర్తించెను. అహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసముండి, గోనెపట్టమీద పరుండి వ్యాకులపడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుటచేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండ ఆపి, అతని కుమారుని కాలమునందు అతని కుటుంబికులమీదికి నేను దాని రప్పించెదను.