1 రాజులు 19:9-14

1 రాజులు 19:9-14 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

అక్కడ అతడు ఒక గుహలో ఆ రాత్రి గడిపాడు. యెహోవా వాక్కు, “ఏలీయా, ఇక్కడ ఏం చేస్తున్నావు?” అని అతన్ని అడిగింది. అతడు జవాబిస్తూ, “నేను సైన్యాల యెహోవా దేవుని పట్ల ఎంతో రోషం కలిగి ఉన్నాను. ఇశ్రాయేలీయులు మీ నిబంధనను తిరస్కరించారు, మీ బలిపీఠాలను పడగొట్టారు, మీ ప్రవక్తలను ఖడ్గంతో చంపారు. నేను ఒక్కన్ని మాత్రమే మిగిలాను, ఇప్పుడు వారు నన్ను కూడా చంపాలని చూస్తున్నారు” అని చెప్పాడు. అందుకు యెహోవా, “బయటకు వెళ్లి, పర్వతం మీద యెహోవా సమక్షంలో నిలబడు, ఎందుకంటే యెహోవా అక్కడినుండి దాటి వెళ్లబోతున్నారు” అన్నారు. అప్పుడు ఒక గొప్ప బలమైన గాలి వచ్చి పర్వతాలను చీల్చింది, యెహోవా ఎదుట బండలను బద్దలు చేసింది, అయితే యెహోవా ఆ గాలిలో లేరు. గాలి తర్వాత భూకంపం వచ్చింది, కాని యెహోవా ఆ భూకంపంలో లేరు. భూకంపం తర్వాత అగ్ని వచ్చింది, కాని యెహోవా ఆ అగ్నిలో లేరు. అగ్ని తర్వాత మెల్లని స్వరం వినిపించింది. ఏలీయా ఆ స్వరం వినగానే, తన వస్ర్తంతో ముఖం కప్పుకుని వెళ్లి ఆ గుహ ద్వారం దగ్గర నిలబడ్డాడు. అప్పుడు అతనికి, “ఏలీయా ఇక్కడ ఏమి చేస్తున్నావు?” అనే స్వరం వినిపించింది. అతడు జవాబిస్తూ, “నేను సైన్యాల యెహోవా దేవుని పట్ల ఎంతో రోషం కలిగి ఉన్నాను. ఇశ్రాయేలీయులు మీ నిబంధనను తిరస్కరించారు, మీ బలిపీఠాలను పడగొట్టారు, మీ ప్రవక్తలను ఖడ్గంతో చంపారు. నేను ఒక్కన్ని మాత్రమే మిగిలాను. ఇప్పుడు వారు నన్ను కూడా చంపాలని చూస్తున్నారు” అని చెప్పాడు.

1 రాజులు 19:9-14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అక్కడున్న ఒక గుహలో ఉండిపోయాడు. యెహోవా “ఏలీయా, ఇక్కడ నువ్వేం చేస్తున్నావ్” అని అతనిని అడిగాడు. అతడు “ఇశ్రాయేలు ప్రజలు నీ నిబంధనను వదిలేసి నీ బలిపీఠాలను పడగొట్టి నీ ప్రవక్తలను కత్తితో చంపేశారు. దూతల సైన్యాల నాయకుడు యెహోవా కోసం మహా రోషంతో నేను ఒకణ్ణి మాత్రమే మిగిలాను. వారు నా ప్రాణం కూడా తీయడానికి చూస్తున్నారు” అని జవాబిచ్చాడు. యెహోవా అతనితో “నీవు వెళ్లి పర్వతం మీద నా ఎదుట నిలబడు” అన్నాడు. అప్పుడు యెహోవా అటుగా వెళ్ళగానే ప్రచండమైన గాలి లేచింది. పర్వతాలు బద్దలై బండరాళ్ళు ముక్కలైపోయాయి గాని యెహోవా ఆ గాలిలో లేడు. గాలి వెళ్లిపోయిన తరువాత భూకంపం వచ్చింది గాని ఆ భూకంపంలో యెహోవా లేడు. ఆ భూకంపం వెళ్ళిపోయిన తరువాత అగ్ని జ్వాలలు కన్పించాయి గాని ఆ అగ్నిలో యెహోవా లేడు. అగ్ని ఆగిపోగానే చాలా నెమ్మదిగా మాట్లాడే ఒక స్వరం వినిపించింది. ఏలీయా ఆ స్వరం విని, తన దుప్పటితో ముఖం కప్పుకుని బయలుదేరి గుహ ఎదుట నిలబడ్డాడు. అప్పుడు “ఏలీయా, ఇక్కడ నువ్వేం చేస్తున్నావ్?” అనే మాట వినిపించింది. ఏలీయా “ఇశ్రాయేలు ప్రజలు నీ నిబంధనను వదిలేసి నీ బలిపీఠాలను పడగొట్టి నీ ప్రవక్తలను కత్తితో చంపేశారు. దూతల సైన్యాల నాయకుడు, యెహోవా కోసం మహా రోషంతో నేను ఒకణ్ణి మాత్రమే మిగిలితే, వారు నా ప్రాణం కూడా తీయడానికి చూస్తున్నారు” అని జవాబిచ్చాడు.

1 రాజులు 19:9-14 పవిత్ర బైబిల్ (TERV)

అక్కడ ఏలీయా ఒక గుహలోకి వెళ్లి ఆ రాత్రి తలదాచుకున్నాడు. అక్కడ యెహోవా ఏలీయాతో మాట్లాడి, “ఏలీయా! నీవిక్కడెందుకున్నావు!” అని అడిగాడు. ఏలీయా ఇలా సమాధానం చెప్పాడు: “సర్వశక్తిమంతుడవైన యెహోవా, నేను నిన్ను సదా సేవిస్తూ వచ్చాను. నా శక్తికొలదీ నేను నిన్ను ఆరాధించాను. కాని ఇశ్రాయేలు ప్రజలు నీతో చేసుకున్న ఒడంబడికను భంగపర్చారు. నీ బలిపీఠాలను వారు నాశనం చేశారు. వారు నీ ప్రవక్తలను చంపేశారు. నేనొక్కడినే ప్రవక్తగా ఇంకా జీవించి వున్నాను. ఇప్పుడు వారు నన్నూ చంప జూస్తున్నారు!” అందుకు యెహోవా ఏలీయాతో: “నీవు వెళ్లి పర్వతం మీద నా ముందు నిలబడు. నేను నీ పక్కగా వెళతాను” అని అన్నాడు. యెహోవా అలా చేయగా, ఒక పెనుగాలి వీచింది. ఆ గాలి కొండలను రెండుగా చీల్చివేసింది. యెహోవా ముందు ఆ గాలి పెద్దగుట్టలను పిండి చేసింది. కాని ఆ పెనుగాలి యెహోవా మాత్రం కాదు! గాలి తగ్గిన పిమ్మట ఒక భూకంపం వచ్చింది. ఆ భూకంపం కూడా యెహోవా కాదు. ఆ భూకంపం పోయిన పిమ్మట అగ్ని పుట్టింది. ఆ అగ్నికూడా యెహోవా కాదు. అగ్ని తరువాత ప్రశాంతత నెలకొనగా, ఒక మృదువైన శబ్దం వినవచ్చింది. ఏలీయా ఆ శబ్దాన్ని విన్నప్పుడు తన అంగీతో తన ముఖం కప్పుకున్నాడు. అతను గుహ ద్వారం వద్దకు వెళ్లి నిలబడ్డాడు. ఇంతలో “ఏలీయా, ఇక్కడెందుకున్నావు?” అంటున్న ఒక కంఠ స్వరం విన్నాడు. ఏలీయా ఇలా అన్నాడు: “సర్వశక్తిమంతుడవైన యెహోవా దేవా, శక్తి వంచన లేకుండా నేను నిన్ను సదా సేవిస్తూవచ్చాను. కాని ఇశ్రాయేలు ప్రజలు వారు నీతో చేసుకున్న ఒప్పందానికి విఘాతం కలుగజేశారు. నీకై నిర్మించిన బలిపీఠాలను నాశనం చేశారు. నీ ప్రవక్తలను చంపేశారు. జీవించియున్న ప్రవక్తలు మరెవ్వరూ లేరు నేను మినహా. వారిప్పుడు నన్ను చంపజూస్తున్నారు.”

1 రాజులు 19:9-14 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

అచ్చట ఉన్న యొక గుహలోచేరి బసచేసెను. యెహోవావాక్కు అతనికి ప్రత్యక్షమై– ఏలీయా, యిచ్చట నీవేమి చేయుచున్నావని అతని నడుగగా అతడు–ఇశ్రాయేలువారు నీ నిబంధనను త్రోసి వేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గముచేత హతము చేసిరి. సైన్యములకధిపతియు దేవుడునగు యెహోవా కొరకు మహారోషముగలవాడనై నేను ఒక డనుమాత్రమే మిగిలియుండగా వారు నా ప్రాణమును కూడ తీసివేయుటకై చూచుచున్నారని మనవిచేసెను. అందుకాయన–నీవు పోయి పర్వతముమీద యెహోవా సముఖమందు నిలిచి యుండుమని సెలవిచ్చెను. అంతట యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను, యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను; శిలలు ఛిన్నాభిన్నములాయెనుగాని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తరువాత భూకంపము కలిగెనుగాని ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెనుగాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు, మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాటలాడు ఒక స్వరము వినబడెను. ఏలీయా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచెను. అంతలో –ఏలీయా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని యొకడు పలికిన మాట అతనికి వినబడెను. అందుకతడు–ఇశ్రాయేలువారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గముచేత హతము చేసిరి. సైన్యములకధిపతియు దేవుడునగు యెహోవాకొరకు మహారోషముగలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలియుండగా వారు నా ప్రాణము తీసివేయుటకై చూచుచున్నారని చెప్పెను.