1 రాజులు 19:3-10

1 రాజులు 19:3-10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఏలీయా ఈ విషయం తెలుసుకుని, లేచి తన ప్రాణం కాపాడుకోడానికి, యూదాలోని బెయేర్షెబాకు వచ్చి, తన సేవకుణ్ణి అక్కడ ఉంచాడు. అతడు ఒక రోజంతా ఎడారిలోకి ప్రయాణించి ఒక రేగు చెట్టు కింద కూర్చున్నాడు. చచ్చిపోదామని ఆశించాడు. “యెహోవా, ఇంతవరకూ చాలు, చనిపోయిన నా పూర్వీకుల కంటే నేనేమంత గొప్పవాణ్ణి కాదు. నా ప్రాణం తీసుకో” అని ప్రార్థన చేశాడు. అతడు రేగు చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు. ఉన్నట్టుండి ఒక దేవదూత వచ్చి అతన్ని తాకి “నీవు లేచి భోజనం చెయ్యి” అన్నాడు. ఏలీయా లేచి చూస్తే, అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చిన రొట్టె, నీళ్ల సీసా కనిపించాయి. కాబట్టి అతడు భోజనం చేసి మళ్ళీ పడుకున్నాడు. యెహోవా దూత రెండవసారి మళ్ళీ వచ్చి అతన్ని లేపి “నీవు చాలా దూరం ప్రయాణం చెయ్యాలి, లేచి భోజనం చెయ్యి” అని చెప్పాడు. అతడు లేచి తిని, తాగి ఆ భోజనం బలంతో నలభై రాత్రింబగళ్లు ప్రయాణించి దేవుని పర్వతమనే పేరున్న హోరేబుకు వచ్చాడు. అక్కడున్న ఒక గుహలో ఉండిపోయాడు. యెహోవా “ఏలీయా, ఇక్కడ నువ్వేం చేస్తున్నావ్” అని అతనిని అడిగాడు. అతడు “ఇశ్రాయేలు ప్రజలు నీ నిబంధనను వదిలేసి నీ బలిపీఠాలను పడగొట్టి నీ ప్రవక్తలను కత్తితో చంపేశారు. దూతల సైన్యాల నాయకుడు యెహోవా కోసం మహా రోషంతో నేను ఒకణ్ణి మాత్రమే మిగిలాను. వారు నా ప్రాణం కూడా తీయడానికి చూస్తున్నారు” అని జవాబిచ్చాడు.

షేర్ చేయి
Read 1 రాజులు 19

1 రాజులు 19:3-10 పవిత్ర బైబిల్ (TERV)

ఇది విన్న ఏలీయా భయపడ్డాడు. తన ప్రాణం కాపాడుకొనేందుకు పారిపోయాడు. అతనితో తన నౌకరును తీసుకుని వెళ్లాడు. వారు యూదాలోని బెయేర్షెబాకు వెళ్లారు. బెయేర్షెబాలో తన నౌకరును ఏలీయా వదిలాడు. తరువాత ఒక రోజంతా ప్రయాణం చేసి ఏలీయా ఎడారిలోకి వెళ్లాడు. ఏలీయా ఒక పొదకింద కూర్చున్నాడు. అతడు చనిపోవాలని కోరుకున్నాడు. ఏలీయా యెహోవానిలా ప్రార్థించాడు: “ప్రభువా, నాకిది చాలు, ఇక నన్ను తీసికొనుము. నా పూర్వికుల కంటె నేను ఉన్నతమైనవాడిని కాను.” ఏలీయా తరువాత చెట్టు కింద పడుకొని నిద్ర పోయాడు. యెహోవా దూత వచ్చి ఏలీయాను తట్టాడు. “నిద్ర లేచి, అహారం తీసుకో!” అన్నాడు దేవదూత. ఏలీయా తన వద్ద నిప్పుల మీద కాల్చిన రొట్టె, ఒక కూజాలో నీరు వున్నట్లు చూశాడు. ఏలీయా ఆ రొట్టెను తిని, నీరు తాగాడు. అతను మరల నిద్రపోయాడు. యెహోవా దేవదూత మళ్లీ అతని వద్దకు వచ్చి, “లేచి ఆహారం తీసుకో, నీవు భోజనం చేయకపోతే నీవు చేయవలసిన వ్రయాణం నీవు నడవలేనంతగా వుంటుంది” అని అన్నాడు. అందుచేత ఏలీయా లేచి అన్న పానాదులు స్వీకరించాడు. ఏలీయా తిన్న ఆహారం అతనికి నలభై రోజులు రాత్రింబగళ్లు నడవగలిగే శక్తి నిచ్చింది. అతడు దేవుని పర్వతం అనబడే హోరేబు పర్వతం వద్దకు వచ్చాడు. అక్కడ ఏలీయా ఒక గుహలోకి వెళ్లి ఆ రాత్రి తలదాచుకున్నాడు. అక్కడ యెహోవా ఏలీయాతో మాట్లాడి, “ఏలీయా! నీవిక్కడెందుకున్నావు!” అని అడిగాడు. ఏలీయా ఇలా సమాధానం చెప్పాడు: “సర్వశక్తిమంతుడవైన యెహోవా, నేను నిన్ను సదా సేవిస్తూ వచ్చాను. నా శక్తికొలదీ నేను నిన్ను ఆరాధించాను. కాని ఇశ్రాయేలు ప్రజలు నీతో చేసుకున్న ఒడంబడికను భంగపర్చారు. నీ బలిపీఠాలను వారు నాశనం చేశారు. వారు నీ ప్రవక్తలను చంపేశారు. నేనొక్కడినే ప్రవక్తగా ఇంకా జీవించి వున్నాను. ఇప్పుడు వారు నన్నూ చంప జూస్తున్నారు!”

షేర్ చేయి
Read 1 రాజులు 19

1 రాజులు 19:3-10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

కాబట్టి అతడు ఈ సమాచారము తెలిసికొని, లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి, యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి, అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దినప్రయాణము అరణ్యములోనికి పోయి యొక బదరీవృక్షముక్రింద కూర్చుండి, మరణాపేక్షగలవాడై – యెహోవా, నా పితరులకంటె నేను ఎక్కువవాడను కాను, ఇంతమట్టుకు చాలును, నా ప్రాణము తీసికొనుము అని ప్రార్థనచేసెను. అతడు బదరీవృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి–నీవు లేచి భోజనము చేయుమని చెప్పెను. అతడు చూచినంతలో అతని తలదగ్గర నిప్పులమీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను గనుక అతడు భోజనముచేసితిరిగి పరుండెను. అయితే యెహోవాదూత రెండవమారు వచ్చి అతని ముట్టి–నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై యున్నది, నీవు లేచి భోజనము చేయుమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనముచేసి, ఆ భోజనపు బలముచేత నలువది రాత్రిం బగళ్లు ప్రయాణముచేసి, దేవుని పర్వతమని పేరుపెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న యొక గుహలోచేరి బసచేసెను. యెహోవావాక్కు అతనికి ప్రత్యక్షమై– ఏలీయా, యిచ్చట నీవేమి చేయుచున్నావని అతని నడుగగా అతడు–ఇశ్రాయేలువారు నీ నిబంధనను త్రోసి వేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గముచేత హతము చేసిరి. సైన్యములకధిపతియు దేవుడునగు యెహోవా కొరకు మహారోషముగలవాడనై నేను ఒక డనుమాత్రమే మిగిలియుండగా వారు నా ప్రాణమును కూడ తీసివేయుటకై చూచుచున్నారని మనవిచేసెను.

షేర్ చేయి
Read 1 రాజులు 19

1 రాజులు 19:3-10 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

ఏలీయా భయపడి, తన ప్రాణం కాపాడుకోడానికి పారిపోయాడు. అతడు యూదాలోని బెయేర్షేబకు చేరి, అక్కడ తన సేవకుడిని విడిచిపెట్టి, అతడు మాత్రం ఎడారిలోకి రోజంతా ప్రయాణం చేశాడు. ఒక బదరీచెట్టు క్రింద కూర్చుని చనిపోవాలని కోరుతూ, “యెహోవా, నా ప్రాణం తీసుకోండి; నేను నా పూర్వికులకంటే గొప్పవాన్ని కాను” అని ప్రార్థించాడు. తర్వాత అతడు ఆ బదరీచెట్టు క్రింద పడుకుని నిద్రపోయాడు. అప్పుడు అకస్మాత్తుగా ఒక దేవదూత అతన్ని తట్టి, “లేచి తిను” అన్నాడు. అతడు కళ్లు తెరిచి చూస్తే అతని తల దగ్గర సీసాలో నీళ్లు నిప్పుల మీద కాల్చిన రొట్టె కనిపించాయి. అతడు తిని త్రాగి మళ్ళీ పడుకున్నాడు. తర్వాత యెహోవా దూత రెండవసారి వచ్చి అతన్ని తట్టి, “లేచి తిను ఎందుకంటే నీవు దూర ప్రయాణం చేయాల్సి ఉంది” అన్నాడు. కాబట్టి అతడు లేచి తిని నీళ్లు త్రాగాడు. ఆ ఆహారం వల్ల బలం పొందుకొని నలభై రాత్రింబగళ్ళు ప్రయాణించి దేవుని పర్వతమైన హోరేబును చేరుకున్నాడు. అక్కడ అతడు ఒక గుహలో ఆ రాత్రి గడిపాడు. యెహోవా వాక్కు, “ఏలీయా, ఇక్కడ ఏం చేస్తున్నావు?” అని అతన్ని అడిగింది. అతడు జవాబిస్తూ, “నేను సైన్యాల యెహోవా దేవుని పట్ల ఎంతో రోషం కలిగి ఉన్నాను. ఇశ్రాయేలీయులు మీ నిబంధనను తిరస్కరించారు, మీ బలిపీఠాలను పడగొట్టారు, మీ ప్రవక్తలను ఖడ్గంతో చంపారు. నేను ఒక్కన్ని మాత్రమే మిగిలాను, ఇప్పుడు వారు నన్ను కూడా చంపాలని చూస్తున్నారు” అని చెప్పాడు.

షేర్ చేయి
Read 1 రాజులు 19