1 రాజులు 19:14-21
1 రాజులు 19:14-21 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఏలీయా “ఇశ్రాయేలు ప్రజలు నీ నిబంధనను వదిలేసి నీ బలిపీఠాలను పడగొట్టి నీ ప్రవక్తలను కత్తితో చంపేశారు. దూతల సైన్యాల నాయకుడు, యెహోవా కోసం మహా రోషంతో నేను ఒకణ్ణి మాత్రమే మిగిలితే, వారు నా ప్రాణం కూడా తీయడానికి చూస్తున్నారు” అని జవాబిచ్చాడు. అప్పుడు యెహోవా అతనితో ఇలా చెప్పాడు. “ఎడారి గుండా నీవు వచ్చిన దారిలో దమస్కు వెళ్ళు. అక్కడ సిరియా దేశం మీద హజాయేలుకు పట్టాభిషేకం చెయ్యి. ఇశ్రాయేలు వారి మీద నింషీ కొడుకు యెహూకు పట్టాభిషేకం చెయ్యి. నీకు బదులు ప్రవక్తగా ఉండడానికి అబేల్మెహోలా వాడు షాపాతు కొడుకు ఎలీషాకు అభిషేకం చెయ్యి. హజాయేలు కత్తిని తప్పించుకొనే వారిని యెహూ చంపేస్తాడు. యెహూ కత్తిని తప్పించుకొనే వారిని ఎలీషా చంపేస్తాడు. అయినా ఇశ్రాయేలు ప్రజల్లో బయలుకు మొక్కకుండా, వాడి విగ్రహాన్ని ముద్దు పెట్టుకోకుండా ఇంకా 7,000 మంది నాకు మిగిలి ఉన్నారు.” ఏలీయా అక్కడ నుండి వెళ్లిన తరువాత అతనికి షాపాతు కొడుకు ఎలీషా కనిపించాడు. అతడు తన దగ్గరున్న పన్నెండు జతల ఎడ్లతో దుక్కి దున్నిస్తూ పన్నెండవ కాడి తానే తోలుతున్నాడు. ఏలీయా అతని దగ్గరికి వెళ్లి తన పైబట్టను అతని మీద వేశాడు. అతడు ఎడ్లను విడిచిపెట్టి ఏలీయా వెంట పరిగెత్తి “నేను వెళ్లి నా తలిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడిస్తాను” అన్నాడు. ఏలీయా “వెళ్లి రా. నేను నీకేం చేశానో గుర్తు పెట్టుకో” అన్నాడు. ఎలీషా అతన్ని విడిచి వెళ్లి, కాడి ఎడ్లను వధించి వాటి మాంసాన్ని కాడి మానులతో వంట చేసి ప్రజలకు వడ్డించాడు. వారు భోజనం చేసిన తరువాత అతడు లేచి ఏలీయా వెంట వెళ్లి అతనికి సేవకుడయ్యాడు.
1 రాజులు 19:14-21 పవిత్ర బైబిల్ (TERV)
ఏలీయా ఇలా అన్నాడు: “సర్వశక్తిమంతుడవైన యెహోవా దేవా, శక్తి వంచన లేకుండా నేను నిన్ను సదా సేవిస్తూవచ్చాను. కాని ఇశ్రాయేలు ప్రజలు వారు నీతో చేసుకున్న ఒప్పందానికి విఘాతం కలుగజేశారు. నీకై నిర్మించిన బలిపీఠాలను నాశనం చేశారు. నీ ప్రవక్తలను చంపేశారు. జీవించియున్న ప్రవక్తలు మరెవ్వరూ లేరు నేను మినహా. వారిప్పుడు నన్ను చంపజూస్తున్నారు.” యెహోవా ఇలా అన్నాడు: “నీవు వచ్చిన దారిలోనే తిరిగి దమస్కు ఎడారికి వెళ్లు. నగరంలో ప్రవేశించి హజాయేలును అరాము దేశానికి (సిరియా) రాజుగా అభిషేకించు. పిమ్మట నింషీ కుమారుడైన యెహూను ఇశ్రాయేలుపై రాజుగా అభిషిక్తుని చేయి. తరువాత, ఆబేల్మె హోలావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు నీ తర్వాత ప్రవక్తగా అభిషేకంచేయి. హజాయేలు ఖడ్గమునుండి తప్పించుకున్న ప్రతివాడినీ యెహూ సంహరిస్తాడు. యెహూ కత్తి పోటునుంచి తప్పించుకున్న ప్రతివాడినీ హజాయేలు చంపేస్తాడు. ఇశ్రాయేలులో ఏడువేల మందిని నేను వదిలి పెడతాను. ఈ ఏడువేల మంది బయలు ముందు ఎన్నడూవంగి నమస్కరించ లేదు. బయలు విగ్రహాల నెన్నడూ వారు ముద్దు పెట్టుకోలేదు.” కావున ఏలీయా ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్లాడు షాపాతు కుమారుడైన ఎలీషాను చూశాడు. ఎలీషా ఎద్దులను కట్టి 12 ఎకరాల పొలం దున్నుతున్నాడు. ఏలీయా వచ్చినప్పుడు ఎలీషా చివరి ఎకరాన్ని దున్నుచుండెను. ఏలీయా సరాసరి ఎలీషా వద్దకు వచ్చాడు. ఏలీయా తన అంగీని తీసి ఎలీషా మీద కప్పాడు. అప్పుడు ఎలీషా పొలంలోవున్న తన ఎద్దులను వదిలి పెట్టాడు. అతడు పరుగెత్తి ఏలీయా వద్దకు వెళ్లి, “నన్ను వెళ్లి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని వారి వద్ద వీడ్కోలు తీసుకోనిమ్ము. తరువాత నేను మీతో వస్తాను” అని అన్నాడు. “అది చాలా మంచిది. వెళ్లు. నిన్ను నేనాపను” అని ఏలీయా అన్నాడు. ఎలీషా వెళ్లి తన ఇంటి వారితో ఒక ప్రత్యేకమైన విందారగించాడు. ఎలీషా వెళ్లి తన ఎద్దులను చంపాడు. ఎడ్లకు కట్టిన కాడి కర్రతో నిప్పుచేసి, ఎడ్ల మాంసాన్ని ఉడకబెట్టాడు. ఆ మాంసాన్ని అందరికీ ఇచ్చాడు. వారంతా ఆ మాంసాన్ని తిన్నారు. ఎలీషా తరువాత ఏలీయాను అనుసరించి వెళ్లాడు. ఎలీషా ఏలీయాకు సహాయకుడయ్యాడు.
1 రాజులు 19:14-21 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అందుకతడు–ఇశ్రాయేలువారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గముచేత హతము చేసిరి. సైన్యములకధిపతియు దేవుడునగు యెహోవాకొరకు మహారోషముగలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలియుండగా వారు నా ప్రాణము తీసివేయుటకై చూచుచున్నారని చెప్పెను. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చిన దేమనగా–నీవు మరలి అరణ్యమార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియ దేశముమీద హజాయేలునకు పట్టాభిషేకము చేయుము; ఇశ్రాయేలు వారిమీద నింషీకుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుము; నీకు మారుగా ప్రవక్తయైయుండుటకు ఆబేల్మె హోలావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము. హజాయేలుయొక్క ఖడ్గమును తప్పించుకొనువారిని యెహూ హతముచేయును; యెహూయొక్క ఖడ్గమును తప్పించుకొనువారిని ఎలీషా హతము చేయును. అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్లూనకయు, నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు నుండు ఏడు వేలమంది నాకు ఇంకను మిగిలియుందురు. ఏలీయా అచ్చటనుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న పండ్రెండు అరకల యెడ్లచేత దుక్కి దున్నించుచు పండ్రెండవ అరక తాను తోలుచుండెను. ఏలీయా అతని చేరబోయి తన దుప్పటి అతనిమీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలీయావెంట పరుగెత్తి–నేను పోయి నా తలి దండ్రులను ముద్దుపెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబ డించెదనని చెప్పి అతనిని సెలవడుగగా అతడు–పోయి రమ్ము, నావలన నీకు నిర్బంధము లేదని చెప్పెను. అందుకతడు అతనిని విడిచి వెళ్లి కాడియెడ్లను తీసి, వధించి వాటిమాంసమును గొర్తినొగల చేత వంటచేసి జనులకు వడ్డించెను. వారు భోజనముచేసిన తరువాత అతడు లేచి ఏలీయా వెంబడి వెళ్లి అతనికి ఉపచారము చేయుచుండెను.
1 రాజులు 19:14-21 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అతడు జవాబిస్తూ, “నేను సైన్యాల యెహోవా దేవుని పట్ల ఎంతో రోషం కలిగి ఉన్నాను. ఇశ్రాయేలీయులు మీ నిబంధనను తిరస్కరించారు, మీ బలిపీఠాలను పడగొట్టారు, మీ ప్రవక్తలను ఖడ్గంతో చంపారు. నేను ఒక్కన్ని మాత్రమే మిగిలాను. ఇప్పుడు వారు నన్ను కూడా చంపాలని చూస్తున్నారు” అని చెప్పాడు. అప్పుడు యెహోవా అతనితో, “నీవు వచ్చిన దారిలోనే తిరిగి వెళ్లు, దమస్కు ఎడారికి వెళ్లు. అక్కడికి వెళ్లాక, హజాయేలును అరాము మీద రాజుగా అభిషేకించు. తర్వాత ఇశ్రాయేలు మీద నిమ్షీ కుమారుడైన యెహును రాజుగా, ఆబేల్-మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాను నీ తర్వాత ప్రవక్తగా అభిషేకించు. హజాయేలు ఖడ్గం నుండి తప్పించుకునే వారిని యెహు చంపుతాడు, యెహు ఖడ్గం నుండి తప్పించుకునే వారిని ఎలీషా చంపుతాడు. అయినా ఇశ్రాయేలులో బయలుకు మోకరించని, వాన్ని ముద్దుపెట్టుకోని ఏడువేలమందిని నా కోసం ప్రత్యేకంగా ఉంచాను” అని చెప్పారు. కాబట్టి ఏలీయా అక్కడినుండి వెళ్లి, షాపాతు కుమారుడైన ఎలీషాను కనుగొన్నాడు. ఎలీషా పన్నెండు జతల ఎడ్లతో పొలం దున్నిస్తూ స్వయంగా అతడు పన్నెండవ జతను నడుపుతూ ఉన్నప్పుడు, ఏలీయా అతని దగ్గరకు వెళ్లి తన దుప్పటి తీసి అతని మీద వేశాడు. అప్పుడు ఎలీషా ఎడ్లను విడిచిపెట్టి ఏలీయా వెంబడి పరుగెత్తి, “నేను వెళ్లి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని వీడ్కోలు చెప్పి మీ వెంట వస్తాను” అని అన్నాడు. అందుకు ఏలీయా, “వెనుకకు వెళ్లు. కాని నేను నీకు చేసిన దాని గురించి ఆలోచించు” అన్నాడు. కాబట్టి ఎలీషా అతన్ని విడిచి వెనుకకు వెళ్లి ఆ జత ఎడ్లను వధించి వాటి మాంసాన్ని కాడి మ్రానులతో వంట చేసి ప్రజలకు వడ్డించాడు. వారు తినిన తర్వాత అతడు లేచి ఏలీయా వెంట వెళ్లి అతని సేవకుడయ్యాడు.