1 రాజులు 19:1-18

1 రాజులు 19:1-18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఏలీయా చేసిందంతా అతడు బయలు ప్రవక్తలందరినీ కత్తితో చంపించిన సంగతీ అహాబు యెజెబెలుకు చెప్పాడు. యెజెబెలు ఒక వార్తాహరునితో ఏలీయాకు ఈ కబురు పంపింది “రేపు ఈ పాటికి చనిపోయిన ఆ ప్రవక్తల ప్రాణం లాగా నేను నీ ప్రాణాన్ని చేయకపోతే దేవుళ్ళు దాని కంటే ఎక్కువ కీడు నా మీదికి తెస్తారు గాక.” ఏలీయా ఈ విషయం తెలుసుకుని, లేచి తన ప్రాణం కాపాడుకోడానికి, యూదాలోని బెయేర్షెబాకు వచ్చి, తన సేవకుణ్ణి అక్కడ ఉంచాడు. అతడు ఒక రోజంతా ఎడారిలోకి ప్రయాణించి ఒక రేగు చెట్టు కింద కూర్చున్నాడు. చచ్చిపోదామని ఆశించాడు. “యెహోవా, ఇంతవరకూ చాలు, చనిపోయిన నా పూర్వీకుల కంటే నేనేమంత గొప్పవాణ్ణి కాదు. నా ప్రాణం తీసుకో” అని ప్రార్థన చేశాడు. అతడు రేగు చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు. ఉన్నట్టుండి ఒక దేవదూత వచ్చి అతన్ని తాకి “నీవు లేచి భోజనం చెయ్యి” అన్నాడు. ఏలీయా లేచి చూస్తే, అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చిన రొట్టె, నీళ్ల సీసా కనిపించాయి. కాబట్టి అతడు భోజనం చేసి మళ్ళీ పడుకున్నాడు. యెహోవా దూత రెండవసారి మళ్ళీ వచ్చి అతన్ని లేపి “నీవు చాలా దూరం ప్రయాణం చెయ్యాలి, లేచి భోజనం చెయ్యి” అని చెప్పాడు. అతడు లేచి తిని, తాగి ఆ భోజనం బలంతో నలభై రాత్రింబగళ్లు ప్రయాణించి దేవుని పర్వతమనే పేరున్న హోరేబుకు వచ్చాడు. అక్కడున్న ఒక గుహలో ఉండిపోయాడు. యెహోవా “ఏలీయా, ఇక్కడ నువ్వేం చేస్తున్నావ్” అని అతనిని అడిగాడు. అతడు “ఇశ్రాయేలు ప్రజలు నీ నిబంధనను వదిలేసి నీ బలిపీఠాలను పడగొట్టి నీ ప్రవక్తలను కత్తితో చంపేశారు. దూతల సైన్యాల నాయకుడు యెహోవా కోసం మహా రోషంతో నేను ఒకణ్ణి మాత్రమే మిగిలాను. వారు నా ప్రాణం కూడా తీయడానికి చూస్తున్నారు” అని జవాబిచ్చాడు. యెహోవా అతనితో “నీవు వెళ్లి పర్వతం మీద నా ఎదుట నిలబడు” అన్నాడు. అప్పుడు యెహోవా అటుగా వెళ్ళగానే ప్రచండమైన గాలి లేచింది. పర్వతాలు బద్దలై బండరాళ్ళు ముక్కలైపోయాయి గాని యెహోవా ఆ గాలిలో లేడు. గాలి వెళ్లిపోయిన తరువాత భూకంపం వచ్చింది గాని ఆ భూకంపంలో యెహోవా లేడు. ఆ భూకంపం వెళ్ళిపోయిన తరువాత అగ్ని జ్వాలలు కన్పించాయి గాని ఆ అగ్నిలో యెహోవా లేడు. అగ్ని ఆగిపోగానే చాలా నెమ్మదిగా మాట్లాడే ఒక స్వరం వినిపించింది. ఏలీయా ఆ స్వరం విని, తన దుప్పటితో ముఖం కప్పుకుని బయలుదేరి గుహ ఎదుట నిలబడ్డాడు. అప్పుడు “ఏలీయా, ఇక్కడ నువ్వేం చేస్తున్నావ్?” అనే మాట వినిపించింది. ఏలీయా “ఇశ్రాయేలు ప్రజలు నీ నిబంధనను వదిలేసి నీ బలిపీఠాలను పడగొట్టి నీ ప్రవక్తలను కత్తితో చంపేశారు. దూతల సైన్యాల నాయకుడు, యెహోవా కోసం మహా రోషంతో నేను ఒకణ్ణి మాత్రమే మిగిలితే, వారు నా ప్రాణం కూడా తీయడానికి చూస్తున్నారు” అని జవాబిచ్చాడు. అప్పుడు యెహోవా అతనితో ఇలా చెప్పాడు. “ఎడారి గుండా నీవు వచ్చిన దారిలో దమస్కు వెళ్ళు. అక్కడ సిరియా దేశం మీద హజాయేలుకు పట్టాభిషేకం చెయ్యి. ఇశ్రాయేలు వారి మీద నింషీ కొడుకు యెహూకు పట్టాభిషేకం చెయ్యి. నీకు బదులు ప్రవక్తగా ఉండడానికి అబేల్మెహోలా వాడు షాపాతు కొడుకు ఎలీషాకు అభిషేకం చెయ్యి. హజాయేలు కత్తిని తప్పించుకొనే వారిని యెహూ చంపేస్తాడు. యెహూ కత్తిని తప్పించుకొనే వారిని ఎలీషా చంపేస్తాడు. అయినా ఇశ్రాయేలు ప్రజల్లో బయలుకు మొక్కకుండా, వాడి విగ్రహాన్ని ముద్దు పెట్టుకోకుండా ఇంకా 7,000 మంది నాకు మిగిలి ఉన్నారు.”

షేర్ చేయి
Read 1 రాజులు 19

1 రాజులు 19:1-18 పవిత్ర బైబిల్ (TERV)

ఏలీయా చేసిన పనులన్నీ రాజైన అహాబు తన భార్యయగు రాణీ యెజెబెలుకు చెప్పాడు. కత్తి పట్టి ఎలా ప్రవక్తలందరినీ ఏలీయా చంపాడో అహాబు ఆమెకు వివరించాడు. అది విన్న యెజెబెలు ఒక దూతను ఏలీయా వద్దకు పంపింది. ఆమె వర్తమానం ఇలా వుంది: “రేపు ఈ పాటికి నీవు ప్రవక్తలను చంపిన విధంగా నిన్ను నేను చంపుతానని ప్రమాణం చేస్తున్నాను. నేనా పనిలో విజయం సాధించలేని పక్షంలో దేవతలు నన్ను చంపుగాక!” ఇది విన్న ఏలీయా భయపడ్డాడు. తన ప్రాణం కాపాడుకొనేందుకు పారిపోయాడు. అతనితో తన నౌకరును తీసుకుని వెళ్లాడు. వారు యూదాలోని బెయేర్షెబాకు వెళ్లారు. బెయేర్షెబాలో తన నౌకరును ఏలీయా వదిలాడు. తరువాత ఒక రోజంతా ప్రయాణం చేసి ఏలీయా ఎడారిలోకి వెళ్లాడు. ఏలీయా ఒక పొదకింద కూర్చున్నాడు. అతడు చనిపోవాలని కోరుకున్నాడు. ఏలీయా యెహోవానిలా ప్రార్థించాడు: “ప్రభువా, నాకిది చాలు, ఇక నన్ను తీసికొనుము. నా పూర్వికుల కంటె నేను ఉన్నతమైనవాడిని కాను.” ఏలీయా తరువాత చెట్టు కింద పడుకొని నిద్ర పోయాడు. యెహోవా దూత వచ్చి ఏలీయాను తట్టాడు. “నిద్ర లేచి, అహారం తీసుకో!” అన్నాడు దేవదూత. ఏలీయా తన వద్ద నిప్పుల మీద కాల్చిన రొట్టె, ఒక కూజాలో నీరు వున్నట్లు చూశాడు. ఏలీయా ఆ రొట్టెను తిని, నీరు తాగాడు. అతను మరల నిద్రపోయాడు. యెహోవా దేవదూత మళ్లీ అతని వద్దకు వచ్చి, “లేచి ఆహారం తీసుకో, నీవు భోజనం చేయకపోతే నీవు చేయవలసిన వ్రయాణం నీవు నడవలేనంతగా వుంటుంది” అని అన్నాడు. అందుచేత ఏలీయా లేచి అన్న పానాదులు స్వీకరించాడు. ఏలీయా తిన్న ఆహారం అతనికి నలభై రోజులు రాత్రింబగళ్లు నడవగలిగే శక్తి నిచ్చింది. అతడు దేవుని పర్వతం అనబడే హోరేబు పర్వతం వద్దకు వచ్చాడు. అక్కడ ఏలీయా ఒక గుహలోకి వెళ్లి ఆ రాత్రి తలదాచుకున్నాడు. అక్కడ యెహోవా ఏలీయాతో మాట్లాడి, “ఏలీయా! నీవిక్కడెందుకున్నావు!” అని అడిగాడు. ఏలీయా ఇలా సమాధానం చెప్పాడు: “సర్వశక్తిమంతుడవైన యెహోవా, నేను నిన్ను సదా సేవిస్తూ వచ్చాను. నా శక్తికొలదీ నేను నిన్ను ఆరాధించాను. కాని ఇశ్రాయేలు ప్రజలు నీతో చేసుకున్న ఒడంబడికను భంగపర్చారు. నీ బలిపీఠాలను వారు నాశనం చేశారు. వారు నీ ప్రవక్తలను చంపేశారు. నేనొక్కడినే ప్రవక్తగా ఇంకా జీవించి వున్నాను. ఇప్పుడు వారు నన్నూ చంప జూస్తున్నారు!” అందుకు యెహోవా ఏలీయాతో: “నీవు వెళ్లి పర్వతం మీద నా ముందు నిలబడు. నేను నీ పక్కగా వెళతాను” అని అన్నాడు. యెహోవా అలా చేయగా, ఒక పెనుగాలి వీచింది. ఆ గాలి కొండలను రెండుగా చీల్చివేసింది. యెహోవా ముందు ఆ గాలి పెద్దగుట్టలను పిండి చేసింది. కాని ఆ పెనుగాలి యెహోవా మాత్రం కాదు! గాలి తగ్గిన పిమ్మట ఒక భూకంపం వచ్చింది. ఆ భూకంపం కూడా యెహోవా కాదు. ఆ భూకంపం పోయిన పిమ్మట అగ్ని పుట్టింది. ఆ అగ్నికూడా యెహోవా కాదు. అగ్ని తరువాత ప్రశాంతత నెలకొనగా, ఒక మృదువైన శబ్దం వినవచ్చింది. ఏలీయా ఆ శబ్దాన్ని విన్నప్పుడు తన అంగీతో తన ముఖం కప్పుకున్నాడు. అతను గుహ ద్వారం వద్దకు వెళ్లి నిలబడ్డాడు. ఇంతలో “ఏలీయా, ఇక్కడెందుకున్నావు?” అంటున్న ఒక కంఠ స్వరం విన్నాడు. ఏలీయా ఇలా అన్నాడు: “సర్వశక్తిమంతుడవైన యెహోవా దేవా, శక్తి వంచన లేకుండా నేను నిన్ను సదా సేవిస్తూవచ్చాను. కాని ఇశ్రాయేలు ప్రజలు వారు నీతో చేసుకున్న ఒప్పందానికి విఘాతం కలుగజేశారు. నీకై నిర్మించిన బలిపీఠాలను నాశనం చేశారు. నీ ప్రవక్తలను చంపేశారు. జీవించియున్న ప్రవక్తలు మరెవ్వరూ లేరు నేను మినహా. వారిప్పుడు నన్ను చంపజూస్తున్నారు.” యెహోవా ఇలా అన్నాడు: “నీవు వచ్చిన దారిలోనే తిరిగి దమస్కు ఎడారికి వెళ్లు. నగరంలో ప్రవేశించి హజాయేలును అరాము దేశానికి (సిరియా) రాజుగా అభిషేకించు. పిమ్మట నింషీ కుమారుడైన యెహూను ఇశ్రాయేలుపై రాజుగా అభిషిక్తుని చేయి. తరువాత, ఆబేల్మె హోలావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు నీ తర్వాత ప్రవక్తగా అభిషేకంచేయి. హజాయేలు ఖడ్గమునుండి తప్పించుకున్న ప్రతివాడినీ యెహూ సంహరిస్తాడు. యెహూ కత్తి పోటునుంచి తప్పించుకున్న ప్రతివాడినీ హజాయేలు చంపేస్తాడు. ఇశ్రాయేలులో ఏడువేల మందిని నేను వదిలి పెడతాను. ఈ ఏడువేల మంది బయలు ముందు ఎన్నడూవంగి నమస్కరించ లేదు. బయలు విగ్రహాల నెన్నడూ వారు ముద్దు పెట్టుకోలేదు.”

షేర్ చేయి
Read 1 రాజులు 19

1 రాజులు 19:1-18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఏలీయా చేసినదంతయును అతడు ఖడ్గముచేత ప్రవక్తలనందరిని చంపించిన సంగతియును అహాబు యెజెబెలునకు తెలియజెప్పగా యెజెబెలు ఒక దూతచేత ఏలీయాకు ఈ వర్తమానము పంపించెను–రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణమువలె చేయనియెడల దేవుడు నాకు గొప్పఅపాయము కలుగజేయునుగాక. కాబట్టి అతడు ఈ సమాచారము తెలిసికొని, లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి, యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి, అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దినప్రయాణము అరణ్యములోనికి పోయి యొక బదరీవృక్షముక్రింద కూర్చుండి, మరణాపేక్షగలవాడై – యెహోవా, నా పితరులకంటె నేను ఎక్కువవాడను కాను, ఇంతమట్టుకు చాలును, నా ప్రాణము తీసికొనుము అని ప్రార్థనచేసెను. అతడు బదరీవృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి–నీవు లేచి భోజనము చేయుమని చెప్పెను. అతడు చూచినంతలో అతని తలదగ్గర నిప్పులమీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను గనుక అతడు భోజనముచేసితిరిగి పరుండెను. అయితే యెహోవాదూత రెండవమారు వచ్చి అతని ముట్టి–నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై యున్నది, నీవు లేచి భోజనము చేయుమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనముచేసి, ఆ భోజనపు బలముచేత నలువది రాత్రిం బగళ్లు ప్రయాణముచేసి, దేవుని పర్వతమని పేరుపెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న యొక గుహలోచేరి బసచేసెను. యెహోవావాక్కు అతనికి ప్రత్యక్షమై– ఏలీయా, యిచ్చట నీవేమి చేయుచున్నావని అతని నడుగగా అతడు–ఇశ్రాయేలువారు నీ నిబంధనను త్రోసి వేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గముచేత హతము చేసిరి. సైన్యములకధిపతియు దేవుడునగు యెహోవా కొరకు మహారోషముగలవాడనై నేను ఒక డనుమాత్రమే మిగిలియుండగా వారు నా ప్రాణమును కూడ తీసివేయుటకై చూచుచున్నారని మనవిచేసెను. అందుకాయన–నీవు పోయి పర్వతముమీద యెహోవా సముఖమందు నిలిచి యుండుమని సెలవిచ్చెను. అంతట యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను, యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను; శిలలు ఛిన్నాభిన్నములాయెనుగాని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తరువాత భూకంపము కలిగెనుగాని ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెనుగాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు, మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాటలాడు ఒక స్వరము వినబడెను. ఏలీయా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచెను. అంతలో –ఏలీయా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని యొకడు పలికిన మాట అతనికి వినబడెను. అందుకతడు–ఇశ్రాయేలువారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గముచేత హతము చేసిరి. సైన్యములకధిపతియు దేవుడునగు యెహోవాకొరకు మహారోషముగలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలియుండగా వారు నా ప్రాణము తీసివేయుటకై చూచుచున్నారని చెప్పెను. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చిన దేమనగా–నీవు మరలి అరణ్యమార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియ దేశముమీద హజాయేలునకు పట్టాభిషేకము చేయుము; ఇశ్రాయేలు వారిమీద నింషీకుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుము; నీకు మారుగా ప్రవక్తయైయుండుటకు ఆబేల్మె హోలావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము. హజాయేలుయొక్క ఖడ్గమును తప్పించుకొనువారిని యెహూ హతముచేయును; యెహూయొక్క ఖడ్గమును తప్పించుకొనువారిని ఎలీషా హతము చేయును. అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్లూనకయు, నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు నుండు ఏడు వేలమంది నాకు ఇంకను మిగిలియుందురు.

షేర్ చేయి
Read 1 రాజులు 19

1 రాజులు 19:1-18 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

అహాబు వెళ్లి, ఏలీయా చేసిందంతా ప్రవక్తలందరినీ ఖడ్గంతో చంపిన సంగతంతా యెజెబెలుకు చెప్పాడు. అందుకు యెజెబెలు, “రేపు ఈ సమయానికి నీవు వారిని చంపినట్లు నేను నిన్ను చంపకపోతే దేవుళ్ళు నన్ను ఇంతకంటే తీవ్రంగా శిక్షించుదురు గాక” అని ఒక దూతతో ఏలీయాకు కబురు పంపింది. ఏలీయా భయపడి, తన ప్రాణం కాపాడుకోడానికి పారిపోయాడు. అతడు యూదాలోని బెయేర్షేబకు చేరి, అక్కడ తన సేవకుడిని విడిచిపెట్టి, అతడు మాత్రం ఎడారిలోకి రోజంతా ప్రయాణం చేశాడు. ఒక బదరీచెట్టు క్రింద కూర్చుని చనిపోవాలని కోరుతూ, “యెహోవా, నా ప్రాణం తీసుకోండి; నేను నా పూర్వికులకంటే గొప్పవాన్ని కాను” అని ప్రార్థించాడు. తర్వాత అతడు ఆ బదరీచెట్టు క్రింద పడుకుని నిద్రపోయాడు. అప్పుడు అకస్మాత్తుగా ఒక దేవదూత అతన్ని తట్టి, “లేచి తిను” అన్నాడు. అతడు కళ్లు తెరిచి చూస్తే అతని తల దగ్గర సీసాలో నీళ్లు నిప్పుల మీద కాల్చిన రొట్టె కనిపించాయి. అతడు తిని త్రాగి మళ్ళీ పడుకున్నాడు. తర్వాత యెహోవా దూత రెండవసారి వచ్చి అతన్ని తట్టి, “లేచి తిను ఎందుకంటే నీవు దూర ప్రయాణం చేయాల్సి ఉంది” అన్నాడు. కాబట్టి అతడు లేచి తిని నీళ్లు త్రాగాడు. ఆ ఆహారం వల్ల బలం పొందుకొని నలభై రాత్రింబగళ్ళు ప్రయాణించి దేవుని పర్వతమైన హోరేబును చేరుకున్నాడు. అక్కడ అతడు ఒక గుహలో ఆ రాత్రి గడిపాడు. యెహోవా వాక్కు, “ఏలీయా, ఇక్కడ ఏం చేస్తున్నావు?” అని అతన్ని అడిగింది. అతడు జవాబిస్తూ, “నేను సైన్యాల యెహోవా దేవుని పట్ల ఎంతో రోషం కలిగి ఉన్నాను. ఇశ్రాయేలీయులు మీ నిబంధనను తిరస్కరించారు, మీ బలిపీఠాలను పడగొట్టారు, మీ ప్రవక్తలను ఖడ్గంతో చంపారు. నేను ఒక్కన్ని మాత్రమే మిగిలాను, ఇప్పుడు వారు నన్ను కూడా చంపాలని చూస్తున్నారు” అని చెప్పాడు. అందుకు యెహోవా, “బయటకు వెళ్లి, పర్వతం మీద యెహోవా సమక్షంలో నిలబడు, ఎందుకంటే యెహోవా అక్కడినుండి దాటి వెళ్లబోతున్నారు” అన్నారు. అప్పుడు ఒక గొప్ప బలమైన గాలి వచ్చి పర్వతాలను చీల్చింది, యెహోవా ఎదుట బండలను బద్దలు చేసింది, అయితే యెహోవా ఆ గాలిలో లేరు. గాలి తర్వాత భూకంపం వచ్చింది, కాని యెహోవా ఆ భూకంపంలో లేరు. భూకంపం తర్వాత అగ్ని వచ్చింది, కాని యెహోవా ఆ అగ్నిలో లేరు. అగ్ని తర్వాత మెల్లని స్వరం వినిపించింది. ఏలీయా ఆ స్వరం వినగానే, తన వస్ర్తంతో ముఖం కప్పుకుని వెళ్లి ఆ గుహ ద్వారం దగ్గర నిలబడ్డాడు. అప్పుడు అతనికి, “ఏలీయా ఇక్కడ ఏమి చేస్తున్నావు?” అనే స్వరం వినిపించింది. అతడు జవాబిస్తూ, “నేను సైన్యాల యెహోవా దేవుని పట్ల ఎంతో రోషం కలిగి ఉన్నాను. ఇశ్రాయేలీయులు మీ నిబంధనను తిరస్కరించారు, మీ బలిపీఠాలను పడగొట్టారు, మీ ప్రవక్తలను ఖడ్గంతో చంపారు. నేను ఒక్కన్ని మాత్రమే మిగిలాను. ఇప్పుడు వారు నన్ను కూడా చంపాలని చూస్తున్నారు” అని చెప్పాడు. అప్పుడు యెహోవా అతనితో, “నీవు వచ్చిన దారిలోనే తిరిగి వెళ్లు, దమస్కు ఎడారికి వెళ్లు. అక్కడికి వెళ్లాక, హజాయేలును అరాము మీద రాజుగా అభిషేకించు. తర్వాత ఇశ్రాయేలు మీద నిమ్షీ కుమారుడైన యెహును రాజుగా, ఆబేల్-మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాను నీ తర్వాత ప్రవక్తగా అభిషేకించు. హజాయేలు ఖడ్గం నుండి తప్పించుకునే వారిని యెహు చంపుతాడు, యెహు ఖడ్గం నుండి తప్పించుకునే వారిని ఎలీషా చంపుతాడు. అయినా ఇశ్రాయేలులో బయలుకు మోకరించని, వాన్ని ముద్దుపెట్టుకోని ఏడువేలమందిని నా కోసం ప్రత్యేకంగా ఉంచాను” అని చెప్పారు.

షేర్ చేయి
Read 1 రాజులు 19