1 రాజులు 17:10-16

1 రాజులు 17:10-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

కాబట్టి అతడు సారెపతు పట్టణ ద్వారం దగ్గరికి వెళ్ళి ఒక విధవరాలు అక్కడ కట్టెలు ఏరుకోవడం చూసి ఆమెను పిలిచాడు. “తాగడానికి గిన్నెలో కొంచెం మంచినీళ్ళు తెస్తావా?” అని అడిగాడు. ఆమె నీళ్లు తేబోతుంటే అతడామెను మళ్ళీ పిలిచి “నీ చేత్తో నాకొక రొట్టె ముక్క తీసుకు రా” అన్నాడు. అందుకామె “నీ దేవుడు యెహోవా జీవం తోడు. గిన్నెలో కొద్దిగా పిండి, సీసాలో కొంచెం నూనె మాత్రం నా దగ్గర ఉన్నాయి. ఒక్క రొట్టె కూడా లేదు. చావబోయే ముందు నేను ఇంటికి వెళ్లి నాకూ నా కొడుక్కీ ఒక రొట్టె తయారు చేసుకుని తిని ఆపైన ఆకలితో చచ్చి పోవాలని, కొన్ని కట్టెపుల్లలు ఏరుకోడానికి వచ్చాను” అంది. అప్పుడు ఏలీయా ఆమెతో అన్నాడు. “భయపడవద్దు, వెళ్లి నీవు చెప్పినట్టే చెయ్యి. అయితే అందులో ముందుగా నాకొక చిన్న రొట్టె చేసి, నా దగ్గరికి తీసుకురా. తరువాత నీకూ నీ కొడుక్కీ రొట్టెలు చేసుకో. భూమి మీద యెహోవా వాన కురిపించే వరకూ ఆ గిన్నెలో ఉన్న పిండి తగ్గదు, సీసాలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా చెప్పాడు.” అప్పుడు ఆమె వెళ్లి ఏలీయా చెప్పిన మాట ప్రకారం చేసింది. అతడూ, ఆమె, ఆమె కొడుకు చాలా రోజులు భోజనం చేస్తూ వచ్చారు. యెహోవా ఏలీయా ద్వారా చెప్పినట్టు, గిన్నెలోని పిండి తక్కువ కాలేదు, సీసాలోని నూనె అయిపోలేదు.

షేర్ చేయి
Read 1 రాజులు 17

1 రాజులు 17:10-16 పవిత్ర బైబిల్ (TERV)

కావున ఏలీయా సారెపతు అను పట్టణానికి వెళ్లాడు. అతడు నగర ద్వారం వద్దకు వెళ్లే సరికి అతనక్కడ ఒక విధవ స్త్రీని చూశాడు. ఆమె వంటకైపుల్లలు ఏరుకొంటూ వుంది. ఏలీయా ఆమెను, “నాకు తాగటానికి ఒక చెంబుతో నీరు తెచ్చి పెడతావా?” అని అడిగాడు. అతనికి నీరు తేవటానికి ఆమె వెళ్తూండగా, “నాకో రొట్టె ముక్క కూడా దయచేసి తీసుకురా” అని ఏలీయా అన్నాడు. “నీ దేవుడైన యెహోవా సాక్షిగా నేను చెబుతున్నాను. నా వద్ద రొట్టె లేదు. ఒక జాడీలో కొద్దిపిండి మాత్రం వుంది. కూజాలో కొంచెం ఒలీవ నూనెవుంది. నిప్పు రాజేయటానికి రెండు పుల్లలు ఏరుకోడానికి నేనిక్కడికి వచ్చాను. నేనవి తీసుకొని వెళ్లి మా ఆఖరి వంట చేసుకోవాలి. నేను, నా కుమారుడు అది తిని, తరువాత ఆకలితో మాడి చనిపోతాము” అని ఆ స్త్రీ అన్నది. ఏలీయా ఆమెతో ఇలా అన్నాడు: “ఏమీ బాధపడకు. నేను చెప్పిన రీతిలో నీవు ఇంటికి వెళ్లి వంట చేసుకో. కాని నీ వద్దవున్న పిండిలో నుంచి ఒకచిన్న రొట్టె ముందుగా చేసి, దానిని నాకు తెచ్చి పెట్టు. తర్వాత నీ కొరకు, నీ బిడ్డ కొరకు వంట చేసుకో. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇలా అన్నాడు: ‘ఆ పిండి జాడీ ఎప్పుడూ ఖాళీ కాదు. ఆ కూజాలో నూనె ఎప్పుడూ తరిగిపోదు. ఈ రాజ్యంమీద యెహోవా వర్షం కురింపించే వరకు ఇది కొనసాగుతుంది.’” అందువల్ల ఆ స్త్రీ ఇంటికి వెళ్లింది. ఏలీయా ఆమెకు ఏమి చేయమని చెప్పాడో అదంతా చేసింది. ఏలీయా, ఆ స్త్రీ, ఆ కుమారుడు చాలా దినముల వరకు సరిపడు ఆహారం కలిగియున్నారు. పిండిజాడీ, నూనె కూజా ఎన్నడూ ఖాళీ కాలేదు. యెహోవా ఎలా జరుగుతుందని చెప్పాడో, అంతా అలానే జరిగింది. ఈ విషయాలన్నీ యెహోవా ఏలీయా ద్వారా చెప్పాడు.

షేర్ చేయి
Read 1 రాజులు 17

1 రాజులు 17:10-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవినియొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి–త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసికొనిరమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోవుచుండగా అతడామెను మరల పిలిచి–నాకొక రొట్టెముక్కను నీ చేతిలో తీసికొని రమ్మని చెప్పెను. అందుకామె–నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నాయొద్దనున్నవేగాని అప్పమొకటైనలేదు, మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసికొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చితిననెను. అప్పుడు ఏలీయా ఆమెతో ఇట్లనెను–భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము; అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదటచేసి నాయొద్దకు తీసికొనిరమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసికొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించువరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువకాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా సెలవిచ్చియున్నాడు అనెను. అంతట ఆమె వెళ్లి ఏలీయా చెప్పిన మాటచొప్పునచేయగా అతడును ఆమెయు ఆమె యింటివారును అనేకదినములు భోజనముచేయుచు వచ్చిరి. యెహోవా ఏలీయా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు.

షేర్ చేయి
Read 1 రాజులు 17

1 రాజులు 17:10-16 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

కాబట్టి అతడు లేచి సారెపతుకు వెళ్లాడు. పట్టణ ద్వారం దగ్గరకు చేరగానే, అక్కడ ఒక విధవరాలు కట్టెలు ఏరుకుంటూ కనిపించింది. అతడు ఆమెను పిలిచి, “త్రాగడానికి నాకు గిన్నెలో నీళ్లు తెస్తావా?” అని అడిగాడు. ఆమె నీళ్లు తీసుకురావడానికి వెళ్తుంటే, అతడు పిలిచి, “దయచేసి ఒక రొట్టె ముక్క కూడా తీసుకురా” అన్నాడు. అందుకు ఆమె జవాబిస్తూ, “సజీవుడు, మీ దేవుడైన యెహోవా పేరిట ప్రమాణం చేస్తున్నాను, నా దగ్గర రొట్టె ఒక్కటి కూడా లేదు, కేవలం జాడీలో పిడికెడు పిండి, కూజలో కొంచెం నూనె ఉన్నాయి. నేను కొన్ని కట్టెలు ఏరుకుని ఇంటికి వెళ్లి నాకు నా కుమారునికి చివరి వంట చేసుకుని, తిని చనిపోతాము” అని అన్నది. ఏలీయా ఆమెతో, “భయపడకు. ఇంటికి వెళ్లి నేను నీకు చెప్పినట్లు చేయు. మొదట నా కోసం చిన్న రొట్టె చేసి తీసుకురా, తర్వాత నీకు, నీ కుమారునికి చేసుకో. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నారు: ‘దేశం మీద యెహోవా వర్షం కురిపించే వరకు, ఆ జాడీలో పిండి తగ్గిపోదు, కూజలో నూనె అయిపోదు’ ” అని చెప్పాడు. ఆమె వెళ్లి ఏలీయా చెప్పినట్లు చేసింది. కాబట్టి ప్రతిరోజు ఏలీయాకు, ఆ స్త్రీకి, తన కుటుంబానికి ఆహారం ఉండేది. ఎందుకంటే ఏలీయా ద్వారా యెహోవా చెప్పిన మాట ప్రకారం జాడీలో పిండి తరిగిపోలేదు, కూజలో నూనె అయిపోలేదు.

షేర్ చేయి
Read 1 రాజులు 17