1 రాజులు 17:1-7

1 రాజులు 17:1-7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

గిలాదు ప్రాంతంలోని తిష్బీ గ్రామం వాడైన ఏలీయా అహాబుతో “ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా ప్రాణం తోడు, నేను ఆయన ఎదుట నిలబడి చెబుతున్నాను. నేను మళ్ళీ చెప్పే వరకూ, రాబోయే కొన్నేళ్ళు మంచు గానీ వాన గానీ పడదు” అన్నాడు. ఆ తరువాత యెహోవా అతనితో ఇలా చెప్పాడు. “నీవు ఇక్కడ నుంచి తూర్పు వైపుగా వెళ్లి యొర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాక్కో. ఆ వాగు నీళ్ళు నీవు తాగాలి. అక్కడ నీకు ఆహారం తెచ్చేలా నేను కాకులకు ఆజ్ఞాపించాను” అని అతనికి చెప్పాడు. అతడు వెళ్లి యెహోవా చెప్పినట్టు యొర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివసించాడు. అక్కడ కాకులు ఉదయమూ సాయంత్రమూ రొట్టె, మాంసాలను అతని దగ్గరికి తెచ్చేవి. అతడు వాగు నీళ్ళు తాగాడు. కొంతకాలమైన తరువాత దేశంలో వాన కురవక ఆ వాగు ఎండిపోయింది.

షేర్ చేయి
Read 1 రాజులు 17

1 రాజులు 17:1-7 పవిత్ర బైబిల్ (TERV)

ప్రవక్తయైన ఏలీయా గిలాదులోని తిష్బీ నగరానికి చెందినవాడు. ఏలీయా వచ్చి రాజైన అహాబుతో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేను సేవిస్తాను. ఆయన శక్తితో నేను నిశ్చయంగా చెప్పేదేమనగా రాబోవు కొద్ది సంవత్సరాలలో మంచుగాని, వర్షంగాని కురియదు. నేను ఆజ్ఞ ఇస్తేగాని వర్షం పడదు.” తరువాత యెహోవా ఏలీయాతో, “నీవు ఈ ప్రదేశాన్ని వదిలి తూర్పుదిశగా వెళ్లి, కెరీతు వాగువద్ద దాగి వుండు. ఆ వాగు యోర్దాను నదికి తూర్పున ఉన్నది. నీవు ఆ వాగు నీటిని తాగవచ్చు. నీకు ఆహారాన్ని అక్కడికి చేరవేయమని నేను కాకోలములకు ఆజ్ఞ ఇచ్చాను” అని అన్నాడు. కావున యెహోవా చెప్పిన విధంగా ఏలీయా చేశాడు. యోర్దాను నదికి తూర్పున వున్న కెరీతువాగు దగ్గర నివసించటానికి అతడు వెళ్లాడు. బొంత కాకులు ప్రతి ఉదయం రొట్టెను, ప్రతి సాయంత్రం మాంసాన్ని తెచ్చి ఇచ్చేవి. ఏలీయా వాగు నీటిని తాగేవాడు. వర్షాలు పడక పోవటంతో, కొంత కాలానికి వాగు ఎండిపోయింది.

షేర్ చేయి
Read 1 రాజులు 17

1 రాజులు 17:1-7 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

అంతట గిలాదు కాపురస్థుల సంబంధియును తిష్బీ యుడునైన ఏలీయా అహాబునొద్దకు వచ్చి–ఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవాజీవముతోడు నా మాట ప్రకారముగాక, యీ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై –నీవు ఇచ్చటనుండి తూర్పువైపునకు పోయి యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగుదగ్గర దాగియుండుము; ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతనియొద్దకు తీసికొనివచ్చుచుండెను; అతడు వాగు నీరు త్రాగుచు వచ్చెను. కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను.

షేర్ చేయి
Read 1 రాజులు 17

1 రాజులు 17:1-7 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

గిలాదు ప్రాంతంలోని తిష్బీ గ్రామవాసియైన ఏలీయా అహాబుతో అన్నాడు, “నేను సేవించే ఇశ్రాయేలీయుల సజీవుడైన దేవుడు, యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, రాబోయే కొన్ని సంవత్సరాలు, నేను చెప్తేనే తప్ప, మంచు గాని, వర్షం గాని కురవదు.” తర్వాత యెహోవా వాక్కు ఏలీయాకు వచ్చింది: “ఈ స్థలం విడిచి, తూర్పు వైపుకు వెళ్లి, యొర్దానుకు తూర్పున, కెరీతు వాగు దగ్గర దాక్కో. నీవు ఆ వాగు నీళ్లు త్రాగు, అక్కడ నీకు ఆహారం అందించాలని కాకులకు ఆదేశించాను.” కాబట్టి యెహోవా చెప్పినట్లు ఏలీయా చేశాడు, అతడు యొర్దానుకు తూర్పున ఉన్న కెరీతు వాగు దగ్గరకు వెళ్లి అక్కడ ఉన్నాడు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కాకులు అతనికి మాంసం, రొట్టెలు తెచ్చేవి, అతడు ఆ వాగు నీళ్లు త్రాగేవాడు. కొంతకాలానికి దేశంలో వర్షం లేకపోవడం వలన ఆ వాగు ఎండిపోయింది.

షేర్ చేయి
Read 1 రాజులు 17