1 రాజులు 12:6-11

1 రాజులు 12:6-11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అప్పుడు రెహబాము రాజు తన తండ్రి సొలొమోను బతికి ఉన్నప్పుడు అతని దగ్గర సేవ చేసిన పెద్దలను సంప్రదించి “ఈ ప్రజలకు ఏం జవాబు చెప్పాలి?” అని వారిని అడిగాడు. వారు “ఈ దినాన నీవు ఈ ప్రజలకు సేవచేయ గోరితే వారికి మృదువైన మాటలతో వారికి జవాబిస్తే వాళ్ళు ఎప్పటికీ నీకు సేవకులుగా ఉంటారు” అన్నారు. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన సలహా పక్కనబెట్టి, తనతో కూడ పెరిగిన తన పరివారంలోని యువకులను పిలిచి సలహా అడిగాడు. అతడు వారిని “మా మీద నీ తండ్రి ఉంచిన కాడిని తేలిక చేయమని నాతో చెప్పుకున్న ఈ ప్రజలకు ఏమని జవాబు చెప్పాలి? మీరిచ్చే సలహా ఏంటి?” అని ప్రశ్నించాడు. అప్పుడు అతనితో బాటు పెరిగిన ఆ యువకులు అతనితో అన్నారు. “నీ తండ్రి మా కాడిని భారం చేసాడు గాని నీవు దాన్ని తేలిక చేయాలని నీతో చెప్పుకున్న ఈ ప్రజలకు ఇలా చెప్పు. మా నాన్న నడుం కంటే నా చిటికెన వేలు పెద్దది. మా నాన్న భారమైన కాడిని పెట్టాడు కానీ నేను ఆ కాడిని ఇంకా భారం చేస్తాను. మా నాన్న చెర్నాకోలలతో మిమ్మల్ని శిక్షించాడు కానీ నేను మిమ్మల్ని కొరడాలతో శిక్షిస్తాను.”

షేర్ చేయి
Read 1 రాజులు 12

1 రాజులు 12:6-11 పవిత్ర బైబిల్ (TERV)

సొలొమోను జీవించి వున్నప్పుడు అతనికి పరిపాలనలో సహాయపడిన కొందరు పెద్దలైన సలహాదారులున్నారు. కావున రాజైన రెహబాము ఈ సందర్భంలో, “ఆ ప్రజలకు ఏమి చెప్పాలని మీరను కొంటున్నారు?” అని సలహా అడిగాడు. పెద్దలు ఇలా అన్నారు, “ఈ రోజు నీవు వారి సేవకునిలా మెలగితే, రేపు వారంతా నిన్ను సేవిస్తారు. నీవు వారితో ప్రేమగా కనికరంతో మాట్లాడితే వారంతా నీ కొరకు ఎల్లప్పుడూ పనిచేస్తారు.” కాని రెహబాము వారి సలహాను పెడచెవిని పెట్టాడు. తన స్నేహితులైన యువకులను సలహా అడిగాడు. “నా తండ్రి ఇచ్చిన కఠినమైన పనికంటె తక్కువ పని ఇమ్మని ప్రజలు నన్నడుగుతున్నారు. నేనేమి సమాధానం చెపితే మంచిదని మీరనుకుంటున్నారు? నన్నేమి చెప్పమంటారు?” అని రెహబాము తన స్నేహితులను అడిగాడు. రాజు యొక్క యువ స్నేహితులు, “ఆ ప్రజలు నీ వద్దకు వచ్చి, ‘నీ తండ్రి మమ్మల్ని బండ చాకిరి చేయటానికి బలవంతం చేశాడు. కనుక మా పనిని ఇప్పుడు సులభం చేయుము’ అని అడిగారు కదా! అయితే నీవిప్పుడు కొన్ని డంబాలు పలికి, ‘నా చిటికెనవేలు నా తండ్రి శరీరం కంటె పెద్దదిగా వుంది. నా తండ్రి మిమ్మల్ని బండ చాకిరికి గురిచేశాడు. కాని నేను మిమ్మల్ని ఇంకా కష్టపడేలా చేస్తాను! నా తండ్రి మీచేత పని చేయించటానికి కొరడాలు ఉపయోగించాడు. కాని నేను పదునైన లోహపు ముక్కలతో కూర్చబడిన కొరడాలతో, మిమ్మల్ని చీల్చునట్లుగా కొడతాను’” అని సమాధానం చెప్పమన్నారు.

షేర్ చేయి
Read 1 రాజులు 12

1 రాజులు 12:6-11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

అప్పుడు రాజైన రెహబాము తన తండ్రియైన సొలొమోను బ్రదికియున్న ప్పుడు అతని సముఖమందు సేవచేసిన పెద్దలతో ఆలోచనచేసి–ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరమిచ్చెదనని వారి నడుగగా వారు–ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవచేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తర మిచ్చినయెడల వారు సదాకాలము నీకు దాసులగుదురనిరి. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి, తనతోకూడ పెరిగిన యౌవనులను పిలిచి ఆలోచన నడిగి, వారికీలాగు ప్రశ్నవేసెను –మామీద నీ తండ్రి యుంచిన కాడిని చులకన చేయుడని నాతో చెప్పుకొనిన యీ జనులకు ప్రత్యుత్తరమిచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు? అప్పుడు అతనితోకూడ ఎదిగిన ఆ యౌవనస్థులు ఈ ఆలోచన చెప్పిరి–నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసెనుగాని నీవు దానిని చులకనగా చేయవలెనని నీతో చెప్పుకొనిన యీ జనులకు ఈలాగు ఆజ్ఞ ఇమ్ము–నా తండ్రి నడుముకంటె నా చిటికెన వ్రేలు పెద్దదిగా ఉండును. నా తండ్రి మీమీద బరువైన కాడిని పెట్టెను సరే, నేను ఆ కాడిని ఇంక బరువుగా చేయుదును; నా తండ్రి చబుకులతో మిమ్మును శిక్షించెను సరే, నేను కొరడాలతో మిమ్మును శిక్షించుదును.

షేర్ చేయి
Read 1 రాజులు 12

1 రాజులు 12:6-11 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

అప్పుడు రెహబాము రాజు తన తండ్రి సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతనికి సేవలందించిన పెద్దలను సంప్రదించి “ఈ ప్రజలకు ఎలా జవాబివ్వాలో చెప్పండి” అని అడిగాడు. అందుకు వారు, “ఈ రోజు నీవు ఈ ప్రజలకు దాసునిగా ఉంటూ సేవ చేస్తూ, వారికి అనుకూలంగా జవాబు చెప్తే, వారు ఎప్పటికీ నీకు దాసులుగా ఉంటారు” అని చెప్పారు. కాని రెహబాము పెద్దలు ఇచ్చిన సలహాను తిరస్కరించి, తనతో పెరిగి పెద్దవారై తనకు సేవలందిస్తున్న యువకులను సంప్రదించాడు. అతడు వారిని, “మీ సలహా ఏంటి? ‘మీ తండ్రి పెట్టిన కాడిని తేలిక చేయండి’ అని నాతో అంటున్న ఈ ప్రజలకు నేనేమి జవాబివ్వాలి?” అని అడిగాడు. అతనితో పాటు పెరిగి పెద్దవారైన ఆ యువకులు జవాబిస్తూ, “ఈ ప్రజలు నీతో, ‘మీ తండ్రి మామీద బరువైన కాడి ఉంచాడు, కాని మీరు దాన్ని తేలిక చేయండి’ అని అన్నారు. కాని నీవు వారితో, ‘నా తండ్రి నడుముకంటే నా చిటికెన వేలు పెద్దది. నా తండ్రి మీమీద బరువైన కాడి ఉంచాడు; నేను దానిని ఇంకా బరువు చేస్తాను. నా తండ్రి కొరడాలతో కొట్టాడు; నేను తేళ్లతో కొడతాను’ అని చెప్పాలి” అన్నారు.

షేర్ చేయి
Read 1 రాజులు 12