1 రాజులు 11:1-11
1 రాజులు 11:1-11 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
రాజైన సొలొమోను ఫరో కుమార్తెతో పాటు చాలామంది పరదేశి స్త్రీలను అనగా మోయాబు, ఎదోము, అమ్మోను, సీదోను, హిత్తీ ప్రజల్లోని స్త్రీలను ప్రేమించాడు. “మీరు వారితో పెళ్ళి చేసుకోవద్దు, ఎందుకంటే వారు ఖచ్చితంగా మీ హృదయాలను వారి దేవుళ్ళ వైపు త్రిప్పుతారు” అని యెహోవా ఇశ్రాయేలు ప్రజలతో ఈ దేశాల వారి గురించే చెప్పారు. అయినప్పటికీ, సొలొమోను వారిని చాలా ప్రేమించాడు. అతనికి రాజకుమార్తెలైన ఏడువందలమంది భార్యలు, మూడువందలమంది ఉంపుడుగత్తెలు ఉన్నారు. అతని భార్యలు అతన్ని తప్పుదారి పట్టించారు. సొలొమోను వృద్ధుడైనప్పుడు, అతని భార్యలు అతని హృదయాన్ని ఇతర దేవుళ్ళ వైపు మళ్ళించారు. అతని హృదయం తన తండ్రియైన దావీదు హృదయంలా తన దేవుడైన యెహోవాకు పూర్తిగా అంకితం కాలేదు. సొలొమోను సీదోనీయుల దేవత అష్తారోతునూ, అమ్మోనీయుల అసహ్యమైన దేవత మిల్కోమును అనుసరించాడు. కాబట్టి సొలొమోను యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు; తన తండ్రియైన దావీదులా యెహోవాను సంపూర్ణంగా వెంబడించలేదు. సొలొమోను మోయాబీయుల అసహ్యమైన కెమోషు దేవునికి, అమ్మోనీయుల అసహ్యమైన మోలెకు దేవునికి యెరూషలేము తూర్పున ఉన్న కొండమీద క్షేత్రాలను కట్టించాడు. తన పరదేశి భార్యలు తమ దేవుళ్ళకు ధూపం వేస్తూ బలులు అర్పించడానికి ఇలా చేశాడు. సొలొమోనుకు రెండుసార్లు ప్రత్యక్షమైన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను అనుసరించక, తన హృదయం త్రిప్పుకున్నందుకు యెహోవా అతని మీద చాలా కోప్పడ్డారు. ఇతర దేవుళ్ళను అనుసరించకూడదు అని సొలొమోనుతో యెహోవా చెప్పినా, సొలొమోను ఆయన ఆజ్ఞను పాటించలేదు. కాబట్టి యెహోవా సొలొమోనుతో ఇలా అన్నారు, “నీ వైఖరి ఇలా ఉన్నది కాబట్టి, నేను నీకు ఆజ్ఞాపించిన నా నిబంధనను, నా శాసనాలను పాటించలేదు కాబట్టి, నేను ఖచ్చితంగా నీ నుండి ఈ రాజ్యాన్ని తీసివేసి నీ పనివారిలో ఒకనికి ఇస్తాను.
1 రాజులు 11:1-11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
సొలొమోను రాజు చాలామంది విదేశీ స్త్రీలను అంటే ఫరో కూతుర్నిమాత్రమే గాక మోయాబు, ఎదోము, అమ్మోను, సీదోను, హిత్తీ మొదలైన జాతి స్త్రీలను మోహించి పెళ్ళిచేసుకున్నాడు. “ఈ ప్రజలు మీ హృదయాలను కచ్చితంగా తమ దేవుళ్ళవైపు తిప్పుతారు కాబట్టి వారితో పెళ్లి సంబంధం పెట్టుకోవద్దని యెహోవా ఇశ్రాయేలీయులకు ముందే చెప్పాడు.” అయితే సొలోమోను ఈ స్త్రీలను మోహించాడు. అతనికి 700 మంది రాకుమార్తెలైన భార్యలూ 300 మంది ఉపపత్నులూ ఉన్నారు. అతని భార్యలు అతని హృదయాన్ని తిప్పివేశారు. సొలొమోను వృద్ధాప్యంలో అతని భార్యలు అతని హృదయాన్ని ఇతర దేవుళ్ళవైపు తిప్పినందువల్ల అతని తండ్రి దావీదు హృదయంలాగా అతని హృదయం యెహోవా దేవుని పట్ల యథార్ధంగా లేదు. సొలొమోను అష్తారోతు అనే సీదోనీయుల దేవతను, మిల్కోము అనే అమ్మోనీయుల అసహ్యమైన విగ్రహాన్నీ అనుసరించి నడిచాడు. ఈ విధంగా సొలొమోను యెహోవా దృష్టికి చెడ్డగా ప్రవర్తించి తన తండ్రి దావీదు అనుసరించినట్టు యథార్థహృదయంతో యెహోవాను అనుసరించలేదు. సొలొమోను కెమోషు అనే మోయాబీయుల హేయమైన విగ్రహానికి, మొలెకు అనే అమ్మోనీయుల హేయమైన విగ్రహానికి యెరూషలేము ముందున్న కొండమీద బలిపీఠాలు కట్టించాడు. తన విదేశీ భార్యలు వారి విగ్రహాలకు ధూపం వేస్తూ బలులు అర్పించడం కోసం అతడు ఇలా చేశాడు. ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా అతనికి రెండు సార్లు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవుళ్ళను అనుసరించకూడదని అతనికి ఆజ్ఞాపించాడు. అయినా సొలొమోను హృదయం ఆయన నుండి తొలగిపోయింది. యెహోవా అతడికి ఇచ్చిన ఆజ్ఞను అతడు పాటించనందుకు ఆయన అతనిపై కోపగించి ఇలా చెప్పాడు. “నేను నీతో చేసిన నా నిబంధనను, శాసనాలను నీవు ఆచరించడం లేదు. కాబట్టి ఈ రాజ్యం కచ్చితంగా నీకు ఉండకుండాా తీసివేసి నీ సేవకుల్లో ఒకడికి ఇచ్చి తీరుతాను.
1 రాజులు 11:1-11 పవిత్ర బైబిల్ (TERV)
రాజైన సొలొమోను ఇశ్రాయేలీయులు కాని వారైన అనేక మంది స్త్రీలను ప్రేమించాడు. అలాంటి స్త్రీలలో ఫరో కుమార్తె, మోయాబీయులు, అమ్మోనీయులు, ఎదోమీయులు, సీదోనీయులు, హిత్తీయులు వున్నారు. గతంలో ఇశ్రాయేలు ప్రజలతో యెహోవా దేవుడు ఇలా అన్నాడు: “ఇతర దేశాల వారిని మీరు వివాహం చేసుకోరాదు. ఒక వేళ మీరు అలా చేస్తే ఆ ప్రజలు వాళ్ల దేవుళ్లను మీరు కొలిచేలా చేస్తారు.” కాని సొలొమోను ఈ స్త్రీల వ్యామోహంలో పడ్డాడు. సొలొమోనుకు ఏడు వందల మంది భార్యలున్నారు. (వీరంతా ఇతర దేశాల రాజుల కుమార్తెలే). అతనికి ఇంకను మూడు వందల మంది స్త్రీలు ఉపపత్నులుగ ఉన్నారు. అతని భార్యలు అతనిని తప్పుదారి పట్టించి దేవునికి దూరం చేశారు. సొలొమోను వృద్దుడయ్యే సరికి అతని భార్యలు అతడు ఇతర దేవుళ్లను మొక్కేలా చేశారు. తన తండ్రియగు దావీదు యెహోవా పట్ల చూపిన వినయ విధేయతలు, భక్తి శ్రద్ధలు సొలొమోను చూపలేకపొయాడు. సొలొమోను అష్తారోతును ఆరాధించాడు. ఇది ఒక సీదోనీయుల దేవత. మరియు సొలొమోను మిల్కోమును ఆరాధించాడు. ఇది అమ్మోనీయుల ఒక భయంకర దేవత విగ్రహం. ఈలాగున సొలొమోను యెహోవా పట్ల అపచారం చేశాడు. తన తండ్రి దావీదువలె సొలొమోను సంపూర్ణంగా యెహోవాని అనుసరించలేదు. కెమోషుకు ఒక ఆరాధనా స్థలాన్ని సొలొమోను నిర్మించాడు. కెమోషు మోయాబీయుల ఒక ఘోరమైన దేవత విగ్రహం. యెరూషలేముకు తూర్పుదిశలో ఒక కొండపై ఆ ఆరాధనా స్థలాన్ని సొలొమోను నిర్మించాడు. అదే కొండ మీద మొలెకునకు కూడా ఒక ఆరాధనా స్థలాన్ని సొలొమోను నిర్మించాడు. మొలెకు అమ్మోనీయులకు చెందిన ఒక భయానక దేవత విగ్రహం. ఇతర దేశాలకు చెందిన తన భార్యలందరి నిమిత్తం సొలొమోను ఈ మాదిరి ఆరాధనా స్థలాలను నిర్మించాడు. అతని భార్యలు వారి వారి దేవుళ్లకు ధూపం వేసి, బలులు సమర్పించేవారు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నుండి సొలొమోను దూరమైనాడు. కావున యెహోవా సొలొమోను పట్ల కోపం వహించాడు. సొలొమోనుకు యెహోవా రెండు సార్లు ప్రత్యక్షమైనాడు. చిల్లర దేవుళ్లను ఆరాధించరాదని యెహోవా సొలొమోనుకు చెప్పాడు: యెహోవా ఆజ్ఞను సొలొమోను పాటించ లేదు. కావున యెహోవా సొలొమోనుతొ ఇలా అన్నాడు, “నాతో నీవు చేసుకొన్న ఒడంబడికను అనుసరించుటకు నీవిష్టపడలేదు. నీవు నా ఆజ్ఞలను శిరసావహించలేదు. కావున నీ రాజ్యాన్ని నీ నుండి వేరు చేస్తానని నిశ్చయంగా చెబుతున్నాను. దానిని నీ సేవకునికి ఇస్తాను.
1 రాజులు 11:1-11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మోయాబీయులు ఎదోమీయులు అమ్మోనీయులు సీదోనీయులు హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతలతట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చేయనియ్యకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చియున్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెనుగాక ఆ జనులలో ఇంక అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి ఏడు వందలమంది రాజకుమార్తెలైన భార్యలును మూడువందలమంది ఉప పత్నులును కలిగియుండిరి; అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతట్టు త్రిప్పగా అతని తండ్రియైన దావీదు హృదయమువలె అతని హృదయము దేవుడైన యెహోవాయెడల యథార్థము కాక పోయెను. సొలొమోను అష్తారోతు అను సీదోనీయుల దేవతను మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడచి తన తండ్రియైన దావీదు అనుసరించినట్లు యథార్థహృదయముతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండమీద బలిపీఠములను కట్టించెను. తమ దేవతలకు ధూపము వేయుచు బలులనర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఈలాగు చేసెను. ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా అతనికి రెండు మారులు ప్రత్యక్షమై –నీవు ఇతర దేవతలను వెంబడింప వలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్దనుండి తొలగిపోయెను. యెహోవా తన కిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి –సెలవిచ్చినదేమనగా – నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపక పోవుట నేను కనుగొనుచున్నాను గనుక యీ రాజ్యము నీకుండకుండ నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చెదను.