1 యోహాను 4:7-12
1 యోహాను 4:7-12 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ప్రియ మిత్రులారా, ప్రేమ దేవుని నుండి వస్తుంది కనుక మనం ఒకరిని ఒకరం ప్రేమించాలి. ప్రేమించేవారు దేవుని మూలంగా పుట్టారు కనుక వారు దేవుణ్ణి ఎరిగినవారు. దేవుడే ప్రేమ, కనుక ప్రేమించనివారు దేవుని తెలుసుకోలేరు. దేవుడు మన మధ్య తన ప్రేమను ఈ విధంగా చూపించారు: ఆయన ద్వారా మనం జీవించగలిగేలా, దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించారు. ఇదే ప్రేమ: మనం దేవుడిని ప్రేమించామని కాదు, కాని ఆయనే మనలను ప్రేమించి మన పాపాలకు ప్రాయశ్చిత్త బలిగా తన కుమారుని పంపారు. ప్రియ మిత్రులారా, దేవుడు మనలను ఎంతో ప్రేమించారు కనుక మనం కూడా ఒకరిని ఒకరం ప్రేమించాలి. దేవుడిని ఎవరూ ఎన్నడూ చూడలేదు; కాని మనం ఒకరిని ఒకరం ప్రేమిస్తే, దేవుడు మనలో జీవిస్తారు; ఆయన ప్రేమ మనలో పరిపూర్ణం అవుతుంది.
1 యోహాను 4:7-12 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ప్రియులారా, ఒకరిని ఒకరు ప్రేమించుకుందాం. ఎందుకంటే, ప్రేమ దేవునినుండి వస్తుంది. ప్రేమించే ప్రతి మనిషీ దేవుని ద్వారా పుట్టి, దేవుణ్ణి తెలుసుకున్న వాడు. ప్రేమించని వాడికి దేవుడు తెలియదు. ఎందుకంటే దేవుడు ప్రేమ. దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించి, ఆయన ద్వారా మనం జీవించాలన్నది ఆయన ఉద్దేశం. దీని ద్వారా దేవుని ప్రేమ మన మధ్య వెల్లడి అయ్యింది. మనం దేవుణ్ణి ప్రేమించామని కాదు గాని ఆయనే మనలను ప్రేమించి, మన పాపాలకు ప్రాయశ్చిత్త బలిగా మనకోసం తన కుమారుణ్ణి పంపించాడు. ప్రేమంటే ఇదే. ప్రియులారా, దేవుడు మనలను ఇంతగా ప్రేమించాడు కాబట్టి మనం కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. ఎవ్వరూ, ఎన్నడూ, దేవుణ్ణి చూడలేదు. మనం ఒకరిని ఒకరు ప్రేమించుకుంటే, దేవుడు మనలో నిలిచి ఉంటాడు. ఆయన ప్రేమ మనలో సంపూర్ణం అవుతుంది.
1 యోహాను 4:7-12 పవిత్ర బైబిల్ (TERV)
ప్రియ మిత్రులారా! ప్రేమ దేవునినుండి వస్తుంది. కనుక మనం పరస్పరం ప్రేమతో ఉందాం. ప్రేమించే వ్యక్తి దేవుని వలన జన్మిస్తాడు. అతనికి దేవుడు తెలుసు. దేవుడు ప్రేమస్వరూపం గలవాడు. ప్రేమలేనివానికి దేవుడెవరో తెలియదు. మనం కుమారునిద్వారా జీవించాలని దేవుడు తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఈ ప్రపంచంలోకి పంపి తన ప్రేమను మనకు వెల్లడి చేసాడు. మనం ఆయన్ని ప్రేమిస్తున్నందుకు ఆయన ఈ పని చెయ్యలేదు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక, మన ప్రాయశ్చిత్తానికి బలిగా తన కుమారుణ్ణి పంపాడు. ఇదే ప్రేమ. ప్రియ మిత్రులారా! దేవుడు మనల్ని యింతగా ప్రేమించాడు కనుక మనం కూడా పరస్పరం ప్రేమతో ఉండాలి. దేవుణ్ణి ఎవ్వరూ చూడలేదు. మనం పరస్పరం ప్రేమతో ఉంటే దేవుడు మనలో నివసిస్తాడు. ఆయన ప్రేమ మనలో పరిపూర్ణత చెందుతుంది.
1 యోహాను 4:7-12 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతము; ఏలయనగా ప్రేమ దేవునిమూలముగా కలుగుచున్నది; ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది. ప్రియులారా, దేవుడు మన లను ఈలాగు ప్రేమింపగా మనమొకనినొకడు ప్రేమింప బద్ధులమై యున్నాము. ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచియుండ లేదు; మన మొకనినొకడు ప్రేమించినయెడల దేవుడు మనయందు నిలిచియుండును; ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును.
1 యోహాను 4:7-12 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ప్రియ మిత్రులారా, ప్రేమ దేవుని నుండి వస్తుంది కాబట్టి మనం ఒకరిని ఒకరం ప్రేమించాలి. ప్రేమించేవారు దేవుని మూలంగా పుట్టారు కాబట్టి వారు దేవున్ని ఎరిగినవారు. దేవుడే ప్రేమ, కాబట్టి ప్రేమించనివారు దేవుని తెలుసుకోలేరు. ఆయన ద్వారా మనం జీవించగలిగేలా, దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించారు. ఈ విధంగా దేవుడు మన మధ్య తన ప్రేమను చూపించారు. మనం దేవుడిని ప్రేమించామని కాదు కాని ఆయనే మనల్ని ప్రేమించి మన పాపాలకు ప్రాయశ్చిత్త బలిగా తన కుమారుని పంపారు. ఇదే ప్రేమంటే. ప్రియ మిత్రులారా, దేవుడు మనల్ని ఎంతో ప్రేమించారు కాబట్టి మనం కూడా ఒకరిని ఒకరం ప్రేమించుకోవాలి. దేవుడిని ఎవరూ ఎన్నడూ చూడలేదు; కాని మనం ఒకరిని ఒకరం ప్రేమిస్తే, దేవుడు మనలో జీవిస్తారు; ఆయన ప్రేమ మనలో పరిపూర్ణం అవుతుంది.