1 యోహాను 4:13-18
1 యోహాను 4:13-18 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
మనం ఆయనలో జీవిస్తున్నామని ఆయన మనలో ఉన్నారని మనం దీనిని బట్టి తెలుసుకోవచ్చు: ఆయన తన ఆత్మను మనకు ఇచ్చారు. మరియు లోక రక్షకునిగా దేవుడు తన కుమారుని పంపడం మనం చూశాము సాక్ష్యమిచ్చాము. యేసు దేవుని కుమారుడని ఎవరు ఒప్పుకుంటారో, వారిలో దేవుడు, వారు దేవునిలో జీవిస్తారు. ప్రేమ మనకు తెలుసు మరియు మనం దానిపైన ఆధారపడుతున్నాం. దేవుడే ప్రేమ. ఎవరు ప్రేమ కలిగి జీవిస్తారో, వారు దేవునిలో, దేవుడు వారిలో జీవిస్తారు. తీర్పు రోజున మనం ధైర్యంతో ఉండునట్లు దేవుని ప్రేమ మనలో ఈ విధంగా పరిపూర్ణం చేయబడింది: ఈ లోకంలో మనం యేసు వలె ఉన్నాము. ప్రేమలో భయం ఉండదు. పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని తరిమివేస్తుంది, ఎందుకంటే భయం అనేది శిక్షకు సంబంధించింది. కనుక భయపడేవారు ప్రేమలో పరిపూర్ణం కాలేరు.
1 యోహాను 4:13-18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దీనివలన మనం ఆయనలో నిలిచి ఉన్నామనీ, ఆయన మనలో నిలిచి ఉన్నాడనీ తెలుసుకుంటాము. ఎందుకంటే, ఆయన తన ఆత్మను మనకిచ్చాడు. తండ్రి తన కుమారుణ్ణి ఈ లోక రక్షకుడుగా పంపించడం మేము చూశాము. దానికి మేము సాక్షులం. యేసు దేవుని కుమారుడని ఎవరు అంగీకరిస్తారో అతనిలో దేవుడు నిలిచి ఉంటాడు. అతడు దేవునిలో నిలిచి ఉంటాడు. దేవునికి మనపై ఉన్న ప్రేమను మనం తెలుసుకుని విశ్వసించాము. దేవుడు ప్రేమ. ప్రేమలో నిలిచి ఉన్నవాడు దేవునిలో నిలిచి ఉంటాడు. దేవుడు అతనిలో నిలిచి ఉంటాడు. తీర్పు రోజున మనం ధైర్యంతో ఉండేలా మన మధ్య ఈ ప్రేమ పరిపూర్ణం అయ్యింది. ఎందుకంటే ఈ లోకంలో మనం ఆయన ఉన్నట్టే ఉన్నాం. ప్రేమలో భయం లేదు. పరిపూర్ణ ప్రేమ భయాన్ని పారద్రోలుతుంది. ఎందుకంటే భయం శిక్షకు సంబంధించింది. భయం ఉన్నవాడు ఇంకా ప్రేమలో పరిపూర్ణత పొందలేదు.
1 యోహాను 4:13-18 పవిత్ర బైబిల్ (TERV)
ఆయన తన ఆత్మను మనకిచ్చాడు. తద్వారా మనము ఆయనలో జీవిస్తున్నామని, ఆయన మనలో జీవిస్తున్నాడని మనం తెలుసుకోగలుగుతున్నాము. దేవుడు తన కుమారుణ్ణి ప్రపంచాన్ని రక్షించటానికి పంపాడు. ఆయన్ని మేము చూసాము, కాబట్టి సాక్ష్యం చెపుతున్నాము. యేసు దేవుని కుమారుడని అంగీకరించినవానిలో దేవుడు నివసిస్తాడు. దేవునిలో వాడు నివసిస్తున్నాడు. దేవునికి మనపట్ల ప్రేమ ఉందని మనం నమ్ముతున్నాము. ఆ ప్రేమ మనకు తెలుసు. దేవుడే ప్రేమ. ప్రేమలో జీవించేవాడు దేవునిలో జీవిస్తాడు. దేవుడు అతనిలో జీవిస్తాడు. తీర్పు చెప్పేరోజు మనం ధైర్యంతో ఉండాలని మన మధ్యనున్న ప్రేమ పరిపూర్ణం చెయ్యబడింది. ఎందుకంటే, మనమీ ప్రపంచంలో ఆయనవలె జీవిస్తున్నాము. ప్రేమలో భయం ఉండదు. పరిపూర్ణత పొందిన ప్రేమ భయాన్ని పారద్రోలుతుంది. ఎందుకంటే, భయం శిక్షకు సంబంధించింది. భయపడే వ్యక్తి ప్రేమలో పరిపూర్ణత పొందలేడు.
1 యోహాను 4:13-18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దీనివలన మనము ఆయనయందు నిలిచియున్నామనియు ఆయన మనయందున్నాడనియు తెలిసికొనుచున్నాము; ఏలయనగా ఆయన మనకు తన ఆత్మ లో పాలు దయచేసియున్నాడు. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి, సాక్ష్యమిచ్చుచున్నాము. యేసు దేవుని కుమారుడని యెవడు ఒప్పు కొనునో, వానిలో దేవుడు నిలిచియున్నాడు, వాడు దేవునియందున్నాడు. మనయెడల దేవునికి ఉన్న ప్రేమను మనమెరిగినవారమై దాని నమ్ముకొనియున్నాము; దేవుడు ప్రేమాస్వరూపియై యున్నాడు, ప్రేమయందు నిలిచి యుండువాడు దేవునియందు నిలిచియున్నాడు, దేవుడు వానియందు నిలిచియున్నాడు. తీర్పుదినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి యున్నది; ఏలయనగా ఆయన ఎట్టివాడై యున్నాడో మనము కూడ ఈ లోకములో అట్టివారమై యున్నాము. ప్రేమలో భయముండదు; అంతేకాదు; పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్లగొట్టును; భయము దండ నతోకూడినది; భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు.
1 యోహాను 4:13-18 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
మనం ఆయనలో జీవిస్తున్నామని ఆయన మనలో ఉన్నారని దీనిని బట్టి మనకు తెలుస్తుంది: ఆయన తన ఆత్మను మనకు ఇచ్చారు. లోక రక్షకునిగా దేవుడు తన కుమారుని పంపడం మనం మేము చూశాం సాక్ష్యమిచ్చాము. యేసు దేవుని కుమారుడని ఎవరు ఒప్పుకుంటారో, వారిలో దేవుడు, వారు దేవునిలో జీవిస్తారు. దేవునికి మనపై ఉన్న ప్రేమను తెలుసుకొని మనం దానిపైన ఆధారపడుతున్నాము. దేవుడే ప్రేమ. ఎవరు ప్రేమ కలిగి జీవిస్తారో, వారు దేవునిలో, దేవుడు వారిలో జీవిస్తారు. తీర్పు రోజున మనం ధైర్యంతో ఉండేలా దేవుని ప్రేమ మనలో ఈ విధంగా పరిపూర్ణం చేయబడింది: ఈ లోకంలో మనం యేసు వలె ఉన్నాము. ప్రేమలో భయం ఉండదు. పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని తరిమివేస్తుంది, ఎందుకంటే భయం అనేది శిక్షకు సంబంధించింది. కాబట్టి భయపడేవారు ప్రేమలో పరిపూర్ణం కాలేరు.