1 యోహాను 1:1-7
1 యోహాను 1:1-7 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఆది నుండి ఉన్న, మేము వినిన, మా కన్నులతో చూసిన, మా చేతులతో తాకిన, ఆ జీవ వాక్యం గురించే మేము ప్రకటిస్తున్నాము. ఆ జీవం ప్రత్యక్షమైంది; మేము దానిని చూశాము, దాని గురించి సాక్ష్యమిస్తున్నాము, తండ్రి దగ్గర ఉండిన మాకు ప్రత్యక్షమైన నిత్యజీవం గురించి మీకు ప్రకటిస్తున్నాము. తండ్రితో కుమారుడైన యేసుక్రీస్తుతో మాకు గల సహవాసంలో మీరు కూడ మాతో చేరేలా, మేము చూచిన వాటిని విన్నవాటిని మీకు ప్రకటిస్తున్నాము. మన ఆనందం సంపూర్ణమవ్వాలని మేము దీనిని వ్రాస్తున్నాము. మేము ఆయన నుండి విని, మీకు ప్రకటిస్తున్న సందేశం ఇదే: దేవుడే వెలుగు; ఆయనలో ఎంత మాత్రం చీకటి లేదు. ఒకవేళ మనం ఆయనతో సహవాసం కలిగివున్నామని చెప్తూ ఇంకా చీకటిలోనే నడిస్తే, మనం అబద్ధం చెప్తున్నాము, సత్యంలో జీవించడం లేదు. అయితే, ఆయన వెలుగులో ఉన్నట్లు మనం వెలుగులోనే నడుస్తున్నట్లయితే, మనం ఒకరితో ఒకరం సహవాసం కలిగి ఉంటాము, ఆయన కుమారుడైన, యేసు రక్తం పాపాలన్నిటి నుండి మనలను శుద్ధి చేస్తుంది.
1 యోహాను 1:1-7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆది నుండి ఉన్న జీవ వాక్కును గురించి మేము విన్నదీ, మా కళ్ళతో చూసిందీ, దగ్గరగా గమనించిందీ, మా చేతులతో తాకిందీ మీకు ప్రకటిస్తున్నాం. ఆ జీవం వెల్లడైంది. తండ్రితో ఉండి ఇప్పుడు బయటకు కనిపించిన ఆ శాశ్వత జీవాన్ని మేము చూశాం కాబట్టి మీకు సాక్షమిస్తూ దాన్ని మీకు ప్రకటిస్తున్నాం. మీరు కూడా మాతో సహవాసం కలిగి ఉండాలని మేము చూసిందీ, విన్నదీ మీకు ప్రకటిస్తున్నాం. నిజానికి మన సహవాసం తండ్రితోను, ఆయన కుమారుడు యేసు క్రీస్తుతోను ఉంది. మీ ఆనందం సంపూర్తి కావాలని ఈ సంగతులు మీకు రాస్తున్నాం. దేవుడు వెలుగు. ఆయనలో చీకటి లేనే లేదు. దీన్ని మేము ఆయన దగ్గర విని మీకు ప్రకటిస్తున్నాం. మనకు ఆయనతో సహవాసం ఉందని చెప్పుకుంటూ, చీకటి మార్గంలో ఉంటే మనం అబద్ధం ఆడుతున్నట్టే. సత్యాన్ని ఆచరిస్తున్నట్టు కాదు. అయితే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిస్తే, మనకు ఒకరితో ఒకరికి అన్యోన్యసహవాసం ఉంటుంది. అప్పుడు ఆయన కుమారుడు యేసు క్రీస్తు రక్తం మనలను ప్రతి పాపం నుండి శుద్ధి చేస్తుంది.
1 యోహాను 1:1-7 పవిత్ర బైబిల్ (TERV)
ఏది మొదటినుండి ఉన్నదో, దాన్ని మేము విన్నాము, మా కళ్ళారా చూసాము. చూసి మా చేతుల్తో తాకాము. అదే జీవం కలిగించే వాక్యం. దాన్ని గురించే మీకు ప్రకటిస్తున్నాము. జీవం కనిపించింది. మేము దాన్ని చూసాము. చూసినట్టు సాక్ష్యం కూడా చెపుతున్నాము. ఆ జీవాన్ని గురించి మీకు ప్రకటిస్తున్నాము. ఆ జీవం తండ్రితో ఉంది. అది మాకు కనిపించింది. తండ్రితో ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో మాకు సహవాసం ఉంది కనుక, మీరు కూడా మాతో సహవాసం చెయ్యాలనే ఉద్దేశ్యంతో మేము చూసినదాన్ని, విన్నదాన్ని మీకు ప్రకటిస్తున్నాము. మన ఆనందం సంపూర్ణంగా ఉండాలని యిది మీకు వ్రాస్తున్నాను. దేవుడు వెలుగై వున్నాడు. ఆయనలో చీకటి ఏ మాత్రం లేదు. ఈ సందేశాన్ని ఆయన మాకు చెప్పాడు. దాన్ని మేము మీకు ప్రకటిస్తున్నాం. మనకు ఆయనతో సహవాసముందని అంటూ చీకట్లో నడిస్తే మనము అసత్యమాడినట్లే కదా! సత్యాన్ని ఆచరించటం మానుకొన్నట్లే కదా! దేవుడు వెలుగులో ఉన్నాడు. కాబట్టి మనం కూడా వెలుగులో నడిస్తే మన మధ్య సహవాసం ఉంటుంది. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు రక్తం మన పాపాలన్నిటిని కడుగుతుంది.
1 యోహాను 1:1-7 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
జీవవాక్యమునుగూర్చినది, ఆదినుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను; తండ్రియొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్యజీవమును మేము చూచి, ఆ జీవమునుగూర్చి సాక్ష్యమిచ్చుచు, దానిని మీకు తెలియ పరచుచున్నాము. మాతోకూడ మీకును సహవాసము కలుగునట్లు మేము చూచినదానిని వినినదానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితోకూడను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేమీ సంగతులను వ్రాయుచున్నాము. మేమాయనవలన విని మీకు ప్రకటించు వర్తమాన మేమనగా–దేవుడు వెలుగై యున్నాడు; ఆయనయందు చీకటి ఎంతమాత్రమును లేదు. ఆయనతోకూడ సహవాసముగలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినయెడల మనమబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల, మనము అన్యోన్యసహవాసము గలవారమై యుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును.
1 యోహాను 1:1-7 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ఆది నుండి ఉన్న జీవవాక్యం గురించి మేము విన్నది, మా కళ్ళతో చూసింది, మా చేతులతో తాకింది మేము ప్రకటిస్తున్నాము. ఆ జీవం ప్రత్యక్షమైంది; తండ్రి దగ్గర ఉండి మాకు ప్రత్యక్షమై ఆ నిత్యజీవాన్ని మేము చూసి, ఆ జీవాన్ని గూర్చి సాక్ష్యమిస్తూ దాన్ని మీకు తెలియజేస్తున్నాము. తండ్రితో కుమారుడైన యేసు క్రీస్తుతో మాకు గల సహవాసంలో మీరు కూడా మాతో చేరేలా మేము చూసినవాటిని విన్నవాటిని మీకు ప్రకటిస్తున్నాము. మన ఆనందం సంపూర్ణమవ్వాలని మేము దీనిని వ్రాస్తున్నాము. మేము ఆయన నుండి విని, మీకు ప్రకటిస్తున్న సందేశం ఇదే: దేవుడే వెలుగు; ఆయనలో ఎంత మాత్రం చీకటి లేదు. ఒకవేళ మనం ఆయనతో సహవాసం కలిగి ఉన్నామని చెప్తూ ఇంకా చీకటిలోనే నడిస్తే మనం అబద్ధం చెప్పినట్లే, సత్యంలో జీవించడం లేదు. అయితే, ఆయన వెలుగులో ఉన్నట్లు మనం వెలుగులోనే నడుస్తున్నట్లయితే, మనం ఒకరితో ఒకరం సహవాసం కలిగి ఉంటాము. ఆయన కుమారుడైన, యేసు రక్తం పాపాలన్నిటి నుండి మనల్ని శుద్ధి చేస్తుంది.