1 కొరింథీయులకు 8:4-13
1 కొరింథీయులకు 8:4-13 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అందుకే, విగ్రహాలకు అర్పించిన వాటిని తినే విషయంలో: “లోకంలో ఒక విగ్రహం ఏ విలువ లేనిది” మరియు “ఒకే ఒక్క దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు” అని మనకు తెలుసు. ఆకాశంలో కాని భూమి మీద కాని దైవాలు ప్రభువులు అని పిలువబడే వారు అనేకమంది ఉన్నా, కానీ మనకైతే ఒక్కడే తండ్రియైన దేవుడు ఉన్నాడు. ఆయన ద్వారానే అన్ని కలిగాయి, ఆయన కోసమే మనం జీవిస్తున్నాం; అలాగే మనకు యేసు క్రీస్తు ప్రభువు ఒక్కడే, ఆయన ద్వారానే అన్ని కలిగాయి, ఆయన ద్వారానే మనం జీవిస్తున్నాం. అయితే ఈ జ్ఞానం అందరికీ లేదు. కొందరు ఇప్పటికీ విగ్రహాలను ఆరాధించే వారు బలి అర్పించిన ఆహారాన్ని తిన్నప్పుడు తాము ఒక దేవతకు అర్పించింది తింటున్నామని భావిస్తున్నారు. అలా వారి మనస్సాక్షి బలహీనంగా ఉన్నందుకు అది అపవిత్రమవుతుంది. అయితే ఆహారం మనల్ని దేవునికి దగ్గరగా తీసుకురాదు; తినకపోతే మనకు నష్టంలేదు, తినడం వలన మనకు లాభం లేదు. అయినాసరే మీ స్వాతంత్ర్యాన్ని ఉపయోగించుకోవడం బలహీనులకు ఆటంకంగా ఉండకుండా చూసుకోండి. ఎందుకంటే మీకున్న జ్ఞానంతో విగ్రహ ఆలయంలో నీవు తినడం బలహీనమైన మనస్సాక్షిగలవారు చూస్తే, వారు విగ్రహాలను అర్పించిన వాటిని తినడానికి ధైర్యం తెచ్చుకొంటారు గదా? అందువల్ల ఎవరి కొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనులైన ఆ సహోదరీ సహోదరులు నీ జ్ఞానాన్ని బట్టి నశిస్తారు. ఇలా వారికి విరోధంగా పాపం చేసి వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించినందుకు మీరు క్రీస్తుకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు. కనుక నేను తిన్నదే నా సహోదరీ సహోదరులు పాపంలో పడడానికి ఒకవేళ కారణమైతే, వారు పాపంలో పడడానికి నేను కారణం కాకూడదని నేను మళ్ళీ ఎప్పుడు అలాంటి ఆహారాన్ని తినను.
1 కొరింథీయులకు 8:4-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అందుచేత విగ్రహాలకు అర్పించిన వాటిని తినే విషయానికి వస్తే, ఈ లోకంలో విగ్రహం అనేది వట్టిది అని మనకు తెలుసు. ఒకే ఒక దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని మనకు తెలుసు. దేవుళ్ళు, ప్రభువులు అని అందరూ పిలిచే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆకాశంలో, భూమి మీదా దేవుళ్ళనే వారు ఎంతమంది ఉన్నప్పటికీ, మనకైతే ఒకే దేవుడున్నాడు. ఆయన తండ్రి అయిన దేవుడు. ఆయన నుండి సమస్తమూ కలిగింది. ఆయన కోసమే మనమున్నాం. అలాగే మనకు ప్రభువు ఒక్కడే ఉన్నాడు. ఆయన యేసు క్రీస్తు. ఆయన ద్వారా అన్నీ కలిగాయి. మనం కూడా ఆయన ద్వారానే ఉనికి కలిగి ఉన్నాం. అయితే ఈ తెలివి అందరికీ లేదు. కొందరు ఇంతకు ముందు విగ్రహాలను ఆరాధించే వారు కాబట్టి తాము తినే పదార్ధాలు విగ్రహార్పితాలని భావించి తింటారు. వారి మనస్సాక్షి బలహీనం కావడం వలన అది వారికి అపరాధం అవుతుంది. భోజనం విషయంలో మనకు దేవుని నుండి ఏమీ మెప్పు కలగదు. మనం దేనినైనా తినకపోవడం వలన మనం తక్కువ వారం కాదు, తినడం వలన ఎక్కువ వారం కాదు. అయితే మీకున్న ఈ స్వేచ్ఛ విశ్వాసంలో బలహీనులైన వారికి అభ్యంతర కారణం కాకుండా చూసుకోండి. ఎలా అంటే, సత్యం గురించిన అవగాహన కలిగిన నీవు విగ్రహాలు నిలిపి ఉన్న స్థలంలో తింటూ ఉండగా బలహీనమైన మనస్సాక్షి గలవాడు చూస్తే, అతడు విగ్రహాలకు అర్పించిన పదార్ధాలను తినడానికి ధైర్యం తెచ్చుకుంటాడు కదా? తద్వారా ఎవరి కోసం క్రీస్తు చనిపోయాడో విశ్వాసంలో బలహీనుడైన ఆ నీ సోదరుడు లేక సోదరి నీ తెలివి వలన పాడైపోతాడు. ఈ విధంగా మీరు మీ సోదరులకు వ్యతిరేకంగా పాపం చేయడం ద్వారా, విశ్వాసంలో బలహీనమైన వారి మనస్సాక్షిని నొప్పించడం ద్వారా, మీరు క్రీస్తుకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు. కాబట్టి నా భోజనం నా సోదరుడు విశ్వాసంలో జారిపోవడానికి కారణమైతే, నా సోదరునికి అభ్యంతరం కలిగించకుండేలా ఇక నేనెన్నడూ మాంసం తినను.
1 కొరింథీయులకు 8:4-13 పవిత్ర బైబిల్ (TERV)
ఇక విగ్రహాలకు బలి ఇచ్చినవాటి విషయం: విగ్రహానికి అర్థం లేదని, ఒక్కడే దేవుడున్నాడని మనకు తెలుసు. దేవుళ్ళని పిలువబడేవాళ్ళు ఆకాశంలోగాని, భూమిమీదగాని ఉన్నా, వాళ్లు “దేవుళ్ళని”, “ప్రభువులని” పిలవబడుచున్నారు. అయితే నిజానికి మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయనే మన తండ్రి. అన్నిటినీ ఆయనే సృష్టించాడు. ఆయన కోసమే మనము జీవిస్తున్నాము. మనకు ఒక్కడే ప్రభువు. ఆయనే యేసుక్రీస్తు. ఆయన ద్వారానే అన్నీ సృష్టింపబడ్డాయి. ఆయనవల్ల మనము జీవిస్తున్నాము. కాని ఈ విషయం తెలియనివాళ్ళు చాలమంది ఉన్నారు. ఈనాటికీ విగ్రహారాధనకు అలవాటు పడ్డ కొందరు ఆ పదార్థాన్ని తిన్నప్పుడు అది విగ్రహానికి అర్పించింది అనుకొని తింటారు. వాళ్ళ మనసులు బలహీనమైనవి కనుక వాళ్ళు మలినమయ్యారు. ఆహారంవల్ల మనము దేవునికి సన్నిహితులము కాలేము. ఆ ఆహారం తినకపోతే నష్టం ఏమీ లేదు. తింటే వచ్చిన లాభం లేదు. కాని మీ నిర్ణయము దృఢవిశ్వాసం లేనివాళ్ళకు నష్టం కలిగించకుండా జాగ్రత్తపడండి. ఈ విషయంపై గట్టి అభిప్రాయం లేనివాడొకడు ఈ విషయాన్ని గురించి జ్ఞానమున్న మిమ్మల్ని గుడిలో నైవేద్యం తినటం చూస్తాడనుకోండి. అప్పుడు అతనికి విగ్రహాలకు నైవేద్యం పెట్టిన ఆహారం తినటానికి ధైర్యం కలుగుతుంది. బలహీనమైన మనస్సుగల మీ సోదరుని కోసం క్రీస్తు మరణించాడు. కాని మీ అజ్ఞానంవల్ల ఆ సోదరుడు నశిస్తాడు. అలా చేస్తే మీ సోదరునిపట్ల పాపం చేసి అతని మనస్సును గాయపరచిన వాళ్ళవుతారు. తద్వారా మీరు క్రీస్తుపట్ల పాపం చేసిన వాళ్ళవుతారు. నా సోదరుడు పాపం చేయటానికి నా ఆహారం కారణమైతే నేనిక మీదట మాంసం తినను! ఏ విధంగానైనా అతని పతనానికి కారకుణ్ణి కాకుండా ఉంటాను.
1 కొరింథీయులకు 8:4-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించినవాటిని తినుట విషయము: – లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. దేవతలన బడినవారును ప్రభువులనబడినవారును అనేకులున్నారు. ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము. అయితే అందరియందు ఈ జ్ఞానము లేదు. కొందరిదివరకు విగ్రహమును ఆరాధించినవారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి యియ్యబడినవని యెంచి భుజించుదురు; ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది. భోజనమునుబట్టి దేవుని యెదుట మనము మెప్పుపొందము; తినకపోయినందున మనకు తక్కువలేదు, తినినందున మనకు ఎక్కువలేదు. అయినను మీకు కలిగియున్న యీ స్వాతంత్యమువలన బలహీనులకు అభ్యంతరము కలుగకుండ చూచుకొనుడి. ఏలయనగా జ్ఞానముగల నీవు విగ్రహాలయమందు భోజనపంక్తిని కూర్చుండగా ఒకడు చూచినయెడల, బలహీనమైన మన స్సాక్షిగల అతడు విగ్రహములకు బలి యియ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకొనును గదా? అందువలన ఎవనికొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీను డైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమునుబట్టి నశించును. ఈలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయుటవలనను, వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుటవలనను, మీరు క్రీస్తునకు విరోధముగా పాపముచేయు వారగుచున్నారు. కాబట్టి భోజనపదార్థమువలన నా సహోదరునికి అభ్యంతరము కలిగినయెడల, నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయకుండుటకై నేనెన్నటికిని మాంసము తినను.
1 కొరింథీయులకు 8:4-13 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అందుకే, విగ్రహాలకు అర్పించిన వాటిని తినే విషయంలో: “లోకంలో విగ్రహానికి విలువలేదు, ఒకే ఒక్క దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు” అని మనకు తెలుసు. ఒకవేళ ఆకాశంలో కాని భూమి మీద కాని దేవుళ్ళు అని పిలువబడే వారు ఉన్నా (నిజానికి చాలామంది “దేవుళ్ళు” చాలామంది “ప్రభువులు” ఉన్నారు), కానీ మనకైతే ఒక్కడే తండ్రియైన దేవుడు ఉన్నాడు. ఆయన ద్వారానే అన్ని కలిగాయి. ఆయన ద్వారానే మనం జీవిస్తున్నాం; అలాగే మనకు యేసు క్రీస్తు ప్రభువు ఒక్కడే, ఆయన ద్వారానే అన్ని కలిగాయి, ఆయన ద్వారానే మనం జీవిస్తున్నాము. అయితే ఈ జ్ఞానం అందరికి లేదు. కొందరు ఇప్పటికీ విగ్రహాలను ఆరాధించేవారు తాము తినే పదార్థాలు విగ్రహాలకు బలి అర్పించినవి అని భావిస్తారు. కాబట్టి వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమవుతుంది. అయితే ఆహారం మనల్ని దేవునికి దగ్గరగా తీసుకురాదు; తినకపోతే మనకు నష్టంలేదు, తినడం వల్ల మనకు లాభం లేదు. అయితే మీకున్న అధికారాన్ని బలహీనులకు అభ్యంతరం కలిగించకుండ చూసుకోండి. ఎందుకంటే మీకున్న జ్ఞానంతో విగ్రహాలు ఉన్న మందిరంలో నీవు తినడం బలహీనమైన మనస్సాక్షి కలవారు చూస్తే, వారు విగ్రహాలను అర్పించిన వాటిని తినడానికి ధైర్యం తెచ్చుకుంటారు కదా? అందువల్ల ఎవరి కోసం క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనులైన ఆ సహోదరీ సహోదరులు నీ జ్ఞానాన్నిబట్టి నశిస్తారు. ఇలా వారికి విరోధంగా పాపం చేసి వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించినందుకు మీరు క్రీస్తుకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు. కాబట్టి నేను తిన్నదే నా సహోదరీ సహోదరులు పాపంలో పడడానికి ఒకవేళ కారణమైతే, వారు పాపంలో పడడానికి నేను కారణం కాకూడదని నేను మళ్ళీ ఎప్పుడు అలాంటి ఆహారాన్ని తినను.