1 కొరింథీయులకు 16:1-24
1 కొరింథీయులకు 16:1-24 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ప్రభువు ప్రజలకు కానుక ప్రోగుచేయడం గురించి: గలతీయలోని సంఘాలకు నేను ఏమి చేయమని చెప్పానో మీరు కూడా అది చేయాలి. ప్రతి వారంలో మొదటి రోజున మీలో ప్రతి ఒక్కరు తాము సంపాదించిన దానికి అనుగుణంగా కొంత ధనాన్ని ప్రక్కన పెట్టి దాచి ఉంచండి. దానివల్ల నేను వచ్చినపుడు కానుకలు సేకరించాల్సిన అవసరం ఉండదు. నేను వచ్చిన తరువాత, మీరు ఆమోదించిన వారికి నేను పరిచయ పత్రికలను ఇచ్చి, మీ కానుకలతో వారిని యెరూషలేముకు పంపుతాను. నేను కూడా వెళ్ళడం అవసరం అయితే, వారు నా వెంట వస్తారు. నేను మాసిదోనియాకు వెళ్లాలని అనుకుంటున్నాను గనుక మాసిదోనియాకు వెళ్ళినపుడు మీ దగ్గరకు వస్తాను. బహుశ మీతో కొంత కాలం గడుపుతాను లేదా చలికాలమంత ఉండవచ్చు, అప్పుడు నేను ఎక్కడికి వెళ్తానో, నా ప్రయాణంలో మీరు నాకు సహాయం చేయగలరు. మార్గమధ్యలో మిమ్మల్ని చూసి వెంటనే వెళ్ళిపోవాలని నేను అనుకోవడం లేదు. ప్రభువు అనుమతిస్తే మీతో కొంత కాలం గడపాలని అనుకుంటున్నాను. అయితే పెంతెకొస్తు దినం వరకు ఎఫెసులోనే ఉంటాను. ఎందుకంటే చాలామంది నన్ను వ్యతిరేకించినా, ఫలవంతమైన పని చేయడానికి ఒక గొప్ప ద్వారం నాకు తెరవబడింది. తిమోతి వచ్చినప్పుడు, అతడు మీతో నిర్భయంగా ఉండేలా చూడండి. నాలాగే అతడు కూడా ప్రభువు పని చేస్తున్నాడు. కనుక ఎవరూ అతని పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించవద్దు. అతడు నా దగ్గరకు తిరిగివచ్చునట్లు అతన్ని సమాధానంగా తన మార్గంలో పంపించండి. అతడు సహోదరులతో పాటు వస్తాడని నేను ఎదురు చూస్తున్నాను. మన సహోదరుడైన అపొల్లో విషయం ఏంటంటే: సహోదరులతో పాటు మీ దగ్గరకు వెళ్ళమని అతన్ని నేను చాలా బ్రతిమాలాను. కాని ఇప్పుడే బయలుదేరడం అతనికి ఏ మాత్రం ఇష్టం లేదు. అయితే సరియైన అవకాశం లభించినపుడు అతడు వస్తాడు. మెలకువగా ఉండండి; విశ్వాసంలో నిలకడగా ఉండండి; ధైర్యం కలిగి బలవంతులై ఉండండి. ప్రేమ పూర్వకంగా అన్నిపనులు చేయండి. స్తెఫను అతని ఇంటి వారు అకయలో మొదటిగా క్రీస్తును స్వీకరించారని మీకు తెలుసు. వారు దేవుని ప్రజల సేవకు తమను తాము అర్పించుకున్నారు. సహోదరీ సహోదరులారా, మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను, అలాంటి వారికి, వారితో పాటు పని చేసి సేవ చేసేవారికి మీరు లోబడి ఉండండి. స్తెఫను, ఫొర్మూనాతు మరియు అకాయికు అనేవారు రావడం నాకు సంతోషం ఎందుకంటే మీరు లేని కొరత వారు నాకు తీర్చారు. నా ఆత్మకు, మీ ఆత్మకు కూడా వారు నూతన ఉత్తేజం కలిగించారు. అలాంటివారు గౌరవించదగినవారు. ఆసియా ప్రాంతంలోని సంఘాలు మీకు తమ అభినందనలు పంపుతున్నారు. అకుల, ప్రిస్కిల్ల అనేవారు, వారి ఇంట్లో సమావేశమయ్యే సంఘం మీకు ప్రభువులో హృదయపూర్వక అభినందనలు పంపుతున్నారు, ఇక్కడి సహోదరీ సహోదరులందరు మీకు అభినందనలు పంపుతున్నారు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరిని ఒకరు అభినందనలు తెలుపుకోండి. పౌలు అను నేను నా స్వహస్తంతో ఈ శుభములు వ్రాస్తున్నాను. ప్రభువును ప్రేమించనివారు శపింపబడును గాక! ప్రభువా రమ్ము! ప్రభువైన యేసు కృప మీతో ఉండును గాక. క్రీస్తు యేసులో మీ అందరికి నా ప్రేమను తెలియజేస్తున్నాను. ఆమేన్.
1 కొరింథీయులకు 16:1-24 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
పరిశుద్ధుల కోసం చందా విషయంలో నేను గలతీయ సంఘాలకు నియమించిన ప్రకారమే మీరు కూడా చేయండి. నేను వచ్చినప్పుడే చందా పోగు చేయడం కాకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి ఒక్కడూ తాను అభివృద్ధి చెందిన కొద్దీ తన దగ్గర కొంత డబ్బు తీసి దాచి పెట్టాలి. నేను వచ్చినప్పుడు ఎవరిని ఈ పనికి మీరు నిర్ణయిస్తారో వారికి ఉత్తరాలిచ్చి, వారిచేత మీ చందాను యెరూషలేముకు పంపిస్తాను. నేను కూడా వెళ్ళడం మంచిదైతే వారు నాతో వస్తారు. నేను మాసిదోనియ మీదుగా వెళ్తున్నాను. కాబట్టి ఆ సమయంలో మీ దగ్గరికి వస్తాను. అప్పుడు మీ దగ్గర కొంతకాలం ఆగవచ్చు, ఒక వేళ శీతకాలమంతా గడుపుతానేమో. ఆ తర్వాత నా ముందు ప్రయాణం ఎక్కడికైతే అక్కడికి వెళ్ళటానికి మీరు సహాయపడవచ్చు. ప్రభువు అనుమతిస్తే మీ దగ్గర కొంతకాలం ఉండాలని ఎదురు చూస్తున్నాను. కాబట్టి ఇప్పుడు మార్గమధ్యంలో మిమ్మల్ని దర్శించడం నాకిష్టం లేదు. కానీ పెంతెకొస్తు వరకూ ఎఫెసులో ఉంటాను. ఎందుకంటే ఒక విశాలమైన ద్వారం నా ఎదుట తెరిచి ఉంది. ఎదిరించే వారు కూడా అనేకమంది ఉన్నారు. తిమోతి వచ్చినప్పుడు అతడు మీ దగ్గర నిశ్చింతగా నివసించేలా చూసుకోండి. నాలాగా అతడు కూడా ప్రభువు పని చేస్తున్నాడు. కాబట్టి ఎవరూ అతన్ని చిన్న చూపు చూడవద్దు. నా దగ్గరికి అతనిని శాంతితో సాగనంపండి. అతడు సోదరులతో కలిసి వస్తాడని ఎదురు చూస్తున్నాను. సోదరుడైన అపొల్లో విషయమేమంటే, అతనిని ఈ సోదరులతో కలిసి మీ దగ్గరికి వెళ్ళమని నేను చాలా బతిమాలాను గాని ఇప్పుడు రావడానికి అతనికి ఎంతమాత్రం ఇష్టం లేదు. అతనికి వీలైనప్పుడు వస్తాడు. మెలకువగా ఉండండి, విశ్వాసంలో నిలకడగా ఉండండి, ధైర్యం గలిగి, బలవంతులై ఉండండి. మీరు చేసే పనులన్నీ ప్రేమతో చేయండి. స్తెఫను ఇంటివారు అకయ ప్రాంతానికి ప్రథమ ఫలమనీ, వారు పరిశుద్ధులకు సేవ చేయడానికి తమను అంకితం చేసుకున్నారనీ మీకు తెలుసు. కాబట్టి సోదరులారా, అలాటి వారికి, పనిలో సహాయం చేసే వారికి, కష్టపడే వారికందరికీ లోబడి ఉండమని మిమ్మల్ని బతిమాలుతూ ఉన్నాను. స్తెఫను, ఫొర్మూనాతు, అకాయికు అనే వారు రావడం సంతోషంగా ఉంది. మీరు లేని కొరత నాకు వీరి వల్ల తీరింది. నా ఆత్మకు, మీ ఆత్మకు వీరు ఆదరణ కలిగించారు. అలాటి వారిని గుర్తించి గౌరవించండి. ఆసియలోని సంఘాల వారు మీకు అభివందనాలు చెబుతున్నారు. అకుల, ప్రిస్కిల్ల, వారి ఇంట్లో ఉన్న సంఘమూ ప్రభువులో మీకు అనేక అభివందనాలు చెబుతున్నారు. ఇక్కడి సోదరులంతా మీకు అభివందనాలు చెబుతున్నారు. పవిత్రమైన ముద్దుపెట్టుకుని, మీరు ఒకరికి ఒకరు అభివందనాలు చెప్పుకోండి. పౌలు అనే నేను నా స్వహస్తంతో ఈ అభివందనం రాస్తున్నాను. ఎవరైనా ప్రభువును ప్రేమించకుండా ఉంటే వారికి శాపం కలుగు గాక. ప్రభువు వస్తున్నాడు. ప్రభు యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండుగాక. క్రీస్తు యేసులో ఉన్న నా ప్రేమ మీ అందరితో ఉంటుంది. ఆమేన్.
1 కొరింథీయులకు 16:1-24 పవిత్ర బైబిల్ (TERV)
పరిశుద్ధుల కోసం సేకరించవలసిన చందాల విషయంలో ఏం చెయ్యాలో, గలతీయలో ఉన్న సంఘాలకు చెప్పాను. మీరు కూడా అదే విధంగా చెయ్యండి. తన సంపాదనను బట్టి ప్రతి ఒక్కడూ కొంత డబ్బు ఆదివారం రోజు దాచాలి. అలా చేస్తే నేను వచ్చిన రోజెల్లా చందానెత్తనవసరం ఉండదు. నేను వచ్చాక మీరెన్నుకొన్నవాళ్ళకు పరిచయ పత్రాలు వ్రాసి వాళ్ళతో మీరు సేకరించిన డబ్బును యెరూషలేము పంపుతాను. నేను కూడా వెళ్ళటం ఉచితమని అనిపిస్తే అంతా కలిసి వెళ్తాం. నేను మాసిదోనియ ద్వారా వెళ్ళాలి కనుక అక్కడికి వెళ్ళి, మీ దగ్గరకు వస్తాను. అలా చేస్తే నేను మీతో కొంతకాలం గడపవచ్చు. బహుశా చలికాలమంతా అక్కడే ఉంటానేమో. ఆ తర్వాత నా ముందు ప్రయాణం ఎక్కడికైతే అక్కడికి వెళ్ళటానికి మీరు సహాయపడవచ్చు. అందుకే ప్రస్తుతం మీ దగ్గరకు రావాలని లేదు. అలా చేస్తే, నేను వెళ్తూ మిమ్మల్ని చూసినట్లు మాత్రమే ఔతుంది. అలా కాక, ప్రభువు చిత్తమైతే మీతో కొంతకాలం గడపాలని ఉంది. నేను ఎఫెసులో పెంతుకొస్తు పండుగ దాకా ఉంటాను. అక్కడ ఫలవంతమైన కార్యాలు చెయ్యటానికి నాకొక గొప్ప అవకాశం కలిగింది. కాని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. తిమోతి మీ దగ్గరకు వస్తే అతనికి ధైర్యం చెప్పండి. ఎందుకంటే, నాలాగే అతడు కూడా ప్రభువు కార్యాన్ని చేస్తున్నాడు. ఎవ్వరూ అతణ్ణి నిరాకరించకండి. అతని ప్రయాణం శాంతంగా సాగేటట్లు చూడండి. అతడు యితర సోదరులతో కలిసి నా దగ్గరకు రానున్నాడు. అతని కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఇక మన సోదరుడైన అపొల్లోను గురించి: నేను మిగతా సోదరులతో కలిసి మీ దగ్గరకు వెళ్ళమని చాలా వేడుకొన్నాను. అతనికి ప్రస్తుతం వెళ్ళటానికి కొంచెం కూడా యిష్టం లేదు. కాని తనకు మనస్సున్నప్పుడు అతడు వస్తాడు. మెలకువగా ఉండండి. సంపూర్ణంగా విశ్వసించండి. ధైర్యంగా ఉండండి. శక్తిని వదులుకోకండి. చేసే కార్యాలు ప్రేమతో చెయ్యండి. అకయ ప్రాంతంలో విశ్వాసులుగా మారినవాళ్ళలో స్తెఫను కుటుంబం మొదటిది. ఇది మీకు తెలుసు. వాళ్ళు తమ జీవితాన్ని విశ్వాసుల సేవకు అంకితం చేసారు. వాళ్ళను అనుసరించుమని మిమ్మల్ని వేడుకొంటున్నాను. వాళ్ళనే కాక వాళ్ళతో కలిసి సేవ చేస్తున్న ప్రతి ఒక్కణ్ణీ మీరు అనుసరించాలి. స్తెఫను, ఫొర్మూనాతు, అకాయికు వచ్చి మీరు తీర్చలేని కొరత తీర్చారు. వాళ్ళు రావటం వల్ల నాకు ఆనందం కలిగింది. వాళ్ళు మీ ఆత్మలకు, నా ఆత్మకు ఆనందం కలిగించారు. వాళ్ళను గౌరవించటం సమంజసం. ఆసియ ప్రాంతంలోని సంఘాలు మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాయి. అకుల, ప్రిస్కిల్ల మరియు వాళ్ళింట్లో సమావేశమయ్యే సంఘము మీకు ప్రభువు పేరిట తమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక్కడున్న సోదరులందరు మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోదరుల ప్రేమతో ఒకళ్ళనొకళ్ళు హృదయాలకు హత్తుకోండి. పవిత్రమైన ముద్దుతో ఒకరికొకరు వందనాలు చెప్పండి. నేను పౌలును. ఈ శుభాకాంక్షలు నా స్వహస్తాలతో వ్రాస్తున్నాను. ప్రభువును ప్రేమించనివాడు శాపగ్రస్థుడు అవుతాడు! ప్రభువా రమ్ము! యేసు ప్రభువు యొక్క అనుగ్రహము మీకందరికి లభించుగాక. యేసు క్రీస్తు పేరిట నా ప్రేమ మీకందరికీ తెలుపుతున్నాను. ఆమేన్.
1 కొరింథీయులకు 16:1-24 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
పరిశుద్ధులకొరకైన కానుకవిషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగుచేయకుండ ప్రతి ఆది వారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తనయొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. నేను వచ్చి నప్పుడు మీరెవరిని యోగ్యులని యెంచి పత్రికలిత్తురో, వారిచేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. నేను కూడ వెళ్లుట యుక్తమైనయెడల వారు నాతోకూడ వత్తురు. అయితే మాసిదోనియలో సంచారమునకు వెళ్లనుద్దేశించుచున్నాను గనుక మాసిదోనియలో సంచారమునకు వెళ్లినప్పుడు మీయొద్దకు వచ్చెదను. అప్పుడు మీయొద్ద కొంతకాలము ఆగవచ్చును, ఒక వేళ శీతకాలమంతయు గడుపుదును. అప్పుడు నేను వెళ్లెడి స్థలమునకు మీరు నన్ను సాగనంపవచ్చును. ప్రభువు సెలవైతే మీయొద్ద కొంతకాలముండ నిరీ క్షించుచున్నాను గనుక ఇప్పుడు మార్గములో మిమ్మును చూచుటకు నాకు మనస్సులేదు. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించియున్నది; మరియు ఎదిరించువారు అనేకులున్నారు గనుక పెంతెకొస్తువరకు ఎఫెసులో నిలిచియుందును. తిమోతి వచ్చినయెడల అతడు మీయొద్ద నిర్భయుడైయుండునట్లు చూచుకొనుడి, నావలెనే అతడు ప్రభువు పనిచేయుచున్నాడు గనుక ఎవడైన అతనిని తృణీకరింప వద్దు. నా యొద్దకు వచ్చుటకు అతనిని సమాధానముతో సాగనంపుడి; అతడు సహోదరులతోకూడ వచ్చునని యెదురు చూచుచున్నాను. సహోదరుడైన అపొల్లోనుగూర్చిన సంగతి ఏమనగా, అతడీ సహోదరులతోకూడ మీయొద్దకు వెళ్లవలెనని నేనతని చాల బతిమాలుకొంటిని గాని, యిప్పుడు వచ్చుటకు అతనికి ఎంతమాత్రమును మనస్సులేదు, వీలైనప్పుడతడు వచ్చును. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలుకడగా ఉండుడి, పౌరుషముగలవారై యుండుడి, బలవంతులై యుండుడి; మీరుచేయు కార్యములన్నియు ప్రేమతో చేయుడి. స్తెఫను ఇంటివారు అకయయొక్క ప్రథమఫలమై యున్నారనియు, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని యున్నారనియు మీకు తెలియును. కాబట్టి సహోదరులారా, అట్టివారికిని, పనిలో సహాయముచేయుచు ప్రయాసపడుచుఉండు వారికందరికిని మీరు విధేయులై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. స్తెఫను, ఫొర్మూనాతు, అకా యికు అనువారు వచ్చినందున సంతోషించుచున్నాను. మీరులేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగజేసిరి గనుక అట్టివారిని సన్మా నించుడి. ఆసియలోని సంఘములవారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల్ల అనువారును, వారి యింటనున్న సంఘమును, ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. సహోదరులందరు మీకు వందనములు చెప్పుచున్నారు. పవిత్రమైన ముద్దుపెట్టుకొని, మీరు ఒకరికి ఒకరు వందనములు చేసికొనుడి. పౌలను నేను నా చేతితోనే వందన వచనము వ్రాయు చున్నాను. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక; ప్రభువు వచ్చుచున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై యుండును గాక. క్రీస్తుయేసునందలి నా ప్రేమ మీయందరితో ఉండును గాక. ఆమేన్.
1 కొరింథీయులకు 16:1-24 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ప్రభువు ప్రజల కోసం కానుక పోగుచేయడం గురించి గలతీయలోని సంఘాలకు నేను ఏమి చేయమని చెప్పానో మీరు కూడా అది చేయాలి. ప్రతి వారంలో మొదటి రోజున మీలో ప్రతి ఒక్కరు మీ సంపాదన బట్టి కొంత ధనాన్ని ప్రక్కన పెట్టి దాచి ఉంచండి. దానివల్ల నేను వచ్చినపుడు కానుకలు సేకరించాల్సిన అవసరం ఉండదు. నేను వచ్చిన తర్వాత, మీరు ఆమోదించిన వారికి నేను పరిచయ పత్రికలను ఇచ్చి, మీ కానుకలతో వారిని యెరూషలేముకు పంపుతాను. నేను కూడా వెళ్లడం అవసరం అయితే, వారు నా వెంట వస్తారు. నేను మాసిదోనియాకు వెళ్లాలని అనుకుంటున్నాను కాబట్టి మాసిదోనియాకు వెళ్లినప్పుడు మీ దగ్గరకు వస్తాను. బహుశ మీతో కొంతకాలం గడుపుతాను లేదా చలికాలమంతా ఉంటాను. అప్పుడు నేను ఎక్కడికి వెళ్తానో అక్కడికి నా ప్రయాణంలో మీరు నాకు సహాయం చేయగలరు. మార్గమధ్యలో మిమ్మల్ని చూసి వెంటనే వెళ్లిపోవాలని నేను అనుకోవడం లేదు. ప్రభువు అనుమతిస్తే మీతో కొంతకాలం గడపాలని అనుకుంటున్నాను. అయితే పెంతెకొస్తు దినం వరకు ఎఫెసులోనే ఉంటాను. ఎందుకంటే చాలామంది నన్ను వ్యతిరేకించినా, ఫలవంతమైన పని చేయడానికి ఒక గొప్ప ద్వారం నాకు తెరవబడింది. తిమోతి వచ్చినప్పుడు అతడు మీ దగ్గర నిర్భయంగా ఉండేలా చూడండి. నాలాగే అతడు కూడా ప్రభువు పని చేస్తున్నాడు. కాబట్టి ఎవరూ అతని పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించవద్దు. అతడు నా దగ్గరకు తిరిగి వచ్చేలా అతన్ని సమాధానంతో పంపించండి. అతడు సహోదరులతో పాటు వస్తాడని నేను ఎదురు చూస్తున్నాను. మన సహోదరుడైన అపొల్లో విషయం ఏంటంటే, సహోదరులతో పాటు మీ దగ్గరకు వెళ్లమని అతన్ని నేను చాలా బ్రతిమాలాను. కాని ఇప్పుడే బయలుదేరడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. అయితే సరియైన అవకాశం లభించినపుడు అతడు వస్తాడు. మెలకువగా ఉండండి; విశ్వాసంలో నిలకడగా ఉండండి; ధైర్యం కలిగి బలవంతులై ఉండండి. ప్రేమ పూర్వకంగా అన్ని పనులు చేయండి. స్తెఫెను అతని ఇంటివారు అకాయలో మొదటిగా క్రీస్తును స్వీకరించారని మీకు తెలుసు. వారు పరిశుద్ధుల సేవకు తమను తాము అర్పించుకున్నారు. సహోదరీ సహోదరులారా, మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను, అలాంటి వారికి, వారితో పాటు పని చేసి సేవ చేసేవారికి మీరు లోబడి ఉండండి. స్తెఫెను, ఫొర్మూనాతు అకాయికు అనేవారు రావడం నాకు సంతోషం ఎందుకంటే మీరు లేని కొరత వారు నాకు తీర్చారు. నా ఆత్మకు, మీ ఆత్మకు కూడా వారు నూతన ఉత్తేజం కలిగించారు. అలాంటివారు గౌరవించదగినవారు. ఆసియా ప్రాంతంలోని సంఘాలు మీకు తమ అభినందనలు పంపుతున్నారు. అకుల, ప్రిస్కిల్ల అనేవారు, వారి ఇంట్లో సమావేశమయ్యే సంఘం మీకు ప్రభువులో హృదయపూర్వక అభినందనలు పంపుతున్నారు. ఇక్కడి సహోదరీ సహోదరులందరు మీకు అభినందనలు పంపుతున్నారు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరిని ఒకరు అభినందనలు తెలుపుకోండి. పౌలు అనే నేను నా స్వహస్తంతో ఈ శుభములు వ్రాస్తున్నాను. ప్రభువును ప్రేమించనివారు శపింపబడును గాక! ప్రభువా రండి! ప్రభువైన యేసు కృప మీతో ఉండును గాక. క్రీస్తు యేసులో మీ అందరికి నా ప్రేమను తెలియజేస్తున్నాను. ఆమేన్.