1 కొరింథీయులకు 15:42-54

1 కొరింథీయులకు 15:42-54 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

మరణించినవారి పునరుత్థానం కూడా ఇలాగే ఉంటుంది. నాటబడిన శరీరం నశించిపోయేది, అయితే అది నాశనంలేనిదిగా లేపబడుతుంది. అది గౌరవం లేనిదిగా విత్తబడి, మహిమలో లేపబడుతుంది; అది బలహీనమైనదిగా విత్తబడి, శక్తిగలదానిగా లేపబడుతుంది. సహజమైన శరీరంగా విత్తబడి, ఆధ్యాత్మిక శరీరంగా లేపబడుతుంది. భౌతిక శరీరం ఉంది గనుక, ఆధ్యాత్మిక శరీరం కూడ ఉంది. “మొదటి మానవుడైన ఆదాము జీవించే ప్రాణి అయ్యాడు” అని వ్రాయబడి ఉంది; కాని చివరి ఆదాము ఒక జీవి అయ్యాడు. ఆధ్యాత్మికమైనది మొదట రాలేదు, కాని భౌతికమైనది మొదట వచ్చింది, దాని తరువాత ఆధ్యాత్మికమైనది వచ్చింది. మొదటి మానవుడు భూమిలోని మట్టితో చేయబడ్డాడు, రెండవ మానవుడు పరలోకానికి చెందిన వాడు. భూమికి చెందిన మానవునిలా భూలోక సంబంధులు ఉంటారు. పరలోకానికి చెందిన వానిలా పరలోక సంబంధులు ఉంటారు. మరియు మనం భూసంబంధియైన మనుష్యుని రూపాన్ని ధరించినట్లే పరలోకసంబంధమైన వాని రూపాన్ని ధరించుకుంటాము. సహోదరీ సహోదరులారా, నేను మీకు చెప్పేది ఏంటంటే, రక్తమాంసాలు దేవుని రాజ్యంలో పాలుపొందలేవు, నశించిపోయేది శాశ్వతమైన దానిని స్వతంత్రించుకోలేదు. నేను మీకు చెప్పే ఈ రహస్యాన్ని వినండి: మనమందరం నిద్రించము గాని, మనమందరం మార్పు చెందుతాము. ఒక క్షణంలోనే, ఒక రెప్పపాటులో, చివరి బూర మ్రోగగానే మనమందరం మార్పు పొందుతాము. బూర మ్రోగుతుంది, అప్పుడు మృతులు శాశ్వతమైనవారిగా లేపబడతారు, మనమందరం మార్పు చెందుతాము. ఎందుకంటే, నశించిపోయేది శాశ్వతమైన దాన్ని ధరించుకోవాలి, మరణించేది మరణంలేని దాన్ని ధరించుకోవాలి. నశించిపోయేది శాశ్వతమైన దాన్ని, మరణించేది మరణంలేని దాన్ని ధరించినపుడు, “విజయం మరణాన్ని మ్రింగివేసింది” అని వ్రాయబడిన వాక్యం యదార్థమవుతుంది.

1 కొరింథీయులకు 15:42-54 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

చనిపోయిన వారు తిరిగి లేవడం కూడా అలాగే ఉంటుంది. నశించిపోయే శరీరాన్ని నాటి నశించని శరీరాన్ని పొందుతారు. ఘనహీనంగా విత్తినది మహిమ గలదిగా, బలహీనంగా విత్తినది బలమైనదిగా తిరిగి లేస్తుంది. ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తినది ఆత్మ సంబంధమైన శరీరంగా లేస్తుంది. ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది కాబట్టి ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది. దీని గురించి, “ఆదామనే మొదటి మనిషి జీవించే ప్రాణి అయ్యాడు” అని రాసి ఉంది. చివరి ఆదాము జీవింపజేసే ఆత్మ అయ్యాడు. మొదట వచ్చింది ఆత్మ సంబంధమైనది కాదు. ముందు ప్రకృతి సంబంధమైనది, ఆ తరవాత ఆత్మ సంబంధమైనది వచ్చాయి. మొదటి మనిషి భూసంబంధి. అతడు మట్టిలో నుండి రూపొందిన వాడు. రెండవ మనిషి పరలోకం నుండి వచ్చినవాడు. మొదట మట్టి నుండి వచ్చినవాడు ఎలాటివాడో ఆ తరువాత మట్టి నుండి పుట్టిన వారంతా అలాంటివారే. పరలోక సంబంధి ఎలాటివాడో తరువాత వచ్చిన పరలోక సంబంధులు కూడా అలాటి వారే. మనం మట్టి మనిషి పోలికను ధరించిన ప్రకారం పరలోక సంబంధి పోలికను కూడా ధరిస్తాం. సోదరులారా, నేను చెప్పేది ఏమంటే, రక్త మాంసాలు దేవుని రాజ్య వారసత్వం పొందలేవు. నశించి పోయేవి నశించని దానికి వారసత్వం పొందలేవు. ఇదిగో వినండి, మీకు ఒక రహస్యం చెబుతున్నాను, మనమంతా నిద్రించం. నిమిషంలో రెప్ప పాటున, చివరి బాకా మోగగానే మనమంతా మారిపోతాం. బాకా మోగుతుంది, అప్పుడు చనిపోయిన వారు నాశనం లేనివారుగా లేస్తారు. మనం మారిపోతాం. నశించిపోయే ఈ శరీరం నాశనం లేని శరీరాన్ని ధరించుకోవాలి. మరణించే ఈ శరీరం మరణం లేని శరీరాన్ని ధరించుకోవాలి. ఈ విధంగా నశించేది నశించని దానినీ, మరణించేది మరణం లేని దానినీ ధరించుకొన్నప్పుడు, “విజయం మరణాన్ని మింగివేసింది” అని రాసి ఉన్న మాటలు నెరవేరుతాయి.

1 కొరింథీయులకు 15:42-54 పవిత్ర బైబిల్ (TERV)

చనిపోయినవాళ్ళు బ్రతికి రావటం కూడా అదే విధంగా ఉంటుంది. నశించిపోయే శరీరాన్ని నాటి, నశించని శరీరాన్ని పొందుతారు. గౌరవం లేని శరీరంగా నాటబడి, మహిమగల శరీరంగా లేపబడుతుంది. బలహీనమైన శరీరంగా నాటబడి, శక్తిగల శరీరముగా లేస్తుంది. భౌతికమైన శరీరాన్ని నాటి, ఆత్మీయమైన శరీరాన్ని పుట్టిస్తాడు. భౌతికమైన శరీరం ఉంది అంటే, ఆత్మీయ శరీరం కూడా ఉంటుంది. ఈ విధంగా వ్రాయబడింది: “ప్రథమ పురుషుడైన ఆదాము జీవించే నరుడయ్యాడు, చివరి ఆదాము జీవాన్ని ఇచ్చే ఆత్మ అయ్యాడు.” ముందు ఆత్మీయత రాలేదు. ముందు భౌతిక శరీరం వచ్చింది. ఆ తర్వాత ఆత్మీయత వచ్చింది. మొదటి పురుషుడు భూమ్మీద ఉన్న మట్టితో సృష్టింపబడ్డాడు. రెండవ మనుష్యుడు పరలోకంనుండి దిగివచ్చాడు. భూమ్మీద ఉన్నవాళ్ళు మట్టితో సృష్టింపబడినవానివలే ఉన్నారు. పరలోకానికి సంబంధించినవాళ్ళు పరలోకంనుండి వచ్చినవానివలె ఉన్నారు. మట్టితో సృష్టింపబడినవాని పోలికలతో మనము జన్మించినట్లే, పరలోకం నుండి వచ్చినవాని పోలికలను కూడా మనము పొందుతాము. సోదరులారా! నేను చెప్పేదేమిటంటే, రక్త మాంసాలతో ఉన్నవాళ్ళు దేవుని రాజ్యం పొందలేరు. నశించిపోయేది అమరత్వం పొందదు. మీకో రహస్యం చెపుతాను వినండి. మనలో ఎవ్వరూ చనిపోరు. అందరూ మారిపోతారు. చివరి బూర ఊదినప్పుడు, మనమందరము ఒక్క క్షణంలో, కనురెప్ప పాటులో మారిపోతాము. ఆ క్షణంలో చనిపోయినవాళ్ళు బ్రతికి వచ్చి చిరంజీవులైపోతారు. మనలో మార్పు కలుగుతుంది. ఎందుకంటే నశించిపోయే ఈ దేహం నాశనం కాని దేహాన్ని ధరించాలి. చనిపోయే ఈ దేహం అమరత్వం పొందాలి. ఇది జరిగినప్పుడు లేఖనాల్లో వ్రాయబడినట్లు జరుగుతుంది

1 కొరింథీయులకు 15:42-54 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మృతుల పునరుత్థానమును ఆలాగే. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును; ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును; బలీహనమైనదిగా విత్తబడి, బలమైనదిగా లేపబడును; ప్రకృతిసంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మసంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతిసంబంధమైన శరీర మున్నది గనుక ఆత్మసంబంధమైన శరీరము కూడ ఉన్నది. ఇందు విషయమై–ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయెనని వ్రాయబడియున్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయెను. ఆత్మసంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతిసంబంధమైనదే మొదట కలిగినది; తరువాత ఆత్మసంబంధమైనది. మొదటి మను ష్యుడు భూసంబంధియై మంటినుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకమునుండి వచ్చినవాడు. మంటినుండి పుట్టినవాడెట్టివాడో మంటినుండి పుట్టినవారును అట్టివారే, పరలోకసంబంధి యెట్టివాడో పరలోకసంబంధులును అట్టి వారే. మరియు మనము మంటినుండి పుట్టినవాని పోలికను ధరించిన ప్రకారము పరలోకసంబంధి పోలికయు ధరింతుము. సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు; క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మన మందరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్ప పాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించుకొనవలసియున్నది; మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసియున్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు, – విజయమందు మరణము మ్రింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును.

1 కొరింథీయులకు 15:42-54 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

మృతుల పునరుత్థానం కూడా ఇలాగే ఉంటుంది. నశించిపోయే శరీరం నాటబడి నాశనంలేనిదిగా లేపబడుతుంది. ఘనహీనంగా విత్తబడి మహిమగలదిగా లేపబడుతుంది; అది బలహీనమైనదిగా విత్తబడి శక్తిగలదానిగా లేపబడుతుంది. ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మీయ శరీరంగా లేపబడుతుంది. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నట్లే ఆత్మీయ శరీరం కూడ ఉంది. కాబట్టి “మొదటి మనిషియైన ఆదాము జీవి అయ్యాడు” అని వ్రాయబడింది; చివరి ఆదాము జీవాన్నిచ్చే ఆత్మ అయ్యాడు. ఆత్మ సంబంధమైనది మొదట రాలేదు, కాని ప్రకృతి సంబంధమైనది మొదట వచ్చింది, ఆ తర్వాతే ఆత్మ సంబంధమైనది వచ్చింది. మొదటి మానవుడు భూమిలోని మట్టితో చేయబడ్డాడు, రెండవ మానవుడు పరలోకానికి చెందిన వాడు. భూమికి చెందిన మానవునిలా భూలోక సంబంధులు ఉంటారు. పరలోకానికి చెందిన వానిలా పరలోక సంబంధులు ఉంటారు. మనం భూసంబంధియైన మనుష్యుని రూపాన్ని ధరించినట్లే పరలోకసంబంధమైన వాని రూపాన్ని ధరించుకుంటాము. సహోదరీ సహోదరులారా, నేను మీకు చెప్పేది ఏంటంటే, రక్తమాంసాలు దేవుని రాజ్య వారసత్వాన్ని పొందలేవు. నశించిపోయేది శాశ్వతమైన దానిని స్వతంత్రించుకోలేదు. నేను మీకు ఒక రహస్యాన్ని చెప్తాను వినండి: మనమందరం నిద్రించం గాని, మనమందరం మార్పు చెందుతాము. ఒక క్షణంలోనే, రెప్పపాటులో, చివరి బూర మ్రోగగానే మనమందరం మార్పు పొందుతాము. బూర మ్రోగుతుంది, అప్పుడు మృతులు శాశ్వతమైనవారిగా లేపబడతారు, మనమందరం మార్పు చెందుతాము. ఎందుకంటే, నశించిపోయేది శాశ్వతమైన దాన్ని ధరించుకోవాలి, మరణించేది మరణంలేని దాన్ని ధరించుకోవాలి. నశించిపోయేది శాశ్వతమైన దాన్ని, మరణించేది మరణంలేని దాన్ని ధరించినపుడు, “విజయం మరణాన్ని మ్రింగివేసింది” అని వ్రాయబడిన వాక్యం నిజమవుతుంది.