1 కొరింథీయులకు 15:12-20

1 కొరింథీయులకు 15:12-20 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

మృతులలో నుండి క్రీస్తు జీవంతో లేపబడ్డారని మేము బోధిస్తుండగా, మృతుల పునరుత్థానం లేదని మీలో కొందరు ఎలా చెప్తారు? మృతుల పునరుత్థానం లేకపోతే క్రీస్తు లేపబడనట్టే. మరియు క్రీస్తే లేపబడకపోతే, మా బోధ వ్యర్థమే, మీ విశ్వాసం కూడా వ్యర్థమే. అంతకంటే ఎక్కువ, దేవుని విషయంలో అనగా దేవుడు క్రీస్తును మరణం నుండి లేపారని చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మేము తప్పుడు సాక్షులంగా కనిపిస్తాం. అయితే దేవుడు ఆయనను లేపకపోతే మరణించినవారు లేపబడరు అనేది నిజం కదా. మృతులు లేపబడకపోతే క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడకపోతే, మీ విశ్వాసం వ్యర్థం; మీరు ఇంకా మీ పాపాల్లోనే ఉన్నారు. అంతేకాక క్రీస్తులో మరణించినవారు కూడా నశించినట్లే. కేవలం ఈ జీవితం కొరకే క్రీస్తులో మన నిరీక్షణ ఉంచితే, అందరికంటే మనం అత్యంత దయనీయులం. ఇప్పుడైతే మరణించినవారిలో ప్రథమఫలంగా క్రీస్తు మరణం నుండి లేపబడ్డారు.

1 కొరింథీయులకు 15:12-20 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

క్రీస్తు మరణించి సజీవుడై లేచాడని మేము ప్రకటిస్తూ ఉంటే మీలో కొందరు అసలు మృతుల పునరుత్థానమే లేదని ఎలా చెబుతారు? మృతుల పునరుత్థానం లేకపోతే, క్రీస్తు కూడ లేవలేదు. క్రీస్తు లేచి ఉండకపోతే మా సువార్త ప్రకటనా వ్యర్థం, మీ విశ్వాసమూ వ్యర్థం. దేవుడు క్రీస్తును లేపాడని ఆయన గూర్చి మేము సాక్ష్యం చెప్పాం కదా? మృతులు లేవడం అనేది లేకపోతే దేవుడు యేసును కూడా లేపలేదు కాబట్టి మేము దేవుని విషయంలో అబద్ధ సాక్షులమన్నట్టే. మృతులు లేవకపోతే క్రీస్తు కూడ లేవలేదు. క్రీస్తు లేవకపోతే మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకా మీ పాపాల్లోనే ఉన్నారన్నమాట. అంతేకాదు, ఇప్పటికే క్రీస్తులో కన్నుమూసిన వారు కూడా నశించినట్టే. మనం ఈ జీవిత కాలం వరకే క్రీస్తులో ఆశ పెట్టుకొనే వారమైతే మనుషుల్లో మనకంటే నిర్భాగ్యులెవరూ ఉండరు. కానీ ఇప్పుడు క్రీస్తు తిరిగి లేవడం ద్వారా చనిపోయిన వారిలో నుండి లేచిన వారిలో ప్రథమఫలం అయ్యాడు.

1 కొరింథీయులకు 15:12-20 పవిత్ర బైబిల్ (TERV)

కాని మేము క్రీస్తు చావు నుండి బ్రతికి వచ్చాడని బోధించాము కదా! మరి మీలో కొందరు చనిపోయినవాళ్ళు బ్రతికి రారని ఎందుకంటున్నారు? అది నిజమైతే క్రీస్తు కూడా చనిపోయి బ్రతికి రాలేదనే అర్థం వస్తుంది. క్రీస్తు చనిపోయి బ్రతికి రానట్లయితే మా బోధన, మీ విశ్వాసము వృథా అయినట్లే కదా! అంతే కాదు. దేవుడు చనిపోయిన క్రీస్తును బ్రతికించాడని మేము చెప్పాము. అలా కాని పక్షంలో మేము దేవుణ్ణి గురించి తప్పు సాక్ష్యము చెప్పినవాళ్ళమౌతాము. కాని ఒకవేళ దేవుడు చనిపోయినవాళ్ళను నిజంగా బ్రతికించనట్లయితే ఆయన్ని కూడా బ్రతికించలేదు. ఎందుకంటే చనిపోయిన వాళ్ళను బ్రతికించనట్లయితే క్రీస్తును కూడా బ్రతికించలేదు. క్రీస్తును బ్రతికించలేదు అంటే, మీ విశ్వాసం వ్యర్థం. మీకు మీ పాపాలనుండి విముక్తి కలుగలేదన్న మాట. అంటే చనిపోయిన క్రీస్తు విశ్వాసులు కూడా తమ పాపాల నుండి విముక్తి పొందలేదన్నమాట. మనకు క్రీస్తు పట్ల ఉన్న ఆశాభావం ప్రస్తుత జీవితం కోసం మాత్రమే అయినట్లయితే మన స్థితి అందరికన్నా అధ్వాన్నం ఔతుంది. కాని నిజానికి చనిపోయిన క్రీస్తు బ్రతికింపబడ్డాడు. చనిపోయి బ్రతికింపబడ్డవాళ్ళలో ఆయన ప్రథముడు.

1 కొరింథీయులకు 15:12-20 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

క్రీస్తు మృతులలోనుండి లేపబడియున్నాడని ప్రక టింపబడుచుండగా మీలో కొందరు–మృతుల పునరుత్థానము లేదని యెట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుత్థానము లేనియెడల, క్రీస్తు కూడ లేపబడియుండలేదు. మరియు క్రీస్తు లేపబడియుండనియెడల మేముచేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని, ఆయననుగూర్చి మేము సాక్ష్యము చెప్పియున్నాము గదా? మృతులు లేపబడనియెడల దేవుడాయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగపడుచున్నాము. మృతులు లేపబడని యెడల క్రీస్తు కూడ లేపబడలేదు. క్రీస్తు లేప బడనియెడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే యున్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించినవారును నశించిరి. ఈ జీవితకాలముమట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైనయెడల మనుష్యులందరి కంటె దౌర్భాగ్యులమై యుందుము. ఇప్పుడైతే నిద్రించినవారిలో ప్రథమఫలముగా క్రీస్తు మృతులలోనుండి లేపబడియున్నాడు.

1 కొరింథీయులకు 15:12-20 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

మృతులలో నుండి క్రీస్తు సజీవంగా లేపబడ్డారని మేము ప్రకటిస్తుండగా, మృతుల పునరుత్థానం లేదని మీలో కొందరు ఎలా చెప్తారు? మృతుల పునరుత్థానం లేకపోతే క్రీస్తు కూడా లేపబడనట్టే కదా. అంతేకాదు క్రీస్తు లేపబడకపోతే, మా బోధ వ్యర్థమే, మీ విశ్వాసం కూడా వ్యర్థమే. అంతేకాక, దేవుడు క్రీస్తును మరణం నుండి లేపారని దేవుని గురించి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మేము అబద్ధ సాక్షులంగా కనబడుతున్నాము. అయితే దేవుడు ఆయనను లేపకపోతే మరణించినవారు లేపబడరు అనేది నిజం కదా. మృతులు లేపబడకపోతే క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడకపోతే మీ విశ్వాసం వ్యర్థమే; మీరు ఇంకా మీ పాపాల్లోనే ఉన్నారు. అంతేకాక క్రీస్తులో మరణించినవారు కూడా నశించినట్లే. కేవలం ఈ జీవితకాలం వరకే క్రీస్తులో మన నిరీక్షణ ఉంచితే, అందరికంటే మనం అత్యంత దయనీయంగా ఉంటాము. ఇప్పుడైతే మరణించినవారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మరణం నుండి లేపబడ్డారు.